
మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి (ఫైల్ ఫోటో)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రభుత్వం రైతు బంధు పథకం రైతులకు పెట్టుబడి చెక్కులను మే 10 నుంచి పంపిణీ చేయనుందని.. తొలిదశ చెక్కుల ముద్రణ పూర్తయిందని స్టేట్ బ్యాంకు తెలంగాణ సీజీఎం జె.స్వామినాథన్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం అనంతరం ఆయన ‘సాక్షి’బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. తొలిదశ చెక్కులను మే మొదటి వారంలో ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు.
నగదు కొరత వాస్తవమే..
బ్యాంకులలో నగదు లేదన్నది వాస్తవమేనని, పెట్టుబడి చెక్కులతో నగదు విత్‌డ్రా కోసం అవసరమైన రూ.1,600 కోట్లను మే మొదటి వారంలోగా సమకూర్చుకుంటామని స్వామినాథన్ పేర్కొన్నారు. ‘‘ఆర్‌బీఐ నుంచి తెలంగాణలోని బ్యాంకులకు 6 నెలల కాలానికి రూ.5,400 కోట్ల నగదు వస్తోంది. ఇప్పుడు రైతు బంధు పథకం కింద మూడు దశల్లో కలిపి మే 15లోపు రూ.5,400 కోట్లు రైతులకు ఇవ్వాలి. అంటే వచ్చిన నగదు అంతా ఈ ఒక్క పథకానికే కేటాయించాల్సి ఉంటుంది..’’అని చెప్పారు.
62 శాతం రెండున్నర ఎకరాల్లోపే..: పోచారం
తెలంగాణలో 58 లక్షల మంది రైతులున్నారని.. వారిలో 62% రైతులు రెండున్నర ఎకరాల్లోపు భూమి ఉన్నవారేనని ఎస్‌ఎల్‌బీసీ భేటీలో మంత్రి పోచారం చెప్పారు. మరో 11–12% మందికి రెండున్నర నుంచి ఐదెకరాల వరకు భూమి ఉందని.. మొత్తంగా 0.28 శాతమే పెద్ద రైతులని పేర్కొన్నారు. పెట్టుబడి చెక్కుల పంపిణీ, ఇబ్బందులు, పరిష్కారాలపై రెండ్రోజుల్లో కలెక్టర్లతో సమావేశమవుతామన్నారు. ప్రతి జిల్లా, గ్రామీణ స్థాయిలోని బ్యాంకుల్లో నగదు అందుబాటులో ఉంచాలని.. చెక్కుల విత్‌డ్రాలో రైతులను ఎలాంటి ఇబ్బందులు పెట్టకూడదని బ్యాంకర్లకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment