సాక్షి, అమరావతి: ప్రజలు చెల్లిస్తున్న డబ్బులను జీతాల రూపంలో తీసుకుంటున్న అధికారులు విధి నిర్వహణలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల్లో దాఖలైన కేసుల విషయంలో అత్యంత శ్రద్ధ, బాధ్యతతో విధులు నిర్వర్తించాలని హితవు పలికింది. కోర్టు కేసుల విషయంలో యాంత్రికంగా వ్యవహరించవద్దని తేల్చి చెప్పింది. ఒక కేసు దాఖలు విషయంలో 1,016 రోజులు (2.7 సంవత్సరాలు) ఆలస్యం చేసినందుకు ఓ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా ఆలస్యంగా పిటిషన్లు దాఖలు చేయడం కోర్టు సమయాన్ని వృథా చేయడమే అవుతుందని హెచ్చరించింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని గుర్తు చేస్తూ అప్పీల్ దాఖలులో ఇంత ఆలస్యం చేసినందుకు మంగళగిరి తహసీల్దార్‌కు రూ.25 వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు జమ చేయాలని ఆదేశించింది.
అప్పీల్ దాఖలులో తీవ్ర ఆలస్యానికి కారణమైన అధికారుల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలస్యాన్ని మాఫీ చేయాలంటూ తహసీల్దార్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ తహసీల్దార్ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని కూడా కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు రిజిస్ట్రీ (జ్యుడీషియల్ విభాగం) అధికారులను సైతం హైకోర్టు మందలించింది. అప్పీల్ దాఖలులో 669 రోజుల ఆలస్యం జరిగిందని తహసీల్దార్ పిటిషన్‌లో పేర్కొన్నారని, వాస్తవానికి 1,016 రోజుల ఆలస్యం జరిగినా ఆ విషయాన్ని రిజిస్ట్రీ పరిశీలించలేదని హైకోర్టు తప్పుబట్టింది. కేసులను స్క్రూటినీ చేసి ప్రాసెస్ చేసే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా జ్యుడీషియల్ విభాగం అధికారులకు తగిన సూచనలు చేయాలని రిజిస్ట్రార్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం తీర్పు వెలువరించారు. (రాజధానిని మార్చే అధికారం ఎందుకుండదు?)
ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది...
ఈ తీర్పును సవాల్ చేస్తూ మంగళగిరి తహసీల్దార్ 2018 సెప్టెంబర్‌లో హైకోర్టులో సెకండ్ అప్పీల్ దాఖలు చేశారు. అప్పీల్ దాఖలులో 669 రోజుల ఆలస్యం ఉందని, దీన్ని మాఫీ చేయాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ స్కీంలో అధికారులంతా తీరిక లేకుండా ఉన్నందువల్ల అప్పీల్ దాఖలులో జాప్యం జరిగిందన్నారు. తహసీల్దార్ అనుబంధ పిటిషన్‌ను పద్మశాలి సంఘం వ్యతిరేకించింది. అప్పీల్ దాఖలులో 1,016 రోజులు ఆలస్యం జరిగినట్లు కోర్టు దృష్టికి తెచ్చింది. ఇంత ఆలస్యంగా అప్పీల్ దాఖలు చేశారంటే ఈ కేసు విషయంలో అధికారులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పులో పేర్కొన్నారు. నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోందని, అప్పీల్ దాఖలుకు చట్టం నిర్దేశించిన గడువు ప్రభుత్వంతో సహా అందరికీ వర్తిస్తుందని తేల్చి చెప్పారు. తహసీల్దార్ పిటిషన్‌ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటిస్తూ విధి నిర్వహణలో అలసత్యం ప్రదర్శించినందుకు జరిమానా విధించారు. (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సీఎం జగన్ అభినందన)
ఇదీ వివాదం...
మంగళగిరిలో దామర్ల నాంచారమ్మ విరాళంగా ఇచ్చిన ఏడు ఎకరాల భూమిని పద్మశాలి సంఘం చెరువుగా మార్చింది. నాంచారమ్మ చెరువులో 3 ఎకరాలు ఆక్రమణకు గురి కాగా మిగిలిన నాలుగు ఎకరాల రక్షణకు సంఘం ఏర్పాట్లు చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వటంపై మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం 2012లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేసింది. దీనిపై తమకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో పద్మశాలి సంఘం 2014లో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీల్ సూట్ దాఖలు చేసింది. విచారణ అనంతరం పద్మశాలి సంఘానికి అనుకూలంగా 2015 ఆగస్టులో తీర్పు వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment