అవసాన దశలో..ఆరోగ్యశ్రీ | Aarogyasri medical services was worst since the 2014 | Sakshi
Sakshi News home page

అవసాన దశలో..ఆరోగ్యశ్రీ

Published Sun, Dec 16 2018 4:32 AM | Last Updated on Sun, Dec 16 2018 4:32 AM

Aarogyasri medical services was worst since the 2014 - Sakshi

ఒకప్పుడు.. ఆ పథకం ప్రపంచంలోనే అద్భుతమైన పథకంగా ప్రపంచ బ్యాంక్‌ నీరాజనాలు అందుకుంది. నేడు.. అదే పథకం నిర్వీర్యం దిశగా సాగిపోతోంది. నాడు.. కోట్లాదిమంది పేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించి ప్రాణాలు పోసింది. నేడు.. ప్రభుత్వ ఆంక్షల సంకెళ్లతో కునారిల్లుతోంది. ఆ పథకం మరేదో కాదు.. ఆరోగ్యశ్రీ. ఎంతోమంది పేదలకు సైతం కార్పొరేట్‌ వైద్యాన్ని అందించి ప్రాణాలు నిలిపిన ఆరోగ్యశ్రీ పథకం నేడు ప్రభుత్వ అస్తవ్యస్త చర్యలతో కొడిగట్టిన దీపంలా మారింది. 

సాక్షి, అమరావతి: పేద రోగులకు భరోసా కల్పించాల్సిన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు బకాయిలు విడుదల చేయకపోవడం, వైద్యానికి అనేక ఆంక్షలు విధించడంతో పేద రోగులకు వైద్యమందడం లేదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళితే సాదర స్వాగతం పలికిన కార్పొరేట్‌ ఆస్పత్రులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బకాయిలు రావడం లేదని, ప్యాకేజీ రేట్లు చాలడం లేదని.. ఇలా రకరకాల కారణాలతో వైద్యానికి ససేమిరా అంటున్నాయి. దేశంలో పలు రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలిచిన ఈ పథకంపై సర్కార్‌ శీతకన్నేసింది. 2007లో ప్రారంభమైన ఈ పథకం 2009 వరకూ అద్భుతంగా అమలైంది. ఇప్పుడు ఆరిపోయే దీపంలా మిణుకు మిణుకుమంటోంది. ప్రభుత్వమే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించిన పథకాన్ని ప్రపంచంలో తొలిసారిగా చూస్తున్నామని నాడు ప్రపంచ బ్యాంక్‌ బృందం కితాబులందుకున్న ఈ పథకం ప్రస్తుతం నిర్వీర్యం దిశగా సాగుతోంది. 

2010 నుంచి ఆంక్షల సంకెళ్లు
అన్ని రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా మరణించిన తర్వాత నుంచి ఆంక్షల సంకెళ్లలో చిక్కుకుంది. 2010 నాటికి 938 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉండగా అందులో 133 జబ్బులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయకూడదని, కేవలం ప్రభుత్వాస్పత్రుల్లోనే చేయాలని నాటి ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ 133 జబ్బులకు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు లేకపోతే రోగులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పుట్టుకతోనే మూగ, చెవుడు చిన్నారులకు 12 ఏళ్ల వరకూ వైద్యం చేయించుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత దీన్ని రెండేళ్ల వయసుకే పరిమితం చేశారు. దీంతో లక్షల మంది చిన్నారులు వైద్యానికి అర్హత కోల్పోయారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 1,600 మంది ఆరోగ్యమిత్రలను తొలగించింది. ప్రస్తుతం కోర్టు ఉత్తర్వులతో వాళ్లు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. తాజాగా కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ చేసే ఆస్పత్రులను నెలకు ఒకటి మాత్రమే కొత్త కేసు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మన రాష్ట్రంలో ఇప్పటికీ సూపర్‌ స్పెషాలిటీ వైద్యం సరిగా లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల్లో గాయపడినవారికి వైద్యం అందించేందుకు చాలా ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. అదేమంటే ప్యాకేజీ రేట్లు చాలడం లేదంటున్నాయి. న్యూరో, కాలేయ బాధితులకు వైద్యం చేసేందుకు కూడా చాలా చోట్ల ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. 

రేషన్‌తో ఆరోగ్యశ్రీ ముడి 
మోకాలికి, బోడిగుండుకి ముడేసిన చందంగా ఎవరైనా మూడు నెలలపాటు రేషన్‌ తీసుకోకపోతే వారి తెల్లరేషన్‌ కార్డులను తొలగించడంతోపాటు ఆరోగ్యశ్రీ నుంచి కూడా వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో పేదలు తీవ్రంగా నష్టపోయారు. గత కొద్దినెలల్లో రేషన్‌ తీసుకోవడం లేదని నాలుగు లక్షల తెల్లరేషన్‌ కార్డులను తొలగించారు. దీంతో వాళ్లందరికీ ఆరోగ్యశ్రీ కూడా వర్తించకుండా పోయింది. నాలుగు లక్షల కార్డులు అంటే.. సుమారు 16 లక్షల మంది పథకం పరిధిలోకి రాకుండా పోయారు.

ఇతర రాష్ట్రాల్లో వైద్యానికి నో..
రాష్ట్రం విడిపోయాక ఆరోగ్యశ్రీకి మరిన్ని కష్టాలొచ్చాయి. వ్యయప్రయాసలతో ఈ పథకం భారమైందని భావించిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో వైద్యానికి నిరాకరించింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా పేద రోగులు హతాశులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం ఇంకా పూర్తిస్థాయిలో లేకపోవడం, హైదరాబాద్‌లో చికిత్సకు ప్రభుత్వం నిరాకరించడంతో లక్షలాది మంది రోగులు వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఉదాహరణకు.. కర్నూలులో ప్రమాదానికి గురైన వ్యక్తికి హైదరాబాద్‌ సమీపంలో ఉంటుంది. అయితే హైదరాబాద్‌లో వైద్యానికి ప్రభుత్వం అనుమతించకపోవడంతో రోగి చావు బతుకుల్లో ఉంటే విజయవాడకో, విశాఖపట్నంకో వెళ్లాల్సిన దుస్థితి.

బకాయిలు రూ.450 కోట్లు 
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించేందుకు 650కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి. వీటికి గత ఆరు మాసాలుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదు. రూ.450 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు వైద్యం అందించలేమని ప్రభుత్వానికి చెప్పేశాయి. ఇప్పటికే కొన్ని కేసులకు సంబంధించి రోగులకు వైద్యం కూడా అందించడం లేదు. చిన్న చిన్న నర్సింగ్‌ హోంలు మాత్రం ఎప్పుడోసారి ప్రభుత్వం చెల్లిస్తుందనే ఆశతో.. విధిలేని పరిస్థితుల్లో కేసులను తీసుకుంటున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యానికి జాప్యం జరుగుతుండటంతో చాలామంది మృత్యువాత పడుతున్నారు. మరోవైపు బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం తన వద్ద నిధులు లేవంటోంది. సర్కారే ఇలా చెబుతుంటే ఇక తమ చేతుల్లో ఏముందని ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. 

ట్రస్టు నుంచి చేయాల్సిందంతా చేస్తున్నాం 
ఆరోగ్యశ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రులకు బకాయిల సమస్యను నిదానంగా పరిష్కరిస్తున్నాం. ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి చేయాల్సిందంతా చేస్తున్నాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా. హైదరాబాద్‌లో వైద్యం నిలిపివేసినా ఇక్కడ ఆస్పత్రులు అభివృద్ధి చెందాయి. దానిపై పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా ఆస్పత్రులకు వైద్యం చేసేందుకు అవకాశం ఇచ్చాం.
– డా.ఎన్‌.సుబ్బారావు,ఇన్‌చార్జి సీఈవో,ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌


డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో.. 
- కేవలం గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులే 40వేల మంది
క్యాన్సర్‌ చికిత్స చేయించుకున్న వారు 2.5 లక్షల మంది
రోజుకు సగటున నెలకు 35 నుంచి 40 కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌
938 జబ్బులకు ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆంక్షలు లేకుండా వైద్యం
162 జబ్బులకు వైద్యం అయ్యాక కూడా తిరిగి ఏడాది పాటు ఫాలో అప్‌
ఏడాది ప్రీమియం రూ.2 లక్షలే ఉన్నా.. కీమో, రేడియేషన్‌ థెరపీకి అదనంగా సీఎం సహాయ నిధి కింద మొత్తం ఇచ్చేవారు.
రోగి డిస్‌చార్జ్‌ అయ్యాక రవాణా చార్జీలు కూడా చెల్లించేవారు.

2014 తర్వాత చంద్రబాబు వచ్చాక పరిస్థితి.. 
ఈ పథకం నిధుల కేటాయింపులు భారీగా తగ్గింపు
కాక్లియర్‌ ఇంప్లాంట్స్‌ సర్జరీలకు కోత
అదనంగా వ్యయమైతే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద సహాయం లేదు.
హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదు.
రోగులకు రవాణా చార్జీలు ఇవ్వడం లేదు.
ఇన్‌పేషెంటుగా చేరకముందు అయ్యే వైద్య పరీక్షలకు సొంతంగా వ్యయం చేసుకోవాల్సిన పరిస్థితి
తాజాగా డైట్‌ కింద ఇచ్చే రూ.100 కట్‌ 
అందరిలాగే సాధారణ డైట్‌ పెట్టాలని ఆదేశాలు
ఈ మొత్తం పేషెంట్ల ఖాతాలో వేస్తున్నామంటున్నా జమకాని వైనం

మంత్రిగారికైతే సింగపూర్‌ వైద్యం 
సామాన్యులు ఆరోగ్యశ్రీ కింద రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇవే నిబంధనలు అధికార పార్టీ నేతలకు మాత్రం వర్తించడం లేదు. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పంటి చికిత్సకు ఏకంగా సింగపూర్‌ వైద్యం పొందడం దీనికి నిదర్శనం. రూ.15 వేలు కూడా వ్యయం కాని రూట్‌ కెనాల్‌ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.2,88,823 మంజూరు చేసింది. మంత్రి పంటినొప్పికి సింగపూర్‌కు వెళ్లచ్చుగానీ, పేద రోగి గుండెనొప్పి వచ్చినా హైదరాబాద్‌కు కూడా వెళ్లేందుకు అవకాశం లేదు.

ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో కాలు కోల్పోయాను 
రెండేళ్ల కిందట రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఎడమ కాలు విరిగింది. ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లాను. అయితే అప్పటికే జాప్యం జరగడంతో కాలు తీసేయాల్సి వచ్చింది. ఆపరేషన్‌ చేసిన అనంతరం వైద్యులు బయటి మందులు రాశారు. వీటికి రూ.40 వేలు ఖర్చైంది. ఈ మొత్తం కాకుండా మరో రూ.40 వేలు అప్పు చేశాను. ఆరోగ్యశ్రీ క్రింద ఆపరేషన్‌ చేస్తే ఉచిత వైద్యం అందేది. నా ఒక్కగానొక్క కొడుకు వివాహం చేసుకుని వెళ్లిపోయాడు. నా భర్త కూడ నన్ను వదిలివేయడంతో కూలిపనికి వెళుతున్నా. సొంత ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం పింఛన్‌ కూడా ఇవ్వడం లేదు.   
 – స్వప్న, కామినేనినగర్, విజయవాడ  

మందులు మీ సీఎం వద్ద తెచ్చుకోమన్నారు 
నేను 2007 నుంచి బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నా. అప్పట్లో కర్నూలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోగా.. హైదరాబాద్‌ వెళ్లమన్నారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. ఈ ఆస్పత్రిలో చికిత్సకు నాటి సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.2 లక్షలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు చేశారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌కు మందులు వాడుతున్నా. అయితే ఆరు నెలలుగా నిమ్స్‌ ఆస్పత్రి మందులు ఇవ్వడం లేదు. ‘నీకిచ్చే మందులు మారాయి.. వెళ్లి మీ ముఖ్యమంత్రి వద్ద చీటీ రాయించుకుని రా..అప్పుడు ఇస్తాము’ అని చెప్పారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌లను కలిసి లెటర్‌ ఇచ్చా. నా లేఖను పంపించామని వారు చెప్పారు. అయితే ఐదు నెలలు దాటినా ఎలాంటి స్పందనా లేదు. నాకు నెల మందులకే రూ.6వేలు ఖర్చవుతోంది. భర్త, కుమారుడు చనిపోవడంతో ఒంటరిదాన్నయ్యా. వ్యాధి కారణంగా ఎలాంటి పనీ చేయలేకపోతున్నా.
–బి.నాగేంద్రమ్మ, అరోరానగర్, కర్నూలు 

ఆరోగ్యశ్రీ వర్తించక అప్పుల పాలయ్యా.. 
మా అమ్మ పాపాయమ్మకు గొంతు క్యాన్సర్‌ వచ్చింది. హైదరాబాద్‌ తీసుకువెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. దీంతో అప్పు చేసి కూకట్‌పల్లిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించా. రూ.2 లక్షలు ఖర్చైంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో మా అమ్మ మరణించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో అన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించేది. ప్రస్తుత ప్రభుత్వం కొన్ని వ్యాధులకు మాత్రమే ఆరోగ్య శ్రీ వర్తింపచేయడంతో మాలాంటి పేదవారికి వైద్యం అందడం లేదు.  
– మారంపూడి శిఖామణి, రామకృష్ణాపురం, కిర్లంపూడి మండలం, తూర్పుగోదావరి జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement