200 ఏళ్ల క్రితమే మారు పంటలు | Telangana Farmers Wonderfully Alternative Cropping System | Sakshi
Sakshi News home page

200 ఏళ్ల క్రితమే మారు పంటలు

Published Sun, Nov 28 2021 2:43 AM | Last Updated on Sun, Nov 28 2021 11:02 AM

Telangana Farmers Wonderfully Alternative Cropping System - Sakshi

అప్పట్లో మూసీ పరీవాహక ప్రాంతంలో సాగు చేస్తున్న రైతులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రెండొందల ఏళ్ల కిందటే రైతులు అద్భుతంగా ప్రత్యామ్నాయ పంటల పద్ధతి పాటించారు. భూసారాన్ని పరిరక్షించుకునేందుకు పంట మార్పిడి విధానం అనుసరించారు. నీరు పొదుపుగా వాడుకునే ప్రాంతాల్లో ఈ ప్రత్యామ్నాయ పంటలకు మరింత ప్రాధాన్యమిచ్చారు. అప్పట్లో 8 నాగళ్లుంటే మోతుబరి రైతు అనేవారు. ఆ కాలంలో అదో స్టేటస్‌ సింబల్‌. ఆ సమయంలో మణుగు వరి విత్తనాల సాగుకు రూ.6 ఖర్చయ్యేది.

అప్పట్లో వ్యవసాయంలో మార్పులు జరుగుతున్న తీరుపై అధ్యయనం చేసిన బ్రిటిష్‌ పరిశోధకుడు డాక్టర్‌ ఎ. వాకర్‌ వివరించారు. ‘స్టాటిస్టికల్‌ రిపోర్ట్‌ ఆన్‌ సర్కార్‌ ఆఫ్‌ వరంగల్‌’ పేరుతో మద్రాస్‌ జర్నల్‌ ఆఫ్‌ లిటరేచర్‌ అండ్‌ సైన్స్‌ మేగజైన్‌లో ఇవన్నీ ప్రచురితమయ్యాయి. దీన్ని పుదుచ్చేరి–కంచి–మామునివర్‌ గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పీజీ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌ హిస్టరీ విభాగాధిపతి రామచంద్రారెడ్డి సేకరించి భద్రపరిచారు. 

నీరున్నా.. లేకున్నా..
తెలంగాణ ప్రాంతంలో వరే ప్రధాన పంట. నీటి లభ్యత బాగున్న ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా వరి సాగుకు మొగ్గు చూపేవారు. అయినా అటు వరి వేస్తూనే తదుపరి కాలానికి భూసారాన్ని పరిరక్షించుకునేందుకు పంట మార్పిడి విధానాన్ని అనుసరించారని బ్రిటిష్‌ పరిశోధకుడి అధ్యయనంలో తేలింది. తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో అటు వానలు, ఇటు చెరువులే ప్రధాన నీటి వనరు.

ఫలితంగా నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలకు మరింత ప్రాధాన్యం ఉండేది. రెండు శతాబ్దాల క్రితమే ఈ తీరు కనిపించింది. వరి సాగులో ఇబ్బందులు, పరిమితుల వల్ల కూడా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించటం విశేషం. వెరసి ఇటు వరి, అటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు కలిసి ఈ ప్రాంత పంట సాగులో ప్రత్యేకత తీసుకొచ్చాయి. 

పంట మార్పిడి ఇలా..
రాష్ట్రంలో రకరకాల స్వభావాలున్న నేలలున్నాయి. వీటి సారాన్ని కాపాడుకునే క్రమంలో కొన్ని ప్రాంతాల్లో పంట మార్పిడి విధానం అనుసరించారు. నీటి లభ్యత కూడా దీనికి మరో ప్రధాన కారణమైంది. ఎర్ర నేలల్లో మొదటి సంవత్సరం పచ్చ జొన్నలు వేసేవారు. రెండో సంవత్సరం ఆముదం, పెసర, పత్తి పండించేవారు. మూడో సంవత్సరం పచ్చ జొన్నలు లేదా ఇతర చిరు ధాన్యాలు సాగు చేసేవారు. ఆ తర్వాతి కాలంలో మళ్లీ ఈ సైకిల్‌ మొదలు.

ఇలా ఏడెనిమిదేళ్లు కొనసాగించేవారు. ఇక నల్ల నేలల్లో తొలి సంవత్సరం రబీ పంటగా తెల్ల జొన్నలు లేదా నల్ల పెసర్లు వేసేవారు. రెండో ఏడాది పునాస పంటగా చిరు ధాన్యాలు, పచ్చ జొన్న పండించేవారు. మూడో సంవత్సరం రబీలో ఆముదం, పెసర్లు, పత్తి సాగు చేసేవారు. నాలుగో ఏడాది పునాసగా పచ్చ, ఎర్ర జొన్న, కందులు లాంటివి వేసేవారు.

కమలాపూర్‌ లాంటి కొన్ని ప్రాంతాల్లో తమలపాకు, బెల్లంకొండ ప్రాంతంలో చెరుకు బాగా సాగయ్యేది. ప్రత్యామ్నాయ పంటలుగా పచ్చ, ఎర్ర, తెల్ల, నల్ల జొన్నలు, సజ్జలు, కొర్రలు, బూర సామలు, పొట్ట సామలు, అరికెలు, వరికెలు, గోధుమ, మొక్కజొన్న, పెసర్లు, బొబ్బర్లు, అనుములు, ఉలువలు, కందులు, శనగలు వేసేవారు. 

రూ.20 మిగిలితే మంచి దిగుబడి
నాగళ్ల సంఖ్య ప్రకారం అప్పట్లో రైతు స్థాయిని నిర్ధారించేవారు. 2 నాగళ్లుంటే సాధారణ రైతు అనేవారు. రెండో నాగళిని కూడా సమకూర్చుకోకపోతే పేద రైతుగా పేర్కొనేవారు. 4 నాగళ్లుంటే పెద్ద రైతుగా భావించేవారు. జమీందారులు, దొరలు, పట్వారీలు, పోలీసు, మాలీ పటేళ్లు లాంటి కొందరికి 8 నాగళ్లుండేవి. వీరిని ధనిక రైతులనేవారు. 8 నాగళ్లుండటాన్ని స్టేటస్‌ సింబల్‌గా భావించేవారు.

రెండు జతల నాగళ్లకు రూ.100, జత ఎడ్లు సమకూర్చుకోవాలంటే రూ. 50 ఖర్చయ్యేది. సాగులో రూ.20 మిగిలితే మంచి దిగుబడిగా భావించేవారు. ఈ భరోసా వరి ద్వారానే వచ్చేదని బ్రిటిష్‌ పరిశోధకుడు పేర్కొన్నారు. రూ.60 నుంచి రూ.80 వస్తే ధనిక రైతుగా గుర్తింపు దక్కేది. 

ఓ మణుగు (దాదాపు 38 కిలోలు) వరి విత్తనాల సాగు ఖర్చు ఇలా..
మొత్తం వ్యయం రూ.6 
ఇందులో విత్తనాల ఖర్చు రూ.2, మహిళా కూలీల వ్యయం 14 అణాలు, నీటిని పెట్టేందుకు ఖర్చు 8 అణాలు, పంట కోత సమయంలో మొత్తం వ్యయం 2 రూపాయల 8 అణాలు, ఇతర ఖర్చులు 2 అణాలు. 
ఈ పరిమాణంలో సాగు చేస్తే సాధారణ పరిస్థితుల్లో దిగుబడి విలువ 8 రూపాయల 8 అణాలు. అంటే మిగులు 2 రూపాయల 8 అణాలు  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement