ఖమ్మం వ్యవసాయం: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తన బుద్ధిని మరోసారి బయటపెట్టింది. పత్తి కొనుగోళ్ల ఆరంభంలోనే కొర్రీలు పెట్టింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జరిపేందుకు ఇద్దరు బయ్యర్లు వచ్చారు. సీసీఐ నిబంధనల ప్రకారం విడి పత్తిని రైతులు అమ్మకానికి తీసుకురావాలి. కానీ మార్కెటింగ్‌శాఖ గ్రామాల్లో వివిధ రకాలుగా ప్రచారం చేసింది. గతంలో ఎప్పుడూ రైతాంగం విడి పత్తిని మార్కెట్‌కు తీసుకువచ్చిన దాఖలాలు లేవు. 2012-13 సంవత్సరంలో సీసీఐ పత్తి కొనుగోళ్లు జరిపినప్పుడు రైతులు సరుకును బస్తాల్లోనే మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మారు.
అదే తరహాలో శుక్రవారం కూడా సీసీఐ కేంద్రానికి రైతులు బస్తాల్లోనే పత్తిని తెచ్చారు. బయ్యర్లు విడిగా తీసుకువచ్చిన పత్తిని నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని తేల్చి చెప్పారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా బయ్యర్లకే వంతపాడారు. కమీషన్‌వ్యాపారులు, దిగుమతిశాఖ ప్రతినిధులు మాత్రం విడిగా పత్తిని తీసుకురావటం కష్టమన్నారు. కొందరు ైరె తులు మార్కెటింగ్‌శాఖ అధికారులను కలిసి విడిగా పత్తిని తేలమని తేల్చి చెప్పారు. గత్యంతరం లేక అధికారులు బయ్యర్లతో మాట్లాడారు. బస్తాల్లో తెచ్చిన పత్తిని కొనుగోలు చేసేందుకు ఒప్పించారు.
పత్తిని పరిశీలించిన బయ్యర్లు
మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన పత్తిని బయ్యర్లు పరిశీలించారు. పత్తిలో 15-20 శాతం తేమ ఉందన్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12 శాతం మాత్రమే తేమ ఉండాలన్నారు. నిబంధనలకు అనుగుణంగా పంటలేదన్న పేరుతో కొనుగోళ్లు జరుపలేదు.
సీసీఐ కొనుగోళ్లపై ఆశతో..
సీసీఐ కొనుగోళ్లు జరుపుతుందనే ఆశతో రైతులు పెద్ద ఎత్తున పత్తిని అమ్మకానికి తీసుకువచ్చారు. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో కొద్దిరోజులుగా పత్తి ధర బాగా క్షీణిస్తోంది. క్వింటాలు రూ.5 వేల వరకు ఉన్న పత్తి ఏకంగా రూ. 3000 నుంచి రూ. 3,500 వరకు మాత్రమే పలుకుతోంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.4,050 మద్దతు ధరగా ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలు రూ. 3,000 నుంచి రూ. 3,500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకైనా అమ్ముకోవచ్చనే ఆశతో సీసీఐ కేంద్రానికి తీసుకొచ్చారు. దాదాపు 14వేల బస్తాలను రైతులు శుక్రవారం అమ్మకానికి తెచ్చారు.
ఆరంభంలోనే బయ్యర్లు కొనుగోలులో ఆటంకాలు సృష్టించారు. తేమశాతం అధికంగా ఉందని కొనేందుకు నిరాకరించారు. మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా తాము ఏమి చేయలేమని చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో రైతులు వ్యాపారులకే క్వింటాలు రూ.3,000 నుంచి రూ.3,500లకు అమ్ముకొని వెళ్లారు. వ్యాపారులతో కుమ్మక్కై కావాలనే సీసీఐ కొర్రీలు పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తేమశాతం అధికంగా ఉండటం వల్లనే కొనలేదు: సుధాకర్, జేడీఎం, వరంగల్ మార్కెటింగ్‌శాఖ
సీసీఐ కేంద్రానికి తీసుకు వచ్చిన పత్తిలో తేమశాతం అధికంగా ఉంది. అందుకే బయ్యర్లు కొనుగోలు చేయలేదు. రైతులు సరుకును ఆరబెట్టుకొని అమ్మకానికి తెస్తే బయ్యర్లు కొనుగోళ్లకు ముందుకు వస్తారు.