చంద్రబాబు మోసాన్ని ఎండగడదాం.. రండి
ఏలూరు (టూటౌన్) : రుణాల మాఫీపై చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5న జిల్లావ్యాప్తంగా తలపెట్టిన ధర్నాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేడు పూటకో మాట, రోజుకో మాట చెబుతూ వంచిస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీపై తొలిసంతకమన్న చంద్రబాబు అధికారం చేపట్టి ఐదు నెలలైనా కాకమ్మ కబుర్లు చెబుతూ కాలక్షేపం చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ రుణమాఫీపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు. బాబు చేసిన మోసంతో రైతులు, డ్వాక్రా మహిళలు తీవ్రంగా నష్టపోయారని నాని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు వైఖరితో అన్నివిధాలుగా నష్టపోయిన రైతులకు వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండ గట్టేందుకు ఈ నెల 5న జిల్లావ్యాప్తంగా తలపెట్టిన రుణాల మాఫీపై ధర్నాను విజయవంతం చేసేందుకు గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు, రైతులు, రైతు నాయకులు సిద్ధంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని 46 మండలాల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇందుకు సమాయత్తం కావాలన్నారు. రైతులు, రైతు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలని నాని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు అన్ని మండల కేంద్రాల్లో జరిగే ఈ ధర్నాకు ప్రజలు మద్దతు తెలపాలని నాని కోరారు.