ఇదేంటి బాబూ!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘రాయలసీమ జిల్లాల్లో కురిసే వర్షపాతం కంటే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదయ్యే వర్షపాతం చాలా తక్కువ. కానీ.. అక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి. గోదావరి నదికి పుష్కలంగా వరద నీరు రావడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆ నీటిని ఒడిసిపట్టి పోలవరం కుడికాలువ ద్వారా రాయలసీమకు మళ్లిస్తా. ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తా. 70 టీఎంసీల నీరు కచ్చితంగా వచ్చి చేరుతుంది. రుణమాఫీ కంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తా..’ చిత్తూరు జిల్లాలో గురువారం జరిగిన రైతు సాధికార సదస్సులో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన ఇది. ఇప్పటికే భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తామంటూ చేసిన ప్రకటన జిల్లా రైతుల్లో అలజడి రేకెత్తిస్తోంది.
ఇదే సందర్భంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం చేసిన వ్యాఖ్యలు పశ్చిమ డెల్టా రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పశ్చిమగోదావరి జిల్లా ఎన్నికల ఫలితాలే ప్రధాన కారణమయ్యాయి. ఈ కారణంగానే ‘ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనిది. ఎక్కడా జరగనంత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా’నని జిల్లాకు వచ్చినప్పుడల్లా పదేపదే ప్రకటనలు చేసే చంద్రబాబు ఇప్పుడు జిల్లా రైతులకు నష్టం చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారంటూ రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టా మీదుగా రాయలసీమకు మళ్లిస్తామని బాబు చెబుతున్నారని,
కొన్నేళ్లుగా గోదావరి వరద నీటి లెక్కలను తీస్తే వాస్తవ పరిస్థితి అర్థమవుతుందని రైతు ప్రతినిధులు పేర్కొంటున్నారు. గోదావరికి సగటున వరద కాలం 45 రోజులు కాగా, కనీసం 30 రోజులకు కూడా వరద నీరు భారీగా వస్తున్న దాఖలాలు లేవు. ఏడేళ్లుగా రెండో పంటకు నీళ్లు అందక రైతులు అష్టకష్టాలూ పడుతున్నారు. ఈ నేపథ్యంలో బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం నిర్మాణాన్ని పక్కనపెట్టి ఈ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడాన్ని పశ్చిమ రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎడతెగని పోరాటాలకు సిద్ధమవుతున్నారు.
అడ్డుకుంటాం
గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించేందుకు పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే అడ్డుకుం టాం. గోదావరి జిల్లాల రైతుల నోట్లో మట్టికొట్టేందుకే ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులను జాప్యం చేసేందుకే ఎత్తిపోతల పథకానికి నాంది పలుకుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రతిపాదనను విరమించకపోతే రైతుల్ని సమీకరించి ఈ పథకాన్ని అడ్డుకుంటాం.
- రుద్రరాజు పండురాజు,
మాజీ చైర్మన్, పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ
ఉద్యమానికి కార్యాచరణ
మూడున్నర సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సర్కా రు ప్రకటించింది. ఇప్పుడు ఆరు రాష్ట్రాల ప్రయోజనాల్ని పక్కన పెట్టి పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామనడం సరికాదు. రాజధాని నగరానికి, రాయలసీమకు నీటిని అందించే నెపంతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు అర్థమవుతోంది. దీని నిమిత్తం రూ.1,800 కోట్లు కేటాయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని కట్టనివ్వం. ఈనెల 13న రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం.
- ఎంవీ సూర్యనారాయణరాజు, అధికార ప్రతినిధి, రైతు కార్యచరణ సమితి
పులిచింతల ఉందిగా..
రూ.100 కోట్లను ఖర్చుచేసి పులిచింతల ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే కొత్త రాజధానికి అవసరమైన నీరు అం దుతుంది. పోలవరంపై ఎత్తిపోతల పథకం అవసరం లేదు. దీనికి కేటాయించిన రూ.1,800 కోట్లను పోల వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉపయోగిస్తే మంచిది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకం అంశాన్ని లేవనెత్తింది. దీనివల్ల రాష్ట్రంతోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక కూడా తీవ్రంగా నష్టపోతాయి. గోదావరి వరదల సమయంలోనే కృష్ణా నదికి కూడా వరదలు వస్తాయి. కాబట్టి గోదావరి వరద నీరు కృష్ణాకు అవసరం లేదు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిచేస్తే 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. ఎత్తిపోతల పథకం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరిం త అలస్యం అవుతుంది.
- పీఆర్‌కే రాజు, జల వనరుల నిపుణులు ప్రయోజనం ఏమిటి
పోలవరం ప్రాజెక్టుకు ముందుగానే ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ.1,800 కోట్ల ఖర్చుతో ఎత్తిపోతల పథకం ప్రారంభి స్తామంటున్నారు. ఎత్తి పో తల ద్వారా కృష్ణా ఆయకట్టుకు 70 టీఎంసీల నీరు చేరుతుందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా అదే ప్రయోజనం చేకూరుతున్నప్పుడు ఎత్తిపోతల పథకానికి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ నిధులను పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఎత్తిపోతల పథకం నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి.
- డేగా ప్రభాకర్, కార్యదర్శి, సీపీఐ జిల్లా శాఖ