రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి సుప్రీంకోర్టు గత నెలలో అనుమతించింది. న్యాయ, సామాజిక వ్యవస్థల్లో సమూల మార్పు జరిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభినందించాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలూ లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. న్యాయ ప్రక్రియలోని పారదర్శకత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది.
రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రక్రియను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 27న ప్రారంభించింది. అయితే ముఖ్యమైన విచారణలను లైవ్ టెలికాస్ట్‌కి అనుమతిస్తూ సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 27నే నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కీలకమైన కేసుల విచారణను పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా ప్రసారం చేయాలని తీసుకున్న నిర్ణయానికి అదే నాంది అయింది. అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్‌విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ కోర్టుల్లో జరిగే విచారణలను ప్రజాప్రయోజనం రీత్యా ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చని నిర్ణయం తీసుకున్నారు. వారు సూచించినట్లుగానే ప్రత్యక్ష ప్రసారాలు ప్రజల్లో రాజ్యాంగ విలువ లను, ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని బలోపేతం చేయడంలో న్యాయపరమైన కృషికి జీవం పోస్తాయి. ఆనాడు వారు ప్రదర్శించిన ఆ దార్శనికతకు తదనంతర ప్రధాన న్యాయమూర్తులు ఎన్వీ రమణ, యుయు లలిత్‌ల పూర్తి మద్దతు లభించింది.
నాలుగేళ్ల అనంతరం రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కీలకమైన విచారణలను ప్రత్యక్ష ప్రసారాలు చేయాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని సుప్రీకోర్టు విస్తృత ధర్మాసనం ఈ సెప్టెంబర్ 20న ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఈ–కమిటీ చైర్‌పర్సన్, ప్రత్యక్ష ప్రసారాలు మొదలెట్టడానికి వెనుక చోదక శక్తిగా ఉన్న జస్టిస్ చంద్రచూడ్, ఆ రోజు తన కోర్టులో విచా రణను మొదలు పెడుతూ ‘మేం ఇప్పుడు వర్చువల్’ అని ప్రకటిం చారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత సర్వోన్నత న్యాయస్థానం మనసా వాచా ఒక గొప్ప పనికి పూనుకుంది. ‘ఇంతకు ముందు ఎన్నడూ చేయలేని పనిని మనం చేయలేకపోతే మనం ఏదీ సాధిం చలేం. తక్కిన ప్రపంచం ముందుకెళుతుంటే న్యాయం మాత్రం యథా తథంగా స్తంభించిపోయి ఉంటుంది. ఇది ప్రపంచానికీ, న్యాయానికీ కూడా మంచిది కాదు’ అని దశాబ్దాల క్రితమే సుప్రసిద్ధ బ్రిటన్ న్యాయమూర్తి లార్డ్ డెన్నింగ్ చెప్పిన గొప్పమాటలను భారత సుప్రీంకోర్టు స్ఫూర్తిగా తీసుకుని ఆచరణను ప్రారంభించింది.
రాజ్యాంగ ధర్మాసనం చేపట్టే కేసుల విచారణను భారత ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి అనుమతించడం ద్వారా... కీలక మలుపు తిప్పగలిగే గొప్ప ప్రజాస్వామిక నిర్ణయాన్ని తీసుకున్నందుకు గత, ప్రస్తుత చీఫ్ జస్టిస్‌లను, సుప్రీంకోర్టు జడ్జీలను అభినందించాల్సి ఉంటుంది. దానికి వారు అర్హులు కూడా అని చెప్పాలి. ఇది భారత న్యాయ, రాజ్యాంగపరమైన చరిత్రలో అత్యంత ముఖ్యమైన, ప్రభావ శీలమైన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. దీనికి కింది కారణా లను మనం చూపించవచ్చు.
ఒకటి: దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరును ఎలాంటి అవరోధాలు లేకుండా దేశ సగటు పౌరులు చూసే వీలు కల్పించడం వల్ల మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలపడుతుంది. అలాగే న్యాయవ్యవస్థ పనితీరు గురించి విమర్శనాత్మకమైన చర్చను ఇది పెంచి పోషిస్తుంది. ప్రజలకు అందుతున్న న్యాయ ప్రక్రియలోని పారదర్శకత, సౌలభ్యత దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలను పౌరులకు అందు బాటులోకి తేవడం అనేది సమాచారాన్ని ఎల్లెడలా నింపుకున్న పౌరు లను అభివృద్ధి చేయడంలో అతి ముఖ్యమైన దశగా చెప్పాలి.
రెండు: ఈ నిర్ణయం చట్టపాలన ప్రాధాన్యతను ప్రజలు అర్థం చేసుకునేలా చేస్తుంది. దరిద్ర నారాయణుల, చారిత్రకంగా వెనుక బడిపోయిన, సాధికారతకు దూరమైపోయిన వర్గాల హక్కులను న్యాయవ్యవస్థ గట్టిగా పరిరక్షిస్తుందని ప్రజలు విశ్వసించడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుంది. సత్యాన్ని శక్తిమంతంగా మాట్లాడడం కంటే మించిన ఉత్తమ మార్గం మరొకటి లేదు. దీని ప్రత్యక్ష ప్రభావం వెంటనే బయటపడక పోవచ్చు కానీ చట్టబద్ధపాలనను గౌరవించే సంస్కృతిని నిర్మించే శక్తి ఈ నిర్ణయానికి ఉందని చెప్పితీరాలి.
మూడు: న్యాయ నిర్ణయ విధానంలో పారదర్శకతను ఇది ప్రోత్సహిస్తుంది. న్యాయమూర్తులు తీసుకునే నిర్ణయాలను సాధారణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవడం అరుదుగానే జరుగుతుంటుంది. చట్టం, న్యాయం అనేవి న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ మాత్రమే వదిలివేయాల్సిన ముఖ్యమైన విషయాలుగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు కోర్టు విచారణలను ప్రత్యక్షంగా చూడడం వల్ల లక్షలాది సామాన్య భారతీయులు తాము శిక్షణ పొందిన న్యాయ వాదులు కాకున్నప్పటికీ, న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయాలలోని నేపథ్యాన్నీ, సందర్భాన్నీ అర్థం చేసుకోవడమే కాదు... న్యాయనిర్ణయ క్రమంలో తటస్థించే... పోటీ పడే విలువలు, ఘర్షించే హక్కులను కూడా వారు ప్రశంసించగలుగుతారు. కోర్టు విచారణల ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ద్వారా సుప్రీంకోర్టు బలీయమైన విశ్వాసాన్ని పాదుకొల్పింది.
నాలుగు: ఈ నిర్ణయం న్యాయవాద వృత్తి నాణ్యతను, ప్రమా ణాలను పెంచగలుగుతుంది. లాయర్లు కోర్టుముందు కనిపించడానికి చక్కగా సిద్ధమవుతారు. బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేయ కూడదనే వివేచనతో ఉంటారు. ఇప్పుడు తమ వాదనలను ప్రజలు నేరుగా చూడటం పట్ల లాయర్లలో సానుకూల వైఖరి పెరుగుతుంది. న్యాయాన్ని అందించే యంత్రాంగాలను న్యాయవాదులు గతంలో కంటే మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. యువ న్యాయవాదుల సన్నద్ధత, మేధో కుశలత కూడా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది కాబట్టి వారి న్యాయవాద వృత్తికి అది ఉన్నత స్థాయిని కట్టబెడుతుంది.
భారతదేశంలో న్యాయవాద విద్యలో నెలకొన్న సంక్షోభాన్ని న్యాయవాద కళాశాలల్లో నాణ్యమైన బోధనను, పరిశోధనను పెంచడం ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చు. న్యాయవాద వృత్తిలోని వ్యాజ్యాలకు సంబంధించిన అంశంలో ప్రవేశించడానికి చాలామంది న్యాయవాద పట్టభద్రులు ఆసక్తి చూపని ధోరణి చాలా సంవత్స రాలుగా కలవరపెడుతోంది. కార్పొరేట్ లావాదేవీల ప్రపంచానికి వ్యతిరేకంగా... కఠిన షరతులు, ఉదాసీనత కారణంగా మన యువ న్యాయవాదులు లావాదేవీల బార్‌లో చేరడానికి సంసిద్ధత తెలుపడం లేదు. లాయర్ల వాస్తవ వాదనలను తిలకించడం, న్యాయమూర్తులు సంధించే ప్రశ్నలకు సమాధానాలు వెతకడం వంటి విచారణలను తిలకించడం వల్ల, సాపేక్షంగా నిర్లక్ష్యానికి గురైన ఈ క్షేత్రంలోకి న్యాయవాద విద్యార్థులు వచ్చేలా ప్రభావితం చేయవచ్చు. జ్యుడీషి యరీ, న్యాయవాద వృత్తి పనితీరుకు సంబంధించిన నూతన స్కాలర్ షిప్, పరిశోధనా రంగాలపై పనిచేసేలా లా ఫ్యాకల్టీ సభ్యులు, న్యాయ పరిశోధకులు ప్రేరణ పొందవచ్చు.
టెక్నాలజీ అనేది సంఘీభావాన్ని బలోపేతం చేసి, దూరానికి సంబంధించిన అవరోధాలను అధిగమించడంలో గొప్ప ఉపకరణంగా ఉంటుంది. కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఈ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని ఆశిద్దాము. పైగా చట్టబద్ధమైన న్యాయాన్ని ప్రజల వద్దకు, వారి రోజువారీ చర్చల వరకు తీసుకెళ్లడంలో కూడా ఇది తోడ్పడుతుందని ఆశిద్దాము. అమెరికా సుప్రీంకోర్టు విశిష్ట న్యాయమూర్తి జస్టిస్ అలివర్ వెండెల్ హోమ్స్ గతంలో ఒక అద్భుత వ్యాఖ్య చేశారు. ‘ప్రపంచంలో అతిగొప్ప విషయం ఏమిటంటే, మనం ఎక్కడ నిలిచామన్నది కాదు; మనం ఏ దిశగా వెళుతున్నామన్నదే ప్రధానమైనది.’ మనం నిజంగానే సరైన దిశలో పయనిస్తున్నామని భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇప్పుడు హామీ ఇచ్చారు.
సి. రాజ్ కుమార్
వ్యాసకర్త వ్యవస్థాపక వైస్ చాన్స్‌లర్,
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ
(‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment