న్యూఢిల్లీ: కిసాన్ స్టోర్‌లో నమోదు చేసుకున్న రైతులకు శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయడంలోనూ, అధిక దిగుబడులు.. ఆదాయం పొందడంలో తోడ్పాటు అందించడంపై ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరిశోధన సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.
పుణేలోని ఐసీఏఆర్–కృషి విజ్ఞాన్ కేంద్రంలో సంయుక్తంగా నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఫలితాల ఊతంతో తమ భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించినట్లు అమెజాన్ తెలిపింది. ఐసీఏఆర్ డిప్యూటీ జనరల్ యూఎస్ గౌతమ్, అమెజాన్ ఫ్రెష్ సప్లై చెయిన్..కిసాన్ విభాగం ప్రోడక్ట్ లీడర్ సిద్ధార్థ్ టాటా ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఐసీఏఆర్ అభివృద్ధి చేసే అధునాతన వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరువ చేసేందుకు ఇరు సంస్థలు కృషి చేస్తాయి. అలాగే, రైతులు తమ ఆదాయాలను పెంచుకునేందుకు ఉపయోగపడే మెరుగైన సాగు విధానాలను కిసాన్ వికాస్ కేంద్రాల్లో (కేవీకే) ప్రదర్శిస్తాయి.
ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు కావాల్సిన శిక్షణ, సహాయాన్ని అమెజాన్ అందిస్తుంది. తద్వారా రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానిస్తుంది. 2021 సెప్టెంబర్‌లో అమెజాన్ తమ ప్లాట్‌ఫామ్‌లో ’కిసాన్ స్టోర్’ సెక్షన్‌ను ప్రారంభించింది. ఇందులో షాపింగ్ ద్వారా వ్యవసాయానికి అవసరమైన ముడి వనరులను రైతులు ఇంటి దగ్గరే అందుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment