
రైతు‘బందు’
రైతుబంధు పథకం బంద్ అయ్యిందేమో అనే అనుమానం కలుగుతోంది. రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రకటనలు గుప్పిస్తున్న పాలకులు వారిని అసలు పట్టించుకోవడం లేదనడానికి ఈ పథకం అద్దం పడుతోంది. రుణమాఫీ ఫలాలు అక్కరకు రాక.. కొత్త రుణాలు అందక అల్లాడుతున్న అన్నదాతలకు ఆసరాగా నిలవాల్సిన రైతుబంధు పథకాన్ని పాలకులు కొండెక్కించారు. రైతులు పండించిన పంటల్ని తగిన ధర వచ్చేవరకూ మార్కెట్ యార్డుల్లో నిల్వ చేయడానికి.. అలా దాచిన పంటపై రుణం ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ పథకం అక్కడక్కడా బడా భూస్వాములకు తప్ప అసలు రైతులకు ఏమాత్రం ఆసరా ఇవ్వడం లేదు.
ఏలూరు :ఆరుగాలం శ్రమంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేవరకు మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసుకుని రైతుల అవసరాలను తీర్చే రైతుబంధు పథకం వారికి ఆమడదూరంలో ఉంది. వరి సాగులో అగ్రస్థానంలో ఉన్న ‘పశ్చిమ’లో అన్నదాతలకు ఈ పథకం అక్కరకు రావడం లేదు. ఫలితంగా పంటలను అయినకాడికి అమ్ముకుని కర్షకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రైతులను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు 1999లో రైతుబంధు పథకాన్ని అప్పటి సర్కారు అమల్లోకి తెచ్చింది. మార్కెట్ యార్డులలో ధాన్యం, ఇతర పంటలను నిల్వ చేసుకునేలా రైతులను ప్రోత్సహించడం ద్వారా ఆయా పంటలకు మంచి ధర వచ్చేలా చేయడం.. నిల్వ ఉంచిన పంటలపై రుణాలు ఇచ్చి తరువాత పంటకు పెట్టుబడులు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
సెస్‌లో 25 శాతం రుణమివ్వాలి
జిల్లాలో 18 వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)లు ఉన్నాయి. వీటిద్వారా ఏటా మార్కెటింగ్ సెస్ రూపంలో ప్రభుత్వానికి రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ప్రతి మార్కెట్ కమిటీకి ఇలా వచ్చే ఆదాయంలో కనీసం 25 శాతం మొత్తాన్ని రైతుబంధు పథకం కింద రైతులకు రుణాలుగా ఇవ్వాలనే నిబంధన ఉంది. రైతు ఈ విధంగా 180 రోజుల వరకూ పంటలను ఏఎంసీలు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములలో 180 రోజుల వరకు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల మార్కెట్‌లో ధరలు పుంజుకున్నాక పంటను రైతులు అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది.
జిల్లాలో ఆచంట, ఆకివీడు, అత్తిలి, భీమడోలు, భీమవరం, చింతలపూడి, ఏలూరు, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు, పెనుగొండ, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, ఉంగుటూరులలో ఏఎంసీలు ఉన్నాయి. వీటిలో 14 ఏఎంసీలలో 329 మంది రైతులకు రూ.2.65 కోట్లను రైతుబంధు పథకం కింద రుణాలుగా ఇచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవికూడా ఈ సీజన్‌లో ఇచ్చినవి కాదు. పైగా ఇలా రుణాలు తీసుకున్న వారంతా బడా భూస్వాములే కావడం విశేషం. రైతులు అడిగితే ఎంతైనా రుణం ఇస్తామని.. మార్కెట్ కమిటీ ఆదాయంలో 25 శాతమే రుణంగా ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని ఢంకా బజాయించి చెబుతున్న అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
రుణ పరిమితి పెంచినా...
రైతు పథకం కింద పంటను ఏఎంసీ గోదాముల్లో నిల్వ చేసుకున్న రైతుకు కనీసం రూ.లక్ష వరకు రుణం లభించేది. దీనిని ఇటీవల రూ.2 లక్షలకు పెంచారు. ఏఎంసీ పరిధిలోని రైతులకు ఏటా రైతుబంధు కార్డులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఎక్కడా ఈ కార్డులు ఇస్తున్న దాఖలాలు లేవు. ఏఎంసీల ద్వారా రైతుల నుంచి సెస్ రూపంలో వసూలు చేస్తున్న మొత్తాలను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తూ ఈ పథకాన్ని ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.