ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌పరం.. ప్రజల ప్రాణాలతో వ్యాపారమా బాబూ?: గోపిరెడ్డి | Gopireddy Srinivasa Reddy Comments On Aarogyasri Privatized | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌పరం.. ప్రజల ప్రాణాలతో వ్యాపారమా బాబూ?: గోపిరెడ్డి

Published Fri, Jan 3 2025 6:22 PM | Last Updated on Fri, Jan 3 2025 7:50 PM

Gopireddy Srinivasa Reddy Comments On Aarogyasri Privatized

సాక్షి, తాడేపల్లి: దేశంలోనే అత్యంత అద్భుతమైన పథకంగా ఉన్న ఆరోగ్యశ్రీని తమ స్వార్థం కోసం ప్రైవేటు బీమా కంపెనీకి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆక్షేపించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచితంగా అందిస్తున్న వైద్యం బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఆయన వెల్లడించారు.

గోపిరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

దురుద్దేశ ఆలోచన. చర్యలు:
కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు బీమా కంపెనీకి కేటాయించి నిర్వీర్యం చేయాలనే దురుద్దేశంతో అడుగులు వేస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం దేశంలోనే ఒక అద్భుతమైన పధకంగా గుర్తింపు పొందింది. వైఎస్సార్‌ ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది దేశంలోనే ఆదర్శవంతమైన పథకంగా అందరి మన్ననలను అందుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి ఈ పథకాన్ని పరిశీలించి తమ రాష్ట్రాల్లో అమలు చేశారు. ప్రాణాంతకమైన గుండె జబ్బులకు ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాలను కోల్పోతున్న ఎందరో పేదలకు ఈ ఆరోగ్యశ్రీ అపర సంజీవనిలా వారి ప్రాణాలను కాపాడింది. ఈ పథకం వల్ల ఎందరో పేదలు కార్పొరేట్‌ వైద్యాన్ని పొందారు. ముఖ్యమంగా గుండె ఆపరేషన్లు, వివిధ రకాల ఆపరేషన్లను చేయించుకున్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా పేర్లు మారాయే తప్ప ఈ పథకాన్ని తీసేసే సాహసం ఎవరూ చేయలేదు. అంత గొప్పగా ఈ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లింది.

బీమా సంస్థకు అప్పగిస్తే..:
ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ఎత్తివేసి, బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది.  దీన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యసేవలు పొందే అవకాశం ఉంది. అదే బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించినా, చికిత్స వ్యయంలో కేవలం రూ.2.5 లక్షల వరకు ఆ సంస్థ నుంచి చెల్లింపులు జరుగుతాయి. అంతకంటే ఎక్కువ అయితే దాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ద్వారా పొందాల్సి వస్తుంది.

ఆ ప్రొసీజర్లన్నింటినీ అనుమతిస్తారా?:
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని బాగా విస్తరించి, మొత్తం 3257 ప్రొసీజర్లను అనుమతించాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించి చేతులు దులుపుకుంటే, మరి ఆ మొత్తం ప్రొసీజర్లను ఆ బీమా కంపెనీ కవర్‌ చేస్తుందా? అది ఖరీదైన వైద్యానికి చెల్లింపులు చేస్తుందా?. ఉదా: కాంక్లియార్‌ ఇంప్లాంటేషన్‌కు దాదాపు రూ.6.5 లక్షల చొప్పున రూ.13 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంకా బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఆ మొత్తాలను బీమా కంపెనీలు చెల్లిస్తాయా? అందుకు బీమా కంపెనీ ఒప్పుకోకపోతే, రోగుల పరిస్థితి ఏమిటి?.

ఎందుకంటే, బీమా కంపెనీలు 60 ఏళ్లు దాటిన వారికి, ఏదైనా దీర్ఘకాల వ్యాథులతో బాధ పడుతున్న వారికి, బీమా చెల్లింపుల్లో పలు ఆంక్షలు విధిస్తాయి. బీమా ప్రీమియం చెల్లించిన తరువాత ఏడాది, కొన్ని వ్యాధులకు కనీసం మూడేళ్ల వరకు వెయిటింగ్‌ పీరియడ్‌ అమలు చేస్తాయి. ఉదా: హిప్‌ రీప్లేస్‌మెంట్‌ ఆరోగ్యశ్రీలో ఉంది. ఏ ఇబ్బంది లేకుండా ఆ సర్జరీ చేసేవాళ్లు. మరి ఇదే చికిత్సకు ప్రైవేటు బీమా కంపెనీలు కనీసం ఏడాది పాటు వెయిటింగ్‌ పీరియడ్‌ తరువాతే అంగీకరిస్తాయి. బీమా కంపెనీలు ఎప్పుడైనా, ఏదో ఒక విధంగా క్లెయిమ్స్‌ తగ్గించుకోవాలనే చూస్తాయి. అందుకే చిన్న చిన్న అంశాలను కూడా సీరియస్‌గా తీసుకుని క్లెయిమ్స్‌ నిరాకరిస్తుంటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్న అన్ని ప్రొసీజర్లను బీమా కంపెనీ ఆమోదిస్తుందా? దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది?.

చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ:
చంద్రబాబు అంటేనే ప్రైవేటీకరణ గుర్తుకు వస్తుంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆయనది అదే వైఖరి. ఇప్పుడు కూడా అంతే. గ్రామాల్లో అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు, నాడు గత ప్రభుత్వం ప్రారంభించిన 10,300 విలేజ్‌ హెల్త్‌క్లినిక్స్‌ను ఇప్పటికే నిర్వీర్యం చేశారు. వాటిని జగన్‌గారు ప్రారంభించారనే కోపంతో వాటిని పనికి రాకుండా చేశారు. 17 మెడికల్‌ కాలేజీలను వైఎస్‌ జగన్‌ హయాంలో తీసుకువస్తే, వాటిలోని సీట్లను కూడా ప్రైవేటుపరం చేసేలా విధానాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో అది ప్రభుత్వ బాధ్యత:
ప్రజాస్వామ్యంలో ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వీటిని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించడం దారుణం. ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా సంస్థకు అప్పగిస్తే, ఆస్పత్రులన్నీ ఆ కంపెనీ చుట్టూ తిరిగి, క్లెయిమ్స్‌ పొందాల్సి వస్తుంది. నిబంధనలకు కట్టుబడి ఎన్ని ఆస్పత్రులు, ఎన్ని క్లెయిమ్స్‌ తెచ్చుకోగలవు? కోవిడ్‌ సంక్షోభ సమయంలో ఆరోగ్యశ్రీ నిబంధనలను వెంటనే మార్చుకుని ప్రజలకు అవసరమైన సేవలను అందించారు. అదే బీమా సంస్థ నిర్దేశించే నిబంధనలు మార్చాలంటే చాలా జాప్యం జరుగుతుంది. అప్పటి వరకు ప్రజల ఆరోగ్యానికి ఎవరు జవాబుదారీ? ప్రభుత్వానికి ఏదైనా జబ్బును ఆరోగ్యశ్రీ కింద చేర్చడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే బీమా కంపెనీ  పరిధిలోకి తీసుకురావడం అంత సులభం కాదు.

ఆలోచన వీడండి:
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ పథకం కింద 45,10,645 మందికి ఉచితంగా వైద్య సేవలందించి వారి ఆరోగ్యాలకు అండగా నిలిచింది. అందుకు రూ.13,421.43 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం గొప్పగా తీర్చిదిద్దిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన వీడాలి. నిరుపేదలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు ఉచితంగా అందించే ఆ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలి. అందుకే ప్రజల మనోభావాలు, వారి అవసరాలు గుర్తించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం.

ఇదీ చదవండి: టార్గెట్‌ సజ్జల.. ఎల్లోమీడియాపై భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ

కూటమి ప్రభుత్వానికి తొలి నుంచే..:
ఆరోగ్యశ్రీ పథకంపై టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి నుంచే కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఆరు నెలల్లో ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా, దాదాపు రూ.3 వేల కోట్లు బకాయి పడింది. దీంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ చికిత్సలు ఆపేసిన ఆస్పత్రులు, ఈనెల 6 నుంచి వాటిని పూర్తిగా నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే మందు, ప్రభుత్వం ఏ కసరత్తు చేసింది? కనీసం ఆస్పత్రులు, వైద్య రంగం ప్రతినిధులతో అయినా మాట్లాడారా? కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లు నాలుగైదు గంటల్లో ప్రైవేటు బీమా కంపెనీ నుంచి క్లెయిమ్‌ అనుమతి రావడం చాలా కష్టం. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కింద దాదాపు 300 మంది కేవలం క్లెయిమ్‌లపైనే పని చేసేవారు. మరి బీమా కంపెనీ ఆ స్థాయిలో పని చేస్తుందా?

లోకేష్‌ సొంత మనుషులు.. బీమా కంపెనీ:
మంత్రి నారా లోకేష్‌ తన సొంత మనుషులతో బీమా కంపెనీని పెట్టించి, వారికే ఈ కాంట్రాక్ట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది తమకు కావాల్సిన వారికి దోచిపెట్టే ప్రయత్నం. ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన ఉన్న పథకం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజల మన్ననలను పొందిన పథకం ఇది. దీనిని కూడా నిర్వీర్యం చేయాలని అనుకోవడం దుర్మార్గం. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకునేలా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని, పోరాడతామని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement