సర్కార్‌కే టోకరా! | farmers hopes on Cotton Corporation of India | Sakshi
Sakshi News home page

సర్కార్‌కే టోకరా!

Published Tue, Dec 23 2014 11:50 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

farmers hopes on  Cotton Corporation of India

ప్రస్తుతం మార్కెట్‌లో పత్తికి పెద్దగా డిమాండ్ లేదు. దీంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న పత్తిరైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.రూ.3,750- రూ.4,050 మధ్య చెల్లిస్తోంది. కానీ ఈ మద్దతు మాత్రం రైతుకు దక్కడం లేదు. వ్యాపారులే రైతుల అవతారం ఎత్తి సర్కార్ మద్దతును దక్కించుకుంటున్నారు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తున్న సీసీఐ చెల్లింపులకు కనీసంగా 10 రోజుల సమయం తీసుకుంటుంది.

కానీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులు అన్ని రోజులు ఆగలేక మద్దతు ధర కంటే రూ.400 తక్కువకే వ్యాపారికి విక్రయిస్తున్నారు. రైతుల నుంచి పత్తి కొన్న వ్యాపారులు రైతుల పేరుమీదే సీసీఐకి పత్తిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారికి అటు మార్కెట్ ఫీజు వడ్డన తప్పడంతో పాటు క్వింటాల్‌కు రూ.400 అదనంగా లభిస్తోంది.

గజ్వేల్: జిల్లాలో ఈసారి 1.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగులోకి వచ్చింది. వర్షాభావ పరిస్థితులతో పంటకు అపార నష్టం కలిగింది. పరిస్థితులు కలిసివస్తే ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున మొత్తం 60 లక్షల పైచిలుకు క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. కానీ కాలం కలిసి రాకపోవడంతో సాగైన పంటలో 50 శాతానికిపైగా పంట దెబ్బతినింది. ప్రస్తుతం 25 నుంచి 30 లక్షల క్వింటాళ్ల దిగుబడులు మాత్రం చేతికందే అవకాశముంది.

ఇప్పటివరకు సీసీఐ జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట, తొగుట, వట్‌పల్లి కేంద్రాల ద్వారా 3.21 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం కేవలం 11 వేల పైచిలుకు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. నిజానికి ప్రతిఏటా ఈ సీజన్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండడంతో పత్తి ధర ఎంఎస్‌పీ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్) కంటే ఎక్కువ పలుకుతుంది.

దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగేది. కానీ ఈ సారి పరిస్థితి తారుమారైంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులంతా ‘ప్రభుత్వ మద్దతు ధర’పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సీసీఐ కేంద్రంలో పత్తి విక్రయిస్తే డబ్బులు ఆలస్యమవుతాయనే కారణంతో రైతులు మద్దతు ధర రూ.3,750- రూ.4,050 కంటే రూ. 300 నుంచి రూ.400 తక్కువైనా ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు.

రైతుల నుంచి రైతుపేరుతోనే అమ్ముతారు
చిన్న, సన్నకారు రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని వ్యాపారులు తిరిగి సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కే విక్రయిస్తున్నారు. సాధారణంగా సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు తమ పట్టాదారు పాసుపుస్తకాలను సమర్పించి, మార్కెట్ యార్డుల్లో తక్‌పట్టీని పొందిన తర్వాతే తమ ఉత్పత్తులను విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాల్సి ఉంటుంది.  రైతు సీసీఐకి పత్తి విక్రయించిన10 రోజుల్లో చెక్కురూపంలో చెల్లింపులు జరుగుతాయి.

కానీ వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని వారి పాస్‌బుక్కుల జిరాక్స్‌లు, అక్కౌంట్ నంబర్లు తీసుకొని రైతుల పేరుతోనే సీసీఐ విక్రయిస్తూ మద్దతు ధర పొందుతున్నారు. నిజానికి వ్యాపారులు తాము లావాదేవీలు లెక్కలు చూపితే వారి కొనుగోళ్ల విలువలో 1 శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అందువల్లే వ్యాపారులు ఇటు మార్కెట్‌ఫీజును ఎగొట్టడంతో పాటు రైతుల పేరుతో పత్తిని విక్రయించి మద్దతును దక్కించుకుంటున్నారు. గజ్వేల్‌లో ప్రస్తుత సీజన్‌లో సీసీఐ ఇప్పటివరకు  97 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది.

మద్దతు ధర క్వింటాలుకు సుమారు రూ.4వేల చొప్పున లెక్కిస్తే మొత్తం దీని విలువ సుమారు రూ.39 కోట్ల వరకు ఉంటుంది. ఇందుకుగానూ సీసీఐ మార్కెట్ యార్డుకు రూ.39 లక్షల మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి సీసీఐ కొనుగోలు చేసిన 97 వేల క్వింటాళ్లలో 80 శాతానికిపైగా ప్రైవేట్ వ్యాపారులకు చెందిన ఉత్పత్తులే ఉంటాయి.

ఈ లెక్కన రైతుల పేరిట తమ ఉత్పత్తులను అమ్ముకోవటం ద్వారా సుమారు రూ.30 లక్షల వరకు మార్కెట్ ఫీజు ఎగవేసినట్టు స్పష్టమవుతుంది. వ్యాపారులు మాత్రం తాము ఇప్పటివరకు కేవలం 10 వేల క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశామని (దీని విలువ సుమారు రూ. 4 కోట్లు) లెక్కలు చూపుతూ కేవలం రూ.4 లక్షలు మాత్రమే మార్కెట్ ఫీజు చెల్లించనున్నారు. అధికారుల అండదండలతో ఈ అక్రమం నడుస్తుందనే ఆరోపణలున్నాయి.

అన్నీ కాకిలెక్కలు..!
పత్తి కొనుగోళ్ల తీరుపై మార్కెటింగ్ శాఖ చెబుతున్న లెక్కలు విస్మయం కలిగిస్తున్నాయి. జిల్లాలోని సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా రెండ్రోజుల క్రితం వరకు 3.17 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారని మార్కెటింగ్ శాఖ చెబుతోంది. వారి లెక్కల ప్రకారం ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసింది 11 వేల పైచిలుకు క్వింట్లాళ్లే. అందులో 10 వేలకుపైగా లావాదేవీలు కూడా గజ్వేల్‌లో జరిగాయని కాకిలెక్కలు చెబుతున్నారు.

జిల్లాలోని సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, వట్‌పల్లిల్లో ప్రైవేట్ వ్యాపారులు చాలామందే ఉన్నా, వారు మాత్రం పత్తిని కొనుగోలు చేయలేదన్నది సర్కార్ లెక్కల సారాంశం. కొనుగోలు చేసినా పదుల సంఖ్యలో క్వింటాళ్లల్లో మాత్రమే కొనుగోలు చేశారంట.  నిజానికి సీసీఐ కొనుగోలు చేసిన పత్తి ఉత్పత్తుల్లో 50 శాతానికిపైగా ప్రైవేట్ వ్యాపారులే ఉంటాయని తెలుస్తోంది. దీన్ని బట్టి సీసీఐ కొనుగోలు చేసిన 3.21 క్వింటాళ్ల విలువ సుమారు రూ.12.5 కోట్లకుపైగా ఉంది. దీని  ప్రకారం  ఆయా మార్కెట్ యార్డులకు ఆ సంస్థ రూ.1.25 కోట్ల మేర మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇందులో సగానికిపైగా వ్యాపారుల ఉత్పతులున్నాయని తెలుస్తుండగా, వారు తమ ఉత్పత్తులను రైతుల పేరిట అమ్ముకోవటంవల్ల రూ.62.5 లక్షల మేర మార్కెట్ ఫీజు ఎగవేశారని చెప్పొచ్చు. మరి కొన్ని రోజులూ పరిస్థితి ఇలానే ఉంటే కోట్లల్లో మార్కెట్ కమిటీలు ఆదాయాన్ని కోల్పోవడం ఖాయం. ఈ వ్యవహారంపై విచారణ జరిపితే ఎన్నో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

జిన్నింగ్ మిల్లుల్లో ఇష్టారాజ్యం...
జిన్నింగ్ మిల్లుల్లోనూ సీసీఐ అధ్వర్యంలో కొనుగోళ్లను చేపట్టవచ్చనే వెసులుబాటును ప్రభుత్వం కల్పించడం వ్యాపారులకు వరంగా మారింది. సీసీఐ సిబ్బంది అంతా జిన్నింగ్ మిల్లుల్లోనే ఉంటూ కొనుగోళ్లు సాగిస్తున్నారు. దీంతో వ్యాపారులు రైతుల రూపేణా పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులను మిల్లులకు తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement