అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఆస్పత్రులకు దూరంగా ఉండే గ్రామాల్లోని ప్రజల చెంతకే వైద్య సేవలను తీసుకెళ్లేందుకు మహానేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంచార వైద్యశాలలు (104 వాహనాలు) ప్రస్తుతం నామమాత్రంగా నడుస్తున్నాయి. వాహనాల కండీషన్ దెబ్బతినడం, మందులు, సిబ్బంది కొరత తదితర సమస్యలు వేధిస్తున్నాయి. వీటిని పరిష్కరించి, గ్రామీణులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ‘104’ వైద్య సేవలను 2009 ఫిబ్రవరి 21న ప్రారంభించారు. వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, జ్వరపీడితులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు గ్రామాల్లోనే వైద్య సేవలు అందించే అవకాశం కల్పించారు.
జిల్లా వ్యాప్తంగా ‘104’ వాహనాలు 23 ఉన్నాయి. మొదటి నుంచి వీటిని అలాగే కొనసాగిస్తున్నారు. వాహనాల సంఖ్య పెంచడం లేదు. నెలలో 24 రోజుల ఫిక్స్‌డ్ ప్రోగ్రాంతో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వాహనాలు పాతబడిపోయాయి. చాలా వాహనాల్లో కనీసం కూర్చోవడానికి కూడా వీల్లేకుండా ఉంది. దీంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. టైర్లు, కండీషన్ కూడా అంతంత మాత్రమే. వాహనాలకు రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయించడం లేదని స్వయంగా ఉద్యోగులే చెబుతున్నారు.
సదుపాయాలు నిల్
104 వాహనాల్లో మందులు అరకొరగా ఉంటున్నాయి. ఐరన్, పారాసిటమాల్, డైక్లో ఫినాక్, కొన్నిరకాల యాంటీబయాటిక్స్ మినహా ఇతర మందులేవీ అందుబాటులో లేవు. ఎలాంటి జ్వరం వచ్చినా పారాసిటమాల్ మాత్రలతో సరిపెడుతున్నారు. గతంలో రాండమ్ కిట్స్ ద్వారా వైద్య పరీక్షలు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. హెచ్‌బీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు అసలే జరగడం లేదు. ఏడాదిన్నరగా షుగర్ పరీక్షలు చేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గర్భిణులకు వైద్య పరీక్షలు చేసే ముందు బీపీ చెక్ చేయాలి. అయితే, అలా జరగడం లేదు.
బీపీ చూసే పరికరాలు లేకపోవడంతో ఫార్మసిస్టులు ఓ అంచనాతో మందులు ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి 104 వాహనంలో 52 రకాల వైద్య సదుపాయాలు ఉండాలి. ప్రస్తుతం 14 కూడా లేవు. ఇక ఏ ప్రాంతంలో క్యాంపు జరిగితే అక్కడికి సంబంధిత పీహెచ్‌సీకి సంబంధించిన మెడికల్ ఆఫీసర్, ఏఎన్‌ఎం, హెల్త్ సూపర్‌వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది, ఆశా వర్కర్.. ఇలా తొమ్మిది మంది తప్పక రావాలి. అయితే, ఒక్కరూ అటువైపు తొంగిచూడడం లేదు. మొత్తం తామే నెట్టుకొస్తున్నామని 104 ఉద్యోగులు వాపోతున్నారు.
దయనీయ స్థితిలో ఉద్యోగులు
104 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలో 23 వాహనాలకు కలిపి 148 మంది సిబ్బంది ఉన్నారు. 27 మంది డ్రైవర్లు, 38 మంది ఫార్మసిస్టులు, 32 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 32 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 15 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. డ్రైవర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు వాహనాల్లో విధులు నిర్వర్తిస్తుండగా, మిగతా వారు పీహెచ్‌సీలలో ఉంటున్నారు.
గతంలో ఒక్కో వాహనంలో ఐదుగురు ఉండేవారు. ఒకరు సెలవులో వెళ్లినా మరొకరు అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం అలా ఉండకపోవడంతో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ప్రతి నెలా వేతనాలు సకాలంలో అందేవి. ప్రతి రోజూ ఫుడ్ అలవెన్స్ రూ.70 చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అభద్రతాభావం నడుమ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
వత్తాంది.. పోతాంది..
Published Thu, Jan 9 2014 3:41 AM | Last Updated on Thu, Jul 11 2019 8:52 PM
Advertisement