ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో సందడి చేశారు. రైతుల సమస్యలపై నిర్మిస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం ఆయన ఇక్కడికి వచ్చారు. మార్కెట్‌లోని రైతులు, గుమస్తాలు, హమాలీలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. షూటింగ్‌లో వారిని భాగస్వాములను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల ఎంపిక సవ్యంగా లేదన్నారు. ఆధార్ కార్డు, నాన్ రెసిడెన్షియల్ అని ఏపీ మంత్రి లోకేష్ మాట్లాడడం సరికాద న్నారు. తనకు వచ్చిన నంది అవార్డును కూడా స్వీకరించడం లేదని స్పష్టం చేశారు. కళాకారులకు హద్దులు పెట్టొద్దని సూచించారు.
సాక్షి, వరంగల్ రూరల్: ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే అవార్డులు అందజేస్తున్నారు.. నంది అవార్డులు ఎవరి సొత్తు కాదు.. అని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ సినిమా షూటింగ్ నిమిత్తం గురువారం వరంగల్ నగరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’ పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే..
రుద్రమదేవికి అవార్డుఇవ్వకపోవడం దారుణం..
ఝూన్సీలక్ష్మీభాయి బ్రిటిష్ పాలకులపై ఏ విధంగా యుద్ధం చేసిందో తెలుగు జాతి మనుగడ ఐక్యత కోసం రాణి రుద్రమదేవి కృషి చేసింది. ఆ కథను ఆధారంగా చేసుకుని గుణశేఖర్ రూపొందించిన రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు ఇవ్వకపోవడం దారుణం.
అవార్డుల విషయం పునరాలోచించాలి..
ఇది వరకు ఉత్తమ సినిమాలను ఎంపిక చేసే సమయంలో అవి సమాజం, సంస్కృతీ సంప్రదాయాలపై ఎలా రోల్ ప్లే చేస్తున్నాయని పరిశీలించేవారు. ప్రస్తుతం ఏది బాగా సక్సస్ అయింది.. ఏది హిట్టు అయిందని చూస్తున్నారు. అవార్డుల విషయంలో పునరాలోచించాలి. అవార్డులు ఎవరి సొత్తు కాదు.. ప్రజలు పన్నులు కడుతున్నారు.. వాటితోనే ఇస్తున్నారు. కళాకారులకు హద్దులు పెట్టొద్దు. నరేంద్ర మోదీపై వాఖ్యలు చేస్తే ముక్కు కోసేస్తారా.. తల తీసేస్తారా.. పద్మావతి సినిమా విడుదల కానేలేదు. ఎవరూ చూడలేదు.. డైరెక్టర్ మీద.. అందులో నటించిన దీపిక పడుకొనె తల మీద రూ.ఐదు కోట్లు ప్రకటిస్తారా.. ఇది ప్రజా స్వామ్యమా..
రైతులపై కేంద్ర సర్కారు పట్టింపేది..
పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నం పెట్టే అన్నదాత ఇలా చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. జీఎస్టీ ప్రారంభం రోజున అర్ధరాత్రి సంబరాలు చేసుకున్నారే కాని రైతు ఆత్మహత్యలను అత్యవసర పరిస్థితిగా ప్రకటించి పార్లమెంట్ ఉభయ సభల్లో ఎందుకు చర్చించడం లేదు. ఆత్మహత్యలు ఆపాలంటే గిట్టుబాటు ధర కల్పించాలి.
ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..
సీసీఐ ప్రకటించిన కనీస మద్దతు ధర సైతం రైతుకు దక్కడం లేదు. పత్తికి తేమ ఎక్కువైందని, రంగు మారిందని సాకులు చెప్పి కొనడం లేదు. రైతులు తెచ్చిన పత్తిలో 10 శాతం సీసీఐ, 90 శాతం ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ మాయాజాలాన్ని నిలువరించి రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే డైరెక్ట్‌గా కొనుగోలు చేయాలి. రైతును దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయించాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సును అమలు చేయాలని సినిమా ద్వారా కోరుతా.
కేంద్రమే రుణ మాఫీ చేయాలి..
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసినట్లుగా భారతదేశం అంతా కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయాలి. పారిశ్రమిక వేత్తలకు రుణాలు మాఫీ చేస్తారు.. మళ్లీ ఇస్తారు. అదే రైతులు ఏం పాపం చేశారు. ఫసల్ యోజన పథకంలో ఒక్కో రైతు దగ్గర కేంద్ర ప్రభుత్వం రూ. 3900 తీసుకుంటోంది. అతివృష్టి అనావృష్టి వచ్చి నష్టపోయినప్పుడు తీసుకున్న ప్రీమియం మొత్తం నష్టపరిహారం చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment