సాక్షి, హైదరాబాద్ : రైతు బంధు పథకం కింద పెట్టుబడి సొమ్ము తీసుకునే రైతుల్లో కొందరు రూ. లక్షలు అందుకోనుండగా.. మరికొందరు వందలు మాత్రమే తీసుకునే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సన్న, చిన్న కారు రైతుల్లో చాలామంది ఎకరాలోపు వారే ఉన్నారు. పట్టణాలు, నగర శివారు గ్రామాల్లో అనేకమందికి కొన్ని గుంటల భూమే ఉంది. ప్రస్తుత అంచనా ప్రకారం 60 లక్షల మంది రైతులకు రైతు బంధు పథకం కింద పెట్టుబడి చెక్కులు అందనున్నాయి. వారిలో లక్షన్నర మందికి గుంట భూమే ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే వారికి ఒక్కొక్కరికి కేవలం రూ.100 చెక్కులు పంపిణీ చేస్తారు.
చెక్కు పోతే అంతే..
చెక్కుల ముద్రణ ఇప్పటికే ప్రారంభమైంది. ఎస్‌బీఐ ముంబైలో ముద్రిస్తుంటే, మిగిలిన బ్యాంకులు దేశంలో వేర్వేరుచోట్ల ముద్రిస్తున్నాయి. ఇప్పటివరకు 80 శాతానికిపైగా రైతుల డేటాను బ్యాంకులకు వ్యవసాయశాఖ అందజేసింది. వాటి ప్రకారం ముద్రణ జరుగుతోంది. రెండు మూడ్రోజుల్లో మొదటి దశ కింద కొన్ని లక్షల చెక్కులు హైదరాబాద్ రానున్నాయి. వాటిని తీసుకునేందుకు వ్యవసాయశాఖ.. అధికారులతో బృందాలను ఏర్పాటు చేసింది. నగరంలో ఎనిమిది బ్యాంకులు వేర్వేరుచోట్ల కౌంటర్లు పెట్టి చెక్కులను వ్యవసాయశాఖకు అప్పగించనున్నాయి. వీటిని జిల్లాలు, మండలాలు, రెవెన్యూ గ్రామాల వారీగా కట్టలు కడతారు. వాటిని డీఏవో, ఏడీఏ, ఏవో, ఏఈవోలు వచ్చి గ్రామాల వారీగా లెక్కగట్టి అత్యంత భద్రత నడుమ తీసుకు వెళ్తారు. చెక్కులు తీసుకెళ్లే సమయంలోనే అన్నీ సరిచూసుకోవాల్సి ఉంటుంది. ఒక్క చెక్కు పోయినా ఉద్యోగం ఊడినంత పని అవుతుందని, తీవ్ర పరిణామాలు, సస్పెన్షన్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఇవిగో చెక్కులు..
ముంబైలో ప్రింట్ అవుతున్న కొన్ని చెక్కులను ఎస్‌బీఐ అధికారులు పరిశీలన కోసం హైదరాబాద్ పంపించారు. అవెలా ఉన్నాయో బ్యాంకు అధికారులు పరిశీలించారు. వాటిల్లో మూడు చెక్కులను ‘సాక్షి’ఎస్‌ఎల్‌బీసీ అధికారుల నుంచి సంపాదించింది. ఆ చెక్కులు పంపిణీకి సిద్ధం చేసినవని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్‌మోహన్ సంతకంతో అవి ఉన్నాయి. ఈ చెక్కులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులవి కావడం విశేషం. ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు టి.తుకారాంకు రూ. 1,300 చెక్కు రాసి ఉంది. అదే మండలం అనుకుంత గ్రామానికి చెందిన రైతు బాసా బక్కన్న పేరుతో రూ.6,480 చెక్కు ఉంది. మరోటి అదే మండలం బోరెనూర్ గ్రామానికి చెందిన పేమదూరు ఏసు పేరుతో రూ.6 వేల చెక్కు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment