court cases
-
కోర్టు ఆదేశించినా ధిక్కరణ!
సాక్షి, హైదరాబాద్: కోర్టు మెట్లెక్కాలంటేనే ప్రజలకు భయం.. తీర్పు కోసం ఎన్నేళ్లు ఎదురుచూడాలో అని. అలాంటిది ట్రయల్ కోర్టులో తీర్పు వచ్చి, అక్కడి నుంచి హైకోర్టుకు చేరిన పిటిషన్లలోనూ తీర్పు వచ్చిన తర్వాత కూడా.. దాని అమలులో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? అవును.. న్యాయస్థానాల ఉత్తర్వులను లెక్క చేయడం లేదు కొందరు అధికారులు. శిక్షలు విధించినా వారిలో మార్పు రావడంలేదు. కోర్టు ధిక్కరణ కేసులో శిక్షలు పడినా అప్పీళ్లలో తప్పించుకుంటున్నారు. దీంతో బాధితులు మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది.కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని.. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనలతో కింది కోర్టులు మానవతా దృక్పథంతో శిక్షలను మాఫీ చేస్తుండటంతో అధికారులు అదే అలుసుగా తీసుకుంటున్నారు. కోర్టు తీర్పు ఇస్తే అమలు చేసి తీరాలా? అని ప్రశ్నిస్తున్నారు. ఏటా పెరుగుతున్న కోర్టు ధిక్కరణ కేసుల గణాంకాలే అందుకు నిదర్శనం. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ –1971 ప్రకారం కోర్టు ధిక్కరణ రెండు రకాలు. సివిల్, క్రిమినల్. ఈ చట్టంలోని సెక్షన్ 1 (15) ప్రకారం.. క్రిమినల్ కంటెంప్ట్ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు నేరుగా చర్యలు తీసుకోవచ్చు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలయ్యే ధిక్కరణ కేసుల్లో సివిల్వే ఎక్కువ. ఏదైనా కోర్టు తీర్పు, ఆదేశం లేదా ఇతర కోర్టు ప్రక్రియలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించటాన్ని సివిల్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణిస్తారు. క్రిమినల్ కంటెంప్్టలో మూడు రకాలున్నాయి. ప్రచురణ రూపంలో, వ్యాఖ్యల రూపంలో, సంజ్ఞల రూపంలో కోర్టుల ఆదేశాలను ఉల్లంఘించినా, కోర్టులను అగౌరవపరిచినా, న్యాయ ప్రక్రియకు అడ్డుపడినా క్రిమినల్ కంటెంప్ట్ కిందికి వస్తుంది.ఎస్ఐకి జరిమానా.. ‘కోర్టు వద్దని చెప్పినా అరెస్టు చేస్తారా? న్యాయస్థానం ఉత్తర్వులంటే లెక్కలేదా? 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసి ఉద్దేశపూర్వకంగానే ధిక్కరణకు పాల్పడ్డారు. సదరు సబ్ ఇన్స్పెక్టర్ క్షమాపణ చెప్పినా ఆమోదయోగ్యం కాదు. వారంపాటు జైలుతోపాటు రూ.2 వేల జరిమానా విధిస్తున్నాం. అంతేకాదు.. బాధితుడికి రూ.50 వేలు పరిహారం చెల్లించాలి.’ – ఒక ఎస్ఐ తీరుపై హైకోర్టు ఆగ్రహం.ఎంపీకి నోటీసులు.. ‘న్యాయవ్యవస్థపై నిరాధార ఆరోపణలు చేయడం క్షంతవ్యం కాదు. మీడియా సమావేశాల్లో ఇష్టం వచి్చనట్లు ఎలా మాట్లాడతారు? దీనిపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయండి.’ – ఒక ఎంపీకి కోర్టు ఆదేశం.కలెక్టర్‌కు జైలు.. ‘ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను 15 రోజుల్లో అమలు చేయని పక్షంలో కలెక్టర్ నెలరోజులు జైలుకు వెళ్లాల్సిందే. రూ.2 వేల జరిమానా కూడా చెల్లించాలి. అలాగే మున్సిపల్ కమిషనర్‌కు 15 రోజుల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నాం.’ ఒక కలెక్టర్ తీరుపై న్యాయస్థానం మండిపాటు.15 ఏళ్లయినా పరిష్కారం కాలేదు.. మా భూమిని ప్రభుత్వ భవనాలు నిర్మించడం కోసం దాదాపు ఒకటిన్నర దశాబ్దాల క్రితం నల్లగొండ జిల్లా కలెక్టర్ తీసుకున్నారు. పరిహారం తర్వాత అందిస్తామని చెప్పారు. ఇప్పటివరకు పరిహారం అందలేదు. కోర్టు చుట్టూ తిరిగి ఆదేశాలు తెచ్చుకున్నా స్పందన లేదు. ఇప్పుడు ధిక్కరణ పిటిషన్ వేశా. విచారణ కొనసాగుతోంది. 70 ఏళ్లు దాటిన వృద్ధుడిని. ఇంకా ఎన్నాళ్లు తిరగాలో.. – భువనగిరికి చెందిన ఓ బాధితుడు కఠిన చర్యలు తీసుకుంటేనే తీర్పుల అమలు సాధ్యం న్యాయం ఆలస్యమైతే న్యాయాన్ని నిరాకరించినట్లే.. అన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ అయ్యర్ మాట న్యాయవ్యవస్థలో నేడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కోర్టు మెట్లెక్కిన సామాన్యుడికి వీలైనంత త్వరగా న్యాయం అందించాలి. కోర్టు తీర్పులను కూడా అధికారులు అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఎన్నిసార్లు కోర్టులను ఆశ్రయించాలి? కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుంటే ఉద్యోగాలు పోతాయి అంటే తప్ప అధికారులు అమలు చేయరు. తీర్పులను అమలు చేయనివారికి కఠిన శిక్షలు విధించాలి. – చిక్కుడు ప్రభాకర్, హైకోర్టు న్యాయవాది -
కోర్టులతో ప్రజలు విసిగిపోయారు: సీజేఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: న్యాయప్రక్రియపై చీఫ్‌జస్టిస్‌ఆఫ్‌ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. శనివారం(ఆగస్టు3) సుప్రీంకోర్టులో జరిగిన ప్రత్యేక లోక్‌అదాలత్ వారోత్సవాల కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. కేసుల సత్వర పరిష్కారానికి ప్రజలు సెటిల్మెంట్లు కోరుకుంటున్నారన్నారు. జడ్జిలకు ఇది ఆందోళన కలిగించే విషయమేనని అభిప్రాయపడ్డారు. కేసుల సెటిల్మెంట్లో లోక్‌అదాలత్‌లది కీలక పాత్ర అని చెప్పారు. లోక్‌అదాలత్‌లో సెటిల్ చేసుకున్న కేసుల్లో అప్పీల్ ఉండదని తెలిపారు. -
కొలిక్కిరాని గురుకుల బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ ఎటూ తేలకపోతుండటంతో ఉపాధ్యాయ వర్గాల్లో గందరగోళం నెలకొంది. అత్యధికంగా రెగ్యులర్ టీచర్లున్న ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో టీచర్ పదోన్నతుల ప్రక్రియను నిర్వహిస్తూనే.. సమాంతరంగా బదిలీలనూ చేపట్టారు. కానీ కొన్ని గురుకుల పాఠశాలల్లో శాంక్షన్డ్ పోస్టులు, వర్కింగ్ కేటగిరీ సరితూగక పోవడంతో సొసైటీ అధికారులు.. పాఠశాలల వారీగా పోస్టుల మంజూరు లెక్కలను పరిశీలించారు.ఈ సొసైటీ పరిధిలో జీఓ 317 కింద చేసిన కేటాయింపులు కూడా పొంతన లేకుండా ఉన్నాయని గుర్తించి.. ఆ మేరకు సర్దుబాటు చేశారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులను డిస్లొకేట్ చేస్తూ కొత్త చోట్ల నియమించారు. ఆ ఉద్యోగులు, బదిలీల ప్రక్రియలో నిబంధనలు పాటించలేదంటూ మరికొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. అప్పటికే ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ చాలావరకు పూర్తయినా.. కోర్టు స్టే నేపథ్యంలో పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపేశారు. ఉద్యోగులంతా పాతస్థానాల్లోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ఈనెలాఖరుతో ముగుస్తుంది. తర్వాత నిషేధం అమలవుతుంది. ఆలోపు పోస్టింగ్ ఉత్తర్వులు వస్తాయా? లేదా? అని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ గురుకుల పరిధిలో.. తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్) పరిధిలో కేటాయింపులపై ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి మైనార్టీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల సంఖ్య తక్కువే. అన్నీ కొత్త గురుకులాలు కావడం, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులంతా కొత్తవారే కావడంతో సులువుగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతుందని భావించారు. కానీ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం, నిబంధనలు పట్టించుకోకపోవడంతో ఈ ప్రక్రియ గందరగోళంగా మారింది.బదిలీల ప్రక్రియలో తప్పులు కూడా ఇబ్బందిగా మారా యి. కొన్ని గురుకుల పాఠశాలల్లో ఒక సబ్జెక్టుకు సంబంధించి రెండు పోస్టులు మాత్రమే ఉంటే అక్కడ అదే సబ్జెక్ట్ వారు ముగ్గురికి పోస్టింగ్ ఇచ్చారు. మరికొందరికి ఎంచుకున్న ఆప్షన్‌కు బదులు ఇతర చోట పోస్టింగ్ ఇవ్వడం వంటివీ చోటు చేసుకున్నాయి. -
దేశంలోపెండింగ్ కేసులు ఐదు కోట్లకుపైనే: కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి ఐదు కోట్లకుపైనే కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. శుక్రవారం(జులై 26) లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. ఐదు కోట్లకు పైగా పెండింగ్ కేసుల్లో సుప్రీంకోర్టులో 85వేలు, వివిధ హైకోర్టుల్లో 60 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.అత్యధికంగా జిల్లా స్థాయి, అంతకంటే దిగువకోర్టుల్లోనే 4కోట్ల54లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కోర్టుల్లో సరైన సదుపాయాలు లేకపోవడం, న్యాయపరమైన చిక్కులు ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు. అత్యంత ఎక్కువగా 1.18 కోట్ల కేసులు ఉత్తర్ ప్రదేశ్‌లోని కింది కోర్టుల్లో పెండింగ్‌లో ఉండటం గమనార్హం. -
US Elections: ట్రంప్ పోరాటం వాటితోనే !
వాషింగ్టన్: కొత్త ఏడాదిలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోవాలని భావిస్తున్న దేశ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నికలకు కేసులు ప్రతిబంధకం కాకుండా ఎంత ధీటుగా ఎదుర్కొన్నప్పటికీ ట్రంప్ స్పీడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రాసిక్యూషన్ కూడా అంతే గట్టిగా కేసులు వాదిస్తోంది. 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించిన కేసుకు సంబంధించి తాజాగా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు చేసింది. ట్రంప్‌కు క్రిమినల్ కేసుల నుంచి ఎలాంటి ప్రత్యేక రక్షణ ఉండదని కోర్టుకు తెలిపింది. తాను అధ్యకక్షుడిగా ఉన్నపుడు పాల్పడిన చర్యలకు క్రిమినల్ చట్టాలు వర్తించవని ట్రంప్ బలంగా వాదిస్తున్నారు. ట్రంప్ చేసిన ఈ వాదనను కొలంబియా కోర్టు ఇప్పటికే తోసిపుచ్చడంతో ఆయన అప్పీల్‌కు వెళ్లారు. ఈ కేసులో జనవరి 9న కొలంబియా సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఇరుపక్షాల వాదనలు విననుంది. ఒకవేళ ట్రంప్ అప్పీల్‌ను కోర్టు తిరస్కరిస్తే ఈ కేసులో మార్చి నుంచి ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభిస్తుంది. అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోవాలనుకుంటున్న ట్రంప్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. 2024 నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా జనవరి 15 నుంచి ప్రైమరీలు ప్రారంభం కానున్నాయి. ఇదీచదవండి..పుతిన్‌ను ఎలాగైనా ఆపాల్సిందే: బైడెన్ -
ప్రత్యక్ష ప్రసారం ప్రజాస్వామ్యానికి బలం
రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి సుప్రీంకోర్టు గత నెలలో అనుమతించింది. న్యాయ, సామాజిక వ్యవస్థల్లో సమూల మార్పు జరిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభినందించాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలూ లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. న్యాయ ప్రక్రియలోని పారదర్శకత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రక్రియను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న ప్రారంభించింది. అయితే ముఖ్యమైన విచారణలను లైవ్ టెలికాస్ట్‌కి అనుమతిస్తూ సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 27నే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కీలకమైన కేసుల విచారణను పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా ప్రసారం చేయాలని తీసుకున్న నిర్ణయానికి అదే నాంది అయింది. అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టుల్లో జరిగే విచారణలను ప్రజాప్రయోజనం రీత్యా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని నిర్ణయం తీసుకున్నారు. వారు సూచించినట్లుగానే ప్రత్యక్ష ప్రసారాలు ప్రజల్లో రాజ్యాంగ విలువ లను, ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని బలోపేతం చేయడంలో న్యాయపరమైన కృషికి జీవం పోస్తాయి. ఆనాడు వారు ప్రదర్శించిన ఆ దార్శనికతకు తదనంతర ప్రధాన న్యాయమూర్తులు ఎన్వీ రమణ, యుయు లలిత్‌ల పూర్తి మద్దతు లభించింది. నాలుగేళ్ల అనంతరం రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన విచారణలను ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీకోర్టు విస్తృత ధర్మాసనం ఈ సెప్టెంబర్ 20న ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఈ–కమిటీ చైర్పర్సన్, ప్రత్యక్ష ప్రసారాలు మొదలెట్టడానికి వెనుక చోదక శక్తిగా ఉన్న జస్టిస్ చంద్రచూడ్, ఆ రోజు తన కోర్టులో విచా రణను మొదలు పెడుతూ ‘మేం ఇప్పుడు వర్చువల్’ అని ప్రకటిం చారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత సర్వోన్నత న్యాయస్థానం మనసా వాచా ఒక గొప్ప పనికి పూనుకుంది. ‘ఇంతకు ముందు ఎన్నడూ చేయలేని పనిని మనం చేయలేకపోతే మనం ఏదీ సాధిం చలేం. తక్కిన ప్రపంచం ముందుకెళుతుంటే న్యాయం మాత్రం యథా తథంగా స్తంభించిపోయి ఉంటుంది. ఇది ప్రపంచానికీ, న్యాయానికీ కూడా మంచిది కాదు’ అని దశాబ్దాల క్రితమే సుప్రసిద్ధ బ్రిటన్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ చెప్పిన గొప్పమాటలను భారత సుప్రీంకోర్టు స్ఫూర్తిగా తీసుకుని ఆచరణను ప్రారంభించింది. రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించడం ద్వారా... కీలక మలుపు తిప్పగలిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు గత, ప్రస్తుత చీఫ్ జస్టిస్లను, సుప్రీంకోర్టు జడ్జీలను అభినందించాల్సి ఉంటుంది. దానికి వారు అర్హులు కూడా అని చెప్పాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన, ప్రభావ శీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దీనికి కింది కారణా లను మనం చూపించవచ్చు. ఒకటి: దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలు లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. అలాగే న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. ప్రజలకు అందుతున్న న్యాయ ప్రక్రియలోని పారదర్శకత, సౌలభ్యత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలను పౌరులకు అందు బాటులోకి తేవడం అనేది సమాచారాన్ని ఎల్లెడలా నింపుకున్న పౌరు లను అభివృద్ధి చేయడంలో అతి ముఖ్యమైన దశగా చెప్పాలి. రెండు: ఈ నిర్ణయం చట్టపాలన ప్రాధాన్యతను ప్రజలు అర్థం చేసుకునేలా చేస్తుంది. దరిద్ర నారాయణుల, చారిత్రకంగా వెనుక బడిపోయిన, సాధికారతకు దూరమైపోయిన వర్గాల హక్కులను న్యాయవ్యవస్థ గట్టిగా పరిరక్షిస్తుందని ప్రజలు విశ్వసించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. సత్యాన్ని శక్తిమంతంగా మాట్లాడడం కంటే మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదు. దీని ప్రత్యక్ష ప్రభావం వెంటనే బయటపడక పోవచ్చు కానీ చట్టబద్ధపాలనను గౌరవించే సంస్కృతిని నిర్మించే శక్తి ఈ నిర్ణయానికి ఉందని చెప్పితీరాలి. మూడు: న్యాయ నిర్ణయ విధానంలో పారదర్శకతను ఇది ప్రోత్సహిస్తుంది. న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలను సాధారణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవడం అరుదుగానే జరుగుతుంటుంది. చట్టం, న్యాయం అనేవి న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ మాత్రమే వదిలివేయాల్సిన ముఖ్యమైన విషయాలుగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు కోర్టు విచారణలను ప్రత్యక్షంగా చూడడం వల్ల లక్షలాది సామాన్య భారతీయులు తాము శిక్షణ పొందిన న్యాయ వాదులు కాకున్నప్పటికీ, న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయాలలోని నేపథ్యాన్నీ, సందర్భాన్నీ అర్థం చేసుకోవడమే కాదు... న్యాయనిర్ణయ క్రమంలో తటస్థించే... పోటీ పడే విలువలు, ఘర్షించే హక్కులను కూడా వారు ప్రశంసించగలుగుతారు. కోర్టు విచారణల ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ద్వారా సుప్రీంకోర్టు బలీయమైన విశ్వాసాన్ని పాదుకొల్పింది. నాలుగు: ఈ నిర్ణయం న్యాయవాద వృత్తి నాణ్యతను, ప్రమా ణాలను పెంచగలుగుతుంది. లాయర్లు కోర్టుముందు కనిపించడానికి చక్కగా సిద్ధమవుతారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేయ కూడదనే వివేచనతో ఉంటారు. ఇప్పుడు తమ వాదనలను ప్రజలు నేరుగా చూడటం పట్ల లాయర్లలో సానుకూల వైఖరి పెరుగుతుంది. న్యాయాన్ని అందించే యంత్రాంగాలను న్యాయవాదులు గతంలో కంటే మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. యువ న్యాయవాదుల సన్నద్ధత, మేధో కుశలత కూడా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది కాబట్టి వారి న్యాయవాద వృత్తికి అది ఉన్నత స్థాయిని కట్టబెడుతుంది. భారతదేశంలో న్యాయవాద విద్యలో నెలకొన్న సంక్షోభాన్ని న్యాయవాద కళాశాలల్లో నాణ్యమైన బోధనను, పరిశోధనను పెంచడం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు. న్యాయవాద వృత్తిలోని వ్యాజ్యాలకు సంబంధించిన అంశంలో ప్రవేశించడానికి చాలామంది న్యాయవాద పట్టభద్రులు ఆసక్తి చూపని ధోరణి చాలా సంవత్స రాలుగా కలవరపెడుతోంది. కార్పొరేట్ లావాదేవీల ప్రపంచానికి వ్యతిరేకంగా... కఠిన షరతులు, ఉదాసీనత కారణంగా మన యువ న్యాయవాదులు లావాదేవీల బార్లో చేరడానికి సంసిద్ధత తెలుపడం లేదు. లాయర్ల వాస్తవ వాదనలను తిలకించడం, న్యాయమూర్తులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం వంటి విచారణలను తిలకించడం వల్ల, సాపేక్షంగా నిర్లక్ష్యానికి గురైన ఈ క్షేత్రంలోకి న్యాయవాద విద్యార్థులు వచ్చేలా ప్రభావితం చేయవచ్చు. జ్యుడీషి యరీ, న్యాయవాద వృత్తి పనితీరుకు సంబంధించిన నూతన స్కాలర్ షిప్, పరిశోధనా రంగాలపై పనిచేసేలా లా ఫ్యాకల్టీ సభ్యులు, న్యాయ పరిశోధకులు ప్రేరణ పొందవచ్చు. టెక్నాలజీ అనేది సంఘీభావాన్ని బలోపేతం చేసి, దూరానికి సంబంధించిన అవరోధాలను అధిగమించడంలో గొప్ప ఉపకరణంగా ఉంటుంది. కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని ఆశిద్దాము. పైగా చట్టబద్ధమైన న్యాయాన్ని ప్రజల వద్దకు, వారి రోజువారీ చర్చల వరకు తీసుకెళ్లడంలో కూడా ఇది తోడ్పడుతుందని ఆశిద్దాము. అమెరికా సుప్రీంకోర్టు విశిష్ట న్యాయమూర్తి జస్టిస్ అలివర్ వెండెల్ హోమ్స్ గతంలో ఒక అద్భుత వ్యాఖ్య చేశారు. ‘ప్రపంచంలో అతిగొప్ప విషయం ఏమిటంటే, మనం ఎక్కడ నిలిచామన్నది కాదు; మనం ఏ దిశగా వెళుతున్నామన్నదే ప్రధానమైనది.’ మనం నిజంగానే సరైన దిశలో పయనిస్తున్నామని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇప్పుడు హామీ ఇచ్చారు. సి. రాజ్ కుమార్ వ్యాసకర్త వ్యవస్థాపక వైస్ చాన్స్‌లర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
పేదల గూటికి టీడీపీ గండి!
సాక్షి, అమరావతి: ఇప్పటి వరకు దేశ, రాష్ట్ర చరిత్రలో వేలాది ఎకరాల భూమిని పారిశ్రామిక వేత్తలకు కేటాయించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి గానీ, గూడు లేని పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించిన దాఖలాలు లేవు. అలాంటిది తొలి సారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్లు లేని పేదలందరికీ సంతృప్త స్థాయిలో ఏకంగా 62 వేల ఎకరాల భూమిని 30.60 లక్షల మందికి పంపిణీ చేశారు. తొలి దశలో 15.60 లక్షల మంది పేదలకు ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తొలి దశలో 55,230 మంది పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు జరగకుండా తాత్కాలికంగా గండి కొట్టింది. వివిధ సాకులతో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కాకుండా ఆ పార్టీ పెద్దల సూచనలతో కొందరు నేతలు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. దీంతో తొలి దశలో తొమ్మిది జిల్లాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 55,230 పేదల ఇళ్ల నిర్మాణాల మంజూరు నిలిచిపోయింది. టీడీపీ నేతలు తాత్కాలికంగా పేదల ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారే తప్ప శాశ్వతంగా అడ్డుకోలేరని, న్యాయస్థానాల్లో కేసులను పరిష్కరించి.. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కోర్టు కేసుల వల్ల ఆగిపోయిన ప్రాంతాల్లో లబ్ధిదారుల మనసులో అలజడి ఏర్పడకుండా వారికి భరోసా కల్పించేలా కేసులు పరిష్కారం కాగానే ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణాలు చేపడతామని సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే అధికారులు లేఖలు రాశారు. పక్షం రోజుల్లో వివాదాల పరిష్కారానికి చర్యలు న్యాయ స్థానాల్లో కేసుల కారణంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వని కారణంగా తొలి దశ ఇళ్ల నిర్మాణాల మంజూరు పత్రాలను 55,230 మంది పేదలకు ఇవ్వలేకపోయామని గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వారం పది రోజుల్లోగా న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని చెప్పారు. ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా న్యాయ స్థానాల్లో కేసుల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ల సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంకా ఎక్కువ రోజులు జాప్యం అయితే రెండో దశ ఇళ్ల నిర్మాణాల్లో తొలి దశలోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని సీఎం ఆదేశించారని తెలిపారు. -
274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 274 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామాల ప్రస్తావనే లేదు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలున్నాయి. తొలి విడతలో 3,249 పంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. రెండో విడతలో 3,328 పంచాయతీల్లో రేపు (ఈ నెల 13న), మూడో విడతలో 3,221 పంచాయతీల్లో ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. నాలుగో విడతగా 3,299 గ్రామాల్లో ఈనెల 21న నిర్వహించే ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నాలుగు విడతల్లోను ఎన్నికల నోటిఫికేషన్ జారీచేయనివి 274 పంచాయతీలున్నాయి. వీటిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 69 ఉన్నాయి. ఏడాది కిందట పెద్ద గ్రామ పంచాయతీలుగా ఉన్న వాటిని పలుచోట్ల స్థానికుల డిమాండ్ మేరకు రెండుగా వర్గీకరించారు. అనంతరం ఆయా పంచాయతీల్లో వార్డుల విభజన జరగలేదు. దీంతో వాటిలో ఎన్నికలు నిర్వహించడంలేదు. కొన్ని పంచాయతీలకు సంబంధించి కోర్టుల్లో కేసులున్నాయి. అందువల్ల ఈ పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడంలేదు. నోటిఫికేషన్ జారీ అయినా జరగనివి మరికొన్ని ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ అయిన తరువాత కూడా వివిధ కారణాలతో మరికొన్ని పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి. మొదటి విడతలో నోటిఫికేషన్ జారీచేసినా సర్పంచి, వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెలిచర్ల పంచాయతీలో ఎన్నికలు నిలిచిపోయాయి. రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చిన పంచాయతీల్లోను మూడుచోట్ల ఎన్నికలు నిలిచిపోయినట్లు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. మూడో విడత ఉపసంహరణకు, నాలుగో విడత నామినేషన్ల దాఖలుకు నేడు గడువు మూడో విడత ఎన్నికలు జరగనున్న 3,221 పంచాయతీల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. అనంతరం ఎంతమంది పోటీలో ఉన్నారన్న స్పష్టత రానుంది. నాలుగో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
మంత్రి మల్లారెడ్డికి కోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ప్రజా ప్రతినిధులపై నమోదైన పలు కేసులు నేడు కోర్టు ముందుకు విచారణకు వచ్చాయి. వేర్వేరు కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కోర్టుకు హాజరయ్యారు. అయితే వీరిలో బండి సంజయ్‌కు ఊరట లభించగా, మంత్రి మల్లారెడ్డి, దానం నాగేందర్‌లు మరో వాయిదాకు హాజరుకాక తప్పదు. గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్‌పై కరీంనగర్లో నమోదైన మూడు కేసులను కోర్టు కొట్టి వేయగా, తన కేసును కూడా కొట్టివేయాలంటూ మంత్రి మల్లారెడ్డి చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. బంజారాహిల్స్‌లో నమోదైన కేసులో మంత్రి మల్లారెడ్డి దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ కోర్టు కొట్టివేసింది. ఫిబ్రవరి 11న మంత్రి మల్లారెడ్డి కచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
జీతాలు తీసుకుంటున్నారుగా.. జాగ్రత్తగా పనిచేయండి!
సాక్షి, అమరావతి: ప్రజలు చెల్లిస్తున్న డబ్బులను జీతాల రూపంలో తీసుకుంటున్న అధికారులు విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల్లో దాఖలైన కేసుల విషయంలో అత్యంత శ్రద్ధ, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని హితవు పలికింది. కోర్టు కేసుల విషయంలో యాంత్రికంగా వ్యవహరించవద్దని తేల్చి చెప్పింది. ఒక కేసు దాఖలు విషయంలో 1,016 రోజులు (2.7 సంవత్సరాలు) ఆలస్యం చేసినందుకు ఓ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడం కోర్టు సమయాన్ని వృథా చేయడమే అవుతుందని హెచ్చరించింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని గుర్తు చేస్తూ అప్పీల్ దాఖలులో ఇంత ఆలస్యం చేసినందుకు మంగళగిరి తహసీల్దార్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని ఆదేశించింది. అప్పీల్ దాఖలులో తీవ్ర ఆలస్యానికి కారణమైన అధికారుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలస్యాన్ని మాఫీ చేయాలంటూ తహసీల్దార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ తహసీల్దార్ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని కూడా కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు రిజిస్ట్రీ (జ్యుడీషియల్ విభాగం) అధికారులను సైతం హైకోర్టు మందలించింది. అప్పీల్ దాఖలులో 669 రోజుల ఆలస్యం జరిగిందని తహసీల్దార్ పిటిషన్లో పేర్కొన్నారని, వాస్తవానికి 1,016 రోజుల ఆలస్యం జరిగినా ఆ విషయాన్ని రిజిస్ట్రీ పరిశీలించలేదని హైకోర్టు తప్పుబట్టింది. కేసులను స్క్రూటినీ చేసి ప్రాసెస్ చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా జ్యుడీషియల్ విభాగం అధికారులకు తగిన సూచనలు చేయాలని రిజిస్ట్రార్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం తీర్పు వెలువరించారు. (రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు?) ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది... ఈ తీర్పును సవాల్ చేస్తూ మంగళగిరి తహసీల్దార్ 2018 సెప్టెంబర్‌లో హైకోర్టులో సెకండ్ అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ దాఖలులో 669 రోజుల ఆలస్యం ఉందని, దీన్ని మాఫీ చేయాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ స్కీంలో అధికారులంతా తీరిక లేకుండా ఉన్నందువల్ల అప్పీల్ దాఖలులో జాప్యం జరిగిందన్నారు. తహసీల్దార్ అనుబంధ పిటిషన్‌ను పద్మశాలి సంఘం వ్యతిరేకించింది. అప్పీల్ దాఖలులో 1,016 రోజులు ఆలస్యం జరిగినట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. ఇంత ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేశారంటే ఈ కేసు విషయంలో అధికారులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పులో పేర్కొన్నారు. నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని, అప్పీల్ దాఖలుకు చట్టం నిర్దేశించిన గడువు ప్రభుత్వంతో సహా అందరికీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. తహసీల్దార్ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటిస్తూ విధి నిర్వహణలో అలసత్యం ప్రదర్శించినందుకు జరిమానా విధించారు. (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన) ఇదీ వివాదం... మంగళగిరిలో దామర్ల నాంచారమ్మ విరాళంగా ఇచ్చిన ఏడు ఎకరాల భూమిని పద్మశాలి సంఘం చెరువుగా మార్చింది. నాంచారమ్మ చెరువులో 3 ఎకరాలు ఆక్రమణకు గురి కాగా మిగిలిన నాలుగు ఎకరాల రక్షణకు సంఘం ఏర్పాట్లు చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వటంపై మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం 2012లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేసింది. దీనిపై తమకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో పద్మశాలి సంఘం 2014లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీల్ సూట్ దాఖలు చేసింది. విచారణ అనంతరం పద్మశాలి సంఘానికి అనుకూలంగా 2015 ఆగస్టులో తీర్పు వెలువడింది. -
కీలక సాక్ష్యం.. ‘మరణవాంగ్మూలం’
సాక్షి, జాగిత్యాల : రమ్యపై ఆమె భర్తకు అనుమానం. ఆమె ప్రవర్తన విషయమై ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రమ్య భరించలేకపోయింది. ఒకరోజు కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. భర్త ఆసుపత్రికి తరలించాడు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వెంటనే కోర్టు మెజిస్ట్రేట్ వచ్చి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలు ఎవరు ఏమి చేస్తున్నారో, ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది’. ఈ నేపథ్యంలో బాధితుల మరణవాంగ్మూలం, పోలీసుల విచారణ తదితర విషయాల గురించి జగిత్యాల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఎస్.పవన్‌కుమార్(9440128938) వివరించారు. చావు ప్రశ్నార్థకమైనప్పుడు.. వ్యక్తి చావు ప్రశ్నార్థకమైనప్పుడు, మరణించే వ్యక్తి తన చావుకు గల కారణాన్ని, ఆ చావుకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకునేందుకు మెజిస్ట్రేట్ బాధితుల నుంచి నమోదు చేసే స్టేట్మెంట్ను మరణ వాంగ్మూలంగా పిలుస్తారు. జరిగిన నేరానికి బాధితుడు ఒక్కడే సాక్షి. ఆ సాక్షి చెప్పేదే బలమైన సాక్ష్యం అయి ఉండవచ్చు. అతడి స్టేట్మెంట్ను తీసుకోకుంటే బాధితుడికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడు.. చావుకు దగ్గరైన వ్యక్తి నిజం చెబుతాడని, ఆ సమయంలో అబద్ధం చెప్పడని, చెప్పడానికి సదరు వ్యక్తి మనస్సు అంగీకరించదని చట్టం భావిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మరణ వాంగ్మూలాన్ని కోర్టు ప్రధాన సాక్ష్యంగా తీసుకుంటుంది. పోలీసులు ఏం చేస్తారంటే.. ఏవరైనా వ్యక్తి తీవ్రగాయాలతో సీరియస్‌గా ఉన్న పరిస్థితుల్లో, ఆ వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేయాలి. మరణ వాంగ్మూలం నమోదు చేసేందుకు ముందుగా మెజిస్ట్రేట్‌కు తెలియజేయాలి. ఇందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. అయితే గాయాలైన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండి, మెజిస్ట్రేట్ వచ్చేంత వరకు కూడా బతకలేని పక్షంలోనే, చికిత్స అందిస్తున్న డాక్టర్‌ను మరణ వాంగ్మూలం నమోదు చేయాలని కోరే హక్కు పోలీసులకు ఉంటుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉండి, ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేని పరిస్థితులు ఉన్నప్పుడు, పోలీస్ అధికారే మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేసేటప్పుడు ఒక్కరిద్దరు సాక్షులు తప్పనిసరిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు పోలీసులు మరణ వాంగ్మూలం నమోదు చేయకుండా ఉండటం బెటర్. అన్నింటికంటే ముఖ్యంగా కోర్టు మెజిస్ట్రేట్ చేత మరణ వాంగ్మూలం నమోదు చేయిస్తే విలువ ఎక్కువగా ఉంటుంది. ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏవరు మరణ వాంగ్మూలాన్ని నమోదు చేశారనే విషయాలను కేసు డైరీలో రాయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం కల్పించాల్సిందే.. మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రత్యేక పద్ధతంటూ చట్టంలో ఎక్కడా లేదు. కానీ మరణ వాంగ్మూలానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పోలీసుల నుంచి అధికారిక సమాచారం రాగానే కోర్టు మెజిస్ట్రేట్ సైతం వాంగ్మూలం తీసుకోవాల్సిన వ్యక్తి దగ్గరకు బయలుదేరుతాడు. బాధితుడి దగ్గరకు వెళ్లగానే మెజిస్ట్రేట్ పోలీసులు పేర్కొంటున్న బాధితుడు ఇతడేనా..వంటి వివరాలు చూసుకుంటారు. బాధితుడికి తాను జడ్జినని చెప్పి, అతడు వాంగ్మూలం ఇచ్చే స్థితిలో ఉన్నాడా లేడా అనే విషయాలు తెలుసుకున్న తర్వాత వాంగ్మూలం రాస్తుంటారు. కేసు పరిశోధనలో మరణ వాంగ్మూలానికి అత్యంత విలువ ఉంటుంది కాబట్టి వాంగ్మూలం తీసుకునేందుకు వచ్చే మెజిస్ట్రేట్లకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉం దని హైకోర్టు 1993లో ఉత్తర్వులు జారీ చేసింది. ఎలా నమోదు చేస్తారంటే.. వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి సృహలో ఉన్నాడా, లేడా తను అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబు చెప్పే పరిస్థితిలో ఉన్నాడా లేడా అని మొదట మెజిస్ట్రేట్ గమనిస్తుంటారు. అతడు అలా లేడని అనిపించినప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ను నమోదు చేయకుండా, అతడు సృహలో లేడనే విషయాన్ని నోట్ చేసి ముగిస్తుంటారు. అతడు సృహలో ఉన్నాడని మెజిస్ట్రేట్ తృప్తిపడితే, బాధితుడు సందర్భశుద్ధిగా మాట్లాడగలడా లేదా, మానసికస్థితి సరిగా ఉందా లేదనే విషయాలను పసిగడుతారు. ఇలా అన్ని విషయాలపై సంతృప్తి చెందిన తర్వాత, సంఘటన ఎలా జరిగింది, కారణం ఎవ్వరు వంటి ప్రశ్నలను అడుగుతూ మెజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు. వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు డాక్టర్లు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. అలాగే వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి సరైన మానసికస్థితిలో ఉన్నట్లు డాక్టర్ల నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సంతకం చేయలేక పోతే వేలి ముద్రలు.. స్టేట్మెంట్ పూర్తైన తర్వాత, ఆ స్టేట్మెంట్లోని విషయాలను, స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తికి తెలియజేసి అతడి సంతకాన్ని తీసుకోవాలి. బాధితుడు సంతకం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతడి వేలిముద్రలను స్టేట్మెంట్ చివర తీసుకోవాలి. గాయపడిన వ్యక్తి సృహాలో ఉన్నప్పటికీ సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఆయనకు చిన్నచిన్న ప్రశ్నలు వేసి, ఆ ప్రశ్నలకు ఆయనిచ్చే గుర్తులు, సంజ్ఞల ద్వారా వాంగ్మూలం నమోదు చేయాలి. ముఖ్యంగా స్టేట్మెంట్ నమోదు చేసే సమయంలో బాధితుల బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులను దగ్గర ఉండనివ్వరు. మరణ వాంగ్మూలం నమోదు ప్రారంభించిన, ముగింపు సమయాన్ని స్టేట్మెంట్పై తప్పనిసరిగా వేయాలి. -
కొత్త పట్టా పుస్తకాలెప్పుడో!
సాక్షి, ఆదిలాబాద్: భూరికార్డుల ప్రక్షాళన జరిగి దాదాపు మూడేళ్లు గడుస్తుంది. అయినా ఇంత వరకు వివాదాస్పదంగా ఉన్న భూ సమస్యలను పరిష్కరించడంతో అధికారులు శ్రద్ధ చూపడం లేదు. సర్వే సమయంలో ఎలాంటి సమస్యలు లేని భూములను పార్ట్–ఏలో చేర్చి కొత్త పట్టాపాసు పుస్తకాలు అందించారు. వివాదాలు ఉన్న భూములను పార్ట్–బిలో చేర్చి ఇంత వరకు కొత్త పట్టా పాసుపుస్తకాలు అందజేయలేదు. దీంతో గత రెండున్నరేళ్లుగా రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తహసీల్దార్ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. మూడు ఎకరాలకుపైనే.. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా భూ వివరాలను పరిశీలించిన అధికారులు సర్వే లో వివాదాలు ఉన్న భూములను పార్ట్–బీలో చే ర్చారు. రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ జరిగి ఇరవై నెలలు గడుస్తున్నా..పార్ట్–బీ భూములకు ఇంత వరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించడం లేదు. దీంతో ఆ భూములు కలిగిన పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో 5400 ఎకరాలపైగా భూములను పార్ట్–బీలో చేర్చగా, గతేడాది నుంచి ఇప్పటి వరకు 2 వేల ఎకరాల భూములకు మాత్రమే పరిష్కర మార్గం చూ పారు. మిగతా 3,400 ఎకరాలకు మోక్షం కలగలేదు. పార్ట్–బీలోని భూములన్నింటీకి పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశించినా ప్రభుత్వం వివిధ కారణాలతో పక్కన పెడుతూ వస్తోంది. గత ఎనిమిది నెలలుగా వరుస ఎన్నికల నేపథ్యం లో పార్ట్–బీ భూ సమస్యల జోలికి అధికారులు వెళ్లలేదు. మోక్షం లభించేనా? నియోజకవర్గంలో జైనథ్, బేల, ఆదిలాబాద్ రూరల్, అర్బన్, మావల మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలోని సుమారు 3400 ఎకరాలకుపైగా భూములు పార్ట్–బీలో పెండింగ్‌లో ఉం ది. వీటకి పూర్తిస్థాయి పరిష్కరం లభించే అవకాశం కనిపించడం లేదు. కోర్టుకేసులు, కుటుంబ వివాదాలు ఉన్న భూములను అధికారులు పక్కనపెట్టగా, చిన్న చిన్న సమస్యలున్న భూములను మాత్రమే పరిశీలన చేసి పరిష్కరిస్తున్నారు. దీంతో అసలు సమస్య ఉన్న భూములు పెండింగ్‌లో నే ఉన్నాయి. అయితే కొన్ని భూములకు చిన్న స మస్యలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదని, కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఓసారి దృష్టి సారిస్తే.. భూ సమస్యలు పరిష్కారం అవుతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పార్ట్–బీలోని కొన్ని భూములపై రెవెన్యూ, సివిల్ కోర్టు కేసులు, సరిహద్దు గుర్తింపు సమస్యలున్నాయి. పాసు పుస్తకం ఇవ్వాలి నా పేరు మీద వ్యవసాయ భూమి ఉంది. పాత పట్టా పాస్‌బుక్‌లు ఉన్నాయి. కానీ కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇంత వరకు ఇవ్వలేదు. చాలాసార్లు అధికారులను అడిగినా.. ఇంత వరకు జారీ చేయలేదు. దీంతో రైతుబంధు, ప్రభుత్వ రాయితీలకు దూరమవుతున్నాం – ప్రసాద్, ఖానాపూర్, ఆదిలాబాద్ -
టీడీపీలో హైడ్రామా
సాక్షి, కాకినాడ (తూర్పు గోదావరి): టీడీపీలో హైడ్రామాకూ ‘తూర్పు’ వేదిక కానుందా? ఆ పార్టీలో సంక్షోభానికి ఇక్కడినుంచే మార్పులు చోటుచేసుకోనున్నాయా? సంక్షోభం పేరుతో కేసుల నుంచి బయటపడేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా?అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశ రాజధానిలో టీడీపీ రాజ్యసభ సభ్యులు యుద్ధ ప్రాతిపదికన బీజేపీలో చేరగా, అదే సమయంలో టీడీపీకి చెందిన కాపు సామాజికవర్గ మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో రహస్య సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అధినేత డైరెక్షన్లో కొందరు నడుచుకోగా, మన దారి మనం చూసుకోవాలన్న ధోరణితో మరికొందరు నాటకీయంగా అడుగులు వేస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఓటమితో టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. కింకర్తవ్యమంటూ భవిష్యత్తుపై దృష్టి సారించారు. ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయిన నేతలు తప్పనిసరిగా కేసులు ఎదుర్కోవల్సి ఉండటంతో కాపాడే వారి కోసం అర్రులు చాస్తున్నట్టుగా రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబుకు సన్నిహిత నేతలుగా, బినామీలుగా చెప్పుకునే కొందరు కీలక నేతలు బీజేపీలో చేరడం వెనుక ఇదే ఉద్దేశమని భావిస్తున్నారు. చంద్రబాబుకు తెలియకుండా ఇదంతా జరిగిందా? లేదంటే ఆయన డైరెక్షన్లోనే వారంతా పార్టీ మారారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలో తెలంగాణలో రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి పంపించి...తరువాత అదే పార్టీతో పొత్తు పెట్టుకున్న వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడలోని సిటీ ఇన్ హోటల్లో టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలు 13 మంది ప్రత్యేకంగా భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు కూడా రాజ్యసభ సభ్యుల బాటలో బీజేపీలోకి వెళ్లేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అంతా చర్చించుకున్నారు. కానీ,వీరి సమావేశం వెనక మరో కారణం ఉందని వాదన వినిపిస్తోంది. తనకు సన్నిహితులైన వారిని బీజేపీలోకి చంద్రబాబే పంపించారని, వారిని వెళ్లిపోమని చెప్పిన చంద్రబాబు తమకెందుకు చెప్పలేదనే కారణంతో వీరంతా ప్రత్యేకంగా సమావేశమైనట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కేసుల నుంచి కాపాడుకునేందుకు సన్నిహితులను పంపించిన చంద్రబాబును నమ్ముకుంటే తమ పుట్టి మునిగేలా ఉందని, మనమంతా కలిసికట్టుగా ఉండి, భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయంతో కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలందరూ సమావేశమైనట్టు స్పష్టమవుతోంది. సుమారు 3 గంటలపాటు సమాలోచనలు చేసిన సదరు కాపు టీడీపీ నేతలు ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం సరికాదని, పరిస్థితులను అంచనా వేసుకుని గట్టి నిర్ణయం తీసుకుందామనే యోచనకు వచ్చినట్టు తెలిసింది. ఇక్కడ భేటీ అయిన వారిలో కొందరిపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. కోర్టులో ఏదో ఒక సందర్భంలో తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మద్దతు కూడగట్టి, మనమంతా ఒక్కటనే ధోరణితో ముందుకెళితే కొంతమేర బయటపడొచ్చనే అభిప్రాయంతో సదరు నేతలు ఈ సమావేశాన్ని వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే వీరు కూడా ఓ దారి చూసుకునే పనిలో పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ, బూరగడ్డ వేదవ్యాస్, బొండా ఉమ, బడేటి బుజ్జి, మీసాల గీత, కొండపల్లి అప్పలనాయుడు, పంచకర్ల రమేష్‌బాబు, ఈలి నాని, చెంగలరాయుడు, బండారు మాధవనాయుడు, కదిరి బాబూరావు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు పక్షులు
పక్కనున్న కేసుల చిట్టా చూస్తే చాలు.. అధికార యంత్రాంగం విధి నిర్వహణలో ఎక్కువ సమయం వీటి విచారణలకే కేటాయించాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేల సంఖ్యలో పెండింగులో ఉంటున్న కేసులు.. అధికారులను.. ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగాన్ని కోర్టు పక్షులుగా మార్చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నెలలో కనీసం రెండుమూడు రోజులు ఏదో ఒక కేసులో కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. జేసీ, ఆర్డీవో స్థాయి అధికారులదీ అదే పరిస్థితి. భూసేకరణ వంటి విభాగాల అధికారులైతే వారంలో మూడు నాలుగు రోజులు కోర్టు కేసుల్లోనే మునిగిపోవాల్సి వస్తోంది. ఫలితంగా రెవెన్యూ శాఖలో రోజువారీ వ్యవహారాలు పెండింగులో పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదవుతుంటే.. వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కూడా కేసులను పెండింగులో పడేస్తూ.. కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో మరెక్కడా లేనన్ని కోర్టు కేసులు ఒక్క విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. దాదాపు ఈ కేసులన్నీ భూ సేకరణ, భూ వివాదాలకు సంబంధించినవే. సుప్రీంకోర్టు మొదలుకొని హైకోర్టు, జిల్లా కోర్టు.. ఇతర కింది కోర్టుల్లోనూ వేల సంఖ్యలో కేసులు విచారణలో ఉన్నాయి. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే విశాఖ కలెక్టర్ నెలలో కనీసం ఒకటి రెండు రోజులు వీటి విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ, హైదరాబాద్‌లకు వెళ్లాల్సి వస్తోంది. ఆయనే కాదు..జేసీ, ఆర్డీవోలు, తహసీల్దార్లు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లలోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అలసత్వమే కారణం జిల్లాలో నమోదవుతున్న వాటిలో రెవెన్యూ, ఇనాం, వక్ఫ్, దేవాదాయ భూముల ఆక్రమణల కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. అధికారుల అలసత్వం వీటి పరిష్కారంలో జాప్యాని కి.. ఎక్కువ రోజులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి దారితీస్తోంది. సకాలంలో కౌంటర్లు దాఖలు చేయకపోవడంతో కింది కోర్టుల్లో పరిష్కరించుకోదగిన కేసుల్లో సైతం పై కోర్టుల ను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని కేసుల్లో అధికారుల వ్యవహరిస్తున్న తీరు ప్రత్యర్థులకు వరంగా మారుతోంది. దసపల్లా హిల్స్‌తో పాటు కొన్ని కీలకమైన భూ వివాదాల్లో ప్రైవేటు పార్టీలకు అనుకూలం గా తీర్పులొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సివిల్ వివాదాలకు సంబంధించి.. సుప్రీంకోర్టులో నాలుగు, హైకోర్టులో 963, లోయర్, డిస్ట్రిక్ట్ కోర్టుల్లో 302, అప్పీల్స్ మరో ఐదు కలిసి మొత్తం 1274 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఉన్న నాలుగు కేసుల్లో కూడా కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది. హైకోర్టు లో ఉన్న 963 కేసులకు సంబంధిం చి 312 కేసుల్లో కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంది. సివిల్ వివాదాలకు సంబంధించి జిల్లా, కింద కోర్టుల్లో 302 రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉంటే.. వాటిలో 67 కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది. ఐదు కేసుల్లో మాత్రమే అప్పీల్‌కు వెళ్లగా వాటన్నింటికీ కౌంటర్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఆన్లైన్ లీగల్ కేసెస్ మానిటరింగ్ సిస్టమ్(ఓఎల్‌సీఎంఎస్)కింద హైకోర్టులో 1585 కేసులు, కింద కోర్టుల్లో 96 కేసులు ఫైల్ కాగా.. ఇప్పటి వరకు హైకోర్టులో 656 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. రెవెన్యూ కోర్టుల్లో 560 కేసులు ఫైల్ కాగా.. 245 పరిష్కారమయ్యాయి. మరో 315 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇనాం కేసులు ఆర్డీవో కోర్టుల్లో 42, సీసీఎల్ఏ కోర్టులో 11 పెండింగ్‌లో ఉన్నాయి. గత 4 ఏళ్లలోనే అధికం కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రాష్ట్రంలో మరెక్కడా లేనంతగా విశాఖ జిల్లాలోనే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో అధిక శాతం కేసులు గత నాలుగేళ్లలో దాఖలైనవే కావడం గమనార్హం. భూసేకరణ వివాదాల కేసులు చాలా తక్కువగా ఉండగా.. ఎక్కువ శాతం ప్రభుత్వ, ప్రైవేటు భూ వివాదాలే. ఆక్రమణదారులకు కొమ్ముకాయడం..భూ కబ్జాలను ప్రోత్సహించడం వల్లే అధికారులను పార్టీలుగా చేస్తూ బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏళ్ల తరబడి ఈ కేసులు కోర్టుల్లో నలుగుతుండడంతో దానికి బాధ్యులైన వారు ఎక్కడున్నా సరే కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వస్తోంది. కోర్టుల చుట్టూ తిరిగే విభాగాల్లో మొదటి స్థానంలో రెవెన్యూ యంత్రాంగం ఉండగా..ఆ తర్వాత దేవాదాయ ధర్మదాయ శాఖ, అటవీ తదితర శాఖల అధికారులుంటున్నారు. ఈ ప్రభావం పాలనపై పడుతోందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
తండ్రి,కొడుకుల దారుణహత్య
సాక్షి, ఇల్లంతకుంట (మానకొండూర్) : భూ వివాదం తండ్రీకొడుకుల దారుణహత్యకు దారితీసింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టారావుపల్లి గ్రామ శివారులోని సర్వేనంబర్ 540లో ఉన్న 39గుంటల వ్యవసాయభూమి కిష్టారావుపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల దేవయ్య అతడి సోదరుడు మామిండ్ల స్వామి పేర్లతో భూ రికార్డుల్లో ఉండగా, కాస్తులో కందికట్కూర్‌కు చెందిన సావనపెల్లి ఎల్లయ్య ఉన్నాడు. భూమి మాదంటే.. మాదంటూ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఇదే భూమిలో సోమవారం మామిండ్ల స్వామి, దేవయ్య విత్తనాలు వేశారు. మంగళవారం వేకువజామున సావనపెల్లి ఎల్లయ్య, అతడి కుమారుడు శేఖర్ వెళ్లి అదే వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌తో దుక్కిదున్నడం మొదలుపెట్టారు. సమీపంలోనే ఉన్న మామిండ్ల దేవయ్య, స్వామి, దేవయ్య భార్య పద్మ, కుమారుడు వెంకటేశ్ వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు. కారం చల్లి.. గొడ్డళ్లతో నరికి.. సావనపెల్లి ఎల్లయ్య(50), అతడి కుమారుడు శేఖర్(21)లపై మామిండ్ల దేవయ్య భార్య పద్మ కారంపొడి చల్లింది. దేవయ్య, అతడి సోదరుడు స్వామి గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. అక్కడే ఉన్న ఎల్లయ్య భార్య ఎల్లవ్వ కేకలు వస్తూ మృతదేహాల వద్దకు వచ్చేలోపే నిందితులు పారిపోయారని ఎల్లవ్వ తెలిపింది. పరిశీలించిన ఎస్పీ.. విషయం తెలుసుకున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఎస్పీ వెంటరమణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పథకం ప్రకారమే హత్యలు జరిగాయని, కొన్నేళ్లుగా భూవివాదం కేసు కోర్టులో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తండ్రీకొడుల హత్యకేసులో నలుగురి పాత్ర ఉందని, నింధితు లు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతుడి భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మృతదేహాలు తరలించొద్దంటూ బంధువుల ఆందోళన.. హత్య ఘటనలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించే వరకు మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తరలించొద్దంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను తరలించేందుకు తీసుకొచ్చిన ట్రాక్టర్ ఎదుట బైటాయించారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐలు అనిల్‌కుమార్, రవీందర్‌లు వచ్చి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ 39 గుంటల భూమి మృతుల కుటుంబానికే చెందేలా చూస్తామని హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. భూవివాదం కోర్టులో ఉందని, కోర్టు చూసుకుంటుందని చెప్పడంతో శాంతించారు. పోలీసుల అదుపులో నిందితులు హత్యకేసులో నిందితులైన మామిండ్ల దేవయ్య, మామిండ్ల స్వామి, పద్మ, వెంకటేశ్ ఇల్లంతకుంట పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి సిరిసిల్ల సీఐ కార్యాలయంలో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు మాత్రం నిందితులు పరారీలోనే ఉన్నారని చెబుతున్నారు. -
నేరము–శిక్ష ఏదీనిలవట్లే!
నగరంలో వివిధ నేరాలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో నిలవట్లేదు. సరైన సాక్ష్యాధారాలు లేక అతి ముఖ్యమైన కేసులూ వీగిపోతున్నాయి. కేవలం 38.9 శాతం కేసుల్లోనే దోషులకు శిక్ష పడుతోందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. ఏదైనా ఓ నేరానికి సంబంధించి నిందితుల్ని పట్టుకోవడమే కాదు... వారిని న్యాయస్థానంలో దోషులుగా నిరూపిస్తేనే బాధితులకు పూర్తి న్యాయం జరిగినట్లు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ కోణంలో పోలీసులు విఫలం అవుతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రంలో (ఉమ్మడి) నమోదైన తొలి మానవబాంబు కేసు.. దాడి జరిగింది సాక్షాత్తూ నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై. ఈ ఘాతుకంలో పెనుముప్పు తప్పినప్పటికీ ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. కేసు దర్యాప్తు, విచారణ దాదాపు పుష్కరకాలం సాగింది. చివరకు కొన్నాళ్ల క్రితం కేసు న్యాయస్థానంలో వీగిపోయింది. ఈ ఒక్క కేసే కాదు.. పోలీసులు అభియోగపత్రాలు దాఖలు చేస్తున్న వాటిలో కనీసం సగం కేసులు కూడా కోర్టులో నిలవట్లేదు. నగరంలో నమోదవుతున్న కేసుల్లో శిక్ష పడుతున్నది కేవలం 38.9 శాతం మాత్రమేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) స్పష్టం చేసింది. దేశంలోని ఇతర మెట్రోల కంటే ఈ విషయంలో సిటీ వెనుకబడి ఉందనడానికి ఈ గణాంకాలే ఓ ఉదాహరణ. ఏదైనా ఓ నేరంలో నిందితులను పట్టుకోవడమే కాదు.. వారిని న్యాయస్థానంలో దోషులుగా నిరూపిస్తేనే బాధితులకు పూర్తి న్యాయం జరిగినట్లు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో ఈ కోణంలో పోలీసులు విఫలమవుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. సిబ్బంది కొరతతోనూ ఇబ్బందే.. నేరం నిరూపణలో 2016 ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలోనూ కన్వెక్షన్స్ 45.1 శాతంగా నమోదయ్యాయి. ఈ పరిస్థితులకు అనేక కారణాలు ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. పోలీసు విభాగంలో క్షేత్రస్థాయి అధికారులైన ఇన్స్పెక్టర్, ఎస్సైల కొరత తీవ్రంగా ఉంది. అత్యధిక కేసుల్లో దర్యాప్తు అధికారులుగా వీరే ఉంటారు. ప్రమాణాల ప్రకారం ఒక్కో దర్యాప్తు అధికారి ఏడాదికి గరిష్టంగా 60 నుంచి 80 కేసుల్ని మాత్రమే దర్యాప్తు చేయాలి. సిబ్బంది కొరత వల్ల ఒక్కొక్కరు 300 నుంచి 400 కేసులు దర్యాప్తు చేయాల్సి వస్తోంది. ఈ ప్రభావం కేసులపై పడి దర్యాప్తులో నాణ్యత దెబ్బతింటోంది. సాంకేతిక కారణాలు, సాక్షులతోనూ.. అనేక కారణాల నేపథ్యంలో కేసును కొలిక్కి తీసుకువకావడంపై ఉంటున్న శ్రద్ధ సాక్ష్యాధారాల సేకరణపై ఉండట్లేదు. రోటీన్లో భాగంగా సేకరిస్తున్న వాటి విషయంలోనూ సాంకేతిక, నిబంధనల్ని దర్యాప్తు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆధారాలను న్యాయస్థానాలు పరిగణలోకి తీసుకోవట్లేదు. వీటన్నింటికీ మించి బాధితులు, సాక్షులతోనూ అధికారులు ఇబ్బందులు వస్తున్నాయి. ఆవేశం నేపథ్యంలో ఫిర్యాదు సమయంలో చూపిన ఆసక్తి బాధితులు కేసు విచారణలో చూపించట్లేదు. వీలున్నంత వరకు రాజీ ధోరణి ప్రదర్శిస్తున్నారు. మరోపక్క ఆయా కేసుల్లో సాక్షులు కేసు విచారణ సమయంలో ఎదురు తిరగడం సైతం ఇబ్బందికరంగా మారుతోంది. ఇవన్నీ న్యాయస్థానాల్లో కేసులు వీగిపోవడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. వీటితో పాటు పోలీసులకు ఎప్పటికప్పుడు పునశ్ఛరణ తరగతులు నిర్వహించకపోవడం సైతం దర్యాప్తు నాణ్యతపై ప్రభావం చూపుతోంది. దర్యాప్తు విధానాల్లోనూ లోపాలు పోలీసు దర్యాప్తు విధానాల్లో ఉన్న అనేక లోపాలు కేసుల విచారణపై ప్రభావం చూపుతోంది. పాశ్చాత్య దేశాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తదితర సంస్థలు చేసే ఇన్వెస్టిగేషన్స్ పక్కాగా ఉంటాయి. ఓ నేరం జరిగినప్పుడు ప్రాథమికంగా వీరు నిందితుల కంటే ఆధారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరి దర్యాప్తు విధానం ‘ఎవిడెన్స్ టు అక్యూజ్డ్’ పం«థాలో సాగుతుంది. సీజర్, పంచ్ విట్నెస్ తదితర అంశాల్లోనూ పక్కాగా మాన్యువల్‌ను అనుసరిస్తారు. అయితే స్థానిక పోలీసుల దర్యాప్తు విధానం ‘అక్యూజ్డ్ టు ఎవిడెన్స్’ పంథాలో సాగుతుంది. తొలుత నిందితుడిని పట్టుకున్న తర్వాత నేరానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తుంటారు. దిద్దుబాటు చర్యలతో ఫలితాలు నగరంలో నేర నిరూపణకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు చక్కదిద్దే చర్యలు చేపట్టారు. దర్యాప్తు అధికారులపై కేసుల భారం తగ్గించేందుకు అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసు మేళాలు నిర్వహిస్తున్నారు. నేరం జరిగినప్పుడు ఆధారాల సేకరణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్‌తో పాటు కన్వెక్షన్లోనూ సీసీ కెమెరాల ఫీడ్‌ను ఆధారంగా వాడుకుంటున్నారు. కేసు నమోదు నుంచి దర్యాప్తు, విచారణ పూర్తయ్యే వరకు బాధితులు, సాక్షులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కోర్టు వ్యవహారాల పర్యవేక్షణకు కోర్టు మానిటరింగ్ సెల్ (సీఎంఎస్) పేరుతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్స్ సంఖ్య పెంచడం, నాణ్యమైన పరికరాలు అందిచడంతో పాటు సిబ్బందికి అనునిత్యం శిక్షణ ఇస్తున్నారు. ఈ చర్యలతో క్రమక్రమంగా శిక్షల శాతం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. -
పెరుగుతున్న గంజాయి ఖైదీలు
సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 200 మంది కోర్టు వాయిదాలకు నిందితుల తరలింపులో ఇబ్బందులు గతేడాది 8,079 కేజీలు స్వాధీనం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో గంజాయి స్మగ్లర్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వారిని కోర్టు వాయిదాలకు తరలించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒకే సారి 50,60 మందిని కోర్టుకు తరలించడం, వారిని తిరిగి జైలుకు తీసుకురావడం ఎస్కార్టు సిబ్బందికి కత్తిమీద సాములా తయారైంది. రాజమహేంద్రవరం క్రైం : గంజాయి సాగు, రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్న నిందితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వారందరినీ రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి వారిని విచారణ కోసం కోర్టుకు తీసుకువెళ్లడం, తిరిగి తీసుకురావడంలో ఎస్కార్టు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏ ఒక్కరు తప్పించుకున్నా వారి ఉద్యోగానికే ఎసరు వస్తుంది. జిల్లాకు సరిహద్దు రాష్ట్రం అయిన ఒడిశా, విశాఖ జిల్లాల నుంచి కూడా జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. హైవే ప్రాంతం ఆనుకొని జిల్లా ఉండడంతో విశాఖ జిల్లా , తూర్పు గోదావరి జిల్లాలోని తుని, జగ్గంపేట, రాజమహేంద్రవరం, అనపర్తి, రావులపాలెం తదితర ప్రాంతాల్లో గంజాయి నిల్వ చేసి రవాణా చేస్తున్నారు. గంజాయిని జిల్లా నుంచి ట్రావెల్ బస్సులు, రైలు మార్గాల ద్వారానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సరుకులు లోడ్‌తో వెళ్తున్న లారీల్లో తరలిస్తున్నారు. పుచ్చకాయలు, చిలగడ దుంపల లోడుల మధ్య గంజాయి మూటలను ఉంచి తరలిస్తున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సాగు, రవాణా కేసుల్లో అనేక మందిని అరెస్టు చేశారు. వివిధ కేసుల్లో 2 లారీలు, 6 వ్యా¯ŒSలు, ఒక జీప్, 6 కార్లు, ఒక ఆటో, 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 200 మందికి పైగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గంజాయి కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మిగిలినకేసుల్లోని వారి కంటే ఎక్కువగా ఉన్నారు. గంజాయి కేసుల్లో అరెస్టయిన నిందితులు 200 మందికి పైగానే ఉన్నారు. వీరిలో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, తూర్పు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో కొందరికి శిక్ష ఖరారు కాగా, మరి కొంత మంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. పోలీస్ రికార్డుల ప్రకారం ఐదేళ్ళుగా గంజాయి సాగు, అక్రమ రవాణా కేసులలో ఎక్కువ మంది అరెస్ట్ అయిన వారు ఉన్నారు. 2015, 16 సంవత్సరాల్లో మొత్తం 38 మంది గంజాయి కేసుల్లో జైలుకు వెళ్లారు. 8,079 కేజీల 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు తరలింపులో ఇబ్బందులు గంజాయి కేసులు ఏళ్ళ తరబడి సాగడంతో కొంత మంది ముద్దాయిలు శిక్ష పడకుండానే జైలు జీవితం అనుభవిస్తున్నారు. గంజాయి కేసులు పీడీ యాక్ట్ కిందకు వస్తాయి గనుక వారికి బెయిల్ దొరకడం కష్టం. కానీ వాయిదాల మేరకు వారిని కోర్టులకు తరలించక తప్పదు. వారికి సెక్యూరిటీ కల్పించడం, ఇంత మందిని ఒకేసారి కోర్టుకు హాజరు పరిచి తిరిగి సెంట్రల్ జైల్‌కు తరలించడం ఎస్కార్ట్ పోలీసులకు కత్తిమీద సాములా తయారైంది. -
దేవాదాయశాఖలో పదోన్నతుల దందా
సాక్షి, హైదరాబాద్: కోర్టు కేసులు పట్టవు... సీనియారిటీతో సంబంధంలేదు..కావాల్సిన వారికి పదోన్నతులు కల్పించడమే లక్ష్యం. ఇదీ దేవాదాయశాఖలో తీరు. ఈ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉన్నత పోస్టుకు పదోన్నతి కల్పించే విషయంలో కొందరు అధికారులు సాగించిన అడ్డగోలు నిర్వాకం. తప్పులతడకగా రూపొందించిన సీనియారిటీ లిస్టును ఆసరాగా చేసుకుని పదోన్నతులు ఇచ్చేశారు. దీనిపై కొందరు కోర్టులో సవాల్ చేశారు. వాస్తవజాబితా రూపొందించాల్సింది పోయి హడావుడిగా పదోన్నతులిచ్చేశారు. ఇప్పుడు మరోసారి దీన్ని సవాల్ చేస్తూ కోర్టు తలుపు తట్టేందుకు కొందరు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో 20 మంది అసిస్టెంట్ కమిషనర్లను నియమించాలని ఆ శాఖ నిర్ణయించింది. దేవాలయాల్లోని గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారులు, ఏసీ, డీసీ, ఆర్జేసీ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లు, డీసీ, ఆర్జేసీ స్థాయి దేవాలయాల్లోని సహాయ కార్యనిర్వహణాధికారులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక్కడే మ తలబు జరిగింది. తమకు అనుకూలంగా ఉన్న వారిని పైకి తీసుకొచ్చి అడ్డదిడ్డంగా వాటిని రూపొందించారు. దీంతో అర్హుల సా ్థనంలో జూనియర్లు అందలమెక్కారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా వీటినే ఖరారు చేసేశారు. అభ్యంతరాలివీ.. - దేవాలయాల్లో ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు మొత్తం ఆదాయంలో 30 శాతానికి మించరాదు. అలాంటి ఆలయాల్లోనే కొత్త నియామకాలు జరగాలి. దానికి విరుద్ధంగా జరిగిన వాటిని అక్రమంగా పరిగణించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. - 2014లో గ్రేడ్-1 ఈఓ పదోన్నతి పొందాల్సినవారు 2011లోనే ఆ పదోన్నతి వచ్చినట్టుగా జాబితాలో చూపినట్టు సమాచారం. - అసిస్టెంట్ కమిషనర్పోస్టుల దామాషాను మారుస్తూ ఈ ఏడాది జనవరిలో జీఓ5 విడుదలైంది. కానీ దాన్ని 2014 నుంచి అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్న వాదన ఉంది. - కొందరు ఉద్యోగులు 2008లో ఈఓలుగా పదోన్నతి పొందగా దానిపై కోర్టు కేసులు దాఖలు కావటంతో వారి విషయంలో 2011ను పరిగణనలోకి తీసుకోవాలి, కానీ 2008లోనే పదోన్నతినే గుర్తించి జాబితా రూపొందించారు. - దేవాలయాల్లో పాలకమండళ్ల చేత నియమితులయ్యేవారు అదే దేవాలయంలోనే పదోన్నతి పొందాలి. వారు కనీసం ఐదేళ్లపాటు పనిచేస్తేనే పదోన్నతి రావాలి. కానీ ఈలోగానే వేరే దేవాలయాలకు మా రి అక్రమంగా పదోన్నతులు పొందినవారికి ఇప్పుడు ఏసీగా ప్రమోట్ చేశారు. -
న్యాయం దక్కేదెలా?
ఏళ్లు గడిచినా అతీ గతీ లేకుండా న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండి పోవడానికి కారణమేమిటో ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌ను అభినం దించాలి. అంతకుముందు పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు అసలు మాట్లాడ లేదని కాదు గానీ... జస్టిస్ ఠాకూర్ ఆ పదవిలో కొచ్చాక కేసులు పెండింగ్‌లో పడిపోవడం గురించీ, న్యాయమూర్తుల నియామకాలలో జాప్యం గురించీ తరచు పాలకుల దృష్టికి తీసుకొస్తున్నారు. తాజాగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో జడ్జీల నియామకం అంశాన్ని ప్రస్తావించకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. అందుకు ఖేదపడ్డారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్న సభలో ఆయన సమక్షంలోనే ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. సమస్యలెదురై తమ దగ్గరకొస్తే పరిశీలించి తప్పొప్పుల్ని నిర్ధారించి న్యాయం చెప్పగల వ్యవస్థ నుంచే ఇలాంటి వ్యాఖ్యలు వినవలసి రావడం పాలకు లకే కాదు... దేశ ప్రజలందరికీ ఇబ్బందికరమే. జస్టిస్ ఠాకూర్ ఇలా బహిరంగ వ్యాఖ్యానించడం ఆక్షేపణీయమని కొందరంటే... కేంద్ర న్యాయశాఖ మంత్రి దృష్టికి లేదా ప్రధాని దృష్టికి మరోసారి సమస్యను నేరుగా తీసుకెళ్లాల్సిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. అయిదు నెలలక్రితం ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్న జాతీయ సదస్సులో కూడా జస్టిస్ ఠాకూర్ జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించారు. ఆ సందర్భంలో ఆయన కంటతడి పెట్టారు కూడా. కోర్టుల్లో న్యాయమూర్తుల కొరత, దాన్ని సరిదిద్దడంలో జరుగుతున్న జాప్యంపై దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం గత శుక్రవారం విచారణకొచ్చినప్పుడు... తాము న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించ వద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాజ్యంపై ఏడాది కాలంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేసేలా చూస్తానని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ హామీ ఇవ్వాల్సివచ్చింది. నిజానికి దీన్ని కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య సాగుతున్న పంచాయతీగా చూడలేము. దీని పర్యవసానాలను అనుభవిస్తున్నది సాధారణ పౌరులు. న్యాయస్థానాల్లో కింది నుంచి పైవరకూ భారీయెత్తున కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. వాటి సంఖ్య 3 కోట్ల వరకూ ఉంటుందని ఒక అంచనా. వీటిని తేల్చవలసిన న్యాయమూర్తుల సంఖ్య మాత్రం 7,675కు పరిమితమై ఉంది. మన దేశంలో పది లక్షలమందికి సగటున పదిమంది న్యాయ మూర్తులున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 107! అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు ఏడాదికి సగటున 81 కేసులు పరిష్కరిస్తారు. మన దేశంలో ఈ సంఖ్య 2,600. న్యాయమూర్తులపై ఇంత భారం పడటం ఎలా చూసినా అవాంఛనీయం. స్వచ్ఛంద సంస్థ దక్ష్ ఈమధ్యే విడుదల చేసిన గణాంకాలను చూస్తే... మన న్యాయస్థానాల్లో అయిదేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉన్న కేసులు 4 శాతమైతే, 5 నుంచి పదేళ్లలోపు పెండింగ్‌లో ఉన్నవి 12 శాతం, 10 ఏళ్ల పైబడి 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నవి 82 శాతం. నిజానికి తాము పూర్తి స్థాయిలో డేటా సేకరించ లేకపోయామని ఆ సంస్థ చెబుతున్నది. ఈ కేసులన్నిటా ప్రధాన కక్షిదారు కేంద్ర ప్రభుత్వమే అన్నది మరవకూడదు. కేసులు తెమల్చడంలో జరుగుతున్న విపరీత జాప్యం పర్యవసానంగా 31 శాతంమంది బెయిల్‌కు వీలైన కేసుల్లో అరెస్టయిఉన్నా జైళ్లలో మగ్గుతున్నారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న కొలీ జియం వ్యవస్థ స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)ని ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని నిరుడు అక్టోబర్‌లో కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుతో కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే ఈ విధానంలో పారదర్శకత లోపించిందని ఇదే కేసులో మెజారిటీ తీర్పుతో విభేదించిన జస్టిస్ చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఏమైతేనేం కొలీజియం వ్యవస్థే ఇప్పుడు అమల్లో ఉంది. దానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి వెలువడాల్సిన విధాన పత్రం(ఎంఓపీ) రాక పోవడం ప్రస్తుత సమస్య. ఫలితంగా కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి 75మంది పేర్లున్న జాబితా అనిశ్చితిలో పడింది. దేశంలోని 24 హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలు 478 ఉన్నాయని న్యాయ మూర్తుల నియామకాలపై సుప్రీంకోర్టులో పిల్ విచారణ కొనసాగిన రోజునే కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఆ హైకోర్టుల్లో దాదాపు 39 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కూడా చెప్పింది. సమస్యపై ఇంత స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడు పరిష్కారంలో జాప్యం మంచిది కాదు. అయితే మొత్తం సమస్యకు న్యాయమూర్తుల కొరత అన్నది ఒక పార్శ్వం మాత్రమే. అదే ఏకైక కారణమనడం కూడా సరిగాదు. కేసులకు సంబంధించిన యాజమాన్య నిర్వహణ సరిగా లేక పోవడం కూడా ఒక కారణమని దక్ష్ సంస్థ ఎత్తిచూపింది. జాతీయ స్థాయిలో ఉన్న కోర్టు మేనేజ్మెంట్ వ్యవస్థ సమకూర్చిన డేటాకూ, కోర్టు వెబ్సైట్లలో చూపుతున్న డేటాకూ పొంతన లేదని ఆ సంస్థ అంటున్నది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టాన్ని సవరించాక చెక్ బౌన్స్ కేసులు వెల్లువలా వచ్చిపడి నేర న్యాయవ్యవస్థ పని విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. న్యాయమూర్తులకూ, న్యాయ వాదులకూ మధ్య తలెత్తే వివాదాలు, ఎడతెగని వాయిదాలు, కేసుల దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం, కింది స్థాయి కోర్టుల్లో మౌలిక సదుపాయాల లేమి, నిరర్ధకమైన కేసులు వంటివి కూడా సమస్యను పెంచుతున్నాయి. పర్యవసానంగా న్యాయం లభించక సాధారణ పౌరులు విలవిల్లాడుతున్నారు. అందువల్ల సమస్య పరిష్కా రానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు న్యాయవ్యవస్థ సమష్టిగా కృషి చేసి దీనికొక ముగింపు పలకాలి. -
కలెక్షన్లు అదుర్స్
► 104 శాతం మేర ఆస్తిపన్ను వసూలు ► ఫలించిన స్పెషల్ డ్రైవ్ ఖాళీ స్థలాలు, ► మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఆస్తిపన్ను వసూళ్లు అంచనాలకు మించాయి. నూరుశాతం పన్ను వసూళ్ల కోసం కమిషనర్ జి.వీరపాండియన్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాన్నిచ్చింది. మున్నెన్నడూ లేని విధంగా ఆస్తిపన్ను 104 శాతానికి(పాతబకాయిలుతో కలిపి)చేరింది. డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌ఓ)ట్రేడ్ లెసైన్స్‌లు 96 శాతం మేర వసూలయ్యాయి. సీవరేజ్, నీటి పన్నులు కూడా అదేవరుసలో నిల్చాయి. ఖాళీస్థలాల పన్ను వసూళ్లు మాత్రం మొరాయించాయి. రూ.58.39 కోట్లకుగాను రూ.8.35 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. వీటి వసూళ్లకు ఈనెల మొదటి వారం నుంచి మరోమారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. నిరంతరం సమీక్ష కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టి లో ఉంచుకొని కమిషనర్ జి.వీరపాండియన్ నూరుశాతం పన్ను వసూ లు లక్ష్యంగా నిర్ణయించారు. రెవెన్యూ విభాగంతోపాటు ప్రజారోగ్య, ఎస్టే ట్స్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, యూసీడీ తదితర శాఖల సిబ్బందికి పన్ను వసూళ్ల బాధ్యత అప్పగించారు. అవకాశం ఉన్నప్పుడల్లా రాత్రి 9 తరువాత సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఫిబ్రవరి నాటికి 80 శాతం ఆస్తిపన్ను వసూలైంది. అదే స్పీడ్ కొనసాగించాల్సిందిగా రెవెన్యూ సిబ్బందికి సూచించారు. నూరుశాతం పన్నులు వసూలు కాకుంటే సంబంధిత ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేస్తానని, మార్చినెల జీతం నిలుపుదల చేస్తామంటూ హెచ్చరించారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేశారు. లక్ష్యాన్ని అధిగమించారు. కోర్టు కేసులు, మొండిబకాయిలు కలిపి మరో రూ.25 కోట్లు వసూలు కావాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.22 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంది. వీటిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలనే యోచనలో కమిషనర్, మేయర్ ఉన్నారు. ఫలించిన మినహాయింపు డీఅండ్‌ఓ ట్రేడ్ లెసైన్స్‌లకు సంబంధించి యూజర్ చార్జీలను మినహా యించారు. సుమారు కోటిన్నర మినహాయింపు రావడంతో వ్యాపారులు ట్రేడ్లెసైన్స్లు కట్టేందుకు ముందుకువచ్చారు. 96 శాతం మేర ఫీజులు వసూలయ్యాయి. మిగిలిన నాలుగు శాతానికి సంబంధించి శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లో ఫీజులు చెల్లించకుంటే షాపు ల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. కొరుకుడుపడని ఖాళీస్థలాలు పన్ను వసూళ్లలో దూకుడు ప్రదర్శించిన అధికారులు ఖాళీస్థలాల విషయంలో చతికిలపడ్డారు. నగరంలో 14 వేల ఖాళీస్థలాలు ఉన్నాయి. వీటి నుంచి రూ.58,39,50,480 బకాయిలు రావాల్సి ఉండగా, రూ. 8,35,92,419 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. స్థలాల యజమానులు, చిరునామాలను గుర్తించడం కష్టతరంగా మారిందన్నది ఉద్యోగుల వాదన. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో కమిషనర్ ఉన్నారు. -
ఏదీ జాబు
నేటికీ కొలిక్కిరాని డీఎస్సీ నియామకాలు కోర్టు కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం రేషనలైజేషన్‌తో పోస్టుల భర్తీకి ఎసరు గగ్గోలు పెడుతున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు ఏలూరు సిటీ : డీఎస్సీ-14 ఎంపిక ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో తెలి యక నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. కోర్టు కే సులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. జిల్లాలో 601 ఉపాధ్యాయ పోస్టుల కోసం 30వేల 17 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా, 27వేల మంది అర్హత సాధించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వీరంతా ‘జాబు ఎప్పుడిస్తారు బాబూ’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో పరీక్షలు రాయగా, జూన్‌లో ఫలితాలు వెల్లడించిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఎంపిక ప్రక్రియ ఊసెత్తడం లేదు. డీఎస్సీ పరీక్ష పత్రాల్లో తప్పులు దొర్లటం, మార్కుల కేటాయింపులో శాస్త్రీయత లోపించడంతో అభ్యర్థుల్లో కొందరు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. డీఎస్సీ-14పై సుమారు 170 కోర్టు కేసులు నమోదయ్యాయంటే.. పరీక్షలు నిర్వహించే విషయంలో సర్కారు ఎంత గొప్పగా వ్యవహరించిందనే విషయాన్ని అవగతం చేసుకోవచ్చు. ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇష్టం లేని సర్కారు కావాలనే లోపభూయిష్టంగా పరీక్షలు జరిపించిందని.. తద్వారా అభ్యర్థులు కోర్టుకు వెళ్లేలా చేసి డీఎస్సీ ఎంపిక ప్రక్రియను ప్రహసనంగా మార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. రేషనలైజేషన్‌తో భర్తీకి ఎసరు ! జిల్లాలో ప్రస్తుతం చేపట్టిన ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణతో ఖాళీ పోస్టులు లేకుండా పోయాయి. కొత్త పోస్టులు భర్తీచేసే అవకాశాలపై ప్రభుత్వం ఏవైనా నూతన నిర్ణయాలు తీసుకుంటే తప్ప డీఎస్సీ-14 ఎంపిక ప్రక్రియ చేపట్టడం సాధ్యం కాదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. జిల్లాలోని పాఠశాలల్లో క్రమబద్ధీకరణ చేసిన అనంతరం 500 టీచర్ పోస్టులు అదనంగా ఉన్నట్టు విద్యాశాఖ పేర్కొంటోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను అనుసరించి 601 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. క్రమబద్ధీకరణ అనంతరం 500 మంది మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్టు చెబుతున్న నేపథ్యంలో 601 పోస్టుల భర్తీ సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త పోస్టులు సృష్టిస్తే తప్ప డీఎస్సీ పోస్టుల భర్తీకి అవకాశం కలగదని అంటున్నారు. పిల్లల సంఖ్య ఆధారంగా ఆదర్శ పాఠశాలల ఏర్పాటు పేరిట జిల్లాలో 35 ప్రాథమిక పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. మరో 60 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలల్లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. పిల్లలు లేరనే సాకుతో పాఠశాలలను మూసివేస్తున్న సర్కారు డీఎస్సీ పోస్టులను ఎలా భర్తీ చేస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుల్లో కోత జిల్లాలో మొత్తంగా డీఎస్సీ-14 నియామకాలకు సంబంధించి 601 పోస్టులకు గాను 532 పోస్టుల్ని మాత్రమే భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ పోస్టులు 123 కాగా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 341, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 68 ఉన్నాయి. వీటి భర్తీని రోస్టర్ జాబితా మేరకు డీఈవో చేపట్టాల్సి ఉంది. 532 పోస్టులో క్లియర్ వేకెన్సీ 395 పోస్టులుండగా, 137 బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. వాటిలో 374 పోస్టులు ప్లెయిన్ ఏరియాలోను, 120 పోస్టులు ఏజెన్సీలోను ఉన్నాయి. వీటితోపాటు ఏజెన్సీ ప్రాంతంలో మరో 38 పోస్టులు ఉండగా, వాటిలో 21 క్లియర్ వేకెన్సీ, 17 పోస్టులు బ్యాక్‌లాగ్‌లో ఉన్నాయి. -
ఆన్లైన్లో కోర్టు కేసుల సమాచారం
నంద్యాలటౌన్ : కోర్టు కేసుల సమాచా రాన్ని ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని జిల్లా జడ్జి ఎంజే ప్రియదర్శిని తెలిపారు. స్థానిక కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన న్యాయ సేవా కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆన్లైన్లో ఉన్న కోర్టు సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులో జరిగే వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తామని చెప్పారు. కక్షిదారులు తమ కేసులకు సంబంధించి వాయిదా తేదీలను, తీర్పులను ఆన్లైన్లో తెలుసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అదనపు సెషన్స్ జడ్జి మంగకుమారి, ప్రిన్సిపల్ సివిల్‌జడ్జి శైలజ, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి శేషాంజనేయులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
‘వీలు’లేకుంటే ఆన్లైన్లో..
⇒ తక్కువ రేటుకే వీలునామా సేవలు ⇒ ఎన్ని సార్లయినా సవరించుకునే అవకాశం వీలునామా..! తన తదనంతరం తన ఆస్తిపాస్తుల్ని వేరొకరికి ఇవ్వటానికి వీలు కల్పించే పత్రం. వ్యక్తి మరణించాక తనకున్న ఆస్తులు, నగదు కోసం కుటుంబ సభ్యుల మధ్య నావంటే నావంటూ గొడవలు తలెత్తడం కొత్తేమీ కాదు. పలు సందర్భాల్లో కోర్టు కేసులూ మామూలే. అయితే కాస్తంత ముందు చూపుతో ఆలోచించి వీలునామా రాస్తే ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. కాకపోతే వీలునామా రాయడానికి ఒక పద్ధతి ఉంది. కేవలం తనకు నచ్చిన విధంగా వీలునామా రాసినంత మాత్రాన సరిపోదు. దీన్ని రిజిష్ట్రారు దగ్గర రిజిస్టరు కూడా చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది కోర్టులతో సహా అన్నిచోట్లా చెల్లుబాటవుతుంది. అయితే ఇపుడు కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ వీలునామాను ఆన్లైన్లో కూడా ఈజీగా రాసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తరవాత దాన్ని రిజిస్టరు చేయటం వంటి బాధ్యతలన్నీ తామే తీసుకుంటున్నాయి. మామూలుగా అయితే రిజిస్ట్రేషన్ మినహా ఈ వీలునామాకు రూ.15 వేల వరకూ అవుతుండగా... ఆన్లైన్లో రూ.4-5 వేలకే పూర్తవుతుండటం గమనార్హం. ఈ-విల్ సౌకర్యం ఏ సంస్థలు ప్రవేశపెట్టాయి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ ఈ ఆన్లైన్ వీలునామాను అందుబాటులోకి తేగా... నేషనల్ సెక్యూరిటీస్ డి పాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) ఈ-గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వార్మండ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటర్స్ (ముంబై) సంయుక్తంగా ఈ సేవలందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సంస్థ కూడా లీగల్ జినీ అనే సంస్థతో కలసి ఈ సేవలు అందిస్తోంది. ezeewill.com, willjini.com, www.hdfcsec.com/-EWi వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో వీలునామాను రూపొందించుకోవచ్చు. దీనికోసం ఈ సంస్థలు దాదాపు రూ.4 వేల ఫీజును వసూలు చేస్తున్నాయి. ఐదు దశల్లోనే పూర్తి... 1. సంబంధిత వెబ్సైట్లకు వెళ్లి మన పూర్తి వివరాలను నమోదు చే సుకున్న పక్షంలో ఒక లాగిన్ ఐడీ, పాస్వర్డ్ లభిస్తాయి. వీటి సహాయంతో వీలునామా రాసుకోవచ్చు. 2. అక్కడి నుంచే నెట్‌బ్యాంకింగ్‌కు వెళ్లి సదరు కంపెనీలు నిర్ధేశించిన ఫీజును చెల్లించాలి. 3. ఆ తర్వాత కుటుంబ, ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. 4. ఆపైన మన తదనంతరం మన ఆస్తులను, నగదును ఎవరికి ఎంత మేర బదలాయించాలో తెలుపుతూ.. సంబంధిత వ్యక్తుల పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. 5. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మనం నమోదు చేసిన వివరాలన్నీ కంపెనీ లీగల్ నిపుణుల వద్దకు చేరతాయి. వారు మనం ఇచ్చిన వివరాల ఆధారంగా వీలునామాను రాస్తారు. దాని రఫ్ కాపీని మనకు ఈ-మెయిల్ చేస్తారు. ఇందులో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైన పక్షంలో చేసి వాటిని తిరిగి కంపెనీకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సవరణలు పూర్తయిన తర్వాత ఒరిజినల్ వీలునామా డాక్యుమెంట్‌ను మన ఈ-మెయిల్‌కు కానీ, మనం ఇచ్చిన చిరునామాకు గానీ 60 రోజుల్లో పంపిస్తారు. ఒరిజినల్‌లోనూ సవరణలు.. ఒకవేళ మన చేతికొచ్చిన ఒరిజినల్ వీలునామా కాపీలో కూడా ఏమైనా సవరణలు అవసరమైన పక్షంలో చేసుకోవచ్చు. అయితే దీనికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు అవసరమైనవారికి వీలునామాను రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతను కూడా ఈ సంస్థలు తీసుకుంటున్నాయి. -
భూ వివాదాల పరిష్కారానికే క్రమబద్ధీకరణ
భూపరిపాలన విభాగం స్పెషల్ కమిషనర్ అధర్ సిన్హా సాక్షి, హైదరాబాద్ : ఎన్నోఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి, ప్రభుత్వానికి మధ్య కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ వివాదాలు పరిష్కారమయ్యేందుకు చేపట్టిన క్రమబద్ధీకరణ ప్రక్రియ దోహదపడుతుందని భూపరిపాలన విభాగం స్పెషల్ కమిషనర్ అధర్ సిన్హా అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ప్రభుత్వం పథకాల ద్వారా ఎక్కువమంది ప్రజలకు మేలు చేకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ కార్యాలయంలో స్పెషల్ కమిషనర్‌గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి అధర్ సిన్హా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. -
నేడు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల విలీనం
సాక్షి, హైదరాబాద్: వివాదాలు, కోర్టు కేసులు, ఆధిపత్య పోరు మూలంగా పదేళ్ల క్రితం విడిపోయిన ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలను మళ్లీ ఏకం చేసి కొత్త సంఘా న్ని ఏర్పాటు చేస్తున్నామని రెండు గ్రూపుల నేతలు టి.వై.ఎస్. శర్మ, టి.సాయిబాబ, షౌకత్ అలీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంఘాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘాన్ని(టీఎస్పీటీఏ) ఏర్పాటు చేస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ని ఎస్సీఈఆర్టీలో సమావేశమై సంఘాల విలీనంతో పాటు టీఎస్పీటీఏ కొత్తకార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.