చీరాల, న్యూస్‌లైన్: మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే రైతులకు వడ్డీలేని రుణాలిచ్చేందుకు రూపొందించిన రైతుబంధు పథకం వారి దరి చేరడం లేదు. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల రైతులకు మూడేళ్లలో ఈ పథకం కింద పైసా కూడా రుణం ఇవ్వలేదంటే పథకం పనితీరు తేటతెల్లమవుతోంది. రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నా..అధికారుల అలసత్వం కారణంగా అవి రైతులకు దక్కడం లేదు. పైసా వడ్డీ లేకుండా అప్పు ఇస్తామంటే రైతులు ముందుకు రావడం లేదని అధికారులంటున్నారు.
రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన మార్కెట్ కమిటీలు కేవలం ఆదాయంపైనే దృష్టి సారించి సేవలను విస్మరించాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేని సమయంలో రైతుబంధు పథకం ద్వారా రుణం పొందే అవకాశం ఉంది. ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించి రుణ సాయమందించాల్సిన అధికారులు రైతులు ఆసక్తి చూపడం లేదన్న సాకుతో చేతులెత్తేస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నిధులున్నా..మూడేళ్లుగా అరకొరగా కూడా రైతులకు రుణాలివ్వడం లేదు. రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసి వడ్డీ లేని రుణం పొందవచ్చు. పథకం కింద పంట విలువలో 75 శాతం వరకు రుణంగా ఇస్తారు.
దీనికి 90 రోజుల వరకు వడ్డీ ఉండదు. పత్తి మినహా జిల్లాలో సాగయ్యే పంట ఉత్పత్తులన్నింటికీ ఈ పథకం కింద నిల్వ చేసుకుని రుణం పొందే అవకాశం ఉంది. ఇందు కోసం మార్కెట్ల వారీగా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. రైతులు వస్తే రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నా..పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో వారు విఫలమవుతున్నారు. వడ్డీ లేకుండా రుణాలిస్తామంటే వద్దనేవారు ఎవరుంటారని రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రైతుబంధు పథకానికి ఏటా కేటాయించిన నిధులు మురిగిపోతూనే ఉన్నాయి. పథకం అమలులో భాగంగా ప్రారంభంలో క్రయవిక్రయాలు జరిపే రైతులకు రైతుబంధు పేరిట ప్రత్యేకంగా పాసుపుస్తకాలిచ్చారు. గతంలో వందల సంఖ్యలో రైతులు రుణాలు తీసుకునేవారు. ప్రస్తుతం రుణం పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో రైతు బంధు పథకం కాగితాలకే పరిమితమైంది.
పథకంపై అవగాహన లేక డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్‌లో ఏ ధర ఉంటే అదే ధరకు పంట అమ్ముకొని రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. చాలా సందర్భాల్లో రైతులు అమ్ముకున్న తర్వాత పంటలకు ధరలు పెరిగాయి. అధికారులు మాత్రం రైతులు ముందుకొస్తే రుణాలిస్తామని చెబుతున్నారు. నగదు అవసరమైన రైతులు తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అమ్ముకుంటున్నారని, దీంతో రుణం తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు.
మూడేళ్లలో పథకం తీరు ఇదీ..
జిల్లాలో మొత్తం 15 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న రైతులకు మూడేళ్లలో ఒక్కపైసా కూడా రైతుబంధు పథకం కింద రుణం మంజూరు చేయలేదు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో మాత్రం 2011-12 సంవత్సరానికి గాను 76 మంది రైతులకు రూ. 32.44 లక్షలు, 2012-13 లో 22 మంది రైతులకు రూ. 17.22 లక్షలు, 2013 నవంబర్ వరకు 31 మంది రైతులకు రూ. 22.63 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. మొక్కుబడిగా మంజూరు చేస్తూ ఈ పథకానికి దూరం చేయడంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకున్నా రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది.
దరిచేరని రైతుబంధు
Published Fri, Jan 3 2014 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement