రాజమండ్రి : రైతుల నిరాసక్తత, మార్కెట్ కమిటీల ప్రచారలోపంతో ‘రైతుబంధు’ పథకం నిష్ర్పయోజనంగా మారింది. ఈ పథకం ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ కమిటీల్లో నిల్వ చేసుకుని మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే నిల్వ చేసిన పంటపై రుణం పొందే వెసులుబాటు కూడా ఉంది. అయినా రైతులు ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. ఈ పథకాన్ని రైతుల్లోకి తీసుకు వెళ్లడంలో అటు మార్కెట్ కమిటీలు సైతం విఫలమవుతున్నాయి.
జిల్లాలో రబీ వరికోతలు ఆరంభమయ్యాయి. ఈ ఏడాది సుమారు 15 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణ నిబంధనలు మార్చడం వల్ల మొత్తం ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తారన్న భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీనితో దళారులు కొన్నదే ధాన్యం.. చెప్పిందే ధరగా మారింది. తేమ పేరుతో మద్దతు ధరకు అడ్డంగా కోతపెడుతుండడంతో రైతులు అయినకాడికి ధాన్యం అమ్ముకుంటున్నారు.
ఐదు శాతం రైతులకు కూడా తెలియని పథకం
రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం మార్కెట్ కమిటీ గోదాముల్లో ధాన్యం నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించింది. రైతు పట్టాదారుపాస్ బుక్, కౌలుదారులైతే రుణ అర్హత కార్డులను చూపి ధాన్యాన్ని ఆరు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా రబీ కొనుగోలు సీజన్ పూర్తయ్యూక ధాన్యానికి మద్దతుకన్నా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఖరీఫ్, రబీ కొనుగోలు పూర్తయ్యూక ధాన్యానికి కనీస మద్దతు కన్నా అధిక ధర వస్తున్న విషయం తెలిసిందే. గత రబీ కొనుగోలు పూర్తయ్యూక బొండాల రకం కనీస మద్దతుధర బస్తా రూ.1,020 ఉంటే, రూ.1,400 వరకు పెరిగిన విషయం తెలిసిందే. ఈ పథకంలో నిల్వ చేసుకున్న ధాన్యం విలువలో 75 శాతం రుణం పొందే అవకాశముంది.
ఒక రైతు గరిష్టంగా రూ.రెండు లక్షల రుణం పొందవచ్చు. ఇన్సూరెన్స్, స్వల్పంగా అద్దెను వసూలు చేస్తుంటారు. అయినా రైతులు రైతుబంధుకు దూరంగా ఉంటున్నారు. సాగు సమయంలో దళారుల వద్ద అప్పులు చేయడం వల్ల వారు చెప్పిన ధరకే అమ్మాల్సి రావడం ఓ కారణమైతే.. మార్కెట్ కమిటీలకు తరలింపు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమనుకోవడం మరో కారణం. జిల్లాలో ఐదు శాతం మంది రైతులు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవడం లేదు. అసలు ఇలాంటి పథకం ఉందనే విషయం కూడా చాలా మంది రైతులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. రైతు బంధుకు ప్రచారం కల్పించడంలో మార్కెట్ కమిటీ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీనికి తోడు జిల్లాలో అల్లవరం, అనపర్తి, ఆలమూరు, జగ్గంపేట, పెద్దాపురం తదితర మార్కెట్ కమిటీలకు గొడౌన్ల సౌకర్యం లేకపోవడం వల్ల కూడా ఈ పథకం నిష్పప్రయోజనంగా మారింది.
అక్కరకు రాని రైతుబంధు
Published Fri, Apr 24 2015 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM
Advertisement
Advertisement