Markphed
-
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: పసుపు కొనుగోలు బాధ్యతలు పొందిన కొన్ని ఏజెన్సీలు అవకతవకలకు పాల్పడినట్టు తేలడంతో వాటన్నింటినీ రద్దు చేస్తూ మార్క్‌ఫెడ్ ఎండీ ఎస్.ప్రద్యుమ్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ సిబ్బందిని నియమించనున్నట్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► కొనుగోలు ఏజెన్సీలపై వచ్చిన అభియోగాలపై జిల్లాల జేసీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ► ఐదారేళ్లుగా ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు నష్టపోతుండటంతో సీఎం వైఎస్ జగన్ తొలిసారిగా పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ► ఈ మేరకు మార్క్‌ఫెడ్ అధికారులు క్వింటాల్ పసుపునకు రూ.6,850 మద్దతు ధరగా ప్రకటించారు. ► రాష్ట్రంలో 16 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పసుపు కొనుగోలు బాధ్యతలను స్వయం సహాయక గ్రూపులు, జిల్లా మార్కెటింగ్ సొసైటీలకు అప్పగించారు. ఇవన్నీ ఇప్పటివరకు 19,054 టన్నులను సేకరించాయి. ► ఇతర రాష్ట్రాల్లో పసుపు క్వింటాల్ రూ.4,500లోపే ఉండటంతో కొందరు వ్యాపారులు అక్కడి నుంచి రాష్ట్రానికి దిగుమతి చేసుకున్నారు. ఇక్కడి రైతుల పేరు మీద ఆ పసుపును రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ రూ.6,850 చొప్పున విక్రయించి లాభాలు పొందారు. ► కొనుగోలు కేంద్రాల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్టు, ఇందుకు పసుపు కొనుగోలు ఏజెన్సీలు సహకరించినట్టు ప్రభుత్వ విచారణలో తేలడంతో ఏజెన్సీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
సాయం చేయండి.. గట్టెక్కుతాం!
♦ సెంట్రల్ పూల్ నుంచి రూ. 212 కోట్లు అడిగిన మార్క్‌ఫెడ్ ♦ అధికారుల నిర్వాకంతో మొక్కజొన్న లావాదేవీల్లో రూ. 220 కోట్ల నష్టం ♦ రూ. 20 కోట్ల మేర పేరుకు పోయిన ఎరువుల బకాయిలు సాక్షి, హైదరాబాద్: మొక్కజొన్న కొనుగోలు, ఎరువుల లావాదేవీల్లో అధికారుల నిర్లక్ష్యం రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్‌ను నష్టాల్లోకి నెట్టింది. 2013-14కు సంబంధించి సకాలంలో మొక్కజొన్నను వేలం వేయకపోవడంతో రూ. 220 కోట్ల మేర నష్టం వాటిల్లింది. బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. మార్క్‌ఫెడ్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మరోవైపు నష్టాలకు బాధ్యులను తేల్చేందుకు విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది. 2013-14కు సంబంధించి రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ రైతుల వద్ద నుంచి 2.7 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను సేకరించింది. కొనుగోలు, ఇతర చార్జీలను కలుపుకుని క్వింటాలుకు రూ. 1,570 మేర మార్క్‌ఫెడ్ ఖర్చు చేసింది. అయితే సేకరించిన ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించాల్సి ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యం వహించారు. దీనికితోడు గోదాములు సరిగా లేక మొక్కజొన్న బూజుపట్టి కుళ్లిపోయింది. దీంతో క్వింటాలుకు రూ. 915 మేర తిరిగి రాగా.. మార్క్‌ఫెడ్‌కు రూ. 220 కోట్ల మేర నష్టం వాటిల్లింది. నష్టాలకు బాధ్యులను తేల్చేందుకు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో పాటు.. దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. దీంతో 2014-15కు సంబంధించి 4.32 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేసి.. క్వింటాలుకు రూ. 1,450 నుంచి రూ. 1,600 చొప్పున పొరుగు రాష్ట్రాలకు విక్రయించింది. మరోవైపు 2013-14లో వాటిల్లిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సెంట్రల్ పూల్’ నిధుల నుంచి నిబంధనల మేరకు రూ. 212 కోట్లు మార్క్‌ఫెడ్‌కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రాన్ని కోరింది. ఎరువుల బకాయిలదీ ఇదే తంతు 2013-14లో మార్క్‌ఫెడ్ ద్వారా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను సహకార సంఘాలు, ఇతర సంస్థలకు సరఫరా చేశారు. అయితే విక్రయాలు పూర్తయినా రూ.155 కోట్ల బకాయిలు పేరుకు పోయాయి. మార్క్‌ఫెడ్ ఇటీవల సహకార సంఘాలపై ఒత్తిడి తెచ్చి రూ.135 కోట్ల బకాయిలు వసూలు చేసింది. నష్టాలను పూడ్చుతాం గత ఏడాది ఏప్రిల్ నాటికి మార్క్‌ఫెడ్ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. 2013-14లో మొక్కజొన్న లావాదేవీల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. ఎరువుల బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించాం. సెంట్రల్ పూల్ నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. బ్యాంకు రుణాలు చెల్లించడం ద్వారా మార్క్‌ఫెడ్ ప్రతిష్టను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. -డాక్టర్ శరత్, ఎండీ, మార్క్‌ఫెడ్ -
ఇక వ్యాపారుల ‘పప్పులు’డకవ్!
► ధరల స్థిరీకరణకు కందులు కొనుగోలు ► మార్క్‌ఫెడ్ ద్వారా 2500 టన్నులు సేకరణ ► ఈ ఏడాది సేకరణ లక్ష్యం 20 వేల టన్నులు సాక్షి, హైదరాబాద్: ఇక వ్యాపారుల పప్పులు ఉడకవు. పప్పుల ధర స్థిరీకరణకు అధికారులు నడుంబిగించారు. సీజన్లో వ్యాపారులు పెద్ద ఎత్తున రైతుల నుంచి పప్పుధాన్యాలు సేకరించి నిల్వ చేస్తున్నారు. ఆఫ్ సీజన్లో అమాంతం ధరలు పెంచుతున్నారు. ముఖ్యంగా కంది పప్పుకు డిమాండ్ ఎక్కువ ఉంటోంది. దీంతో కందులను ప్రత్యేక కేంద్రాల ద్వారా విక్రయిం చాల్సి రావడంతో సబ్సిడీ భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కందుల కొనుగోలుకు శ్రీకారం చుట్టిం ది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మార్కెట్ ధరకు కందులను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సేకరించిన కందులను రాష్ట్రంలోనే నిల్వ చేసి ఆఫ్ సీజన్లో ధరల పెరుగుదలను స్థిరీకరించనుంది. మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర మార్కెటింగ్ సంస్థలైన భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), నాఫెడ్ పక్షాన రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్ కందులను సేకరిస్తోంది. ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా 13 కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించినా ఆసిఫాబాద్, సిద్దిపేట మినహా మిగతా 11 చోట్ల కందులు కొనుగోలు చేశారు. నారాయణపేట, కొడంగల్, బాదేపల్లి (మహబూబ్‌నగర్), సూర్యాపేట, తిరుమలగిరి (నల్లగొండ), జహీరాబాద్ (మెదక్), తాండూరు, వికారాబాద్ (రంగారెడ్డి), ఆదిలాబాద్, బోథ్, జైనూరు(ఆదిలాబాద్)లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఆదిలాబాద్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఇప్పటివరకు మొత్తంగా 25 వేల క్విం టాళ్లు (2500 మెట్రిక్ టన్నులు) కందులు సేకరించారు. ప్రస్తుత సీజన్ మార్చి వరకు కొనసాగనుండగా 20వేల మెట్రిక్ టన్ను ల సేకరణ లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు మార్క్‌ఫెడ్ ఎండీ డా. శరత్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
సీసీఐపైనే పత్తి కొనుగోలు భారం!
లావాదేవీలపైవెనక్కి తగ్గిన మార్క్‌ఫెడ్ వచ్చే ఏడాది నుంచి సేకరణకు ప్రణాళిక మహారాష్ట్ర తరహా విధానంపై అధ్యయనం హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రైతుల నుంచి పత్తి కొనుగోలుకు సంసిద్ధత వ్యక్తం చేసిన మార్క్‌ఫెడ్ చివరి నిమిషంలో ప్రతిపాదన విరమించుకుంది. పత్తి సేకరణలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుసరించిన విధానం పలు చోట్ల వివాదాస్పమైంది. ఈ నేపథ్యంలో 2015-16 సీజన్ పత్తి కొనుగోలులో మార్క్‌ఫెడ్‌ను కూడా భాగస్వామిగా చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే సీసీఐ నుంచి పత్తి సేకరణకు అవసరమైన నిధులు, అనుమతులు తక్షణమే లభించడం కష్టమని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ఏటా వరి, మొక్కజొన్న ధాన్యం సేకరణలో కీలకంగా వ్యవహరిస్తున్న మార్క్‌ఫెడ్ పత్తి సేకరణకు కనీసం రూ. 2వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. అదీగాక సేకరించిన పత్తిని జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయడం తక్షణమే ఆచరణ సాధ్యం కాదని భావించింది. దీంతో మహారాష్ట్ర తరహా విధానాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. మహారాష్ట్రలో మార్క్‌ఫెడ్ తరహా సంస్థలు కేవలం పత్తి సేకరణకు పరిమితం కాకుండా అమ్మకాలు కూడా సాగిస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర విధానాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని సంకల్పించింది. దీంతో ఈ ఏడాది పత్తి సేకరణ బాధ్యత సీసీఐకే అప్పగించి, వచ్చే ఏడాది నుంచి రంగ ప్రవేశం చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మార్క్‌ఫెడ్‌కు ఇటీవల మార్కెటింగ్ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మార్పులు సూచించిన సర్కారు గత ఏడాది పత్తి కొనుగోలుకు సీసీఐ రాష్ట్రంలో 83 కేంద్రాలు ఏర్పాటు చేసి 2.02 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 16.33 లక్షల హెక్టార్లలో 27.76 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. సీసీఐ వంటి సంస్థల జోక్యంతోనే పత్తి సేకరణలో మధ్య దళారీల ప్రమేయాన్ని తగ్గింవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు సీసీఐ గత ఏడాది జిన్నింగ్ మిల్లుల వద్దే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతుల ముసుగులో జిన్నింగ్ మిల్లు యజమానులు సీసీఐకి పత్తి నిల్వలు అంటగట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో సీసీఐ తీరు విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ వెనక్కి తగ్గడంతో మరోమారు సీసీఐపైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాది పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు సూచించింది. కొనుగోలు కేంద్రాలను 90కి పెంచాలని, జిన్నింగ్ మిల్లుల్లో కాకుండా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మరోవైపు పత్తి రైతుల జాబితా రూపొందించి గుర్తింపు కార్డులు అందజేయాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే పత్తి కొనుగోలులో సీసీఐ ఎంతమేర సఫలమవుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మార్క్‌ఫెడ్‌కు కన్నం
ఖమ్మం వ్యవసాయం: ‘కంచే చేను మేసిన చందం’గా స్టేట్‌వేర్ హౌసింగ్ ముఖ్య అధికారి వ్యవహరించారు. కాపాడాల్సిన ఆయనే అవినీతికి యత్నించి అడ్డంగా దొరికి పోయారు. జిల్లాలో రైతులు పండించిన మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తోంది. కొనుగోలు చేసిన వాటిని జిల్లాకేంద్రంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో మార్క్‌ఫెడ్ 6,251 టన్నులు కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచింది. వాటిని మార్క్‌ఫెడ్ సంస్థ ప్రధాన కార్యాలయం అధికారులు అమ్మకానికి పెట్టి టెండర్లు పిలిచారు. టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత డెలవరీ ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ ఆర్డర్ల ఆధారంగా మొక్కజొన్న కొనుగోలు చేసిన కాంట్రాక్టర్లు గోదాముల నుంచి వాటిని తరలిస్తున్నారు. జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది 6,251 టన్నుల సరుకు కొనుగోలు చేశారు. 6,230 టన్నుల సరుకుకు మార్క్‌ఫెడ్ సంస్థ టెండర్లు పిలిచింది. అంటే 21 టన్నులు మినహా మొత్తం టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అమ్మారు. 6,230 టన్నుల్లో 49 టన్నులు మినహా మిగిలిన మొత్తానికి మార్క్‌ఫెడ్ మేనేజర్ కాంట్రాక్టర్లకు రిలీజ్ ఆర్డర్లు ఇచ్చారు. అయితే 49 టన్నులకుగాను గోదాముల్లో 9 టన్నులు మాత్రమే ఉన్నాయని స్టేట్‌వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ తనకు సూచించారని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సునీత చెబుతున్నారు. మిగిలిన 40 టన్నుల విషయం అడుగగా కొరత ఏర్పడినట్లు సమాధానం ఇచ్చారన్నారు. అక్రమానికి ఆజ్యం ఇలా... రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆదివారం 550 మొక్కజొన్నల బస్తాలలోడుతో లారీ బయలుదేరింది. ఆ లారీ ప్రకాశ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు గోదాం వద్దకు చేరింది. అక్కడ దిగుమతి అయ్యే సమయంలో వ్యవహారం బయటపడింది. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారి అక్కడ అన్లోడ్ చేయవద్దని హమాలీలకు సూచించారు. అక్కడ నుంచి లారీని తరలించారు. లారీ కాల్వొడ్డులోని భారత ఆహార సంస్థ గిడ్డంగుల ప్రాంతానికి చేరింది. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ ఇలంబరితికి తెలిసింది. ఆయన రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుటాహుటిన అక్కడికి వెళ్లి లారీని పట్టుకున్నారు. అదో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుకు చెందిన ఏపీ20 ఎక్స్-6336 నంబర్ లారీగా గుర్తించారు. ఈ లారీలో ఉన్న మొక్కజొన్నల విలువ సుమారు రూ.3 లక్షలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వేర్‌హౌసింగ్ అధికారే సూత్రధారి.. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన మొక్కజొన్నలకు రక్షణ కల్పించి తిరిగి ఆ సంస్థకు అప్పగించాల్సిన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారే అక్రమార్గం పట్టించారు. నిల్వ ఉంచిన స్టాక్‌లో సుమారు 40 టన్నులను కొరత పేరుతో లెక్కల్లో చూపించలేదు. వాటిని బయటి వ్యాపారులకు విక్రయించి లక్షల రూపాయలు వెనుకేసుకుందామన్న ఆ అధికారి యత్నం బెడిసికొట్టింది. ఆదివారం సెలవురోజు అని..ఇదే అనుకూల సమయమని చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ వ్యవహారంపై సీరియస్ ఉన్న కలెక్టర్ పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీనితో సంబంధమున్న స్టేట్‌వేర్ హౌసింగ్ అధికారుల్లో వణుకుపుడుతోంది. మార్క్‌ఫెడ్ అధికారులు తమకేమి సంబంధం లేదని చేతులెత్తేశారు.