సాక్షి ప్రతినిధి, ఏలూరు :జిల్లాలో రుణమాఫీ ప్రక్రియ ప్రహసనంలా మారింది. అప్పులు మాఫీ అవుతాయని ఆరు నెలలుగా కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నల్లో సగం మందికి అడియాశలే మిగిలాయి. సర్కారు పూటకో మాట చెబుతూ.. ఘడియకో విధానం ప్రకటించ డంతో రైతు నిలువునా దగాపడ్డాడు. రుణమాఫీ లేదా ప్రభుత్వం తాజాగా చెబుతున్న రుణ విముక్తి పథకంతో ఏ ఒక్క రైతు నిజంగా
లాభపడ్డారో జిల్లా అధికారులు.. అంతెందుకు ప్రజాప్రతినిధులే గుండెల మీద చెయ్యి వేసుకుని నిజాయితీగా, ధైర్యంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయినా సరే.. పశ్చిమ రుణం తీర్చుకోలేనిదంటూ ముచ్చటగా మూడోసారి సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఉంగుటూరు మండ లం కైకరంలో శుక్రవారం జరిగే రైతు సాధికార సదస్సులోనూ బాబు ఇవే ‘రుణం’ మాటలు వల్లె వేస్తారని రైతన్నలతోపాటు టీడీపీ నేతలూ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. జిల్లాలో 2013 డిసెంబర్ 31 నాటికి మొత్తం 8.50 లక్షల మంది రైతులు రూ.7,500 కోట్ల మేర వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఒక్క సంతకంతో ఆ రుణాలన్నీ ఇప్పటికే మాఫీ కావాలి.
ఆరు నెలలుగా రోజుకో మాట.. పూటకో తిరకాసు విధానంతో వ్యవసాయ రుణాల మాఫీని ఇప్పుడు రైతు రుణ విముక్తిగా మార్చారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేసి, ఆధార్, రేషన్ కార్డులతో ముడిపెట్టి, సాగుచేసిన పంటలను పరిగణనలోకి తీసుకుని లబ్ధిదారుల జాబితాను రూపొందిం చాలని ఇటీవల బ్యాంకర్లకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. తిరకాసు మార్గదర్శకాల మేరకు జిల్లాలో 3,54,507 మంది రైతులు మాత్రమే రుణవిముక్తి పథకానికి అర్హులుగా బ్యాంకర్లు తేల్చారు. ఆ మేరకు రుణమాఫీకి రూ.1,195.42 కోట్లు అవసరం అవుతుందని తేల్చి ప్రభుత్వానికి జాబితాను పంపారు. కనీసం ఆ జాబితానైనా యథాతథంగా ఆమోదించాల్సిన ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. మొదటి విడతగా రూ.50వేల లోపు రుణమాఫీ, 20 శాతం మాఫీ కింద రూ.371 కోట్లను రైతుల ఖాతాలకు జమ చేస్తామని యంత్రాంగం చెబుతోంది.
సీఎం వస్తున్నా లెక్క తేలలేదు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం జిల్లా రైతు సాధికార సదస్సులో పాల్గొనేందుకు వస్తున్నా రూ.50 వేల లోపు రుణమాఫీ ఎంతమందికి అవుతుందనే వివరాలను పూర్తిస్థాయిలో జిల్లా యంత్రాం గం ప్రకటించలేకపోయింది. ఈ వివరాలు వెల్లడిం చేందుకు మరో వారం రోజుల పడుతుందని ఓ అధికారి ‘సాక్షి’ ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. ఇప్పటివరకైతే ఎవరివద్దా స్పష్టమైన సమాచారం లేదని ఆయన చెప్పారు. ఇదిలావుండగా, డీసీసీబీ ద్వారా రుణమాఫీకి అర్హులైన రైతులు అత్యధికంగా 257 సొసైటీల పరిధిలో 1,05,752 మంది ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. వీరికి రూ.250.42 కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని లెక్కగట్టారు.
ఇక ప్రభు త్వ, వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ.120 కోట్లే ఉండటం చూస్తుంటే రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది, సర్కారు కొర్రీలు దాటి మాఫీకి అర్హులైన వారు ఎంతమంది ఉంటారనేది ఇట్టే అర్థమవుతుంది. ఇక డ్వాక్రా, కౌలు రైతుల రుణాల మాఫీపై చంద్రబాబు ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. జిల్లాలో డ్వాక్రా రుణాలు రూ.1,000 కోట్లకు పైగా ఉండగా, కౌలు రైతుల రుణాలు రూ.165 కోట్ల మేర ఉన్నాయి. శుక్రవారం నాటి సదస్సులోనైనా డ్వాక్రా మహిళల, కౌలు రైతుల రుణాలకు సంబంధించి సీఎం ప్రకటన చేస్తారోమోనని ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
ఎంపిక చేసిన రైతులతోనే సదస్సు
జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేం దుకు గత నెలలో కాళ్ల మండలం కలవపూడి గ్రామానికి సీఎం చంద్రబాబు రాగా, ఐకేపీ యానిమేటర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. సీఎం వారిపై అసహనం వ్యక్తం చేయడం.. ఇందుకు ప్రతిగా సభలో ఆయన ప్రసంగిస్తున్నంత సేపూ ఆందోళనకారులు నినాదాలు చేయడం పోలీసులకు తలనొప్పిగా పరిణమించింది. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఈసారి పోలీసు అధికారులు, టీడీపీ నేతలు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. రుణమాఫీ అతి కొద్దిమందికే అమలవుతున్న నేపథ్యంలో రైతులు, డ్వాక్రా మహిళల నుంచి ఎటువంటి నిరసనలు వెల్లువెత్తకుండా సీఎం బహిరంగ సభకు కేవలం ఎంపిక చేసిన రైతులు, మహిళా ప్రతినిధులనే అనుమతిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారైనా సీఎం పర్యటనను ప్రశాంతంగా ముగించాలనే ఉద్దేశంతో అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎంతమందికి విముక్తి?
Published Fri, Dec 12 2014 1:46 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement