యాసంగి సీజన్‌లోనూ అనుమానమే అంటున్న అధికారులు
అంతకుముందు వానాకాలం సీజన్‌లో సర్కారు ఎగనామం
ప్రస్తుతం సీజన్ మొదలై నెల దాటినా మార్గదర్శకాలపై కొరవడిన స్పష్టత
ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.7,500 ఇస్తామన్న హామీ నెరవేరని వైనం
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా అమలుపై అస్పష్టత నెలకొంది. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో రైతులకు భరోసా సాయం చేయకుండా వాయిదా వేసిన ప్రభుత్వం, ప్రస్తుత యాసంగి సీజన్‌లోనైనా ఇస్తుందా లేదా అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది. వానాకాలం సీజన్‌లో అదిగో ఇస్తాం, ఇదిగో చేస్తాం అంటూ ప్రభుత్వం కాలయాపన చేసిందని, యాసంగిలోనూ అలాగే చేసే అవకాశం ఉందని కొందరు వ్యవసాయ శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
సీజన్ మొదలై నెల రోజులు దాటిందని, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదని, పైగా ఈసారి కూడా భరోసా సాయం ఉండక పోవచ్చనే సంకేతాలు తమకు వస్తున్నాయని వారు చెబుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీనే పూర్తి చేయలేదని, ఇంకా చాలామందికి మాఫీ నిధులు జమ చేయాల్సి ఉన్నందున, అప్పటివరకు రైతు భరోసా ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో రైతుల్లో నైరాశ్యం నెలకొంది.
రుణమాఫీ అందక.. భరోసా రాక
సీజన్‌కు ముందే రైతుకు సహాయం చేయాలనేది రైతు భరోసా (గతంలో రైతుబంధు) పథకం ఉద్దేశం. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు వంటి వాటి కోసం పెట్టుబడిని అందించాలన్నది లక్ష్యం. 2018 నుంచి ప్రతి ఏడాదీ రెండు సీజన్లలో నిరాటంకంగా కొనసాగిన ఈ పథకం గత వానాకాలంలో సీజన్‌లో మాత్రం ఆగిపోయింది. రైతుబంధు పథకంలో మార్పులు చేర్పులు చేసి కొత్త మార్గదర్శకాలతో రైతుభరోసా తీసుకురావాలని కొత్త ప్రభుత్వం భావించింది. ఆ మేరకు ఈ ఏడాది జులై 2వ తేదీన రైతుభరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది.
జిల్లాల్లో అభిప్రాయ సేకరణ చేసింది. అనంతరం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతుభరోసాపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. జూలైలో సమావేశాలు జరిగినా రైతుభరోసా ఊసెత్తలేదు. ఇప్పటివరకు కూడా ఏమీ తేల్చలేదు. ఒకవైపు రుణమాఫీ అందరికీ సరిగ్గా జరగక, మరోవైపు భరోసా సాయం కూడా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారంలోకి వచ్చాక రూ.5 వేలే అందజేత
గతేడాది వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతుబంధు కింద రైతులకు రూ. 72,815 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సీజన్‌కు ఎకరానికి రూ.5,000 నుంచి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచి్చంది. రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని పేర్కొంది. అయితే అధికారంలోకి వచ్చాక యాసంగి సీజన్‌లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలు అందజేసింది. వానాకాలం సీజన్ నుంచి రూ.7,500 ఇస్తామని పేర్కొంది.
రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తితో సందిగ్ధత
ఈ క్రమంలోనే రైతులకు ఇచ్చిన హామీ మేర కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు రూ.31 వేల కోట్లు ఇస్తామని చెప్పి చివరకు రూ.18 వేల కోట్లలోపే ఇచ్చారు. నిబంధనలు, కొర్రీలతో వేలాది మంది రైతులకు ఇవ్వకపోవడం, చాలామంది అర్హులైన రైతులకు కూడా అందకపోవడంతో వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రైతుభరోసా పథకాన్ని తొలుత అనుకున్నట్టుగా అనేక మార్పులతో అమలు చేస్తే రైతుల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందోనన్న సందిగ్ధతలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలోనే రైతు భరోసాపై సాగతీత ధోరణిలో వ్యవహరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment