Lentils
-
పప్పుకు నిప్పెట్టాడు!
అప్పు చేసి పప్పు కూడు తినమన్నారు గానీ...పప్పుకు నిప్పెట్టమని చెప్పలేదు పెద్దలు. హరిద్వార్‌లోని జ్వాలానగర్‌కు చెందిన ఈ పెద్దాయన పప్పుకు నిప్పెట్టి ‘ఫైర్‌వాలీ దాల్’ పేరుతో తన హోటల్లో హాటు హాటుగా అమ్ముతుంటాడు. నెయ్యి... మొదలైన దినుసులు ఉన్న గరిటెను మండించి ప్లేట్లో ఉన్న పప్పుకు జస్ట్ అలా తగిలిస్తాడు...అంతే! ‘ఫైర్‌వాలీ దాల్’కు రుచికరమైన సూప్‌ను ఉచితంగా ఇస్తాడు. ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ కోసం ఎప్పుడూ వచ్చే వారితో పాటు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అంటూ వచ్చే వాళ్లు కూడా ఎక్కువే. ఆనోటా ఈ నోటా ఈ ‘ఫైర్‌వాలీ దాల్’ గురించి విన్న ఒక యువకుడు పనిగట్టుకొని దిల్లీ నుంచి హరిద్వార్‌కు వచ్చాడు. ‘ఇతడి చేతిలో ఏదో ఇంద్రజాలం ఉంది’ అంటూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వేడి వేడిగా పోస్ట్ చేశాడు. ‘సో టెంప్టింగ్’ అంటూ స్పందించారు నెటిజనులు. -
మధ్యాహ్న భోజనానికి సబ్సిడీ పప్పు
సాక్షి, హైదరాబాద్: పప్పు నిల్వలను వదిలించుకునేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కంది, పెసర వంటి పప్పులను సబ్సిడీపై రాష్ట్రాలకు ఇవ్వా లని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. మధ్యాహ్న భోజనం, సమీకృత శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) తదితర సంక్షేమ పథకాలకు పప్పులను అందజేయాలని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ శాఖ శుక్రవారం లేఖ రాసింది. మార్కెట్ ప్రకారం సాధారణ ధరను నిర్ధారించి కిలోకు రూ.15 చొప్పున సబ్సిడీపై ఇస్తామని వెల్లడించింది. మొత్తం 34.88 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు నిల్వలను వదిలించుకోవా లని భావిస్తోంది. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి ప్రతి ఏడాది ప్రభుత్వసంస్థల ద్వారా కేంద్రం పప్పుధాన్యాలను సేకరిస్తోంది. దిగుమతులు కూడా వస్తుండటంతో నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఏం చేయాలో అర్థంగాక వాటిని రాష్ట్రాలకు అంటగట్టాలని నిర్ణయించింది. ఏ పథకానికి ఎంతెంత అవసరమో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో పేరుకుపోయిన కందులు మరోవైపు నిల్వ ఉన్న పప్పుధాన్యాలను వదిలించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. తన వద్ద ఉన్న కందుల నిల్వలను పప్పు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థకు ఇస్తామని ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై సీఎస్ ఇటీవల ప్రత్యేక భేటీ నిర్వ హించారు. ప్రతి ఏడాది రైతుల నుంచి మార్క్‌ఫెడ్ కందులను కొనుగోలు చేసి, మద్దతు ధర అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. క్వింటాకు రూ.5,450 కనీస మద్దతు ధరతో కందులు కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్ వద్ద 11.29 లక్షల క్వింటాళ్లు పేరుకుపోయాయి. వాటిని క్వింటాలుకు రూ.3,500 మించి కొనడానికి వ్యాపారులు ముందుకు రావడంలేదు. అలాఅమ్మితే వందల కోట్లు నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతోంది. త్వరలో రానున్న ఈ ఖరీఫ్ కందులనూ మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఎలాగైనా నిల్వ కందులను వదలించుకోవాలన్న ఆలోచనతో వాటిని పప్పు చేసి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. కందిని పప్పు చేసి కిలోకు రూ.50 చొప్పున పేదలకు, ఇతర వినియోగదారులకు అందజేస్తామని నిర్ణయించింది. కిలో, 5, 10, 25 కిలోల బ్యాగుల్లో ప్యాక్ చేయాలని నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థలో పప్పు సరఫరా లేదు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పుడు బియ్యం తప్ప ఇతర ఆహార పదార్థాలను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడంలేదు. గతంలో కందిపప్పును సరఫరా చేసి నిలిపివేశారు. దీంతో కందిపప్పు సరఫరాను పునరుద్ధరించాలంటే ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న పప్పులనే వదిలించుకునే పరిస్థితి లేనప్పుడు ఇక కేంద్రం నుంచి వచ్చే లక్షల టన్నులు ఏం చేయగలరనేది ప్రశ్న. -
మన కందులు మనకే..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన కందులను కొనుగోలు చేసి తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కందుల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అనంతరం ప్రభుత్వం కందుల కొనుగోళ్లు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ల ద్వారా కొనుగోలు చేసిన కందులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు బాధ్యతలను పౌరసరఫరాల విభాగానికి అప్పగించింది. కొనుగోలు చేసిన కందులను మిల్లుల ద్వారా పప్పు తయారు చేసి పౌరసరఫరాల విభాగం ద్వారా తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు అందించనున్నారు. ఇప్పటికే జిల్లాలో మార్క్‌ఫెడ్ వద్ద ఉన్న కందుల్లో 500 టన్నులను అధికారులు కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. మిగిలిన కందులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇప్పటి వరకు గత ఏడాదికి సంబంధించి కొనుగోలు చేసిన 25వేల టన్నుల కందులతో పాటు ఈ ఏడాది కొనుగోలు చేసిన 34వేల టన్నుల కందులు మార్క్‌ఫెడ్ వద్ద ఉన్నాయి. ఇవి కాకుండా నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన 17వేల టన్నులు సైతం గోడౌన్లలో నిల్వ ఉన్నాయి. నెలకు 20 వేల టన్నులు అవసరం.. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కందులను దిగుమతి చేసుకునేది. తాజాగా తెల్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్రంలో కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న కందుల కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్‌కార్డులకు సంబంధించి ప్రతినెలా 20వేల టన్నుల కందులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లాతో పాటు కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు, చిత్తూరుతో పాటు కృష్ణా జిల్లాలను రైతులు అధికంగా కంది పంట సాగు చేస్తున్నారు. రైతులకు పంట చేతికొచ్చే నాటికి మార్కెట్లో క్వింటాలు రూ.3,500 నుంచి రూ.4వేలు మాత్రమే ధర ఉంది. ఈ ధరకు కందుల అమ్మకాలు సాగిస్తే రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు గగ్గోలు పెట్టారు. దీంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్, నాఫెడ్ల ద్వారా కందుల కొనుగోళ్లకు సిద్ధమైంది. క్వింటాలు రూ.5450 చొప్పున జిల్లా వ్యాప్తంగా 51వేల టన్నుల కందులు కొనుగోలు చేశారు. అర్హులైన రైతుల వద్ద కాకుండా అధికార పార్టీ నేతలు, దళారుల వద్ద కందుల కొనుగోలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత కందుల ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు కందులు రూ.3300 మాత్రమే ధర ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన కందులను బయట మార్కెట్లో విక్రయిస్తే పెద్ద ఎత్తున నష్టాలు చవి చూడాల్సి వస్తుందని ప్రభుత్వం భావించింది. ఇదే సమయంలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఎటూ కందిపప్పు పంపిణీ చేయాలని నిర్ణయించినందున కర్ణాటక, తమిళనాడుల నుంచి కందుల కొనుగోళ్లు నిలిపివేసి రాష్ట్ర వ్యాప్తంగా పండిన కందులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు చేసిన కందులను మిల్లుల ద్వారా పప్పు ఆడించి తెల్లరేషన్ కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ఎటూ కందుల కొనుగోళ్లకు సిద్ధ పడినందున మార్క్‌ఫెడ్, నాఫెడ్ల వద్ద ఉన్న కందులే కాకుండా తమ వద్ద నిల్వ ఉన్న కందులను సైతం కొనుగోలు చేయాలని రైతులతో పాటు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు రూ.30 కోట్ల బకాయిలు.. జిల్లాలో మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాల్లో రైతులు ఏటా 1.50 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేస్తున్నారు. జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం 34వేల టన్నులు (రూ.184 కోట్లు) కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు రైతులకు 80 శాతం డబ్బులు మాత్రమే చెల్లించారు. ఇంకా 20 శాతం డబ్బులు (దాదాపు రూ.30 కోట్లు) చెల్లించాల్సి ఉంది. ఈనెలాఖరుకు రైతుల డబ్బులు చెల్లించనున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు తెలిపారు. -
కంది.. కదలనంటోంది!
సాక్షి, కురిచేడు : రెండేళ్లుగా కందులు రైతుల లోగిళ్లలో నిల్వ ఉన్నాయి. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో నిలబడినా రైతుకు మాత్ర ఫలితం దక్కలేదు. పరపతి సంఘాల్లోని అధికార పార్టీ నాయకులు సీరియల్లో ఉన్న తమకు మొండిచేయి చూపి వారి అనుయాయులకు ప్రాధాన్యమిచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. కందుల కేంద్రంలో కాకుండా బయట కూడా కాటా వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురిచేడు మండలంలోని కురిచేడు, ఎన్.ఎస్.పి.అగ్రహారం సహకార పరపతి సంఘాల పరిధిలోని కందుల కొనుగోలు కేంద్రాలకు టార్గెట్లు పూర్తయ్యాయంటూ మార్క్‌ఫెడ్ వారు ఏప్రిల్ 30 నుంచి కొనుగోళ్లు నిలిపివేశారు. పడమర వీరాయపాలెం కొనుగోలు కేంద్రం ఒక్కటి మాత్రమే నిర్వహణలో ఉంది. దీంతో కందుల నిల్వలు ఉన్న రైతులంతా కలిసి కొనుగోళ్లకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖామంత్రి శిద్దా రాఘవరావు ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. కానీ ఇంతవరకు అనుమతి రాకపోవటంతో కేంద్రాలు నిలిచిపోయి ఉన్నాయి. కానీ గడచిన సోమ, మంగళవారాలలో మార్కెట్ యార్డు పక్కన వున్న శ్రీనివాసనగర్‌లో ఓ రైతు ఇంటి వద్ద కందులు కొనుగోలు జరుగుతుండటంతో కలకలం రేగింది. కొందరు రైతులు వాటిని ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో గుట్టు రట్టయింది. అసలేం జరిగిందంటే..! కందుల కొనుగోలు కోసం కేంద్రాలు ప్రారంభించే ముందు ప్రభుత్వం అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించింది. కానీ అధికారులు మెట్ట భూముల్లో ఎకరానికి నాలుగు క్వింటాల్లు, మాగాణి భూములలో ఎకరానికి 7 క్వింటాళ్ల ప్రకారం దిగుబడి వస్తుందని ప్రభుత్వానికి తెలిపారు. ప్రభుత్వం అందులో సగం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మెట్ట భూముల రైతులు నీరు అందుబాటులో ఉన్నంత వరకు ఎన్నో వ్యవ ప్రయాసలకు ఓర్చి మూడు కిలోమీటర్ల వరకు నీరు పెట్టి ఎకరానికి 7 క్వింటాళ్ల వరకు పండించారు. మాగాణి భూముల్లో 12 క్వింటాళ్ల వరకు పండించారు. దీంతో రైతుల వద్ద కందులు ఇబ్బడి ముబ్బడిగా మిగిలిపోయాయి. మిగిలిన కందులను ఏంచేయాలో అర్థంకాక, కొనుగోలు కేంద్రాల్లో కొనక, బయట తక్కువకు అడుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3500 టన్నులు కొనుగోలు చేశారు.. ఇప్పటి వరకు కురిచేడు కొనుగోలు కేంద్రం ద్వారా 3500 టన్నులు కందులు కొనుగోలు చేశారు. మరో 750 టన్నులకు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్.ఎస్.పి. అగ్రహారం కొనుగోలు కేంద్రం పరిధిలో 1800 టన్నులు కొనుగోలు చేశారు. మరో 1300 టన్నుల కొనుగోలుకు అనుమతి కావాలని కోరుతున్నారు. పడమర వీరాయపాలెం కొనుగోలు కేంద్రం పరిధిలో 650 టన్నులకు అనుమతి ఇచ్చారు. కొనుగోలు జరుగుతుంది. ఈ నెల 15 వరకు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాయటం జరిగింది. –జోత్స్నదేవి, కురిచేడు, ఏఓ రెండు నెలల తర్వాత వెనక్కు పంపారు మార్చి నెలలో 13వ తేదీ కందుల కొనుగోలుకు సీరియల్ ఇచ్చారు.కాని రెండు నెలల పాటు కాగితాలు వారి వద్ద ఉంచుకుని తిరిగి ఇప్పడు ఇచ్చారు. యార్డు మూసి వేసిన తరువాత అనుమతి కోసమంటూ మరలా కాగితాలు తీసుకుని అనుమతి వస్తుందని తెలిశాక వెనక్కు ఇచ్చారు. సమాధానం కూడా చెప్పలేదు. అధికార పార్టీ నాయకుల కందులు యార్డులో కాకుండా బయట కొంటున్నారు.– ఇందూరి సుబ్బారెడ్డి, రైతు, కురిచేడు ప్రభుత్వం కొనలేదు, బయట అమ్ముకోనీయలేదు ప్రభుత్వం అన్ని కందులు మేమే కొంటామని చెప్పి మోసం చేసింది. బయట అమ్ముకోనీయ కుండా చేసి చివరకు వాళ్లు కూడా కొనలేదు. నిరుడు కందులు కూడా ఉన్నాయి. రెండేళ్ల కందులు ఏమి చేసుకోవాలో అర్థం కావటం లేదు.అప్పులు పెరిగిపోయాయి.– పెనుగొండ రామిరెడ్డి, రైతు, కురిచేడు -
పప్పుధాన్యాలతో హైబీపీకి చెక్
లండన్ : పప్పు ధాన్యాలతో హైబీపీని నియంత్రంచవచ్చని తాజా అథ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. కూరలు, సూప్స్‌లో వాడే పప్పుధాన్యాలు వయసుతో పెరిగే బీపీని కంట్రోల్ చేస్తాయని ఎలుకలపై చేసిన ప్రయోగంలో తేలింది. హైబీపీని చౌకగా దొరికే ఈ ధాన్యాలతో నియంత్రిచవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మనితోబా అథ్యయనం పేర్కొంది. పప్పుధాన్యాలు రక్తకణాల ఆరోగ్యం క్షీణించకుండా చూస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డల్లాస్‌లో జరిగిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వార్షిక సదస్సులో పరిశోధకులు తమ అథ్యయన ఫలితాలను వెల్లడించారని ది డైలీ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. బీపీ నియంత్రణలో పప్పుధాన్యాల పనితీరు అద్భుతంగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని అథ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ పీటర్ జహ్రద్కా చెప్పారు. రక్త సరఫరాలో లోపాలపై నాన్ క్లినికల్ చికిత్సలో భాగంగా పప్పుధాన్యాలు ప్రభావవంతంగా పనిచేశాయని తెలిపారు. సకాలంలో గుర్తించి చికిత్స చేయకుంటే హైపర్‌టెన్షన్‌గా వ్యవహరించే హైబీపీ స్ర్టోక్‌లు, గుండెపోటుకు దారితీస్తుంది. -
తమ్ముళ్ల గుప్పిట్లోకి కొనుగోలు కేంద్రాలు?
కర్నూలు(అగ్రికల్చర్): మద్దతు ధరతో కందులు, శనగలు కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయనున్న కేంద్రాలు ‘తమ్ముళ్ల’ చేతుల్లోకి వెళ్లనున్నాయి. కరువుతో అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని రాష్ట్ర అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మార్క్‌ఫెడ్ కందులు, శనగల కొనుగోలు ప్రక్రియను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఇవ్వడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కొనుగోలు కేంద్రాలను అప్పగించడం వల్ల అధికార పార్టీ నేతల సిపార్స్‌లు ఉన్నవారికి చెందిన రైతుల దిగుబడులనే కొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కందుల కొనుగోలు కేంద్రాలు ఇవే..: కందులకు మార్కెట్లలో రూ.4,000 వరకు ధర ఉండగా ఈ నెల 16 నుంచి రూ.5,450 మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు కృష్ణగిరి, వెల్దుర్తి, డోన్, ప్యాపిలి, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, బేతంచెర్ల, పత్తికొండలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బేతంచెర్ల, నంద్యాల, ఆత్మకూరులో సోమవారం నుంచే రైతులకు టోకెన్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కాగా మిగిలిన కేంద్రాల్లో బుధవారం నుంచి టోకెన్లు ఇవ్వనున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని కృష్ణగిరి, వెల్దుర్తి కేంద్రాలు డీఆర్డీఏ–వెలుగు ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు; బేతంచెర్ల కేంద్రాన్ని ఆగ్రోస్, మిగిలిన కేంద్రాలను డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నడుస్తాయి. శనగల కొనుగోలు కేంద్రాలు.. శనగలకు మార్కెట్లో రూ.3000 నుంచి రూ.3,800 వరకు ఉండగా ప్రభుత్వం ఈ నెల 21 నుంచి రూ.4,400 మద్దతు ధరతో కొనుగోలు చేయనుంది. అందుకు జిల్లా వ్యాప్తంగా 25 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కర్నూలు, కోడుమూరు, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, మిడుతూరు, ఆత్మకూరు, నంద్యాల, బనగానపల్లి, ఆళ్లగడ్డ, గుండుపాపల, గోస్పాడు, కోవెలకుంట్ల, దొర్నిపాడు, ఉయ్యలవాడ, సంజామల, కొలిమిగుండ్ల, అవుకు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, ఆస్పరి, హొలగొంద, పత్తికొండ, మద్దికెరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొలిమిగుండ్ల, బేతంచెర్ల, అవుకు కేంద్రాలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, గుండుపాపల, ఉయ్యలవాడ, సంజామల కేంద్రాలను పీఏసీఎస్‌లకు, ఎమ్మిగనూరు, దొర్నిపాడు కేంద్రాలను ఆగ్రోస్‌కు, మిడుతూరును గ్రామైక్య సంఘానికి మార్క్‌ఫెడ్ అప్పగించింది. -
కొనుగోల్‌మాల్!
జిల్లాలోని భువనగిరి, ఆలేరులో ఏర్పాటు చేసిన హాకా కందుల కొనుగోలు కేంద్రాల్లో గోల్మాల్ జరుగుతోంది. రైతులు తెచ్చిన కందులను వెంటనే కొనకుండా వివిధ అడ్డంకులు సృష్టిస్తూ దళారులు తెచ్చిన కందులను క్షణాల్లోనే కొనేస్తున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు అక్రమాలకు అడ్డాలుగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కందుల కొనుగోళ్ల విషయంలో దందా సాగుతున్నా.. ఎవరూ పర్యవేక్షించడం లేదు. ఫలితంగా జిల్లాలోని కందుల కొనుగోలు కేంద్రాలు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళారులకు సిరులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, యాదాద్రి : జిల్లాలోని భువనగిరి, ఆలేరు వ్యవసాయ మార్కెట్లలో ఐదురోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాలకవర్గాలు.. దళారులతో కుమ్మక్కై వారినుంచి టన్నుల కొద్దీ కందులను కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన కందులను మాత్రం కొనకుండా రేపుమాపు అంటూ కేంద్రాలకు తిప్పుకుంటూ దళారులు తేగానే క్షణాల్లో కొనేస్తున్నారు. ఇందంతా అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. ఇందుకు ఉదాహరణ ఆలేరులో ఐదు రోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించగా అదేరోజు ఆలేరు మండలానికి చెందిన ఓ రైతు 30 సంచుల కందులను తెచ్చాడు. ఆ రైతు తెచ్చిన కందులను ఈ రోజు వరకు కొనుగోలు చేయలేదు. ప్రతిరోజు కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిపోతున్నా.. స్పందన లేదు. మరోవైపు సోమవారం వరకు ఆలేరు మార్కెట్లో 1,400 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. భువనగిరిలో 1,100 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఈ మొత్తం కొనుగోళ్లపై విచారణ జరిపిస్తే భారీ కుంభకోణం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు. తాజా ఘటన ఇలా.. మంగళవారం అనంతపురం జిల్లా నుంచి లారీలో తెచ్చిన కందులను భువనగిరి కొత్త మార్కెట్ యార్డులో విక్రయిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకోవడంతో దళారుల దందా వెలుగు చూసింది. ఈ కందులు అనంతపురం నుంచి వచ్చాయా లేక స్థానిక దళారులు తెచ్చినవా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారుల కనుసన్నలలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. గత సంవత్సరం కూడా కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కందులు కొనుగోలు చేయడానికి పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్లు, వీఆర్వోల ధ్రువీకరణలతో వందలాది క్వింటాళ్ల కందులు మార్కెట్ యార్డ్‌ల్లో కొనుగోలు జరుగుతోంది. రూ.5,450 మద్దతు ధర.. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మార్కెట్‌యార్డ్‌లలో హాకా ద్వారా ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5250, బోనస్ రూ.200 కలిపి ప్రతి క్వింటాల్‌కు రూ.5450 చెల్లిస్తున్నారు. సకాలంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రకరకాల కొర్రీలతో కొనుగోలు చేయకుండా రైతులను తిప్పుకోవడంతో విసిగిపోయిన రైతులు గ్రామాల్లో దళారులకు క్వింటాల్ రూ.3500నుంచి రూ.4000 వరకు అమ్ముకుంటున్నారు. వీటిని దళారులు తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.5,450లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ కందులు ఎక్కడివి! ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన లారీలో 17 టన్నుల కందులు భువనగిరి మార్కెట్‌కు భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాకు ఇస్మాయిల్ ఉదయం లారీలో తెచ్చాడు. సుమారు 7 టన్నుల వరకు కందులను లారీలోంచి మార్కెట్లో దించారు. విషయం గమనించిన రైతులు విషయం తెలుసుకున్న భువనగిరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, బొల్లేపల్లి వీఆర్ఓ లక్ష్మినర్సయ్యను పిలిపించి లారీలోంచి దించుతున్న కందులను అడ్డుకున్నారు. ఇదేలారీ మార్కెట్ నుంచి మాయమై రాత్రి వరకు భువనగిరి పట్టణ శివారులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. అనంతరం అక్కడినుంచి ఆ లారీ వెళ్లిపోయింది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో.. ఆ లారీ ఏమైనట్లో ఎవరికీ తెలియదు. అలాగే ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానిక దళారులతో కలిసి కందుల విక్రయాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తాము పండించిన కందులను కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం భువనగిరి మార్కెట్ యార్డ్‌లో గడ్డం శ్రీనివాస్ అనే వ్యాపారి విక్రయించిన 30 క్వింటాళ్ల కందులపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. కొనుగోళ్ల బాధ్యత ఔట్సోర్సింగ్ సిబ్బందిదే.. మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. మార్కెట్ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు కొనుగోలు బా«ధ్యతలను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు కనిపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిపై నిఘా లేకుండాపోయింది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి తమకు నాయ్యం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
మంత్రి మాటలు.. ‘నీటి’మూటలు
బోర్లలో నీరు రాక ఎండుతున్న ఉద్యాన పంటలు రూ.వందల కోట్ల నష్టం అన్ని పంటలను కాపాడతామని మంత్రి సోమిరెడ్డి హామీ చీనీ, మామిడికి మాత్రమే మొక్కుబడిగా రక్షకతడులు మిగతా వాటిని పట్టించుకోని వైనం అనంతపురం అగ్రికల్చర్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాటలు నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా అన్ని రకాల పండ్లతోటలను కాపాడతామని మంత్రి హామీ ఇవ్వగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న జిల్లా పర్యటనకు వచ్చిన సోమిరెడ్డి అనంతపురం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, బుక్కపట్నం తదితర మండలాల్లో బోరుబావుల్లో నీళ్లు రాక ఎండుముఖం పట్టిన చీనీ, మామిడి, ద్రాక్ష తదితర పండ్లతోటలను పరిశీలించారు. ఎంత ఖర్చయినా వెనకాడేది లేదు.. రక్షకతడులు ఇచ్చి తోటలన్నీ కాపాడతామని రైతులకు హామీ ఇచ్చారు. జిల్లా పర్యటన ముగించుకుని అమరావతి వెళ్లగానే ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. చీనీ, మామిడి తోటలకు మాత్రమే రక్షకతడి ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. అవి కూడా మండు వేసవి ముగిసే సమయంలో ఇవ్వడంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఎత్తిపెట్టిన బోర్లు.. ఎండిన తోటలు జూలై, 2016 తర్వాత జిల్లాలో సరైన వర్షం పడకపోవడంతో భూగర్భజలాలు సగటున 26 మీటర్ల లోతుకు పడిపోయాయి. బోర్ల నుంచి గుక్కెడు నీరు రావడం గగనంగా మారింది. జిల్లాలో దాదాపు 2.50 లక్షల బోరుబావులు ఉండగా, 90 వేల వరకు ఎత్తిపోయినట్లు అంచనా. రూ.లక్షలు వెచ్చించి పెంచిన పండ్లతోటలు కళ్లముందే ఎండిపోతుండటంతో రైతులు అప్పులు చేసి కొత్తగా బోర్లు వేయిస్తున్నారు. భగీరథ ప్రయత్నమే చేస్తున్నా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పది ఎకరాల తోటలున్న రైతులు ఐదు ఎకరాలు వదిలేసి..మిగిలిన తోటను కాపాడుకునే యత్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు ట్యాంకర్లను కొనుగోలు చేసి అరకొరగా నీటిని సరఫరా చేసుకుంటున్నారు. విపత్తు సంభవిస్తుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానశాఖ ముందస్తు చర్యలు చేపట్టడంలో దారుణంగా విఫలమయ్యాయి. ఫలితంగా రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఒక అంచనా ప్రకారం నీటి ఎద్దడితో పాటు ధరలు లేక ఈ సీజన్లో చీనీ, మామిడి, దానిమ్మ, అరటి, బొప్పాయి, కర్బూజా, కళింగర తదితర రైతులకు రూ.800 కోట్ల వరకు నష్టం జరిగింది. ఎటు చూసినా క్షామమే.. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో 1.71 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో పండ్లతోటలు ఉన్నాయి. అత్యధికంగా చీనీ 45 వేల హెక్టార్లు, మామిడి 44 వేల హెక్టార్లు, అరటి 12 వేల హెక్టార్లు, దానిమ్మ 7 వేల హెక్టార్లు, సపోటా 5 వేల హెక్టార్లు, కర్భూజా, కళింగర పంటలు 10 వేల హెక్టార్లు, ఇవి కాకుండా ద్రాక్ష, జామ, అంజూర, బొప్పాయి, కూరగాయలు, పూలు, ఔషధ పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. భూగర్భజలాలు అటుగంటిపోవడంతో తాడిపత్రి, ధర్మవరం, రాప్తాడు, కూడేరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ముదిగుబ్బ, అనంతపురం, పుట్లూరు, యల్లనూరు, గార్లదిన్నె, నార్పల, కనగానపల్లి, బత్తలపల్లి, తాడిమర్రి, బుక్కపట్నం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, రాయదుర్గం, పామిడి, పెద్దపప్పూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో దాదాపు 15 నుంచి 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లతోటలు ఎండిపోయాయి. ఏళ్ల తరబడి పెంచిన దానిమ్మ, ద్రాక్ష, అంజూర లాంటి తోటలు ఎండిపోవడంతో రైతుల ఇంట ఆందోళన వ్యక్తమవుతోంది. మొక్కుబడిగా రక్షకతడి 15 వేల ఎకరాల చీనీ, 5 వేల ఎకరాల మామిడికి రక్షకతడి ఇవ్వడానికి రూ.32 కోట్లు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కూడా అస్తవ్యస్తంగా తయారు కావడంతో రాయితీ సొమ్ము వస్తుందా, రాదా అన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యానశాఖ అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడం, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో రక్షకతడి ఎవరికీ ప్రయోజనం లేకుండా పోతోంది. ఇప్పటివరకు 1,600 హెక్టార్ల చీనీ, 1,200 హెక్టార్ల మామిడి తోటలకు మాత్రమే ఒక రక్షకతడి ఇచ్చినట్లు సమాచారం. రైతులే స్వయంగా నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాలని మెలికపెట్టడంతో అందుబాటులో ట్యాంకర్లు, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రకాల పండ్లతోటలకు రక్షకతడి ఇవ్వాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తాము కూడా ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు ప్రతిపాదనలు పంపినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. -
పైసలేవీ సారూ!
కందులు అమ్మిన రైతులకు అందని సొమ్ము ►48 గంటల్లో బ్యాంకులో జమ చేస్తామన్న ప్రభుత్వం ►వారం పదిరోజులైనా దిక్కులేని వైనం ►ఇంకా రూ.152 కోట్లు పెండింగ్.. అటు కొనుగోళ్లూ తక్కువ ►పండింది 5 లక్షల టన్నులు.. ప్రభుత్వం కొన్నది 65 వేల టన్నులు ►విధిలేక దళారులకే తెగనమ్ముకుంటున్న రైతాంగం ►క్వింటాల్‌కు రూ. 800 నష్టం.. ఆందోళనలో అన్నదాత హైదరాబాద్ రాష్ట్రంలో కంది రైతుకు కష్టకాలం వచ్చింది. సరిగా వర్షాలు కురవక ఇప్పటికే పంట దిగుబడి తగ్గిపోగా.. వచ్చిన పంటకైనా సకాలంలో డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. కందులను కొన్న ప్రభుత్వ సంస్థలు వారం పదిరోజులైనా రైతులకు సొమ్ము చెల్లించడం లేదు. దీంతో రైతులు తక్షణావసరాల కోసం చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంస్థలకు అమ్మితే వెంటనే సొమ్ము చేతికందక.. మద్దతు ధరకన్నా తక్కువకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఒక్కో క్వింటాల్ రూ.800 వరకు నష్టపోతున్నట్లు అంచనా. కేంద్ర సంస్థలు సకాలంలో సొమ్ము విడుదల చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇవ్వకపోవడం వల్లే సకాలంలో సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ప్రచారం ఘనం.. చేయూత శూన్యం ‘పత్తి వద్దు.. సోయా, కంది పంటలే ముద్దు’అంటూ గతేడాది ప్రభుత్వం చేసిన ప్రచారానికి చాలా మంది రైతులు ఆకర్షితులయ్యారు. ధర కూడా ఎక్కువగా ఉండడంతో 2016 ఖరీఫ్‌లో 10.3 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. ఇది సాధారణం కంటే 4 లక్షల ఎకరాలు అదనం కావడం గమనార్హం. దీనివల్ల ఉత్పత్తి పెరిగి ధర పడిపోయింది. గతేడాది కంది ధర మార్కెట్లో క్వింటాల్‌కు రూ.10 వేల వరకు ఉండగా.. ఈసారి రూ.4,200 వరకే పలికింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ. 5,050 కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించింది. కేంద్ర సంస్థలైన నాఫెడ్, ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా 95 వేల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 89 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో 5 లక్షల టన్నుల వరకు కంది దిగుబడి వస్తుందని అంచనా. కానీ చాలా తక్కువగా 95 వేల టన్నులే కొనుగోలు చేయాలని నిర్ణయించడంపైనే విమర్శలు వచ్చాయి. చివరికి నిర్ణయించిన స్థాయిలోనూ కొనుగోళ్లు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ సంస్థలన్నీ కలసి ఇప్పటివరకు 65,538 మంది రైతుల నుంచి 65,723 టన్నుల కందులే కొనుగోలు చేశాయి. ఇందుకోసం రైతులకు రూ.341 కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ రూ.189 కోట్లే చెల్లించారు. మిగతా రూ.152 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలి. కానీ వారం పది రోజులైనా చెల్లించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ.100 కోట్లు కేటాయించాలని మార్క్‌ఫెడ్ కోరగా.. రూ.30 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది కూడా విడుదల కాకపోవడంతో రైతులకు సొమ్ము చెల్లింపు ఆలస్యమవుతోందని అంటున్నారు. దళారులే దిక్కయ్యారు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రైతులు 2.5 లక్షల టన్నుల కందిని విక్రయించారని అంచనా. అందులో 65 వేల టన్నులకుపైగా ప్రభుత్వ సంస్థల కేంద్రాల్లో విక్రయించగా.. మిగతా 1.85 లక్షల టన్నులు దళారులకే అమ్మినట్లు తెలుస్తోంది. మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4,200 ధర మాత్రమే పలికినా.. తక్షణమే సొమ్ము చేతికి వస్తుందన్న భావనతో అమ్ముకున్నారు. ఇక సెకండ్ గ్రేడ్ కందులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయడం లేదు. అందువల్ల కూడా రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పలుచోట్ల అధికారులు, దళారులు కుమ్మక్కై.. గ్రేడ్–1 కందిని గ్రేడ్–2 అంటూ తిప్పి పంపినట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఆ రైతులు దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపు రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న దళారులు.. అదే కందిని మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేసుకుంటున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు మార్కెట్లోకి మరింతగా కంది పంట రానుంది. దీంతో దళారులు మరింతగా తెగించే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అవసరాలకు ఇబ్బందిగా ఉంది ‘‘ఈనెల 4న మార్క్‌ఫెడ్ కేంద్రంలో నాలుగు క్వింటాళ్ల కందులు అమ్మిన. మూడు రోజుల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు. పది రోజులవుతున్నా డబ్బులు జమ కాలేదు. ఇంటి అవసరాలకు ఇబ్బందిగా మారింది..’’ – రైతు, మామిడి అంజిలప్ప, పగిడ్యాల్ (యాలాల) గతేడాదితో పోలిస్తే నష్టమే ‘‘గతేడాది కంది క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల దాకా ధర పలికింది. ఈసారి ధరలను అమాంతం తగ్గించేశారు. పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. ఎకరాకు ఐదారు క్వింటాళ్ల కందులు పండాల్సి ఉండగా.. సరిగా వర్షాల్లేక రెండు మూడు క్వింటాళ్లే పండాయి. దీంతో నష్టమే మిగులుతోంది..’’ – రైతు శివారెడ్డి, అప్పక్‌పల్లి, నారాయణపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా 60 శాతం సొమ్ము చెల్లించాం: ‘‘రైతుల నుంచి కొనుగోలు చేసిన దాంట్లో ఇప్పటివరకు 60 శాతం వరకు నగదు చెల్లించాం. గతం కంటే ఇది ఎంతో ఎక్కువ. వాస్తవంగా దళారుల వద్దే రైతులకు చెల్లించడంలో ఆలస్యమవుతోంది..’’ – ఎం.జగన్మోహన్, మార్క్‌ఫెడ్ ఎండీ -
గాదెకింద ‘కంది’కొక్కులు
గోదాముల్లో కందుల అక్రమ నిల్వలు సరుకు దాచేసి మార్కెట్లో కృత్రిమ కొరత రైతుల వద్ద చవగ్గాకొని అదును చూసి అధిక ధరకు అమ్మకాలు వినియోగదారులను దోచుకుతింటున్న వ్యాపారులు పన్నుల ఎగవేతతో ప్రభుత్వాదాయూనికి భారీగా గండి పట్టించుకోని అధికారులు.. విజిలెన్స్ మొక్కుబడి దాడులు రైతుల నిల్వలంటూ తప్పించుకొంటున్న నిందితులు పీసీపల్లిలో 587 క్వింటాళ్ల అక్రమ నిల్వల గుర్తింపు సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అక్రమార్కులకు కందుల వ్యాపారం కాసుల పంట పండిస్తోంది. గాదెకింద పందికొక్కుల్లా తయూరై దోచుకుతింటున్నారు. ఏటా వేలాది క్వింటాళ్ల కందులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. రైతుల వద్ద చవగ్గా కొని ఫుడ్‌గ్రైన్ లెసైన్స్ తీసుకోకుండానే కందులను అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్లో డిమాండ్ పెంచుతున్నారు. ఈ తరువాత అధిక రేట్లకు విక్రయించి వినియోగదారులను దోచుకుతింటూ పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. పన్నులు చెల్లించకుండా ప్రభుత్వాదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నారు. ఒక్కరోజే భారీ నిల్వల గుర్తింపు.. విజిలెన్స్ సీఐలు కిషోర్, శ్రీరామ్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో మండల కేంద్రం పీసీపల్లిలో 310 బస్తాలు, మురుగమ్మిలో 469 బస్తాలు, పెదవరిమడుగులో 200 బస్తాలు మొత్తం 979 బస్తాల(587 క్వింటాళ్ల) కందులు పట్టుబడ్డాయి. ఒక్కరోజు నిర్వహించిన దాడుల్లో ఇంత మొత్తంలో కందులు పట్టుబడ్డాయంటే అక్రమ నిల్వలు ఏస్థాయిలో ఉన్నాయో తెలుస్తోంది. వ్యాపారులు వీటిని రైతులవద్ద కారు చవకగా కొని ప్రభుత్వానికి ఎటువంటి పన్నుచెల్లించకుండా గోదాముల్లో అక్రమంగా దాచారు. 2014-15 ఏడాదిలో 668 క్వింటాళ్లు,2015-16 లో 486 క్వింటాళ్లు, 2016-17 కు గాను తాజాగా శుక్రవారం 587 క్వింటాళ్లు కందులు పట్టు బడినట్లు విజిలెన్స్ నివేదికలు చెబుతున్నాయి. అధికారు పార్టీ ఒత్తిళ్లతో అటు విజిలెన్స్ సైతం మొక్కుబడి దాడులతో సరిపెడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో దాడులు జరిగితే జిల్లా వ్యాప్తంగా వేలాది క్వింటాళ్ల కందుల అక్రమ నిల్వలు బయటపడే అవకాశముంది. ఇదే జరిగితే మార్కెట్లో వినియోగదారులకు కంది కొరత తీరినట్లే. జోరుగా అక్రమ వ్యాపారం.. జిల్లాలో ముఖ్యంగా పశ్చిమప్రాంతంలో కందులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఆప్రాంతంతోపాటు ఇటు తూర్పు ప్రకాశంలోని పలుప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో వేలాది క్వింటాళ్లు అక్రమంగా నిల్వ ఉంచుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా నిత్యావసర వస్తువులు నిలువ ఉంచాలంటే ఫుడ్‌గ్రైన్ సర్టిఫికెట్ తప్పనిరి. కానీ ఏ ఒక్క వ్యాపారీ అనుమతులు తీసుకున్న దాఖలాలు లేవు. కొందరు అధికారులకు ముపుడుపులు ముట్టజెప్పి అక్రమంగా నిల్వ చేస్తున్నారు. సరుకు దాచేసి మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడంతోనే నిత్యావసర సరుకుల ధరలు నింగినంటుతున్నాయి. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టించుకోని అధికారులు.. వ్యాపారులు అక్రమ నిల్వలకు పాల్పడుతున్నా పౌరసరఫరాల విభాగం, కమర్షియల్ టాక్స్, వ్యవసాయ, పోలీసు, విజిలెన్స్ విభాగాలు స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. అధికారులు అందిన కాడికి దండుకొని వ్యాపారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలోని ఓ మార్కెట్ ప్రాంతంలోనే వేల క్వింటాళ్ల కందులు నిలువ ఉన్నాయని, ఆ మార్కెట్ లోకి అధికారపార్టీ ప్రజాప్రతినిధి అనుమతి లేనిదే విజిలెన్స్ సైతం వెళ్లకూడదన్న నిబంధనలున్నట్లు ప్రచారం ఉంది. రైతుల సాకుచూపి.. విజిలెన్స్ దాడుల్లో పట్టుబడ్డ అక్రమ నిల్వలు ఆ తరువాత కేసు విచారణకు వచ్చే నాటికి రైతులు దాచుకున్నవిగా తేల్చిసి వ్యాపారులు తప్పించుకుంటున్నారు. చివరకు రైతులే.. కందులను గోడౌన్లలో దాచుకున్నారని తేలుస్తారు. వ్యాపారులు తమకు పరిచయమున్న రైతుల పాసుపుస్తకాలు తెచ్చి విచారణాధికారి ముందుంచి, మసిపూసి మారేడు కాయ చేస్తారు. చివరకు రైతులను అడ్డుపెట్టి వారు తప్పించుకొంటారు. పౌరసరఫరాల విభాగంలో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారులు వ్యాపారులకు సహకరిస్తున్నట్లు సమాచారం. అధికారుల సలహాలతోనే ఈ తంతు నడుస్తోందని సాక్షాత్తు విజిలెన్స్‌కు చెందిన ఓ అధికారే పేర్కొనడం గమనార్హం. -
ఇక వ్యాపారుల ‘పప్పులు’డకవ్!
► ధరల స్థిరీకరణకు కందులు కొనుగోలు ► మార్క్‌ఫెడ్ ద్వారా 2500 టన్నులు సేకరణ ► ఈ ఏడాది సేకరణ లక్ష్యం 20 వేల టన్నులు సాక్షి, హైదరాబాద్: ఇక వ్యాపారుల పప్పులు ఉడకవు. పప్పుల ధర స్థిరీకరణకు అధికారులు నడుంబిగించారు. సీజన్లో వ్యాపారులు పెద్ద ఎత్తున రైతుల నుంచి పప్పుధాన్యాలు సేకరించి నిల్వ చేస్తున్నారు. ఆఫ్ సీజన్లో అమాంతం ధరలు పెంచుతున్నారు. ముఖ్యంగా కంది పప్పుకు డిమాండ్ ఎక్కువ ఉంటోంది. దీంతో కందులను ప్రత్యేక కేంద్రాల ద్వారా విక్రయిం చాల్సి రావడంతో సబ్సిడీ భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్లో ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కందుల కొనుగోలుకు శ్రీకారం చుట్టిం ది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మార్కెట్ ధరకు కందులను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సేకరించిన కందులను రాష్ట్రంలోనే నిల్వ చేసి ఆఫ్ సీజన్లో ధరల పెరుగుదలను స్థిరీకరించనుంది. మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర మార్కెటింగ్ సంస్థలైన భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), నాఫెడ్ పక్షాన రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్ కందులను సేకరిస్తోంది. ఎఫ్‌సీఐ, నాఫెడ్ ద్వారా 13 కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించినా ఆసిఫాబాద్, సిద్దిపేట మినహా మిగతా 11 చోట్ల కందులు కొనుగోలు చేశారు. నారాయణపేట, కొడంగల్, బాదేపల్లి (మహబూబ్‌నగర్), సూర్యాపేట, తిరుమలగిరి (నల్లగొండ), జహీరాబాద్ (మెదక్), తాండూరు, వికారాబాద్ (రంగారెడ్డి), ఆదిలాబాద్, బోథ్, జైనూరు(ఆదిలాబాద్)లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 23న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఆదిలాబాద్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఇప్పటివరకు మొత్తంగా 25 వేల క్విం టాళ్లు (2500 మెట్రిక్ టన్నులు) కందులు సేకరించారు. ప్రస్తుత సీజన్ మార్చి వరకు కొనసాగనుండగా 20వేల మెట్రిక్ టన్ను ల సేకరణ లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు మార్క్‌ఫెడ్ ఎండీ డా. శరత్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
అకాల వర్షం..కొంత లాభం..కొంత నష్టం
రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలో శనివారం అర్థరాత్రి కురిసిన అకాల వర్షంతో చేతికి వచ్చిన పంటలు తడిచి, రైతుకు నష్టం కలిగించాయి. తాండూరు మార్కెట్‌యార్డులో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత సుమారు గంటపాటు వర్షం కురియటంతో మార్కెట్ యార్డులో నిల్వ చేసిన వేరుశనగలు, కందుల బస్తాలు తడిసిపోయాయి. అలాగే, యాలాల మండలంలో సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పెద్దేముల్ మండలంలో అదివారం తెల్లవారు జామున ఓ మోస్తరు వర్షం పడింది. దీంతో చెరకు పంటకు ఎంతో మేలు జరిగింది. (తాండూరు)