పచ్చబొట్టు చెరిగింది | Chandrababu Naidu Cheating Farmers On Loan Waiver | Sakshi
Sakshi News home page

పచ్చబొట్టు చెరిగింది

Published Sun, Dec 28 2014 11:56 PM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM

పచ్చబొట్టు చెరిగింది - Sakshi

పచ్చబొట్టు చెరిగింది

 తొలి రోజుల్లో నీరందక పంటలు ఎండిపోగా.. తొలకరిలో సుడిదోమ, ఎండు తెగులు వరిని చుట్టుముట్టాయి. మొక్కజొన్న అన్నదాతను నిలువునా ముంచేసింది. వర్జీనియా రైతు నష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయూడు. పత్తి పేరు చెబితేనే రైతులు ఆమడంత దూరం పారిపోయారు. హెలెన్ తుపాను పరి హారం నేటికీ అందకపోగా.. అక్కరకొస్తుందనుకున్న రుణమాఫీ వెక్కిరించింది. పచ్చబొట్టు లాంటి పైరు పచ్చలతో కళకళలాడాల్సిన పుడమి తల్లి 2014లో బోసిపోయింది. ఆంధ్రా అన్నపూర్ణగా పేరొందిన ‘పశ్చిమ’ చిన్నబోయింది. అన్నదాతల శ్రమ ఆవిరైపోయింది. నిండా గింజలతో ఒదిగి ఉండే వరి ఉరికొయ్యగా మారింది. ఓ అన్నదాత చేనుగట్టున బలవన్మరణానికి పాల్పడగా.. ముగ్గురు కౌలు రైతులు అదేబాట పట్టారు.
 
 ఏలూరు (టూ టౌన్)/పాలకొల్లు/చింతలపూడి/దేవరపల్లి/నల్లజర్ల రూరల్ : 2013-14 రబీలో 1.59 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా.. హెలెన్ తుపాను, భారీ వర్షాలు చుట్టుముట్టాయి. ఖరీఫ్‌లో 2.38 లక్షల హెక్టార్లకుగాను 2.12 లక్షల హెక్టార్లలో రైతులు వరి పంట వేశారు. సుడిదోమ, ఎండు తెగులు, హుద్‌హుద్ తుపాను ప్రభావంతో రెండు రోజులపాటు కురిసిన వర్షాలు వరిని నిలువునా దెబ్బతీశాయి. వీటిని తట్టుకుని కొద్దోగొప్పో దిగుబడి సాధించారనుకుంటే.. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలనే నిబంధన విధించారు. సకాలంలో సొమ్ము అందక రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యం అమ్మిన రైతులకు సర్కారు సుమారు రూ.200 కోట్లు బకాయిపడింది. తేమ, తరుగుదల పేరిట బస్తాకు రూ.200 నుంచి రూ.300 నష్టపోవాల్సి వస్తోంది. వరుస నష్టాల పాలై పెనుమంట్ర మండలం జుత్తిగకు చెందిన సత్తి సూర్యచంద్ర నారాయణ రెడ్డి, వేర్వేరు చోట్ల ముగ్గురు కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
 
 రుణమాఫీ.. రైతు నెత్తిన టోపీ
 రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ హామీని నిలబెట్టుకోలేకపోయింది. నిబంధనలు, రకరకాల కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నాల్లో నిమగ్నం కావడంతో రుణమాఫీ ఫలాలు అందక.. మరోవైపు రుణాలు అందక అన్నదాతలు అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాడు. సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల పరిధిలో రుణమాఫీ పథకానికి 4లక్షల మంది రైతులు అర్హులు కాగా, మొదటి విడతగా 1.50 లక్షల మందికి.. అందులోనూ రూ.50 వేల లోపు రుణం తీసుకున్న వారికి మాత్రమే మాఫీ వర్తింప చేస్తున్నట్టు సర్కారు మెలికపెట్టింది. వారికైనా రుణమాఫీ వర్తించిందా అంటే.. అదీ లేదు. ఎవరికి రుణం మాఫీ అయ్యిందో బ్యాంకులకే తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలావుంటే.. వాయిదా మీరిన రుణాలపై 13 శాతం వడ్డీ విధిస్తూ సర్కారు షాకిచ్చింది. మరోవైపు బంగారాన్ని తాకట్టుపెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులపైనా వడ్డీ భారం పెరిగింది. 55 పైసల వడ్డీకే రుణాలివ్వగా, సర్కారు తీరుతో అదికాస్తా రూ.1.80 పైసల వడ్డీకి చేరింది.
 
 పొగాకు కాదది.. పగాకు
 జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 150 గ్రామాల్లో ఈ ఏడాది సుమారు 30 వేల హెక్టార్లలో వర్జీనియా పొగాకు సాగు చేశారు. 61 మిలియన్ కిలోల పొగాకు పండించటానికి పొగాకు బోర్డు అనుమతి ఇవ్వగా, రైతులు సుమారు 69 మిలియన్ కిలోలు పండించి తీవ్రంగా నష్టపోయారు. చిన్న, సన్న కారు, కౌలు రైతులు పెట్టుబడులైనా రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రుణమాఫీని నమ్ముకుని సకాలంలో పొగాకు అమ్ముకోలేకపోవటంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు చెబుతున్నారు.
 
 మొక్కజొన్న.. ముంచేసిందన్నా
 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు, రబీలో గిట్టుబాటు ధర పడిపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 46వేల 564 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయాలనేది లక్ష్యం కాగా, 36,193 హెక్టార్లలో మాత్రమే రైతులు సాగు చేశారు. సీడ్ మొక్కజొన్న కొనుగోలు విషయంలో కంపెనీలు వెనకడుగు వేయడంతో దీని ప్రభావం సాగుపై పడింది. ధరలు పెరుగుతాయని ఆశించిన రైతులు మొక్కజొన్న బస్తాలను ఇళ్లవద్దే నిల్వ చేశారు. కొనేవారు లేకపోవడంతో చివరకు తెగనమ్ముకుని నష్టపోయారు.
 
 66వేల ఎకరాల్లో పంట వేయలేదు
 ఖరీఫ్ సీజన్‌లో కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాగునీరు ఆలస్యం కావటంతో సకాలంలో నాట్లు వేయలేకపోయారు. సాగునీరు అందక 66వేల 265 ఎకరాల్లో వరి సాగుచేయలేని దుస్తితి తలెత్తింది. వర్షాభావ పరిస్థితులు దెబ్బతీశాయి.
 
 సుడిదోమ స్వైర విహారంతో..
 జిల్లాకు హుద్‌హుద్ తుపాను ముప్పు తప్పినప్పటికీ.. దాని ప్రభావంతో కురిసిన వర్షాలు వరిని దెబ్బతీశాయి. తట్టుకుని నిలబడిన డెల్టాలోని చేలను సుడిదోమ చుట్టుముట్టింది. పాలకొల్లు ప్రాంతంలో ఎండుతెగులు కాటేసింది. వీటిబారిన పడిన వరి కనీసం పశుగ్రాసానికి సైతం పనిరాలేదు. చీడపీడల వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా పథకాన్ని వర్తింపచేయకపోవడంతో కనీసం పెట్టుబడులైనా దక్కక అన్నదాతలు నలిగిపోయారు. మరోవైపు ఆరుతడి పంటలు వేసిన రైతులు సైతం పూర్తిగా నష్టపోయారు. మినుము విత్తనాలు నిలువునా ముంచేశాయి. 2013 నవంబర్‌లో వ చ్చిన హెలెన్ తుపాన్ కారణంగా పంటను నష్టపోయిన రైతులకు ఇప్పటివరకూ నష్ట పరిహారం అందలేదు.
 
 పత్తి.. నష్టాల కత్తి
 జిల్లాలో 4,655 హెక్టార్లలో పత్తి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 3,209 హెక్టార్లలో మాత్రమే వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గత ఏడాదితో పోలిస్తే సీడ్ పత్తి, వాణిజ్య పత్తి ధరలు కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా గిట్టుబాటు కాలేదు. పురుగు మందులు ఎక్కువగా వాడాల్సి రావడంతో ఖర్చులు పెరిగిపోయాయి. ఏజెంట్లు, డీలర్లు సక్రమంగా నగదు చెల్లించకపోవడంతో రైతులు నష్టాలబారిన పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement