ఇక వ్యాపారుల ‘పప్పులు’డకవ్!
► ధరల స్థిరీకరణకు కందులు కొనుగోలు
► మార్క్‌ఫెడ్ ద్వారా 2500 టన్నులు సేకరణ
► ఈ ఏడాది సేకరణ లక్ష్యం 20 వేల టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఇక వ్యాపారుల పప్పులు ఉడకవు. పప్పుల ధర స్థిరీకరణకు అధికారులు నడుంబిగించారు. సీజన్‌లో వ్యాపారులు పెద్ద ఎత్తున రైతుల నుంచి పప్పుధాన్యాలు సేకరించి నిల్వ చేస్తున్నారు. ఆఫ్ సీజన్‌లో అమాంతం ధరలు పెంచుతున్నారు. ముఖ్యంగా కంది పప్పుకు డిమాండ్ ఎక్కువ ఉంటోంది. దీంతో కందులను ప్రత్యేక కేంద్రాల ద్వారా విక్రయిం చాల్సి రావడంతో సబ్సిడీ భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కందుల కొనుగోలుకు శ్రీకారం చుట్టిం ది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మార్కెట్ ధరకు కందులను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సేకరించిన కందులను రాష్ట్రంలోనే నిల్వ చేసి ఆఫ్ సీజన్‌లో ధరల పెరుగుదలను స్థిరీకరించనుంది. మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర మార్కెటింగ్ సంస్థలైన భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), నాఫెడ్ పక్షాన రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్ కందులను సేకరిస్తోంది. ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా 13 కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించినా ఆసిఫాబాద్, సిద్దిపేట మినహా మిగతా 11 చోట్ల కందులు కొనుగోలు చేశారు.
నారాయణపేట, కొడంగల్, బాదేపల్లి (మహబూబ్‌నగర్), సూర్యాపేట, తిరుమలగిరి (నల్లగొండ), జహీరాబాద్ (మెదక్), తాండూరు, వికారాబాద్ (రంగారెడ్డి), ఆదిలాబాద్, బోథ్, జైనూరు(ఆదిలాబాద్)లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఆదిలాబాద్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఇప్పటివరకు మొత్తంగా 25 వేల క్విం టాళ్లు (2500 మెట్రిక్ టన్నులు) కందులు సేకరించారు. ప్రస్తుత సీజన్ మార్చి వరకు కొనసాగనుండగా 20వేల మెట్రిక్ టన్ను ల సేకరణ లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు మార్క్‌ఫెడ్ ఎండీ డా. శరత్ ‘సాక్షి’కి వెల్లడించారు.