ఏటా పెరుగుతున్న కంటెంప్ట్ కేసులు
కోర్టుల సున్నితత్వాన్ని అలుసుగా తీసుకుంటున్న అధికారులు
తీర్పులు అమలుచేయకపోవటంతో బాధితుల ఇబ్బందులు
పెండింగ్‌లో 13,885 కోర్టు ధిక్కరణ కేసులు
సాక్షి, హైదరాబాద్: కోర్టు మెట్లెక్కాలంటేనే ప్రజలకు భయం.. తీర్పు కోసం ఎన్నేళ్లు ఎదురుచూడాలో అని. అలాంటిది ట్రయల్ కోర్టులో తీర్పు వచ్చి, అక్కడి నుంచి హైకోర్టుకు చేరిన పిటిషన్లలోనూ తీర్పు వచ్చిన తర్వాత కూడా.. దాని అమలులో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? అవును.. న్యాయస్థానాల ఉత్తర్వులను లెక్క చేయడం లేదు కొందరు అధికారులు. శిక్షలు విధించినా వారిలో మార్పు రావడంలేదు. కోర్టు ధిక్కరణ కేసులో శిక్షలు పడినా అప్పీళ్లలో తప్పించుకుంటున్నారు. దీంతో బాధితులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది.
కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని.. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనలతో కింది కోర్టులు మానవతా దృక్పథంతో శిక్షలను మాఫీ చేస్తుండటంతో అధికారులు అదే అలుసుగా తీసుకుంటున్నారు. కోర్టు తీర్పు ఇస్తే అమలు చేసి తీరాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఏటా పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసుల గణాంకాలే అందుకు నిదర్శనం.
కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ –1971 ప్రకారం కోర్టు ధిక్కరణ రెండు రకాలు. సివిల్, క్రిమినల్. ఈ చట్టంలోని సెక్షన్ 1 (15) ప్రకారం.. క్రిమినల్ కంటెంప్ట్ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలయ్యే ధిక్కరణ కేసుల్లో సివిల్‌వే ఎక్కువ. ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించటాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. క్రిమినల్ కంటెంప్‌్టలో మూడు రకాలున్నాయి. ప్రచురణ రూపంలో, వ్యాఖ్యల రూపంలో, సంజ్ఞల రూపంలో కోర్టుల ఆదేశాలను ఉల్లంఘించినా, కోర్టులను అగౌరవపరిచినా, న్యాయ ప్రక్రియకు అడ్డుపడినా క్రిమినల్ కంటెంప్ట్ కిందికి వస్తుంది.
ఎస్‌ఐకి జరిమానా..
‘కోర్టు వద్దని చెప్పినా అరెస్టు చేస్తారా? న్యాయస్థానం ఉత్తర్వులంటే లెక్కలేదా? 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి ఉద్దేశపూర్వకంగానే ధిక్కరణకు పాల్పడ్డారు. సదరు సబ్ ఇన్‌స్పెక్టర్ క్షమాపణ చెప్పినా ఆమోదయోగ్యం కాదు. వారంపాటు జైలుతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తున్నాం. అంతేకాదు.. బాధితుడికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలి.’ – ఒక ఎస్‌ఐ తీరుపై హైకోర్టు ఆగ్రహం.
ఎంపీకి నోటీసులు..
‘న్యాయవ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేయడం క్షంతవ్యం కాదు. మీడియా సమావేశాల్లో ఇష్టం వచి్చనట్లు ఎలా మాట్లాడతారు? దీనిపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయండి.’ – ఒక ఎంపీకి కోర్టు ఆదేశం.
కలెక్టర్‌కు జైలు..
‘ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను 15 రోజుల్లో అమలు చేయని పక్షంలో కలెక్టర్ నెలరోజులు జైలుకు వెళ్లాల్సిందే. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలి. అలాగే మున్సిపల్ కమిషనర్‌కు 15 రోజుల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నాం.’ ఒక కలెక్టర్ తీరుపై న్యాయస్థానం మండిపాటు.
15 ఏళ్లయినా పరిష్కారం కాలేదు..
మా భూమిని ప్రభుత్వ భవనాలు నిర్మించడం కోసం దాదాపు ఒకటిన్నర దశాబ్దాల క్రితం నల్లగొండ జిల్లా కలెక్టర్ తీసుకున్నారు. పరిహారం తర్వాత అందిస్తామని చెప్పారు. ఇప్పటివరకు పరిహారం అందలేదు. కోర్టు చుట్టూ తిరిగి ఆదేశాలు తెచ్చుకున్నా స్పందన లేదు. ఇప్పుడు ధిక్కరణ పిటిషన్ వేశా. విచారణ కొనసాగుతోంది. 70 ఏళ్లు దాటిన వృద్ధుడిని. ఇంకా ఎన్నాళ్లు తిరగాలో..
– భువనగిరికి చెందిన ఓ బాధితుడు
కఠిన చర్యలు తీసుకుంటేనే తీర్పుల అమలు సాధ్యం
న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్లే.. అన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్ మాట న్యాయవ్యవస్థలో నేడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కోర్టు మెట్లెక్కిన సామాన్యుడికి వీలైనంత త్వరగా న్యాయం అందించాలి. కోర్టు తీర్పులను కూడా అధికారులు అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఎన్నిసార్లు కోర్టులను ఆశ్రయించాలి? కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుంటే ఉద్యోగాలు పోతాయి అంటే తప్ప అధికారులు అమలు చేయరు. తీర్పులను అమలు చేయనివారికి కఠిన శిక్షలు విధించాలి. – చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment