రైతు బంధు కింద రుణాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం : బ్యాంకులతో సంబంధం లేకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుబంధు పథకం కింద రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలిస్తామని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ తెలిపారు. రైతులు తమ వద్ద ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కమిటీ గొడౌన్‌లలో భద్రపరిస్తే చాలని చెప్పారు. మొదటి ఆరు నెలలకు వడ్డీ ఉండదని, ఆ తర్వాత 12శాతం వడ్డీ శాతం వసూలు చేస్తారన్నారు. వడ్డీ లేని ఆరు నెలల్లోనే వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించి రుణం తీర్చవచ్చనని తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ రైతులకు ఇదొక మంచి సౌలభ్యమన్నారు. రుణమాఫీ, రుణాల రీషెడ్యూల్ విషయంలో కూడా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు.
డీసీఎంఎస్ కాంట్రాక్ట్ రద్దు
అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలోనే అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో డీసీఎంఎస్‌కు ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రద్దు చేశామన్నారు. త్వరలోనే కొత్తగా టెండర్లు పిలుస్తామని చెప్పారు. సక్రమంగా పనిచేయని అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనం సరిగా పెట్టని ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అలాగని, నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకోలేదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. తానొచ్చిన తర్వాత వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేసేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఎవరికి కావాలన్నా మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.
ఆధార్ సీడింగ్‌పై ప్రత్యేక దృష్టి
ఆధార్ సీడింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్ తెలిపారు. రేషన్‌కార్డులకు సంబంధించి 84 శాతం సీడింగ్ జరిగిందని, హౌసింగ్‌కు సంబంధించి 85 శాతం, పింఛన్ల లబ్ధిదారులలో 2.4 లక్షల మందికి సీ డింగ్ చేసినట్టు చెప్పారు. కేవలం 18వేల మంది మా త్రమే సీడింగ్ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా ఆధార్ సీడింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయంలో జిల్లా కాస్త వెనకబడి ఉందని, దీనిపై విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వివరించారు. ఎక్కడా లేని విధంగా జిల్లాలో మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ ద్వారా లెవీ సేకరణ జరుగుతోందని, దీని కన్నా ఎఫ్‌సీఐ ద్వారా సేకరణ చేయడమే మేలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
పర్యాటకాభివృద్ధిపై దృష్టి
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ తెలిపారు.ఈ మేరకు టూరి జం ప్రచార కౌన్సిల్‌ను పునరుద్ధరించినట్టు చెప్పారు. తోటపల్లి బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్ ప్రాంతాలతో పాటు విజయనగరం పెద్ద చెరువును పర్యాటకంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పెద్దచెరువు వద్ద అందమైన గార్డెన్ ఏర్పాటు చేయడంతో పాటు బోటు సౌకర్యం కల్పించే యోచనలో ఉన్నామన్నారు. టెంపు ల్ టూరిజంతో పాటు ఎకో టూరిజంపై దృష్టిపెట్టామన్నారు. అనువైన చోట జలపాతాలు, స్నేక్‌పార్క్ ఏర్పా టు చేసే ఆలోచన ఉందన్నారు. చింతపల్లిలో చేపట్టిన బీచ్ రిసార్ట్ నిర్మాణం నవంబర్‌లో పూర్తవుతుందన్నా రు. గురజాడ భవనాన్ని ఆధునికీకరిస్తామని, సంగీత కళాశాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్టోబర్‌లో సంగీత ఉత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.
డీఈఈపై చర్యలకు సిఫారసు
పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్‌కుమార్‌పై చర్యలకు సిఫారసు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. పాత తేదీతో టెక్నికల్ అసిస్టెంట్ల కాల పరిమితిని పొడిగించడం సరికాదన్నారు. జెడ్పీ సీఈఓ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి లేఖ రాసినట్టు చెప్పారు. డీఈఈ శ్రీనివాస్‌తో పాటు అందులో ప్రమేయం ఉన్న మిగతా వారిపైనా చర్యలు ఉంటాయన్నారు. విద్యాశాఖాధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై దృష్టి సారిస్తానన్నారు. భూముల విలువ పెరుగుతున్న నేపథ్యంలో భోగాపురంలో జరుగుతున్న ఆక్రమణలపై సీరియస్‌గా చర్యలు తీసుకుంటామని తెలిపారు.