కలెక్షన్లు అదుర్స్
► 104 శాతం మేర ఆస్తిపన్ను వసూలు
► ఫలించిన స్పెషల్ డ్రైవ్ ఖాళీ స్థలాలు,
► మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఆస్తిపన్ను వసూళ్లు అంచనాలకు మించాయి. నూరుశాతం పన్ను వసూళ్ల కోసం కమిషనర్ జి.వీరపాండియన్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాన్నిచ్చింది. మున్నెన్నడూ లేని విధంగా ఆస్తిపన్ను 104 శాతానికి(పాతబకాయిలుతో కలిపి)చేరింది. డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌ఓ)ట్రేడ్ లెసైన్స్‌లు 96 శాతం మేర వసూలయ్యాయి. సీవరేజ్, నీటి పన్నులు కూడా అదేవరుసలో నిల్చాయి. ఖాళీస్థలాల పన్ను వసూళ్లు మాత్రం మొరాయించాయి. రూ.58.39 కోట్లకుగాను రూ.8.35 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. వీటి వసూళ్లకు ఈనెల మొదటి వారం నుంచి మరోమారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నారు.
నిరంతరం సమీక్ష
కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టి లో ఉంచుకొని కమిషనర్ జి.వీరపాండియన్ నూరుశాతం పన్ను వసూ లు లక్ష్యంగా నిర్ణయించారు. రెవెన్యూ విభాగంతోపాటు ప్రజారోగ్య, ఎస్టే ట్స్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, యూసీడీ తదితర శాఖల సిబ్బందికి పన్ను వసూళ్ల బాధ్యత అప్పగించారు. అవకాశం ఉన్నప్పుడల్లా రాత్రి 9 తరువాత సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఫిబ్రవరి నాటికి 80 శాతం ఆస్తిపన్ను వసూలైంది. అదే స్పీడ్ కొనసాగించాల్సిందిగా రెవెన్యూ సిబ్బందికి సూచించారు.
నూరుశాతం పన్నులు వసూలు కాకుంటే సంబంధిత ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేస్తానని, మార్చినెల జీతం నిలుపుదల చేస్తామంటూ హెచ్చరించారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేశారు. లక్ష్యాన్ని అధిగమించారు. కోర్టు కేసులు, మొండిబకాయిలు కలిపి మరో రూ.25 కోట్లు వసూలు కావాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.22 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంది. వీటిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలనే యోచనలో కమిషనర్, మేయర్ ఉన్నారు.
ఫలించిన మినహాయింపు
డీఅండ్‌ఓ ట్రేడ్ లెసైన్స్‌లకు సంబంధించి యూజర్ చార్జీలను మినహా యించారు. సుమారు కోటిన్నర మినహాయింపు రావడంతో వ్యాపారులు ట్రేడ్‌లెసైన్స్‌లు కట్టేందుకు ముందుకువచ్చారు. 96 శాతం మేర ఫీజులు వసూలయ్యాయి. మిగిలిన నాలుగు శాతానికి సంబంధించి శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లో ఫీజులు చెల్లించకుంటే షాపు ల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.
కొరుకుడుపడని ఖాళీస్థలాలు
పన్ను వసూళ్లలో దూకుడు ప్రదర్శించిన అధికారులు ఖాళీస్థలాల విషయంలో చతికిలపడ్డారు. నగరంలో 14 వేల ఖాళీస్థలాలు ఉన్నాయి. వీటి నుంచి రూ.58,39,50,480 బకాయిలు రావాల్సి ఉండగా, రూ. 8,35,92,419 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. స్థలాల యజమానులు, చిరునామాలను గుర్తించడం కష్టతరంగా మారిందన్నది ఉద్యోగుల వాదన. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో కమిషనర్ ఉన్నారు.