ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో బారులుతీరిన పత్తి వాహనాలు
సాక్షి, ఆదిలాబాద్: సీసీఐ, వ్యాపారులు పత్తి కొనుగోళ్లు చేయకపోవడంతో కొన్ని గంటలపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ స్తంభించింది. జిన్నింగ్ మిల్లుల్లో స్థలం లేకపోవడంతో తాము పత్తి కొనలేమంటూ వారు చేతులెత్తారు. దీనిపై రైతులకు ఏ సమాచారం లేకపోవడంతో శుక్రవారం మార్కెట్‌కు పెద్ద ఎత్తున రైతులు పత్తి బండ్లతో వచ్చారు. ఉదయం కొద్దిమంది నుంచి పత్తి కొనుగోలు చేసి, ఆపై నిలిపివేశారు.
దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాన్స్‌పోర్టర్లు, వ్యాపారులతో అధికారులు సమావేశమై సయోధ్య కుదర్చడంతో మధ్యాహ్నం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
సమ్మెను సాకుగా చూపుతూ
ఆదిలాబాద్‌లో ఇప్పటివరకు వ్యాపారులు 3 లక్షల క్వింటాళ్లకు పైగా, సీసీఐ 8 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేసింది. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా మార్చి భారీ వాహనాల ద్వారా తమిళనాడుకు తరలిస్తారు. అయితే ఆదిలాబాద్‌లో నాలుగు రోజులుగా ట్రాన్స్‌పోర్టర్లు పత్తి బేళ్లు లిఫ్ట్ చేయడం లేదని సీసీఐ, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ సమ్మెలో భాగంగా తాము ట్రాన్స్‌పోర్ట్ చేయడం లేదని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. దీంతో జిన్నింగ్ మిల్లుల్లో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకపోయాయి. ఈ పరిస్థితుల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడమే రైతుల ఆందోళనకు దారితీసింది.
సయోధ్య కుదిర్చినా..
ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ట్రాన్స్‌పోర్టర్లు, వ్యాపారులను చర్చలకు పిలిచారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పత్తి కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 14 నుంచి 17 వరకు పత్తి కొనుగోళ్లు చేయమని సీసీఐ ప్రకటించింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోవడంతోనే తాము కొనుగోలు చేయలేమని మార్కెటింగ్ అధికారులకు వారు స్పష్టం చేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment