దేవాదాయశాఖలో పదోన్నతుల దందా | illegal hike of igher salaries in Endowments Department | Sakshi
Sakshi News home page

దేవాదాయశాఖలో పదోన్నతుల దందా

Published Fri, Sep 30 2016 12:35 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

illegal hike of igher salaries in Endowments Department

సాక్షి, హైదరాబాద్: కోర్టు కేసులు పట్టవు... సీనియారిటీతో సంబంధంలేదు..కావాల్సిన వారికి పదోన్నతులు కల్పించడమే లక్ష్యం. ఇదీ దేవాదాయశాఖలో తీరు. ఈ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి ఉన్నత పోస్టుకు పదోన్నతి కల్పించే విషయంలో కొందరు అధికారులు సాగించిన అడ్డగోలు నిర్వాకం. తప్పులతడకగా రూపొందించిన సీనియారిటీ లిస్టును ఆసరాగా చేసుకుని పదోన్నతులు ఇచ్చేశారు. దీనిపై కొందరు కోర్టులో సవాల్ చేశారు.

వాస్తవజాబితా రూపొందించాల్సింది పోయి హడావుడిగా పదోన్నతులిచ్చేశారు. ఇప్పుడు మరోసారి దీన్ని సవాల్ చేస్తూ కోర్టు తలుపు తట్టేందుకు కొందరు అధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు  ఖాళీగా ఉండటంతో  20 మంది అసిస్టెంట్ కమిషనర్‌లను నియమించాలని ఆ శాఖ నిర్ణయించింది.
 
 దేవాలయాల్లోని గ్రేడ్-1 కార్యనిర్వహణాధికారులు, ఏసీ, డీసీ, ఆర్‌జేసీ కార్యాలయాల్లో సూపరింటెండెంట్లు, డీసీ, ఆర్‌జేసీ స్థాయి దేవాలయాల్లోని సహాయ కార్యనిర్వహణాధికారులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇక్కడే మ తలబు జరిగింది. తమకు అనుకూలంగా ఉన్న వారిని పైకి తీసుకొచ్చి అడ్డదిడ్డంగా వాటిని రూపొందించారు. దీంతో అర్హుల సా ్థనంలో జూనియర్లు అందలమెక్కారు. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా వీటినే ఖరారు చేసేశారు.

 అభ్యంతరాలివీ..
 -    దేవాలయాల్లో ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు మొత్తం ఆదాయంలో 30 శాతానికి మించరాదు. అలాంటి ఆలయాల్లోనే కొత్త నియామకాలు జరగాలి. దానికి విరుద్ధంగా జరిగిన వాటిని అక్రమంగా పరిగణించాల్సి ఉన్నా పట్టించుకోలేదు.
 -    2014లో గ్రేడ్-1 ఈఓ పదోన్నతి పొందాల్సినవారు  2011లోనే ఆ పదోన్నతి వచ్చినట్టుగా జాబితాలో చూపినట్టు సమాచారం.
 -    అసిస్టెంట్ కమిషనర్‌పోస్టుల దామాషాను మారుస్తూ ఈ ఏడాది జనవరిలో జీఓ5 విడుదలైంది. కానీ దాన్ని 2014 నుంచి అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్న వాదన ఉంది.
 -    కొందరు ఉద్యోగులు 2008లో ఈఓలుగా పదోన్నతి పొందగా దానిపై కోర్టు కేసులు దాఖలు కావటంతో వారి విషయంలో 2011ను పరిగణనలోకి తీసుకోవాలి, కానీ 2008లోనే పదోన్నతినే గుర్తించి జాబితా రూపొందించారు.
 -    దేవాలయాల్లో పాలకమండళ్ల చేత నియమితులయ్యేవారు అదే దేవాలయంలోనే పదోన్నతి పొందాలి. వారు కనీసం  ఐదేళ్లపాటు పనిచేస్తేనే పదోన్నతి రావాలి.  కానీ ఈలోగానే వేరే దేవాలయాలకు మా రి అక్రమంగా పదోన్నతులు పొందినవారికి ఇప్పుడు ఏసీగా ప్రమోట్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement