Trade License
-
బాణాసంచా దుకాణాలకు తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఫీజు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండగను పురస్కరించుకొని బాణాసంచా (పటాకుల) దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తీసు కోవాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. లైసెన్స్ లేకుండా దుకాణాల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వబోమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. రిటైల్ అమ్మకాల కోసం దుకాణాలు ఏర్పాటు చేసేవారు రూ.11 వేలు, హోల్‌సేల్ విక్రయాలకు రూ. 66వేలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఇలా.. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ పొంది నిబంధనలకనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్ణీత ట్రేడ్ లైసెన్స్ ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్/ జీహెచ్ఎంసీ వెబ్సైట్ (www.ghmc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చన్నారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతులు ఇవ్వాలని కోరారు. బాణాసంచా షాపులను ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదని తెలిపారు. తగిన ఫైర్ సేఫ్టీ ఉండాలి.. కాలనీలు, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్లో/ పెద్దహాల్లో తగిన ఫైర్‌సేఫ్టీతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి వీలుగా అగ్నిమాపక నిరోధక పరికరాలు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద, చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దుకాణాలకు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చకూడదని, షాపులో ఏర్పాటు చేసే లైట్లు ఇతరత్రా కరెంటు పరికరాలకు నాణ్యమైన విద్యుత్ వైర్‌ను వినియోగించాలని సూచించారు. బాణాసంచా స్టాల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే స్టాల్ హోల్డర్దే బాధ్యతని, చట్టపరమైన చర్యలకు బాధ్యుడని తెలిపారు. ఈ విషయాన్ని తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్లో పొందుపరచనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు.చదవండి: స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాలి.. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఫైర్ క్రాకర్స్ అయిన సిరీస్ క్రాకర్స్/లడీస్ తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం ఉందని, వాటి అమ్మకాలకు అనుమతించరని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ 1955/న్యాయస్థానాలు/పీసీబీ/ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. బాణాసంచా విక్రయ స్టాళ్లను సంబంధిత డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్‌తో పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారుల బృందం కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. -
ట్రేడ్ లైసెన్సు లేకుంటే భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: ట్రేడ్ లైసెన్స్ లేని వ్యాపారాలపై సర్కారు కొరడా ఝళిపించనుంది. మున్సిపల్ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్సు తీసుకోకుండా వ్యాపారాలు చేసేవారిపై, గడువు తీరిన లైసెన్సులతో వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించేవారిపై భారీ జరిమానాలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రేడ్‌లైసెన్సు తీసుకోకపోతే వ్యాపారం ప్రారంభమైన నాటి నుంచి తొలి మూడు నెలల వరకు 25 శాతం, ఆ తర్వాత నుంచి లైసెన్సు తీసుకునే వరకు 50 శాతం లైసెన్సు ఫీజును జరిమానాగా విధించాలని అధికారులను ఆదేశించింది. గడువు తీరిన ట్రేడ్‌లైసెన్సుతో వ్యాపారాలు నిర్వహించేవారికి సంబంధిత ఏడాది జూన్ వరకు 25 శాతం, జూలై 1 నుంచి ట్రేడ్‌లైసెన్సు పునరుద్ధరించుకునే నాటి వరకు 50 శాతం లైసెన్సు ఫీజును జరిమానాగా విధించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ మున్సిపాలిటీల ట్రేడ్ లైసెన్సు నిబంధనలు–2020ను ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ విడుదల చేశారు. వ్యాపారాలను బట్టి లైసెన్సులు వ్యాపారాల స్వభావాన్ని బట్టి డేంజరస్ అండ్ అఫెన్సివ్(ప్రమాదకర, ఉపద్రవ), సాధారణ వ్యాపారాలు/దుకాణాలు/కార్యాలయాలు, పారిశ్రామిక సముదాయాలు, తాత్కాలిక వ్యాపారాలు అనే నాలుగు కేటగిరీలుగా విభజించి ట్రేడ్ లైసెన్సులు జారీ చేయనున్నారు. ట్రేడ్ లైసెన్సు లేకుండా మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి వ్యాపారాలు నిర్వహిం చడానికి వీలులేదని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యాపారాలు/పరిశ్రమల నిర్వహణకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులతోపాటు లైసెన్సు ఫీజు చెల్లించిన తర్వాతే లైసెన్సులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. ప్రాంతం ప్రాధాన్యత, విస్తీర్ణం ఆధారంగా లైసెన్సుల జారీకి ప్రభుత్వం రేట్లను నిర్ణయించింది. ప్రమాదకర వ్యాపారాలతోపాటు సాధారణ వ్యాపారాలు/దుకాణాలు/కార్యాలయాలకు సింగిల్ లైన్ రోడ్డు ఉంటే ప్రతి చదరపు అడుగుకు కనీసం రూ.3, డబుల్‌లైన్ ప్రాంతంలో కనీసం రూ.4, మల్టీలైన్ రోడ్డు ఉంటే కనీసం రూ.5 చొప్పున మొత్తం ప్రాంతం విస్తీర్ణానికి లెక్కించి లైసెన్సుఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నక్షత్రాల హోటళ్లు, కార్పొరేట్ ఆస్పత్రులు చదరపు అడుగుకు కనీసం రూ.6 చొప్పున ఫీజులు చెల్లించాల్సి ఉండనుంది. పరిశ్రమల స్థాయిని బట్టి కనీసం రూ.4 నుంచి రూ.7 వరకు ప్రతి చదరపు అడుగు స్థలానికి చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సిళ్లు నిర్ణయించాలి.. ఇక తాత్కాలిక వ్యాపారాల కోసం వసూలు చేసే లైసెన్సు ఫీజులను స్థానిక మున్సిపల్ కౌన్సిళ్లు నిర్ణయించాలని ప్రభుత్వం పేర్కొంది. ప్రతి మూడేళ్లకోసారి మున్సిపల్ కౌన్సిళ్లు ట్రేడ్‌లైసెన్సు ఫీజులను పెంచాలని, ఒకవేళ మున్సిపల్ కౌన్సిళ్లు పెంచకపోతే జిల్లా కలెక్టర్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. -
కార్వీకి మరో షాక్..!
ముంబై/హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీకి ఒకదాని తర్వాత మరొకటిగా షాకులు తగులుతున్నాయి. తాజాగా అన్ని విభాగాల్లో ట్రేడింగ్ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సోమవారం ప్రకటించాయి. ఎక్సే్ఛంజీల నిబంధనలను ఉల్లంఘించడమే ఇందుకు కారణమని వెల్లడించాయి. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని వేర్వేరుగా విడుదల చేసిన సర్క్యులర్లలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వివరించాయి. ఈక్విటీ, డెట్ విభాగాల్లో కార్వీ ట్రేడింగ్ టెర్మినల్స్‌ను డీయాక్టివేట్ చేసినట్లు బీఎస్ఈ తెలిపింది. ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమోడిటీ సెగ్మెంట్స్‌లో నిర్దిష్ట ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. అటు ఎన్ఎస్ఈ కూడా ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ డెరివేటివ్స్, డెట్, కమోడిటీ డెరివేటివ్స్ వంటి అన్ని విభాగాల్లోనూ కార్వీపై నిషేధం విధించింది. అయితే, బ్రోకింగ్ లైసెన్సును సస్పెండ్ చేయడంపై సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించనున్నట్లు కార్వీ వర్గాలు తెలిపాయి. ఇది సత్వరమే పరిష్కారం కాగలదని పేర్కొన్నాయి. దాదాపు రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రూ. 600 కోట్ల దాకా రుణాలు తీసుకుందని, క్లయింట్ల నిధులను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా, పాత క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలను (పీవోఏ) ఉపయోగించుకోకుండా కార్వీపై నవంబర్ 22న మా ర్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. వెసులుబాటుకు సెబీ నిరాకరణ.. క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీలు (పీవోఏ) ఉపయోగించుకుని వారి ట్రేడ్స్‌ను సెటిల్ చేయడానికి వెసులుబాటు ఇవ్వాలన్న కార్వీ అభ్యర్థనను సెబీ తోసిపుచ్చింది. పీవోఏలను దుర్వినియోగం చేసి, క్లయింట్ల షేర్లను కంపెనీ అక్రమంగా దారి మళ్లించిందని ఆక్షేపించింది. ప్రాథమిక ఆధారాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో క్లయింట్ల పీవోఏలను కార్వీ ఉపయోగించడానికి అనుమతించడం వివేకవంతమైన నిర్ణయం కాబోదని సెబీ స్పష్టం చేసింది. కార్వీ ద్వారా షేర్లను విక్రయించాలనుకుంటున్న క్లయింట్లు.. ఇందుకోసం ఎలక్ట్రానిక్ లేదా ఫిజికల్ డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్)ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించింది. విక్రయించిన షేర్లను డీమ్యాట్ అకౌంట్ నుంచి డెబిట్ చేసేలా బ్రోకింగ్ సంస్థకు క్లయింట్లు సూచనలివ్వడానికి డీఐఎస్ ఉపయోగపడుతుంది. కార్వీపై ఎన్ఎస్ఈ చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్ ఇంకా కొనసాగుతోందని, క్లయింట్ల షేర్లు.. నిధుల దుర్వినియోగం ఎంత మేర జరిగిందన్నది త్వరలోనే వెల్లడవుతుందని సెబీ వ్యాఖ్యానించింది. పీవోఏను ఉపయోగించుకోవడంపై స్పష్టతనివ్వాలన్న కార్వీ అభ్యర్థ్ధనపై డిసెంబర్ 2లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సెబీకి శాట్ సూచించిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి షేర్లు.. కార్వీ అక్రమంగా తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్న షేర్లలో సుమారు 90 శాతం సెక్యూరిటీలు.. తిరిగి క్లయింట్ల ఖాతాల్లోకి చేరాయి. సెబీ తీసుకున్న సత్వర చర్యలతో సుమారు 83,000 మంది ఇన్వెస్టర్లకు తమ షేర్లు తిరిగి వచ్చాయని నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) వెల్లడించింది. ‘సెబీ ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఈ పర్యవేక్షణలో కార్వీ స్టాక్ బ్రోకింగ్ డీమ్యాట్ ఖాతా నుంచి సుమారు 82,599 మంది క్లయింట్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లను బదలాయించడం జరిగింది‘ అని పేర్కొంది. బాకీలు సెటిల్ చేసిన తర్వాత మిగతా వారి ఖాతాల్లోకి కూడా షేర్ల బదలాయింపు పూర్తవుతుందని ఎన్ఎస్డీఎల్ వివరించింది. -
30 లోపు ఆస్తిపన్ను చెల్లించకుంటే జరిమానా
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ఆస్తి పన్ను బకాయిదారులు డిసెంబర్ 31లోపు చెల్లించాలని, లేకుంటే జనవరి 1వ తేదీ నుంచి జరిమానాలు విధాస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ డా. బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈపాటికే ఆస్తి పన్నును చెల్లించాలని వ్యక్తిగతంగా ఎస్సెమ్మెస్‌లను పంపామన్నారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పన్ను, ట్రేడ్ లైసెన్స్‌ల వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు వసూలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్తి, ట్రేడ్ లైసెన్స్ పన్నులను వసూలు చేయడంలో వెనుకబడ్డ సర్కిళ్లకు తాఖీదులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్ కింద రూ.50 కోట్లు సేకరించాలని నిర్ణయించగా ఇప్పటికి రూ.72 కోట్లు వచ్చాయన్నారు. ఆస్తి పన్ను సేకరణలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.1206 కోట్లు వసూలు కాగా ప్రస్తుత 2017–18కి రూ.1,400 కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్థారించామన్నారు. -
బజ్జీ బండ్లు.. బంగారు బాతుగుడ్లు
► ట్రేడ్ లైసెన్స్‌లకు నోచుకోని చిరు వ్యాపారులు ► లైసెన్స్‌లు ఇవ్వకుండా ఉద్యోగుల నెలవారీ మామూళ్లు ► ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వైనం సాక్షి, అమరావతి: ట్రేడ్ లైసెన్సులపై చిరు వ్యాపారులకు అవగాహన లేకపోవడం మున్సిపాలిటీ ఉద్యోగులకు వరంగా మారింది. వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు ఇవ్వకుండా మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా మున్సిపాలిటీల పరిధిలో ఉండే చిన్న వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్సుకు అయ్యే సొమ్ము కంటే భారీగా మామూళ్ల కింద ఇవ్వాల్సి వస్తోంది. వ్యాపారులకు అవగాహన కల్పించి 24 గంటల్లోగా లైసెన్సు మంజూరు చేయాల్సి ఉద్యోగులే.. మామూళ్లకు అలవాటుపడి రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారు. 16 లక్షలకు పైగా షాపులుంటే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు పక్కన బజ్జీ కొట్ల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ సుమారు 16 లక్షల వరకూ వ్యాపార కేంద్రాలు ఉన్నాయని, వారిలో 6 లక్షలకు మాత్రమే ట్రేడ్ లైసెన్సులు ఉన్నట్టు మున్సిపల్ అధికార వర్గాలు తెలిపాయి. వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ విధిగా ట్రేడ్ లైసెన్సు తీసుకోవాలి. ఒక వేళ చిన్న వ్యాపారులు లైసెన్సు తీసుకోకపోయినా ప్రభుత్వ ఉద్యోగులే వారి వద్దకు వెళ్లి ఇవ్వాలి. అయితే.. లైసెన్సులు ఇవ్వడం మానేసిన ఉద్యోగులు.. మామూళ్లు తీసుకోవడం మొదలుపెట్టారు. మామూళ్లు ఇవ్వకపోతే చిరు వ్యాపారులకు బెదిరింపులు తప్పడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారుల నుంచి వసూళ్ల సొమ్ము కోట్ల రూపాయల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు పక్కన చెరకురసం బండి నడుపుతుంటే సంవత్సరానికి ట్రేడ్ లైసెన్సుకింద రూ.165 మాత్రమే చెల్లించాలి. కానీ ఉద్యోగులు అతనికి లైసెన్సు ఇవ్వకుండా మూన్నెళ్లకోసారి వంద రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడలోనే ఇలా మామూళ్లు చెల్లించే చిన్న చిన్న వ్యాపారులు వేలల్లో ఉన్నారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి ట్రేడ్ లైసెన్సుల మామూళ్లతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యాపారులందరికీ లైసెన్సులు జారీచేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. మామూళ్లతో అటు మున్సిపాలిటీలూ, ఇటు చిరువ్యాపారులూ ఆర్థికంగా నష్టపోతుండగా, ఉద్యోగులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. -
పన్ను వసూళ్లలో టాప్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని మరో 20 వేల మంది వ్యాపారులను ట్రేడ్ లైసెన్స్ పరిధిలో తేవడంలో జీహెచ్ఎంసీ సఫలీకృతమైంది. ప్రస్తుతం సుమారు 65వేల మంది ట్రేడ్ లైసెన్స్‌దారులు ఉన్నారు. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 1.10లక్షల మంది ట్రేడ్ లైసెన్స్‌ను తీసుకున్నారు. నగరంలో కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ పొందిన జాబితాను కూడా దక్షిణ మండలం విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి జీహెచ్ఎంసీ సేకరించింది. కమర్షియల్ ట్యాక్స్, విద్యుత్ శాఖ నుండి పొందిన జాబితాలను ప్రస్తుతం జీహెచ్ఎంసీ వద్ద ఉన్న ట్రేడ్ లైసెన్స్‌ల ఆధారంగా జీహెచ్ఎంసీకి ట్రేడ్ లైసెన్స్ కట్టనివారి జాబితాను సేకరించింది. ఈ జాబితాలో 27వేల మంది జీహెచ్ఎంసీ పరిధి బయట ఉండడం, కొందరు తమ వ్యాపారాలను మానివేసినట్లు గుర్తించారు. మిగిలినవారిలో జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్‌లేని వారికి వెంటనే ట్రేడ్‌లైసెన్స్‌లు పొందాలని ఎస్ఎంఎస్లు పంపడం, అక్రమ వ్యాపారాలను నిర్వహించే వారికి నోటీసులు పంపడం, అన్ని స్థాయిల అధికారులు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణతో ట్రేడ్‌లైసెన్స్‌ల ద్వారా ఇప్పటికే రూ. 37 కోట్లు ఆర్జించారు. మార్చి 31వ తేదీలోగా కనీసం మరో రూ.20 కోట్లను ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా పన్నులు సేకరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. రికార్డు స్థాయిలో ఆదాయం అంతర్గత లోసుగులను సరిదిద్దుకోవడం, పన్ను ఎగవేత దారులను గుర్తించి వారిని పన్నులు చెల్లించే కేటగిరిలోకి తేవడంతో జీహెచ్ఎంసీ పన్నుల వసూళ్లలో ఘణనీయమైన వృద్ది సాధిస్తోంది.గత ఆర్థిక సంవత్సరం ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా బల్దియాకు మొత్తం రూ.27.50 కోట్లు లభించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) జనవరి 17వ తేదీ వరకు రూ. 65,500 ట్రేడ్ లైసెన్స్‌ల నుండి రూ. 37కోట్లు సేకరించడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా రూ. 50కోట్లను సేకరించాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో రెండు నెలలు ఉండగానే కేవలం ట్రేడ్ లైసెన్స్‌ల సేకరణలోనే గత సంవత్సరం మొత్తాన్ని చూస్తే దాదాపు రూ.10కోట్ల పైగా అదనపు ఆదాయం లభించింది. -
డబ్బులే డబ్బులు!
♦ గ్రేడ్లెసైన్స్ ద్వారా వికారాబాద్ ♦ మున్సిపాలిటీకి రూ.6లక్షల ఆదాయం ♦ పట్టణంలోని వ్యాపార సముదాయలు 991 ♦ పూర్తిస్థాయిలో వృత్తిపన్ను వసూలు వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీ 1987లో ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నడూ వ్యాపారుల నుంచి ట్రేడ్ లెసైన్సులు పూర్తిస్థాయిలో వసూలు చేయలేదు. మున్సిపాలిటీని ఏర్పాటు చేసినప్పుడు వ్యాపార సముదాయాలు కూడా తక్కువగా ఉండేవి. వాటి నుంచి పన్నులు వసూలు చేయాలన్న నిబంధన ఉన్నా అధికారుల పట్టించుకోలేదు. ఈ యేడాది ఆ పన్ను పూర్తిస్థాయిలో వసూ లు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీం తో మున్సిపాలిటీకి ఆరు లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. వికారాబాద్ మున్సిపాలిటీ గతంలో మేజర్ గ్రామ పంచాయతీగా కొనసాగింది. ఆ తర్వాత 1987లో పురపాకల సంఘంగా మారింది. ఈ నేపథ్యంలో అప్పట్లో చిరు వ్యాపారులతో పాటు పెద్ద వ్యాపారస్తులు, వివిధ వృత్తుల వారు విక్రయాలు జరిపేవారు. అప్పట్లో కొందరు మున్సిపల్ యంత్రాంగం ట్రెడ్ లెసైన్స్‌ను వసూల్ చేయకుండా చేతివాటం ప్రదర్శించడంతో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఆగిపోయింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు ట్రెడ్లెసైన్స్ ద్వారా పన్ను వసూలును మున్సిపల్ యంత్రాంగం పూర్తిస్థాయిలో విస్మరించింద నే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది వరకు వివిధ వ్యాపారస్తులనుంచి అరకొరగా పన్ను వసూల్ చేస్తూ మిగతా డబ్బులను సిబ్బంది జేబుల్లో వేసుకునే వారనే విమర్శలున్నాయి. పట్టణంలో కార్మిక కార్యాలయం లెక్కల ప్రకారం వ్యాపార సముదాయలు రమారమి 1500 వరకు ఉన్నాయి. అయితే, మున్సిపల్ యంత్రాంగం మాత్రం 991వరకే ఉన్నాయని చెప్పింది. వీటికి సంబంధించి ఈ ఏడాది రూ.500 నుంచి రూ.2,500 వరకు ట్రెడ్ లెసైన్స్ కింద పన్ను వసూ లు చేశారు. దీంతో రూ.6 లక్షల వరకు పన్నులు రూపేణా వచ్చినట్టు మున్సిపల్ యంత్రాంగం పేర్కొంటోంది. కాకపోతే పట్టణ విస్తీర్ణంతోపాటు జనాభా పెరగడంతో వ్యాపార సముదాయలు సైతం పెరిగాయి. కానీ, ట్రైడ్లెసైన్స్ ఫీజు మాత్రం పెంచలేదు. తాండూరు మున్సిపాలిటీలో వసూలుచేస్తున్న ట్రెడ్ లెసైన్స్ పన్ను సుమారుగా రూ.1000 నుంచి రూ.50వేల వరకు ఉన్నట్లు సమాచారం. అయితే ట్రెడ్ లెసైన్స్ ఫీజును మున్సిపల్ కౌన్సిల్లో ప్రవేశపెట్టి పాత రేట్లను సవరించి కొత్తవి నిర్ణయిస్తూ తీర్మానం చేయాలి. దీనిని అమలు చేస్తే మున్సిపాలిటీకి భారీగా ఆదాయం వస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
పథకం గొప్ప.. ఫలితం దిబ్బ
► సత్ఫలితాలివ్వని డిజిటల్ సిటిజన్ సర్వీసెస్ ► ప్రచార లోపమే ప్రధాన కారణం ► గ్రామీణ పౌరులకు అందని సేవలు పల్లెలు దేశ ప్రగతికి పట్టుగొమ్మలు. అలాంటి పల్లె వాసులకు సేవలు అందించడానికి డిజిటల్ సిటిజన్ సర్వీసెస్ పథకాన్ని ప్రారంభించారు. దీనికి సరైన ప్రచారం కల్పించకపోవడంతో ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఒకటి, రెండు మినహా మిగిలిన సేవలు అందని ద్రాక్షగానే మారాయి. చిత్తూరు (కార్పొరేషన్): పంచాయతీల్లో ఆన్లైన్ పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం డిజిటల్ సిటిజన్ సర్వీసెస్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా భవన అనుమతులు, ఇంటి పన్నులు, మ్యూటేషన్ (పేర్లు మార్పు), లే అవుట్ల అనుమతి, వివాహ ధ్రువీకరణ పత్రాలు, ఎన్వోసీ, ఆస్తి విలువ, ట్రేడ్ లెసైన్స్, ప్రయివేటు కొళాయి కనెక్షన్స్, ప్రాపర్టీ వాల్యుయేషన్ ఇలా 9 రకాల సేవలను ఆన్లైన్ ద్వారా ఇవ్వడానికి ఈ విధానం ప్రవేశపెట్టారు. జిల్లాలో మొదటి విడతగా 33 మండలాల పరిధిలోని పంచాయతీల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే దీని గురించి తగిన స్థాయిలో ప్రచారం చేయలేదు. కేవలం 20 నుంచి 30 శాతం మంది పౌరులకు మాత్రమే దీని గురించి తెలుసు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 70 నుంచి 80 శాతం మందికి ఇలాంటిది ఒకటి ఉంది అని తెలియకపోవడంతో ఆ సేవలు ఆశించిన స్థాయిలో ఉపయోగంలోకి రావడం లేదు. హౌస్ ట్యాక్స్, బిల్డింగ్ అనుమతులు, లే అవుట్లు మినహా మిగిలిన సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. -
కలెక్షన్లు అదుర్స్
► 104 శాతం మేర ఆస్తిపన్ను వసూలు ► ఫలించిన స్పెషల్ డ్రైవ్ ఖాళీ స్థలాలు, ► మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో ఆస్తిపన్ను వసూళ్లు అంచనాలకు మించాయి. నూరుశాతం పన్ను వసూళ్ల కోసం కమిషనర్ జి.వీరపాండియన్ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాన్నిచ్చింది. మున్నెన్నడూ లేని విధంగా ఆస్తిపన్ను 104 శాతానికి(పాతబకాయిలుతో కలిపి)చేరింది. డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌ఓ)ట్రేడ్ లెసైన్స్‌లు 96 శాతం మేర వసూలయ్యాయి. సీవరేజ్, నీటి పన్నులు కూడా అదేవరుసలో నిల్చాయి. ఖాళీస్థలాల పన్ను వసూళ్లు మాత్రం మొరాయించాయి. రూ.58.39 కోట్లకుగాను రూ.8.35 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. వీటి వసూళ్లకు ఈనెల మొదటి వారం నుంచి మరోమారు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. నిరంతరం సమీక్ష కార్పొరేషన్ ఆర్థిక సంక్షోభాన్ని దృష్టి లో ఉంచుకొని కమిషనర్ జి.వీరపాండియన్ నూరుశాతం పన్ను వసూ లు లక్ష్యంగా నిర్ణయించారు. రెవెన్యూ విభాగంతోపాటు ప్రజారోగ్య, ఎస్టే ట్స్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, యూసీడీ తదితర శాఖల సిబ్బందికి పన్ను వసూళ్ల బాధ్యత అప్పగించారు. అవకాశం ఉన్నప్పుడల్లా రాత్రి 9 తరువాత సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఫిబ్రవరి నాటికి 80 శాతం ఆస్తిపన్ను వసూలైంది. అదే స్పీడ్ కొనసాగించాల్సిందిగా రెవెన్యూ సిబ్బందికి సూచించారు. నూరుశాతం పన్నులు వసూలు కాకుంటే సంబంధిత ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేస్తానని, మార్చినెల జీతం నిలుపుదల చేస్తామంటూ హెచ్చరించారు. ఉద్యోగులు మరింత బాధ్యతగా పనిచేశారు. లక్ష్యాన్ని అధిగమించారు. కోర్టు కేసులు, మొండిబకాయిలు కలిపి మరో రూ.25 కోట్లు వసూలు కావాల్సి ఉంటుందని అధికారులు లెక్కలేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.22 కోట్ల మేర ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంది. వీటిపై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలనే యోచనలో కమిషనర్, మేయర్ ఉన్నారు. ఫలించిన మినహాయింపు డీఅండ్‌ఓ ట్రేడ్ లెసైన్స్‌లకు సంబంధించి యూజర్ చార్జీలను మినహా యించారు. సుమారు కోటిన్నర మినహాయింపు రావడంతో వ్యాపారులు ట్రేడ్లెసైన్స్లు కట్టేందుకు ముందుకువచ్చారు. 96 శాతం మేర ఫీజులు వసూలయ్యాయి. మిగిలిన నాలుగు శాతానికి సంబంధించి శుక్రవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ తెలిపారు. నోటీసులు అందిన మూడు రోజుల్లో ఫీజులు చెల్లించకుంటే షాపు ల్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. కొరుకుడుపడని ఖాళీస్థలాలు పన్ను వసూళ్లలో దూకుడు ప్రదర్శించిన అధికారులు ఖాళీస్థలాల విషయంలో చతికిలపడ్డారు. నగరంలో 14 వేల ఖాళీస్థలాలు ఉన్నాయి. వీటి నుంచి రూ.58,39,50,480 బకాయిలు రావాల్సి ఉండగా, రూ. 8,35,92,419 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. స్థలాల యజమానులు, చిరునామాలను గుర్తించడం కష్టతరంగా మారిందన్నది ఉద్యోగుల వాదన. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే యోచనలో కమిషనర్ ఉన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం
- లెసైన్స్‌ల రెన్యూవల్‌కు రూ. 3 లక్షల డిమాండ్ - డబ్బు తీసుకుని చిక్కిన గడ్డిఅన్నారం మార్కెట్ కార్యదర్శి చైతన్యపురి: లంచం తీసుకుంటూ మరో అవి నీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది. ట్రేడ్‌లెసైన్స్‌ల రెన్యూవల్‌కు రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి (ఎస్జీఎస్) కార్యదర్శి కె. జనార్దన్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా అవినీతిశాఖ అధికారులకు దొరికాడు. గురువారం రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం... మార్కెట్లోని 122 కమీషన్ ఏజంట్ల లెసైన్స్‌ల కాలం 2013తో ముగిసింది. 2014 నుంచి 2018 వరకు రెన్యూవల్ చేయాల్సి ఉంది. రెన్యూవల్ కోసం హోల్‌సేల్ కమీషన్ ఏజెంట్లంతా 2013లోనే చాలాన్లు చెల్లించారు. ఎస్జీఎస్ జనార్దన్‌రెడ్డి లెసైన్స్‌లు రెన్యూవల్ చేయకుండా నిలిపివేశారు. దీంతో హోల్‌సేల్ ఫ్రూట్ కమిషన్ ఏజంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాజుద్దీన్..రెన్యూవల్స్ కోసం లేఖ రాయగా.. అదనంగా ఒక్కో షాపుకు రూ.2500 ఇస్తేనే రెన్యూవల్ చేస్తానని స్పష్టం చేశారు. ముందు రెన్యూవల్ చేయండి.. తర్వాత డబ్బు ఇస్తామని తాజుద్దీన్ చెప్పడంతో 2014 ఆగస్టు నాటికి 116 షాపుల రెన్యూవల్ ్స పూర్తి చేసి మిగిలిన వాటిని రెన్యూవల్ చేయకుండా జనార్దన్‌రెడ్డి ఆపేశారు. మిగిలిన షాపులకు రెన్యూవల్స్ పూర్తి చేయాలని ఫిబ్రవరి 2015న మళ్లీ అసోసియేషన్ తరఫున లేఖ రాయగా... ఒప్పందం ప్రకారం తనకు లంచం డబ్బు చెల్లిస్తేనే రెన్యూవల్ చేస్తానని జనార్దన్‌రెడ్డి చెప్పాడు. దీంతో ఎస్జీఎస్ వైఖరితో విసుగెత్తిన తాజుద్దీన్ ఈనెల 16న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు జనార్దన్‌రెడ్డిని పట్టుకొనేందుకు పథకం వేశారు. మూడు నెలల్లో రిటైర్ కావాల్సి ఉండగా.. గడ్డిఅన్నారం మార్కెట్ ఎస్జీఎస్గా జనార్దన్‌రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టి గురువారానికి రెండేళ్లు పూర్తయింది. సెప్టెంబర్‌లో పదవీ విరమణ పొందాల్సి ఉన్న ఆయన ఏసీబీకి పట్టుబ డటం గమనార్హం. 2009లో ఇక్కడ పనిచేసిన ఎస్జీఎస్ విశ్వనాథం కూడా రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అ ప్పుడు విశ్వనాథంను, ఇప్పుడు జనార్దన్‌రెడ్డిని పట్టించింది కూడా తాజుద్దీన్ కావటం విశేషం. పట్టుపడిందిలా... గురువారం ఉదయం 12 గంటలకు ఏసీబీ అధికారులు మార్కెట్ కార్యాలయం వద్ద కాపుకాశారు. 12.15 గంటలకు రూ. 3 లక్షలు తీసుకుని తాజుద్దీన్ ఎస్జీఎస్ జనార్దన్‌రెడ్డి దగ్గరకు వెళ్లాడు. ముసారంబాగ్‌కు చెందిన తాత్కాలిక డ్రైవర్ రవీందర్‌కుమార్ కారు నడుపుతుండగా వెనుక సీట్లో తాజుద్దీన్‌ను కూర్చోపెట్టుకుని జనార్దన్‌రెడ్డి కార్యాలయం నుంచి మార్కెట్లో గల యార్డుల వద్దకు వెళ్లారు. మధ్యలో తాజుద్దీన్ దగ్గర నుంచి రూ.3 లక్షలు ముందు సీట్లో కూర్చున్న జనార్ధన్‌రెడ్డి తీసుకుని డ్రైవర్ చేతికి ఇచ్చాడు. డ్రైవర్ ఆ డబ్బును తన షర్టులోపల పెట్టుకున్నాడు. ఏసీబీ అధికారులు కారును ఆపి జనార్దన్‌రెడ్డితో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లంచం డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ విచారణ అనంతరం జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. వరంగ ల్లోని జనార్దన్‌రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. డ్రైవర్ రవీందర్ పాత్రపై విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ దాడిలో సీఐలు ఎస్.వెంకట్‌రెడ్డి, నాగేశ్వరరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఈ- రిజిస్ట్రేషన్‌లో ‘ట్రేడ్ లెసైన్స్’ పొందండిలా..
మహానగరంలో ఏ వ్యాపారం చేయాలన్నా తప్పకుండా లెసైన్స్ ఉండాల్సిందే. వ్యాపార అనుమతి పత్రాన్ని (ట్రేడ్ లెసైన్స్) గతంలో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నిబంధనలకు అనుగుణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం జారీ చేసేది. అయితే, లెసైన్స్ జారీలో పారదర్శకత, త్వరితంగా ధృవీకరణ పత్రాలు మంజూరు, వ్యాపారులకు సౌకర్యంగా ఉండేందుకు ‘ఆన్లైన్’లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రొవిజనల్ లెసైన్స్ పొందే వీలుండడం ఈ విధానం ప్రత్యేకత. ట్రేడ్ లెసైన్స్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? ఏయే పత్రాలు జతచేయాలి? తదితర విషయాలు మీ కోసం.. రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి.. ⇒ గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొన్ని సేవలను ఈ- రిజిస్ట్రేషన్ విధానంతో అందిస్తున్నారు. ⇒ ఈ సేవలను పొందాలంటే ముందుగా మనం సంబంధిత సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ⇒ ఇందుకు http://eghmc.ghmc.gov.in/ సైట్లో సిటిజన్ లాగిన్ కాలమ్‌లో ‘రిజిస్టర్ యువర్ సెల్ఫ్’ను క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, చిరునామా, పిన్‌కోడ్, ఈ- మెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ తరువాత ‘సబ్మిట్’ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఈ- మెయిల్‌కు, ఫోన్‌కు పాస్వర్డ్ వస్తుంది. ⇒ మీ మొబైల్ ఫోన్ నంబరు మీకు యూజర్ నేమ్‌గా ఉంటుంది. స్కాన్ చేసి ఉంచుకోవాల్సిన పత్రాలు.. ⇒ రెంటల్ డీడ్, ప్రాపర్టీ టాక్స్ రసీదు, బిల్డింగ్ ప్లాన్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు పీడీఎఫ్ ఫార్మట్‌లో ఉంచుకోవాలి. ⇒ పైన పేర్కొన్న పత్రాల పరిమాణం ‘1 ఎంబీ’కి మించకూడదు. దరఖాస్తు విధానం ఇలా... ⇒ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చిన తరువాత లాగిన్ అవ్వండి. ⇒ ఇక్కడి విండోలో ‘ట్రేడ్ లెసైన్స్’ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ⇒ స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘ట్రాన్సాక్షన్’ ఆప్షన్లో సబ్ ఆప్షన్‌గా ఉన్న ‘అప్లై ఫర్ న్యూ ట్రేడ్ లెసైన్స్’ను ఎంచుకోవాలి. ఇప్పుడు మీకు దరఖాస్తు ఫామ్ వస్తుంది. ⇒ ఈ దరఖాస్తును నింపిన తర్వాత ‘సబ్మిట్’ చేస్తే మీకు దరఖాస్తు నంబరుతో ‘ఎకనాలెడ్జ్మెంట్- ప్రొవిజినల్ డిమాండ్ నోటీస్’ వస్తుంది. ⇒ ఇందులో మీరు చెల్లించాల్సిన రుసుం ఎంతో తెలియపరుస్తారు. ⇒ ఈ రుసుంను ‘మీ-సేవ’లో గానీ, ఇదే సైట్లో ‘ఆన్లైన్ పేమెంట్’ గాని చేయవచ్చు. ⇒ తరువాత మీకు రుసుం రసీదు, ప్రొవిజనల్ లెసైన్స్ జారీ చేస్తారు. ⇒ దరఖాస్తు అనంతరం ఎకనాలెడ్జ్మెంట్ పత్రాలు మీ ఈ-మెయిల్‌కు వచ్చేస్తాయి. ⇒ సంబంధిత అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో దరఖాస్తులో మీరు పేర్కొన్న అంశాలు సరైనవి అని తేలిన అనంతరం మీకు ‘ట్రేడ్ లెసైన్స్’ మంజూరు చేస్తారు. దరఖాస్తు పరిశీలన గురించి.. ⇒ ఇదే సైట్లో ‘రిపోర్ట్స్’ ఆప్షన్లో ‘అప్లికేషన్ స్టేటస్’ను క్లిక్ చేయాలి. ⇒ ఇక్కడ బై డిఫాల్ట్‌గా మీ దరఖాస్తు నంబర్ కనిపిస్తుంది. ⇒ దాని స్టేటస్ కూడా కాలమ్‌లో చివర కనిపిస్తుంది. ⇒ మీకు మరిన్ని వివరాలు కావాలంటే సంబంధిత దరఖాస్తును క్లిక్ చేసి ‘వ్యూ డీటేల్స్’ను క్లిక్ చేస్తే దరఖాస్తు వివరాలు ప్రత్యక్షమవుతాయి. నోట్ : దరఖాస్తులో ‘*’ గుర్తున్న వాటిని కచ్చితంగా పూరించాలి. ఫోన్ నంబరు, ఈ-మెయిల్, చిరునామా కరెక్ట్‌గా ఇవ్వాలి. భవిష్యత్తులో సమాచారం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్లింత్ ఏరియాను కరెక్ట్‌గా నమోదు చేయాలి. -
కొత్త రాష్ట్రంలో కొత్త టిన్ నంబర్లు: హీరాలాల్
హన్మకొండ: జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాపారులకు వేర్వేరుగా టిన్ నంబర్లను కేటాయించనున్నట్టు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా తెలిపారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా వ్యాపార లావాదేవీలల్లో జరిగే మార్పులు, వ్యాపారుల సమస్యలు, ఇతర అంశాలపై ఖమ్మం, వరంగల్ జిల్లాలకు చెందిన పరిశ్రమలు, ట్రేడ్ సభ్యులకు వరంగల్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వాణిజ్య పన్నుల శాఖ అవగాహన కల్పించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆ శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు 11 డిజిట్లతో కూడిన టిన్ నంబర్లలో మొదటి రెండు నంబర్లను మార్చినట్లు తెలిపారు. తెలంగాణకు 36, ఆంధ్రప్రదేశ్‌కు 37ను కొత్తగా చేర్చామన్నారు. జూన్ 1వరకు పాత టిన్ నంబర్లలో వ్యాపార లావాదేవీలు జరుపుకోవచ్చని, జూన్ 2 నుంచి మాత్రం తప్పకుండా కొత్త నంబర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అందుకోసం ఏ కార్యాలయానికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అయితే కొత్త నంబర్లు వచ్చే లోపు ఆడిటింగ్ ఇతర వివరాలు క్లియర్‌గా ఉండాలని వ్యాపారులకు సూచించారు. జూన్ 2 తర్వాత రెండు రాష్ట్రాలలో వ్యాపారాలను కొనసాగించాలనే వారికి రెండు నంబర్లు, తెలంగాణలో ఉంటూ ఆంధ్ర, ఆంధ్రలో ఉంటూ తెలంగాణలో వ్యాపారాలను కొనసాగించాలనే వారికి ఒకే టిన్ నంబర్‌తో నిర్వహించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. వాణిజ్య శాఖలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో మార్పులు ఉండకపోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్సల్టెంట్ (రెవెన్యూ) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్రా, వాణిజ్యపన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ జి.లక్ష్మిప్రసాద్, ట్రేడ్ అండ్ కామర్స్ కమిటీ చైర్మన్ రవీంద్రమోడీ, వైస్‌ప్రెసిడెంట్ అనిల్‌రెడ్డి వెన్నం, వాణిజ్య శాఖ డిప్యూటీ కమిషనర్ కె.హరిత, ఆ శాఖ సిబ్బందితో పాటు, వరంగల్, ఖమ్మం జిల్లాల చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైస్‌మిల్లర్లు, ట్రేడర్లు, డీలర్లు పాల్గొన్నారు.