సీసీఐపైనే పత్తి కొనుగోలు భారం!
లావాదేవీలపైవెనక్కి తగ్గిన మార్క్‌ఫెడ్
వచ్చే ఏడాది నుంచి సేకరణకు ప్రణాళిక
మహారాష్ట్ర తరహా విధానంపై అధ్యయనం
హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతుల నుంచి పత్తి కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేసిన మార్క్‌ఫెడ్ చివరి నిమిషంలో ప్రతిపాదన విరమించుకుంది. పత్తి సేకరణలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుసరించిన విధానం పలు చోట్ల వివాదాస్పమైంది. ఈ నేపథ్యంలో 2015-16 సీజన్ పత్తి కొనుగోలులో మార్క్‌ఫెడ్‌ను కూడా భాగస్వామిగా చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే సీసీఐ నుంచి పత్తి సేకరణకు అవసరమైన నిధులు, అనుమతులు తక్షణమే లభించడం కష్టమని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఏటా వరి, మొక్కజొన్న ధాన్యం సేకరణలో కీలకంగా వ్యవహరిస్తున్న మార్క్‌ఫెడ్ పత్తి సేకరణకు కనీసం రూ. 2వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అదీగాక సేకరించిన పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయడం తక్షణమే ఆచరణ సాధ్యం కాదని భావించింది. దీంతో మహారాష్ట్ర తరహా విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. మహారాష్ట్రలో మార్క్‌ఫెడ్ తరహా సంస్థలు కేవలం పత్తి సేకరణకు పరిమితం కాకుండా అమ్మకాలు కూడా సాగిస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర విధానాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని సంకల్పించింది. దీంతో ఈ ఏడాది పత్తి సేకరణ బాధ్యత సీసీఐకే అప్పగించి, వచ్చే ఏడాది నుంచి రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్క్‌ఫెడ్‌కు ఇటీవల మార్కెటింగ్ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
మార్పులు సూచించిన సర్కారు
గత ఏడాది పత్తి కొనుగోలుకు సీసీఐ రాష్ట్రంలో 83 కేంద్రాలు ఏర్పాటు చేసి 2.02 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 16.33 లక్షల హెక్టార్లలో 27.76 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. సీసీఐ వంటి సంస్థల జోక్యంతోనే పత్తి సేకరణలో మధ్య దళారీల ప్రమేయాన్ని తగ్గింవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు సీసీఐ గత ఏడాది జిన్నింగ్ మిల్లుల వద్దే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతుల ముసుగులో జిన్నింగ్ మిల్లు యజమానులు సీసీఐకి పత్తి నిల్వలు అంటగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో సీసీఐ తీరు విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వెనక్కి తగ్గడంతో మరోమారు సీసీఐపైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు సూచించింది. కొనుగోలు కేంద్రాలను 90కి పెంచాలని, జిన్నింగ్ మిల్లుల్లో కాకుండా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మరోవైపు పత్తి రైతుల జాబితా రూపొందించి గుర్తింపు కార్డులు అందజేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే పత్తి కొనుగోలులో సీసీఐ ఎంతమేర సఫలమవుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.