ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన ఘటన దరిమిలా ఏకాకిగా మిగిలిన మంత్రి పీతల సుజాతకు ఎట్టకేలకు ఇద్దరు టీడీపీ నేతలు బాసటగా నిలుస్తామని ప్రకటించారు.
ఏలూరు : ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన ఘటన దరిమిలా ఏకాకిగా మిగిలిన మంత్రి పీతల సుజాతకు ఎట్టకేలకు ఇద్దరు టీడీపీ నేతలు బాసటగా నిలుస్తామని ప్రకటించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మార్కెట్ కమిటీ చైర్మన్ కురెళ్ల రాంప్రసాద్ మంత్రికి తాము అండగా ఉంటామన్నారు. దళిత ఆడపడుచు అయిన పీతల సుజాతపై అపవాదులకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మంత్రిపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే బుజ్జి ఖండించారు. ఇంటివద్ద డబ్బు సంచి ఉన్న విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియచేసి విచారణ చేయించాలని మంత్రి సుజాత సూచించారని, ఈ విషయంలో ఆమె నిజాయితీకి మెచ్చుకోవాల్సింది పోయి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఏలూరు ఏఎంసీ చైర్మన్ కురెళ్ల రాంప్రసాద్ ఒక ప్రకటన చేస్తూ.. మంత్రి సుజాత నిజాయితీ నిరూపించుకోవడానికే పోలీసు విచారణ కోరారని, కొంతమంది కావాలనే రాజకీయంగా దెబ్బతీయడానికి విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయవృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీతల సుజాత ఈ ఆరోపణల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన వ్యాఖ్యానించారు.