కష్టాలు మాకు..కాసులు మీకా? | Round Table Conference of Farmer Communities has fires on Officers and millers | Sakshi
Sakshi News home page

కష్టాలు మాకు..కాసులు మీకా?

Published Wed, May 22 2019 3:45 AM | Last Updated on Wed, May 22 2019 3:45 AM

Round Table Conference of Farmer Communities has fires on Officers and millers - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి. చిత్రంలో రైతు సంఘాల నాయకులు

సాక్షి, అమరావతి: రైతులు రెక్కలు ముక్కలు చేసుకుని ప్రతికూల పరిస్థితుల్లోనూ పంట పండిస్తే గిట్టుబాటు ధర లేకుండా చేస్తారా? అన్నదాతా సుఖీభవా అంటూ రైతులకే శఠగోపం పెడతారా? అని మంగళవారం విజయవాడలో జరిగిన అఖిలపక్ష  రైతు సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌర సరఫరాల అధికారులు, మిల్లర్లు మిలాఖత్‌ అయి ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కకుండా చేస్తున్నారని మండిపడింది. ఒక బస్తా వడ్లు పండించడానికి రైతు రక్తమాంసాలను పణంగా పెడుతుంటే మిల్లర్లు అడుగు కదలకుండా అడ్డగోలు దోపిడీకి పాల్ప డుతున్నారని, అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తింది. ప్రభుత్వ దుర్నీతిని ఎండగట్టేందుకు, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న మోసాల తీరును వివరించేందుకు ఈనెల 27న పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను కలవాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ప్రముఖ రైతు నాయకుడు ఎర్నేని నాగేంద్రనాధ్, ఏపీ రైతు సంఘం నేత ఆంజనేయులు, ఏపీ కౌలు రైతుల సంఘం నేత విద్యాధరరావు, రైతు నాయకులు అనుమోలు గాంధీ, కొలనుకొండ శివాజీ, అక్కినేని చంద్రరావు, వై.రమేష్, కె.శ్రీనివాసరావు, కొల్లా రాజమోహన్‌ తదితరులు హాజరయ్యారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతు నాయకులు ఈ సదస్సులో తమ స్వానుభవాలను వివరించారు. 75 కిలోల బస్తాకి 1200 గ్రాముల ధాన్యాన్ని తారం కింద వ్యాపారులు అదనంగా తీసుకునేది చాలదన్నట్టు టన్నుకి మరో 5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను ధాన్యం కొనుగోళ్ల నుంచి ఓ పథకం ప్రకారం తప్పించడం వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఐకేపీ సెంటర్లకు వచ్చే ధాన్యాన్ని నేరుగా మిల్లులకు తరలించి రైతుకు దక్కాల్సిన రవాణా చార్జీలను కూడా మిల్లర్లే తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బియ్యాన్ని తిరిగి మరాడించి మిల్లర్లు లబ్ధి పొందుతుంటే పౌరసరఫరాల అధికారులు అసలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యంలో తేమ నిబంధన పేరిట రైతుల్ని ఐకేపీ సెంటర్లలో అష్టకష్టాలు పెడుతున్నందునే రైతులు దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు రైతులకు ఇస్తామని ప్రకటించిన మొత్తాన్ని ఈ ఖరీఫ్‌ నుంచే కౌలు రైతులకు కూడా ఇవ్వాలని పలువురు సూచించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం నేత నాగిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లలో వ్యవసాయ రంగ దుస్థితిని వివరించారు. 75 కిలోల బస్తాకి 175 నుంచి 180 రూపాయల మధ్య రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం రైతులు, రైతు సంఘాలతో ఎందుకు చర్చలు జరపడం లేదని నిలదీశారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఒక్క ధాన్యం విషయంలోనే ఇలా జరగడం లేదని, రైతు పండించే ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక ఉండాలని సూచించారు. రైతులు సమైక్యంగా ముందుకు కదిలితే అనుకున్నది సాధించవచ్చని పిలుపునిచ్చారు. 

సదస్సు తీర్మానాలు...
– ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దగాను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగాలి. 
– ఈ విషయాన్ని చర్చించేందుకు ఈనెల 27న పౌరసరఫరాల కమిషనర్‌ను కలవాలి. 
– రైతు సంఘాలు, మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. 
– రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. 
– అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల అధికారులపై వేటు వేయాలి.
 
రేపట్నుంచి బాబూ మా పక్కకే
ధాన్యం కొనుగోళ్లలో ప్రస్తుత అవకతవకలకు ఇప్పటి వరకు ప్రథమ ముద్దాయిగా ఉన్న చంద్రబాబు రేపట్నుంచి తమ పక్కన చేరి పోరాడాల్సిందేనని రైతు నాయకుడు అనుమోలు గాంధీ అన్నారు. ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉద్యమించక తప్పదన్నారు. 23వ తేదీ తర్వాత రాష్ట్రంలో పెద్ద మార్పు రాబోతోందని ఈనాటి మొదటి ముద్దాయి (ముఖ్యమంత్రి చంద్రబాబు) రేపొద్దున ప్రతిపక్ష నేతగా రైతు సమస్యలపై గళం విప్పక తప్పదన్నారు. ఎవరొచ్చినా కమ్యూనిస్టులు పోరాటం చేయాల్సిందేనని, వాళ్లతో కలిసి మున్ముందు ఇతర రైతు సంఘాలు, పార్టీలు పోరాడక తప్పదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement