గద్వాల, న్యూస్‌లైన్ : ఐదేళ్ల క్రితం ప్రారంభమైన గద్వాల పత్తి మార్కెట్‌యార్డులో ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో కొనుగోళ్లు ప్రారంభిస్తారని ఏటా ఎదురుచూస్తున్న రైతులకు పత్తి విత్తనోత్పత్తిసాగు వచ్చే ఏడాది నుంచి పూర్తిగా తగ్గనున్న నేపథ్యంలో ఇక మార్కెట్ యార్డు మూతపడే పరిస్థితి నెలకొంది. 2008 అక్టోబర్ 5న ఇక్కడి పత్తి మార్కెట్‌యార్డును అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. మరుసటి ఏడాది నుంచి మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు చేపడతామని హామీఇచ్చారు. ఈ హామీ వాయిదా పడుతూ వచ్చింది. 40వేల ఎకరాల్లో పత్తి విత్తనోత్పత్తి సాగు ఉన్న గద్వాల ప్రాంతంలో పత్తి మార్కెట్ అవసరమన్న ఉద్దేశంతో దాదాపు రూ.2కోట్ల నుంచి రూ.3 కోట్ల ఖర్చుతో యార్డును నిర్మించి సకల సౌకర్యాలు కల్పించారు. ఈ మార్కెట్ ఏ ముహూర్తాన నిర్మించారో తెలియదు కానీ ప్రారంభమైన నాటి నుంచి ఐదేళ్లుగా గోదాంలకు అడ్డాగా మారింది.
చివరకు మార్కెట్‌కు పత్తి రాకుండానే విత్తనోత్పత్తి సాగు ఈ ప్రాంతంలో నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో పత్తి మార్కెట్ అవసరం లేకుండానే పోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా గద్వాల పత్తి మార్కెట్ యార్డు ప్రారంభమైన నాటి నుంచి కొనుగోళ్లు, అమ్మకాలు ప్రారంభం కాకుండానే చివరకు నిరవధికంగా మార్కెట్‌కు మోక్షం లేకుండా మిగిలిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరం.
కాగా, 2008లో ప్రారంభమైన గద్వాల పత్తి మార్కెట్‌యార్డులో 2009 నుంచి పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లూ చేస్తామని అధికారులు చెప్పారు. నాటి నుంచి ఏటా సీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఇందుకు తగిన నిర్ణయం వెలువడుతుందని చెబుతూ వచ్చారు. ఈ ప్రాంత రైతులకు గద్వాల పత్తి మార్కెట్ ఏ సేవలు చేయకుండానే మూతపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా గద్వాలప్రాంతంలో రైతులకు మేలు చేసే పత్తి విత్తనోత్పత్తి సాగు వచ్చే ఏడాది నుంచి నిలిచిపోకుండా అవసరమైన చర్యలు చేపడితే ప్రయోజనం.
మార్కెట్‌కు మంగళం?
Published Thu, Oct 24 2013 3:00 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement