rythu bandhu scheme
-
KTR: తప్పించుకోలేవు రేవంత్..!
-
రైతు భరోసా మళ్లీ హుళక్కేనా?
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొంది. ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసిన ప్రభుత్వం, ప్రస్తుత యాసంగి సీజన్లోనైనా ఇస్తుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. వానాకాలం సీజన్లో అదిగో ఇస్తాం, ఇదిగో చేస్తాం అంటూ ప్రభుత్వం కాలయాపన చేసిందని, యాసంగిలోనూ అలాగే చేసే అవకాశం ఉందని కొందరు వ్యవసాయ శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.సీజన్ మొదలై నెల రోజులు దాటిందని, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదని, పైగా ఈసారి కూడా భరోసా సాయం ఉండక పోవచ్చనే సంకేతాలు తమకు వస్తున్నాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీనే పూర్తి చేయలేదని, ఇంకా చాలామందికి మాఫీ నిధులు జమ చేయాల్సి ఉన్నందున, అప్పటివరకు రైతు భరోసా ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో నైరాశ్యం నెలకొంది. రుణమాఫీ అందక.. భరోసా రాక సీజన్‌కు ముందే రైతుకు సహాయం చేయాలనేది రైతు భరోసా (గతంలో రైతుబంధు) పథకం ఉద్దేశం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు వంటి వాటి కోసం పెట్టుబడిని అందించాలన్నది లక్ష్యం. 2018 నుంచి ప్రతి ఏడాదీ రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం గత వానాకాలంలో సీజన్లో మాత్రం ఆగిపోయింది. రైతుబంధు పథకంలో మార్పులు చేర్పులు చేసి కొత్త మార్గదర్శకాలతో రైతుభరోసా తీసుకురావాలని కొత్త ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఈ ఏడాది జులై 2వ తేదీన రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది.జిల్లాల్లో అభిప్రాయ సేకరణ చేసింది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతుభరోసాపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. జూలైలో సమావేశాలు జరిగినా రైతుభరోసా ఊసెత్తలేదు. ఇప్పటివరకు కూడా ఏమీ తేల్చలేదు. ఒకవైపు రుణమాఫీ అందరికీ సరిగ్గా జరగక, మరోవైపు భరోసా సాయం కూడా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చాక రూ.5 వేలే అందజేత గతేడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ. 72,815 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సీజన్‌కు ఎకరానికి రూ.5,000 నుంచి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచి్చంది. రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలు అందజేసింది. వానాకాలం సీజన్ నుంచి రూ.7,500 ఇస్తామని పేర్కొంది. రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తితో సందిగ్ధత ఈ క్రమంలోనే రైతులకు ఇచ్చిన హామీ మేర కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రూ.31 వేల కోట్లు ఇస్తామని చెప్పి చివరకు రూ.18 వేల కోట్లలోపే ఇచ్చారు. నిబంధనలు, కొర్రీలతో వేలాది మంది రైతులకు ఇవ్వకపోవడం, చాలామంది అర్హులైన రైతులకు కూడా అందకపోవడంతో వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా పథకాన్ని తొలుత అనుకున్నట్టుగా అనేక మార్పులతో అమలు చేస్తే రైతుల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందోనన్న సందిగ్ధతలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలోనే రైతు భరోసాపై సాగతీత ధోరణిలో వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
తెలంగాణలో జాబ్ క్యాలెండర్! కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
నకిలీ రైతులకు బిగ్ షాక్
-
రైతు భరోసా, రుణమాఫిపై సుఖేందర్ రెడ్డి సంచలన కామెంట్స్
-
రైతు భరోసాపై రైతులతో కీలక సమావేశం
-
రైతు భరోసాపై ప్రజాభిప్రాయం
-
రైతుకు రొక్కం
-
రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్
-
తెలంగాణలో రైతు బంధు పధకానికి శ్రీకారం
-
‘రైతుబంధు నాకొద్దు’
జోగిపేట(అందోల్): రైతుబంధు పథకం పేరుతో తన తల్లి జానాబాయి పేర ఉన్న వ్యవసాయ భూమికి వచ్చే చెక్కును తీసుకోనని, దానిని గౌరవంగా తిరస్కరిస్తున్నామని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. సోమవారం ఆయన సాక్షితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సింగూరు పర్యటన సందర్భంగా దామోదర తల్లి జానాబాయి పేర ఉన్న 20 ఎకరాలకు పెట్టుబడి పథకం కింద రూ.1.60 లక్షలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన రాజనర్సింహ ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సహాయం తమకు వద్దన్నారు. రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం మంది కౌలు రైతులే పంటలను పండించుకుంటున్నారన్నారు. వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. బడా రైతుల గురించి కాకుండా చిన్న, సన్న కారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను ఏ మేరకు ఆదుకున్నారో శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రైతన్నకు సాయం ‘రైతుబంధు’
మహబూబ్‌నగర్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10నుంచి ప్రారంభం కానుంది. ఎకరాకు రూ.4వేలు, ఏడాదికి రూ.8వేలు చెక్కుల రూపంలో అందించడం, చెక్కులతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో ఆరు రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేశారు. శనివారం ఆర్‌అండ్‌బీలో తహసీల్దార్ ఎంవీ ప్రభాకర్‌రావు రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 10న ఎదిర జెడ్పీహెచ్ఎస్, 11న మహబూబ్‌నగర్ మహాత్మాగాంధీ రోడ్ హైస్కూల్, 12న ఏనుగొండ జెడ్పీహెచ్ఎస్, ఎర్రవల్లి యూపీఎస్, 14న బోయపల్లి జెడ్పీహెచ్ఎస్, 15న పాలకొండ యూపీఎస్ పాఠశాలల్లో చెక్కుల పంపిణీ ఉంటుందని తెలిపారు. రూ. 2.77కోట్ల చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక్కో బృందం సుమారు 300మంది రైతులకు పంపిణీ చేయనున్నారు. సమావేశంలో డీటీలు అఖిలప్రసన్న, కోట్ల మురళీధర్, ఏఓ నాగరాజు, ఆర్ఐ క్రాంతికుమార్‌గౌడ్, ఏఆర్ఐ హనీఫ్, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రాములు తదితరులు పాల్గొన్నారు. -
హుజూరాబాద్‌లో ‘రైతుబంధు’కు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రైతుబంధు పథకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కరీంనగర్ జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్‌లో ఈ నెల 10న పథకాన్ని ప్రారంభించి రైతులకు చెక్కులు అందజేయనున్నారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ సమీపంలోని ఇందిరానగర్–శాలపల్లిలో లేదా ధర్మరాజుపల్లిలో సీఎం సభను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ కమలాసన్‌రెడ్డి, హుజూరాబాద్ ఆర్డీవో బి.చెన్నయ్య మొద ట హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానాన్ని పరిశీలించారు. అనం తరం మండలంలోని శాలపల్లి, ధర్మరాజుపల్లి గ్రామాల్లో సభ నిర్వహణకు అనువుగా ఉన్న ఖాళీ స్థలాలను సందర్శించారు. -
రైతు బంధు పథకం: నగదు రెడీ
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకం ద్వారా రైతులకు అందించనున్న నిధులను బ్యాంకుల్లో సిద్ధంగా ఉంచినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను బ్యాంకుల ద్వారా వెంటనే నగదుగా మార్చుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. మే ఒకటో తేదీ నాటికి రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల్లో రూ.4,114.62 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరో రూ.2 వేల కోట్ల నగదును విడుదల చేయించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు బుధవారం రిజర్వ్ బ్యాంకు అధికారులను కలుస్తారని చెప్పారు. త్వరలోనే ఈ డబ్బు వస్తుందని, చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయ్యే నాటికి బ్యాంకుల్లో మొత్తం రూ.6 వేల కోట్లు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. రైతు బంధు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 57.33 లక్షల పాస్ పుస్తకాలు రైతులకు అందివ్వాలని నిర్ణయించాం. ఇందులో 4.60 లక్షల మంది ఆధార్ కార్డులను అనుసంధానం చేయలేదు. ఆధార్ కార్డు అనుసంధానం చేసిన 52,72,779 మందికి చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తాం. ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5–7.30 గంటల మధ్య నిర్వహించాలి. ఈ నెల 10న కార్యక్రమం ప్రారంభిస్తాం’’ అని సీఎం చెప్పారు. ఎస్బీఐ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు, గ్రామీణ వికాస్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఐఓబీ, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్ బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంటుందన్నారు. రైతుల కోసం సిద్ధంగా ఉంచిన డబ్బును బ్యాంకర్లు ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దని స్పష్టంచేశారు. రైతులకు ఇవ్వాల్సిన అన్ని చెక్కులు, అన్ని పాస్ పుస్తకాల ముద్రణ పూర్తయి, మండలాలకు చేరుకున్నాయని తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయం అందివ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ నెల 10 నుంచి మొదటి విడత డబ్బులను చెక్కుల రూపంలో అందించనుంది. సీఎం సమీక్షలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, పార్థసారథి, రామకృష్ణారావు, రాజేశ్వర్ తివారి, శాంతా కుమారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్రావు, భూ పరిపాలన డైరెక్టర్ వాకాటి కరుణ, ఐటీ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఓఎస్డీ రజిత్ షైనీ, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూములకూ ‘పెట్టుబడి’ సొమ్ము
సాక్షి, హైదరాబాద్ : అటవీ యాజమాన్య హక్కు పత్రాలున్న గిరిజన రైతులకు కూడా ‘రైతుబంధు’పథకం కింద పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో రాష్ట్రంలో 3 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ శాఖ తెలిపింది. 6 లక్షల ఎకరాలకు పైగా అటవీ యాజమాన్య హక్కు పత్రాలున్నాయి. వాటిని ఏళ్ల తరబడి ఆ గిరిజన రైతులే సాగు చేసుకుంటున్నారు. రెవె న్యూ శాఖ నిర్వహించిన భూ ప్రక్షాళన సర్వేలో ఈ భూములను వ్యవసాయ భూములుగా పరిగణించకుండా బీ కేటగిరీ వివాదాస్పద భూములుగా గుర్తించింది. ఈ భూములకు పెట్టుబడి సొమ్ము ఇవ్వకూడదని ప్రభుత్వం భావించింది. గిరిజనుల నుంచి ఒత్తిడి, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విన్న పాలతో ప్రభుత్వం అటవీ యాజమాన్య హ క్కు పత్రాలున్న భూములకు కూడా పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతుల వద్ద యాజమాన్య హక్కు పత్రాలు లేకపోవడంతో వారికి పెట్టుబడి సొమ్ము అందే పరిస్థితి కనిపించడం లేదు. అటవీ యాజ మాన్య హక్కు పత్రాలున్న రైతులకు కూడా వచ్చే నెల 10 నుంచే చెక్కుల పంపిణీ ప్రారంభిస్తారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రత్యేకంగా చెక్కుల ముద్ర ణ చేపడతామని వ్యవసాయ శాఖ తెలిపింది. -
మే 10 నుంచి పెట్టుబడి చెక్కులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వం రైతు బంధు పథకం రైతులకు పెట్టుబడి చెక్కులను మే 10 నుంచి పంపిణీ చేయనుందని.. తొలిదశ చెక్కుల ముద్రణ పూర్తయిందని స్టేట్ బ్యాంకు తెలంగాణ సీజీఎం జె.స్వామినాథన్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. తొలిదశ చెక్కులను మే మొదటి వారంలో ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. నగదు కొరత వాస్తవమే.. బ్యాంకులలో నగదు లేదన్నది వాస్తవమేనని, పెట్టుబడి చెక్కులతో నగదు విత్‌డ్రా కోసం అవసరమైన రూ.1,600 కోట్లను మే మొదటి వారంలోగా సమకూర్చుకుంటామని స్వామినాథన్ పేర్కొన్నారు. ‘‘ఆర్బీఐ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు 6 నెలల కాలానికి రూ.5,400 కోట్ల నగదు వస్తోంది. ఇప్పుడు రైతు బంధు పథకం కింద మూడు దశల్లో కలిపి మే 15లోపు రూ.5,400 కోట్లు రైతులకు ఇవ్వాలి. అంటే వచ్చిన నగదు అంతా ఈ ఒక్క పథకానికే కేటాయించాల్సి ఉంటుంది..’’అని చెప్పారు. 62 శాతం రెండున్నర ఎకరాల్లోపే..: పోచారం తెలంగాణలో 58 లక్షల మంది రైతులున్నారని.. వారిలో 62% రైతులు రెండున్నర ఎకరాల్లోపు భూమి ఉన్నవారేనని ఎస్ఎల్బీసీ భేటీలో మంత్రి పోచారం చెప్పారు. మరో 11–12% మందికి రెండున్నర నుంచి ఐదెకరాల వరకు భూమి ఉందని.. మొత్తంగా 0.28 శాతమే పెద్ద రైతులని పేర్కొన్నారు. పెట్టుబడి చెక్కుల పంపిణీ, ఇబ్బందులు, పరిష్కారాలపై రెండ్రోజుల్లో కలెక్టర్లతో సమావేశమవుతామన్నారు. ప్రతి జిల్లా, గ్రామీణ స్థాయిలోని బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని.. చెక్కుల విత్‌డ్రాలో రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని బ్యాంకర్లకు సూచించారు. -
‘రైతుబంధు’పై అమెరికా సంస్థ అధ్యయనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రైతుబంధు’పథకం అమలు తీరుపై అమెరికా పరిశోధన సంస్థ అధ్యయనం చేయనుంది. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన ఆర్థిక విభాగం ఈ బాధ్యతలు చేపట్టనుంది. ఈ అధ్యయనాని కి ‘హై ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ ఎవాల్యువేషన్’అని నామకరణం చేశారు. రైతుబంధు పథకం ప్రారంభమయ్యాక ఈ సంస్థ సర్వే మొ దలు పెడుతుంది. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల పనితీరు, వారి సామర్థ్యం అంచనా వేయనుంది. రైతుల అభిప్రాయాలు తీసుకుంటుంది. పథకం వల్ల వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకుంటుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. 120మండలాల్లో అధ్యయనం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో అధ్యయనం చేపడితే నిష్పక్షపాతంగా ఉండదని భావించి ఒక అంతర్జాతీయ పరిశోధన యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం బాధ్యతలు అప్పగించింది. వచ్చే నెల 10 నుంచి పెట్టుబడి చెక్కులను ప్రభుత్వం రైతులకు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. చెక్కుల పంపిణీ సమయంలోనే వర్సిటీ బృందం అధ్యయనం మొదలుపెడుతుంది. అందుకు 120 మండలాలను కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా గుర్తిస్తుంది. ఆ మండలాల వ్యవసాయ, రెవెన్యూ అధికారుల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు తీసుకుంటుంది. ఆయా మండలాలకు చెందిన రైతుల ఫోన్ నంబర్లు, పట్టా వివరాలను రెవెన్యూ శాఖ నుంచి సేకరిస్తుంది. పెట్టుబడి చెక్కులు అందాయా.. లేదా.. ఎంత సొమ్ము అందింది.. ఎక్కడైనా అన్యాయం జరిగిందా.. దానికి బాధ్యులెవరు.. తీసుకున్న పెట్టుబడి సొమ్మును ఏ అవసరాలకు ఉపయోగించారు.. తదితర వివరాలను అధ్యయనం చేస్తుంది. అధ్యయనం చేసిన నివేదికలను ప్రతి 10 రోజులకోసారి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ అధ్యయనం నెల రోజులు జరుగుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. కాల్ సెంటర్ ఏర్పాటు.. అమెరికన్ పరిశోధన వర్సిటీ ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ కాల్ సెంటర్ నుంచే 120 మండలాలకు చెందిన అధికారులు, రైతులను సంప్రదిస్తుంది. అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తుంది. ఈ అధ్యయనం చేపట్టడంలో ప్రధాన ఉద్దేశం పథకాన్ని సరిగా అమలుచేసేలా అధికారులపై ఒత్తిడి తేవడమేనని వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 120 మండలాల్లో పథకం అమలు తీరును పరిశీలించి అధికారుల పనితీరు, సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. పైగా అమెరికా సంస్థ తమ సామర్థ్యాన్ని అంచనా వేస్తుందన్న భయంతో అధికారులు తప్పులు దొర్లకుండా సక్రమంగా చెక్కుల పంపిణీ చేస్తారన్న భావన సర్కారులో ఉందని చెబుతున్నారు. రైతుల నుంచి వచ్చే అభిప్రాయాలను బట్టి పథకంలో తీసుకురావాల్సిన మార్పులను గుర్తిస్తారు. అందుకు తగ్గట్లు రబీలో మార్పులు చేర్పులు చేస్తారు. అధ్యయనం ఎలా చేయాలన్న దానిపై వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ బుధవారం అధ్యయన బృందంతో సమావేశమయ్యారు. -
లక్షన్నర మంది రైతులకు రూ.100
సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతుల్లో కొందరు రూ. లక్షలు అందుకోనుండగా.. మరికొందరు వందలు మాత్రమే తీసుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సన్న, చిన్న కారు రైతుల్లో చాలామంది ఎకరాలోపు వారే ఉన్నారు. పట్టణాలు, నగర శివారు గ్రామాల్లో అనేకమందికి కొన్ని గుంటల భూమే ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం 60 లక్షల మంది రైతులకు రైతు బంధు పథకం కింద పెట్టుబడి చెక్కులు అందనున్నాయి. వారిలో లక్షన్నర మందికి గుంట భూమే ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే వారికి ఒక్కొక్కరికి కేవలం రూ.100 చెక్కులు పంపిణీ చేస్తారు. చెక్కు పోతే అంతే.. చెక్కుల ముద్రణ ఇప్పటికే ప్రారంభమైంది. ఎస్బీఐ ముంబైలో ముద్రిస్తుంటే, మిగిలిన బ్యాంకులు దేశంలో వేర్వేరుచోట్ల ముద్రిస్తున్నాయి. ఇప్పటివరకు 80 శాతానికిపైగా రైతుల డేటాను బ్యాంకులకు వ్యవసాయశాఖ అందజేసింది. వాటి ప్రకారం ముద్రణ జరుగుతోంది. రెండు మూడ్రోజుల్లో మొదటి దశ కింద కొన్ని లక్షల చెక్కులు హైదరాబాద్ రానున్నాయి. వాటిని తీసుకునేందుకు వ్యవసాయశాఖ.. అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. నగరంలో ఎనిమిది బ్యాంకులు వేర్వేరుచోట్ల కౌంటర్లు పెట్టి చెక్కులను వ్యవసాయశాఖకు అప్పగించనున్నాయి. వీటిని జిల్లాలు, మండలాలు, రెవెన్యూ గ్రామాల వారీగా కట్టలు కడతారు. వాటిని డీఏవో, ఏడీఏ, ఏవో, ఏఈవోలు వచ్చి గ్రామాల వారీగా లెక్కగట్టి అత్యంత భద్రత నడుమ తీసుకు వెళ్తారు. చెక్కులు తీసుకెళ్లే సమయంలోనే అన్నీ సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఒక్క చెక్కు పోయినా ఉద్యోగం ఊడినంత పని అవుతుందని, తీవ్ర పరిణామాలు, సస్పెన్షన్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇవిగో చెక్కులు.. ముంబైలో ప్రింట్ అవుతున్న కొన్ని చెక్కులను ఎస్బీఐ అధికారులు పరిశీలన కోసం హైదరాబాద్ పంపించారు. అవెలా ఉన్నాయో బ్యాంకు అధికారులు పరిశీలించారు. వాటిల్లో మూడు చెక్కులను ‘సాక్షి’ఎస్ఎల్బీసీ అధికారుల నుంచి సంపాదించింది. ఆ చెక్కులు పంపిణీకి సిద్ధం చేసినవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ సంతకంతో అవి ఉన్నాయి. ఈ చెక్కులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులవి కావడం విశేషం. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు టి.తుకారాంకు రూ. 1,300 చెక్కు రాసి ఉంది. అదే మండలం అనుకుంత గ్రామానికి చెందిన రైతు బాసా బక్కన్న పేరుతో రూ.6,480 చెక్కు ఉంది. మరోటి అదే మండలం బోరెనూర్ గ్రామానికి చెందిన పేమదూరు ఏసు పేరుతో రూ.6 వేల చెక్కు ఉంది. -
‘రైతు బంధు’కు అప్పులే దిక్కు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తలపెట్టిన ‘రైతు బంధు’పథకానికి అప్పులే ఆధారం కానున్నాయి. రైతులకు సాయం పంపిణీ కోసం భారీగా నిధులు అవసరం కావటంతో.. ఇప్పటికిప్పుడు రూ.4 వేల కోట్లు అప్పు కావాలని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకును ఆశ్రయించింది. ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోందన్న విమర్శల మధ్య తిరిగి రుణ సమీకరణకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే.. రైతు బంధు పథకానికి ఏటా రూ.12 వేల కోట్లు అవసరమని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర బడ్జెట్లో నిధులు కూడా కేటాయించింది. ఈనెల 19 లేదా 20 నుంచే తొలి విడత సాయాన్ని అందిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. తొలివిడతగా రూ.4 వేల చొప్పున అందించేందుకు సుమారు రూ.6,000 కోట్లు అవసరమని అంచనా. అయితే ఆర్థిక సంవత్సరం తొలి నెల కావడంతో ఖజానాలో నిధులు లేవు. తాజా బడ్జెట్ అంచనాల ప్రకారం.. రాష్ట్రానికి ప్రతి నెలా సగటున రూ.6 వేల కోట్ల పన్నుల ఆదాయం వస్తుంది. కానీ ఆర్థిక సంవత్సరం తొలినెల కావడంతో ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆశించిన ఆదాయం వచ్చినా.. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర చెల్లింపులకే ప్రతినెలా రూ.4 వేల కోట్లకుపైగా అవసరం. ఇతర బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టినా ‘రైతు బంధు’పథకానికి రూ.2 వేల కోట్లకు మించి వెచ్చించే పరిస్థితి లేదని సమాచారం. దీంతో రుణ సేకరణకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగానే అప్పులు.. ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది రూ.28 వేల కోట్ల మేరకు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. ఇందులో మూడింట రెండొంతుల అప్పును ఎప్పుడైనా.. రిజర్వు బ్యాంకు ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి సమీకరించేందుకు వీలుంటుంది. మిగతా ఒక వంతు మాత్రం ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకోవటం అరుదు. కానీ ‘రైతు బంధు’కు నిధుల కోసం ఏప్రిల్‌లోనే రుణ సమీకరణకు అనుమతించాలని బడ్జెట్‌కు ముందే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖను కోరడం గమనార్హం. ఈ నెల 10న రూ.2 వేల కోట్లు, 17న మరో రూ.2 వేల కోట్లను సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టింది. ఈ నిధులతో రైతులకు ఆర్థిక సాయానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని నిశ్చయించుకుంది. -
పాస్‌బుక్కుంటేనే.. చెక్కు పాస్
సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు చెక్కు రైతుఖాతాలో జమ కావాలంటే పాస్ పుస్తకం ఉండాల్సిందే. రైతుల గుర్తింపుపత్రంగా పాస్‌బుక్ చూపించాల్సి ఉంది. ఈ మేరకు ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. పాస్‌పుస్తకాల ప్రింటింగ్‌కు కావాల్సిన సమాచారంతో వెంటనే వ్యవసాయ శాఖకు నివేదిక పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 72 లక్షల రైతు ఖాతాలుండగా ఇప్పటివరకు 67 లక్షల ఖాతాలను మాత్రమే తహసీల్దార్లు పూర్తి చేశారు. అందులోనూ 57 లక్షల ఖాతాల పాస్‌పుస్తకాల ముద్రణకు మాత్రమే సిఫారసు చేశారు. చెక్కుల పంపిణీకి గడువు సమీపిస్తున్నందున గ్రామాలవారీగా ఎంత భూమి ఉంది.. అందులో ఎన్ని ఖాతాలున్నాయనే వివరాలను పంపాలని, అన్ని ఖాతాలను తహసీల్దార్లు డిజిటల్ సంతకాల ద్వారా అధీకృతం చేయాలని ఎన్ఐసీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తి కానట్టు తెలుస్తోంది. భూరికార్డుల ప్రక్షాళన గణాంకాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు కూడా తేడా ఉం దని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆ తేడాలను పరిశీలించి సరిచేయాలని, డ్రాఫ్ట్ పాస్ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసి సదరు రైతుకివ్వాలని, అన్ని వివరాలు సరిగా ఉన్న తర్వాతే ఫైనల్ పాస్‌పుస్తకానికి సిఫారసు చేయాలని, ఇలాంటి భూముల వివరాలను కలెక్టర్లు, జేసీ లిఖితపూర్వకంగా నిర్ధారించి ఈ నెల 24వ తేదీలోపు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ కమిటీకి అవసరం లేదు : అసైన్డ్ భూములను కబ్జాలో ఉన్న వారికి రీఅసైన్ చేసే విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రీ అసైన్మెంట్ కోసం గతంలో ఉన్న నియోజకవర్గ స్థాయి అసైన్మెంట్ కమిటీకి సంబంధంలేకుండానే జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవచ్చని భూపరిపాలన డైరెక్టర్ వి.కరుణ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు భూమిలేని వారు, పరిమితంగా భూములున్న పేదలు అసైన్డ్ భూములు లేదా ఇండ్లస్థలాలను కొనుగోలు చేసి కబ్జాలో ఉన్నట్టయితే వారికే ఆ భూములు, స్థలాలను నేరుగా కలెక్టర్లే రీ అసైన్ చేయనున్నారు. -
అక్కరకు రాని రైతుబంధు
రాజమండ్రి : రైతుల నిరాసక్తత, మార్కెట్ కమిటీల ప్రచారలోపంతో ‘రైతుబంధు’ పథకం నిష్ర్పయోజనంగా మారింది. ఈ పథకం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ కమిటీల్లో నిల్వ చేసుకుని మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే నిల్వ చేసిన పంటపై రుణం పొందే వెసులుబాటు కూడా ఉంది. అయినా రైతులు ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. ఈ పథకాన్ని రైతుల్లోకి తీసుకు వెళ్లడంలో అటు మార్కెట్ కమిటీలు సైతం విఫలమవుతున్నాయి. జిల్లాలో రబీ వరికోతలు ఆరంభమయ్యాయి. ఈ ఏడాది సుమారు 15 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణ నిబంధనలు మార్చడం వల్ల మొత్తం ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తారన్న భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీనితో దళారులు కొన్నదే ధాన్యం.. చెప్పిందే ధరగా మారింది. తేమ పేరుతో మద్దతు ధరకు అడ్డంగా కోతపెడుతుండడంతో రైతులు అయినకాడికి ధాన్యం అమ్ముకుంటున్నారు. ఐదు శాతం రైతులకు కూడా తెలియని పథకం రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం మార్కెట్ కమిటీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించింది. రైతు పట్టాదారుపాస్ బుక్, కౌలుదారులైతే రుణ అర్హత కార్డులను చూపి ధాన్యాన్ని ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా రబీ కొనుగోలు సీజన్ పూర్తయ్యూక ధాన్యానికి మద్దతుకన్నా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఖరీఫ్, రబీ కొనుగోలు పూర్తయ్యూక ధాన్యానికి కనీస మద్దతు కన్నా అధిక ధర వస్తున్న విషయం తెలిసిందే. గత రబీ కొనుగోలు పూర్తయ్యూక బొండాల రకం కనీస మద్దతుధర బస్తా రూ.1,020 ఉంటే, రూ.1,400 వరకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ పథకంలో నిల్వ చేసుకున్న ధాన్యం విలువలో 75 శాతం రుణం పొందే అవకాశముంది. ఒక రైతు గరిష్టంగా రూ.రెండు లక్షల రుణం పొందవచ్చు. ఇన్సూరెన్స్, స్వల్పంగా అద్దెను వసూలు చేస్తుంటారు. అయినా రైతులు రైతుబంధుకు దూరంగా ఉంటున్నారు. సాగు సమయంలో దళారుల వద్ద అప్పులు చేయడం వల్ల వారు చెప్పిన ధరకే అమ్మాల్సి రావడం ఓ కారణమైతే.. మార్కెట్ కమిటీలకు తరలింపు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనుకోవడం మరో కారణం. జిల్లాలో ఐదు శాతం మంది రైతులు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవడం లేదు. అసలు ఇలాంటి పథకం ఉందనే విషయం కూడా చాలా మంది రైతులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. రైతు బంధుకు ప్రచారం కల్పించడంలో మార్కెట్ కమిటీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీనికి తోడు జిల్లాలో అల్లవరం, అనపర్తి, ఆలమూరు, జగ్గంపేట, పెద్దాపురం తదితర మార్కెట్ కమిటీలకు గొడౌన్ల సౌకర్యం లేకపోవడం వల్ల కూడా ఈ పథకం నిష్పప్రయోజనంగా మారింది. -
రైతు బంధు అమలు చేస్తాం:హరీష్‌రావు
-
రైతు‘బందు’
రైతుబంధు పథకం బంద్ అయ్యిందేమో అనే అనుమానం కలుగుతోంది. రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటనలు గుప్పిస్తున్న పాలకులు వారిని అసలు పట్టించుకోవడం లేదనడానికి ఈ పథకం అద్దం పడుతోంది. రుణమాఫీ ఫలాలు అక్కరకు రాక.. కొత్త రుణాలు అందక అల్లాడుతున్న అన్నదాతలకు ఆసరాగా నిలవాల్సిన రైతుబంధు పథకాన్ని పాలకులు కొండెక్కించారు. రైతులు పండించిన పంటల్ని తగిన ధర వచ్చేవరకూ మార్కెట్ యార్డుల్లో నిల్వ చేయడానికి.. అలా దాచిన పంటపై రుణం ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ పథకం అక్కడక్కడా బడా భూస్వాములకు తప్ప అసలు రైతులకు ఏమాత్రం ఆసరా ఇవ్వడం లేదు. ఏలూరు :ఆరుగాలం శ్రమంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేవరకు మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసుకుని రైతుల అవసరాలను తీర్చే రైతుబంధు పథకం వారికి ఆమడదూరంలో ఉంది. వరి సాగులో అగ్రస్థానంలో ఉన్న ‘పశ్చిమ’లో అన్నదాతలకు ఈ పథకం అక్కరకు రావడం లేదు. ఫలితంగా పంటలను అయినకాడికి అమ్ముకుని కర్షకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు 1999లో రైతుబంధు పథకాన్ని అప్పటి సర్కారు అమల్లోకి తెచ్చింది. మార్కెట్ యార్డులలో ధాన్యం, ఇతర పంటలను నిల్వ చేసుకునేలా రైతులను ప్రోత్సహించడం ద్వారా ఆయా పంటలకు మంచి ధర వచ్చేలా చేయడం.. నిల్వ ఉంచిన పంటలపై రుణాలు ఇచ్చి తరువాత పంటకు పెట్టుబడులు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సెస్‌లో 25 శాతం రుణమివ్వాలి జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు ఉన్నాయి. వీటిద్వారా ఏటా మార్కెటింగ్ సెస్ రూపంలో ప్రభుత్వానికి రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ప్రతి మార్కెట్ కమిటీకి ఇలా వచ్చే ఆదాయంలో కనీసం 25 శాతం మొత్తాన్ని రైతుబంధు పథకం కింద రైతులకు రుణాలుగా ఇవ్వాలనే నిబంధన ఉంది. రైతు ఈ విధంగా 180 రోజుల వరకూ పంటలను ఏఎంసీలు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో 180 రోజుల వరకు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల మార్కెట్లో ధరలు పుంజుకున్నాక పంటను రైతులు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలో ఆచంట, ఆకివీడు, అత్తిలి, భీమడోలు, భీమవరం, చింతలపూడి, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, పెనుగొండ, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, ఉంగుటూరులలో ఏఎంసీలు ఉన్నాయి. వీటిలో 14 ఏఎంసీలలో 329 మంది రైతులకు రూ.2.65 కోట్లను రైతుబంధు పథకం కింద రుణాలుగా ఇచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవికూడా ఈ సీజన్లో ఇచ్చినవి కాదు. పైగా ఇలా రుణాలు తీసుకున్న వారంతా బడా భూస్వాములే కావడం విశేషం. రైతులు అడిగితే ఎంతైనా రుణం ఇస్తామని.. మార్కెట్ కమిటీ ఆదాయంలో 25 శాతమే రుణంగా ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని ఢంకా బజాయించి చెబుతున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రుణ పరిమితి పెంచినా... రైతు పథకం కింద పంటను ఏఎంసీ గోదాముల్లో నిల్వ చేసుకున్న రైతుకు కనీసం రూ.లక్ష వరకు రుణం లభించేది. దీనిని ఇటీవల రూ.2 లక్షలకు పెంచారు. ఏఎంసీ పరిధిలోని రైతులకు ఏటా రైతుబంధు కార్డులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఎక్కడా ఈ కార్డులు ఇస్తున్న దాఖలాలు లేవు. ఏఎంసీల ద్వారా రైతుల నుంచి సెస్ రూపంలో వసూలు చేస్తున్న మొత్తాలను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తూ ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
రైతు బంధు కింద రుణాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : బ్యాంకులతో సంబంధం లేకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుబంధు పథకం కింద రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలిస్తామని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. రైతులు తమ వద్ద ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కమిటీ గొడౌన్లలో భద్రపరిస్తే చాలని చెప్పారు. మొదటి ఆరు నెలలకు వడ్డీ ఉండదని, ఆ తర్వాత 12శాతం వడ్డీ శాతం వసూలు చేస్తారన్నారు. వడ్డీ లేని ఆరు నెలల్లోనే వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించి రుణం తీర్చవచ్చనని తెలిపారు. బుధవారం తన ఛాంబర్లో విలేకర్లతో మాట్లాడుతూ రైతులకు ఇదొక మంచి సౌలభ్యమన్నారు. రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్ విషయంలో కూడా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. డీసీఎంఎస్ కాంట్రాక్ట్ రద్దు అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలోనే అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో డీసీఎంఎస్‌కు ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రద్దు చేశామన్నారు. త్వరలోనే కొత్తగా టెండర్లు పిలుస్తామని చెప్పారు. సక్రమంగా పనిచేయని అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం సరిగా పెట్టని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అలాగని, నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోలేదన్నారు. అంగన్వాడీ కేంద్రాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. తానొచ్చిన తర్వాత వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఎవరికి కావాలన్నా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఆధార్ సీడింగ్‌పై ప్రత్యేక దృష్టి ఆధార్ సీడింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్ తెలిపారు. రేషన్‌కార్డులకు సంబంధించి 84 శాతం సీడింగ్ జరిగిందని, హౌసింగ్‌కు సంబంధించి 85 శాతం, పింఛన్ల లబ్ధిదారులలో 2.4 లక్షల మందికి సీ డింగ్ చేసినట్టు చెప్పారు. కేవలం 18వేల మంది మా త్రమే సీడింగ్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఆధార్ సీడింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కాస్త వెనకబడి ఉందని, దీనిపై విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ ద్వారా లెవీ సేకరణ జరుగుతోందని, దీని కన్నా ఎఫ్‌సీఐ ద్వారా సేకరణ చేయడమే మేలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకాభివృద్ధిపై దృష్టి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ తెలిపారు.ఈ మేరకు టూరి జం ప్రచార కౌన్సిల్‌ను పునరుద్ధరించినట్టు చెప్పారు. తోటపల్లి బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్ ప్రాంతాలతో పాటు విజయనగరం పెద్ద చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పెద్దచెరువు వద్ద అందమైన గార్డెన్ ఏర్పాటు చేయడంతో పాటు బోటు సౌకర్యం కల్పించే యోచనలో ఉన్నామన్నారు. టెంపు ల్ టూరిజంతో పాటు ఎకో టూరిజంపై దృష్టిపెట్టామన్నారు. అనువైన చోట జలపాతాలు, స్నేక్పార్క్ ఏర్పా టు చేసే ఆలోచన ఉందన్నారు. చింతపల్లిలో చేపట్టిన బీచ్ రిసార్ట్ నిర్మాణం నవంబర్‌లో పూర్తవుతుందన్నా రు. గురజాడ భవనాన్ని ఆధునికీకరిస్తామని, సంగీత కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్టోబర్‌లో సంగీత ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఈఈపై చర్యలకు సిఫారసు పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్‌కుమార్‌పై చర్యలకు సిఫారసు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పాత తేదీతో టెక్నికల్ అసిస్టెంట్ల కాల పరిమితిని పొడిగించడం సరికాదన్నారు. జెడ్పీ సీఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. డీఈఈ శ్రీనివాస్‌తో పాటు అందులో ప్రమేయం ఉన్న మిగతా వారిపైనా చర్యలు ఉంటాయన్నారు. విద్యాశాఖాధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై దృష్టి సారిస్తానన్నారు. భూముల విలువ పెరుగుతున్న నేపథ్యంలో భోగాపురంలో జరుగుతున్న ఆక్రమణలపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
దరిచేరని రైతుబంధు
చీరాల, న్యూస్‌లైన్: మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునే రైతులకు వడ్డీలేని రుణాలిచ్చేందుకు రూపొందించిన రైతుబంధు పథకం వారి దరి చేరడం లేదు. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల రైతులకు మూడేళ్లలో ఈ పథకం కింద పైసా కూడా రుణం ఇవ్వలేదంటే పథకం పనితీరు తేటతెల్లమవుతోంది. రుణాలిచ్చేందుకు ప్రభుత్వం ఏటా లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నా..అధికారుల అలసత్వం కారణంగా అవి రైతులకు దక్కడం లేదు. పైసా వడ్డీ లేకుండా అప్పు ఇస్తామంటే రైతులు ముందుకు రావడం లేదని అధికారులంటున్నారు. రైతుల సంక్షేమానికి పాటుపడాల్సిన మార్కెట్ కమిటీలు కేవలం ఆదాయంపైనే దృష్టి సారించి సేవలను విస్మరించాయి. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేని సమయంలో రైతుబంధు పథకం ద్వారా రుణం పొందే అవకాశం ఉంది. ఈ పథకంపై రైతులకు అవగాహన కల్పించి రుణ సాయమందించాల్సిన అధికారులు రైతులు ఆసక్తి చూపడం లేదన్న సాకుతో చేతులెత్తేస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో నిధులున్నా..మూడేళ్లుగా అరకొరగా కూడా రైతులకు రుణాలివ్వడం లేదు. రైతులు పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనప్పుడు వాటిని మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసి వడ్డీ లేని రుణం పొందవచ్చు. పథకం కింద పంట విలువలో 75 శాతం వరకు రుణంగా ఇస్తారు. దీనికి 90 రోజుల వరకు వడ్డీ ఉండదు. పత్తి మినహా జిల్లాలో సాగయ్యే పంట ఉత్పత్తులన్నింటికీ ఈ పథకం కింద నిల్వ చేసుకుని రుణం పొందే అవకాశం ఉంది. ఇందు కోసం మార్కెట్ల వారీగా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు. రైతులు వస్తే రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెబుతున్నా..పథకంపై రైతులకు అవగాహన కల్పించడంలో వారు విఫలమవుతున్నారు. వడ్డీ లేకుండా రుణాలిస్తామంటే వద్దనేవారు ఎవరుంటారని రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో రైతుబంధు పథకానికి ఏటా కేటాయించిన నిధులు మురిగిపోతూనే ఉన్నాయి. పథకం అమలులో భాగంగా ప్రారంభంలో క్రయవిక్రయాలు జరిపే రైతులకు రైతుబంధు పేరిట ప్రత్యేకంగా పాసుపుస్తకాలిచ్చారు. గతంలో వందల సంఖ్యలో రైతులు రుణాలు తీసుకునేవారు. ప్రస్తుతం రుణం పొందే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో రైతు బంధు పథకం కాగితాలకే పరిమితమైంది. పథకంపై అవగాహన లేక డబ్బులు అవసరమైనప్పుడు మార్కెట్లో ఏ ధర ఉంటే అదే ధరకు పంట అమ్ముకొని రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. చాలా సందర్భాల్లో రైతులు అమ్ముకున్న తర్వాత పంటలకు ధరలు పెరిగాయి. అధికారులు మాత్రం రైతులు ముందుకొస్తే రుణాలిస్తామని చెబుతున్నారు. నగదు అవసరమైన రైతులు తమ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు అమ్ముకుంటున్నారని, దీంతో రుణం తీసుకోవడానికి ముందుకు రావడం లేదన్నారు. మూడేళ్లలో పథకం తీరు ఇదీ.. జిల్లాలో మొత్తం 15 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న రైతులకు మూడేళ్లలో ఒక్కపైసా కూడా రైతుబంధు పథకం కింద రుణం మంజూరు చేయలేదు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో మాత్రం 2011-12 సంవత్సరానికి గాను 76 మంది రైతులకు రూ. 32.44 లక్షలు, 2012-13 లో 22 మంది రైతులకు రూ. 17.22 లక్షలు, 2013 నవంబర్ వరకు 31 మంది రైతులకు రూ. 22.63 లక్షలు మాత్రమే మంజూరు చేశారు. మొక్కుబడిగా మంజూరు చేస్తూ ఈ పథకానికి దూరం చేయడంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకున్నా రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది.