ఆదిలాబాద్‌లో కొనుగోళ్లపై ప్రతిష్టంభన
తేమ శాతం, ధర ఖరారుపై వివాదం
తక్కువ ధర ఖరారు చేసిన వ్యాపారులు
నిబంధనల ప్రకారమే కొంటామన్న సీసీఐ
తేమతో సంబంధం లేకుండా కొనాలని రైతుల డిమాండ్
ఆదిలాబాద్‌లో రాత్రి వరకు కొనసాగిన ఆందోళన
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. తేమ శాతం, తక్కువ ధర ఖరారుపై వివాదం ఏర్పడటంతో కొనుగోళ్లు జరగలేదు. తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలంటూ రైతులు రాత్రివరకు తమ ఆందోళన కొనసాగించారు. వివరాలిలా ఉన్నాయి.. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. సీసీఐ క్వింటాల్ పత్తికి మద్దతు ధర రూ.7,521తో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు మొదట క్వింటాల్ పత్తికి రూ.6,700 ధర వేలం ద్వారా నిర్ణయించి, ఆ తర్వాత రూ.10, రూ.20 పెంచుతూ రూ.7,150 వరకు చేరుకున్నారు.
ఆ తర్వాత ధర పెంచేందుకు ససేమిరా అన్నారు. దీంతో కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ అధికారులు ధర పెంచాలని ప్రైవేట్ వ్యాపారులకు సూచించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. సీసీఐతో పోలి్చతే ప్రైవేట్ ధర తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వారికి నచ్చజెప్పినప్పటికీ వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.
ప్రైవేట్ వ్యాపారులు రూ.7,200కు కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. మరోవైపు సీసీఐ అధికారులు కూడా నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని తెలిపారు. 8 నుంచి 12 మధ్య శాతం తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అది దాటితే క్వింటాలుకు రూ.75.21 చొప్పున కోత విధిస్తామని పేర్కొనడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తేమతో సంబంధం లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతు తెలిపారు.
కలెక్టర్ ఘెరావ్..ఉద్రిక్తత
ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులు, రైతులతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కలెక్టర్ పలుమార్లు చర్చించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ రూ.7,200కు కొనుగోలు చేసేలా ఒప్పించిన తర్వాత వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు ఘెరావ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మొత్తం మీద రాత్రి వరకు తేమ పేచీ తేలలేదు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు పట్టుబట్టారు. కానీ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెప్పడం, ధర పెంచేందుకు ప్రైవేట్ వ్యాపారులు ఒప్పుకోక పోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.
దీంతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మార్కెటింగ్ అధికారులు మరోసారి సీసీఐ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులతో చర్చించినా ఎటూ తేలలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ యార్డు నుంచి పంజాబ్ చౌక్ చేరుకొని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. రాత్రి వరకు ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపిన జిల్లా కలెక్టర్.. చివరకు మొదటి రోజు తీసుకొచ్చిన పత్తిని తేమతో సంబంధం లేకుండా క్వింటాల్ రూ.6,696 చొప్పున శనివారం కొనుగోలు చేసేలా వ్యాపారులను ఒప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment