పైసలేవీ సారూ!
కందులు అమ్మిన రైతులకు అందని సొమ్ము
►48 గంటల్లో బ్యాంకులో జమ చేస్తామన్న ప్రభుత్వం
►వారం పదిరోజులైనా దిక్కులేని వైనం
►ఇంకా రూ.152 కోట్లు పెండింగ్.. అటు కొనుగోళ్లూ తక్కువ
►పండింది 5 లక్షల టన్నులు.. ప్రభుత్వం కొన్నది 65 వేల టన్నులు
►విధిలేక దళారులకే తెగనమ్ముకుంటున్న రైతాంగం
►క్వింటాల్‌కు రూ. 800 నష్టం.. ఆందోళనలో అన్నదాత
హైదరాబాద్ రాష్ట్రంలో కంది రైతుకు కష్టకాలం వచ్చింది. సరిగా వర్షాలు కురవక ఇప్పటికే పంట దిగుబడి తగ్గిపోగా.. వచ్చిన పంటకైనా సకాలంలో డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. కందులను కొన్న ప్రభుత్వ సంస్థలు వారం పదిరోజులైనా రైతులకు సొమ్ము చెల్లించడం లేదు. దీంతో రైతులు తక్షణావసరాల కోసం చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంస్థలకు అమ్మితే వెంటనే సొమ్ము చేతికందక.. మద్దతు ధరకన్నా తక్కువకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఒక్కో క్వింటాల్ రూ.800 వరకు నష్టపోతున్నట్లు అంచనా. కేంద్ర సంస్థలు సకాలంలో సొమ్ము విడుదల చేయకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇవ్వకపోవడం వల్లే సకాలంలో సొమ్ము చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.
ప్రచారం ఘనం.. చేయూత శూన్యం
‘పత్తి వద్దు.. సోయా, కంది పంటలే ముద్దు’అంటూ గతేడాది ప్రభుత్వం చేసిన ప్రచారానికి చాలా మంది రైతులు ఆకర్షితులయ్యారు. ధర కూడా ఎక్కువగా ఉండడంతో 2016 ఖరీఫ్‌లో 10.3 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. ఇది సాధారణం కంటే 4 లక్షల ఎకరాలు
అదనం కావడం గమనార్హం. దీనివల్ల ఉత్పత్తి పెరిగి ధర పడిపోయింది. గతేడాది కంది ధర మార్కెట్లో క్వింటాల్‌కు రూ.10 వేల వరకు ఉండగా.. ఈసారి రూ.4,200 వరకే పలికింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూ. 5,050 కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ప్రకటించింది. కేంద్ర సంస్థలైన నాఫెడ్, ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా 95 వేల టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 89 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
వాస్తవానికి రాష్ట్రంలో 5 లక్షల టన్నుల వరకు కంది దిగుబడి వస్తుందని అంచనా. కానీ చాలా తక్కువగా 95 వేల టన్నులే కొనుగోలు చేయాలని నిర్ణయించడంపైనే విమర్శలు వచ్చాయి. చివరికి నిర్ణయించిన స్థాయిలోనూ కొనుగోళ్లు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ సంస్థలన్నీ కలసి ఇప్పటివరకు 65,538 మంది రైతుల నుంచి 65,723 టన్నుల కందులే కొనుగోలు చేశాయి. ఇందుకోసం రైతులకు రూ.341 కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ రూ.189 కోట్లే చెల్లించారు. మిగతా రూ.152 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నిబంధనల ప్రకారం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలి. కానీ వారం పది రోజులైనా చెల్లించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ.100 కోట్లు కేటాయించాలని మార్క్‌ఫెడ్ కోరగా.. రూ.30 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది కూడా విడుదల కాకపోవడంతో రైతులకు సొమ్ము చెల్లింపు ఆలస్యమవుతోందని అంటున్నారు.
దళారులే దిక్కయ్యారు
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రైతులు 2.5 లక్షల టన్నుల కందిని విక్రయించారని అంచనా. అందులో 65 వేల టన్నులకుపైగా ప్రభుత్వ సంస్థల కేంద్రాల్లో విక్రయించగా.. మిగతా 1.85 లక్షల టన్నులు దళారులకే అమ్మినట్లు తెలుస్తోంది. మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4,200 ధర మాత్రమే పలికినా.. తక్షణమే సొమ్ము చేతికి వస్తుందన్న భావనతో అమ్ముకున్నారు. ఇక సెకండ్ గ్రేడ్ కందులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయడం లేదు. అందువల్ల కూడా రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పలుచోట్ల అధికారులు, దళారులు కుమ్మక్కై.. గ్రేడ్–1 కందిని గ్రేడ్–2 అంటూ తిప్పి పంపినట్లు ఆరోపణలున్నాయి. దాంతో ఆ రైతులు దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. మరోవైపు రైతుల నుంచి తక్కువ ధరకు కొన్న దళారులు.. అదే కందిని మద్దతు ధరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మేసుకుంటున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు మార్కెట్లోకి మరింతగా కంది పంట రానుంది. దీంతో దళారులు మరింతగా తెగించే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అవసరాలకు ఇబ్బందిగా ఉంది
‘‘ఈనెల 4న మార్క్‌ఫెడ్ కేంద్రంలో నాలుగు క్వింటాళ్ల కందులు అమ్మిన. మూడు రోజుల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు. పది రోజులవుతున్నా డబ్బులు జమ కాలేదు. ఇంటి అవసరాలకు ఇబ్బందిగా మారింది..’’ – రైతు, మామిడి అంజిలప్ప, పగిడ్యాల్ (యాలాల)
గతేడాదితో పోలిస్తే నష్టమే
‘‘గతేడాది కంది క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల దాకా ధర పలికింది. ఈసారి ధరలను అమాంతం తగ్గించేశారు. పెట్టుబడి కూడా చేతికి రావడం లేదు. ఎకరాకు ఐదారు క్వింటాళ్ల కందులు పండాల్సి ఉండగా.. సరిగా వర్షాల్లేక రెండు మూడు క్వింటాళ్లే పండాయి. దీంతో నష్టమే మిగులుతోంది..’’ – రైతు శివారెడ్డి, అప్పక్‌పల్లి, నారాయణపేట మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
60 శాతం సొమ్ము చెల్లించాం:
‘‘రైతుల నుంచి కొనుగోలు చేసిన దాంట్లో ఇప్పటివరకు 60 శాతం వరకు నగదు చెల్లించాం. గతం కంటే ఇది ఎంతో ఎక్కువ. వాస్తవంగా దళారుల వద్దే రైతులకు చెల్లించడంలో ఆలస్యమవుతోంది..’’ – ఎం.జగన్‌మోహన్, మార్క్‌ఫెడ్ ఎండీ