బీ‘మాయే’ | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

బీ‘మాయే’

Published Fri, Aug 22 2014 1:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

బీ‘మాయే’ - Sakshi

బీ‘మాయే’

సాక్షి ,ఏలూరు:   రుణమాఫీ జాప్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ప్రభుత్వ నిర్వాకం వారిని సాయానికి దూరం చేస్తోంది. బ్యాంకుల నుంచి కొత్త అప్పులు రాకపోవడం అటుంచి.. ఇతరత్రా రైతుల ప్రయోజనాలను రుణమాఫీ జాప్యం దారుణంగా దెబ్బతీస్తోంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయిన రైతులకు  ‘మెరుగుపరిచిన జాతీయ పంటల బీమా పథకం’ ద్వారా కాస్తయినా సాయం దక్కేది. రుణమాఫీ చేస్తామంటూ ఆ కాస్త సాయాన్నీ ప్రభుత్వం లాగేసుకోవడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. మరోవైపు కొత్త రుణాలు మంజూరు చేయకపోవడం వల్ల ఈ ఖరీఫ్‌లో బీమా దూరం అవుతోంది. సాయం అందక, కొత్తగా బీమా సదుపాయం పొందే అవకాశం లేక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
 ప్రీమియం ఎక్కువైనా..
 2012 ఖరీఫ్ నుంచి మెరుగుపరిచిన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. బీమా ప్రీమియం దాదాపు 15 ఏళ్లుగా 2.25 శాతమే ఉంది. అయితే 2012-13 కాలానికి దానిని 4 శాతం చేశారు. 2013-14 కాలానికి 5 శాతానికి పెంచారు. అంటే లక్ష రూపాయల విలువ చేసే పంటకు బీమా చేయించుకుంటే రూ.5 వేలు ప్రీమియం చెల్లించాలి. అయినా ఆపదలో ఆదుకుంటుందనే ఆశతో రైతులు అధిక సొమ్మును ప్రీమియంగా చెల్లిస్తున్నారు. దీనిని రుణమాఫీకి లింకు పెట్టొద్దని వేడుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
 
 ఇచ్చిందీ లాగేసుకుంటున్నారు
 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కళ్లాల్లో ఉన్న ధాన్యం రాశులకు నష్టం వాటిల్లినప్పుడు, వర్షాభావ పరిస్థితుల్లో విత్తనం మొలకెత్తనప్పుడు, వడగండ్ల వానలు కురిసినప్పుడు కలిగే పంట నష్టానికి బీమా వర్తిస్తుంది. ఈ ఆశతోనే రైతులు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు. జిల్లాలో గతేడాది 1,53,457 మంది రైతులు 2,69,479 హెక్టార్లలో పంటలకు బీమా చేయించుకున్నారు. 2012 నవంబర్‌లో నీలం తుపాను, దాని ప్రభావంతో సంభవించిన వరదల కారణంగా జిల్లాలో 1,41,258 హెక్టార్లలో వరి పంట, 600 హెక్టార్లలో చెరకు దెబ్బతిన్నాయి. ఆ తరువాత 1,93,044 మంది రైతులు 84,675 హెక్టార్లకు బీమా చేయించారు. దీంతో వారికి బీమా పరిహారం కింద రూ.213 కోట్లు అందే అవకాశం ఏర్పడింది. గతేడాది హెలెన్ తుపాను, అధిక వర్షాలకు పంటలు కోల్పోయిన రైతులకు దాదాపు రూ.103 కోట్ల బీమా పరిహారం సొమ్ము  రావాల్సి ఉంది. కానీ ఆ సాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం లాగేసుకోనుంది.
 
 కొత్తగా రాకుండా చేస్తున్నారు
 ఇప్పటివరకూ కట్టిన బీమా సొమ్మును ప్రభుత్వం తీసేసుకోనుండగా ఈ ఏడాది ఖరీఫ్‌కు బీమా పథకమే వర్తించకుండాపోతోంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేప్పుడే ఎకరా వరి పంటకు రూ.579, చెరకు పంటకు రూ.730 నుంచి రూ.974 బీమా ప్రీమియంగా మినహాయించుకుంటాయి. ప్రైవేట్ బ్యాంకులు, సహకార బ్యాంకుల నుంచి రుణం పొందని వారు నేరుగా ప్రభుత్వానికే బీమా ప్రీమియం చెల్లించవచ్చు. రైతులు కట్టిన ప్రీమియంనకు అంతే సొమ్మును ప్రభుత్వం బీమా సంస్థలకు చెల్లిస్తుంటుంది. కానీ ఈ ఏడాది టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీతో రైతులు పాత రుణాలు బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు.
 
 పాతవి కడితే తప్ప బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేమంటున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా జూలై నెలాఖరులోగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉన్నా రైతులెవరూ కట్టలేదు. దీంతో ప్రీమియం గడువును ఈ నెలాఖరు వరకూ పొడిగించారు. అయితే రుణాల మంజూరే లేకపోవడంతో ప్రీమియం చెల్లించే అవకాశం లేదు. ఫలితంగా రానున్న అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, అధిక వర్షాలు వచ్చి పంటలకు నష్టం ఏర్పడితే రైతులకు చిల్లిగవ్వ కూడా సాయం అందదు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఈ రూపంలో టీడీపీ కోలుకోలేని దెబ్బకొడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement