లైసెన్స్ లేకున్నా, నిబంధనలు అతిక్రమించినా చర్యలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండగను పురస్కరించుకొని బాణాసంచా (పటాకుల) దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ తీసు కోవాలని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. లైసెన్స్ లేకుండా దుకాణాల ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులివ్వబోమని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి స్పష్టం చేశారు. రిటైల్ అమ్మకాల కోసం దుకాణాలు ఏర్పాటు చేసేవారు రూ.11 వేలు, హోల్‌సేల్ విక్రయాలకు రూ. 66వేలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు.
దరఖాస్తు ఇలా..
బాణాసంచా దుకాణాల నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ పొంది నిబంధనలకనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్ణీత ట్రేడ్ లైసెన్స్ ఫీజును చెల్లించి జీహెచ్‌ఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్/ జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ (www.ghmc.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చన్నారు. గుర్తింపు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు ప్రతులు ఇవ్వాలని కోరారు. బాణాసంచా షాపులను ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయరాదని తెలిపారు.
తగిన ఫైర్ సేఫ్టీ ఉండాలి..
కాలనీలు, బస్తీలకు దూరంగా ఓపెన్ గ్రౌండ్‌లో/ పెద్దహాల్‌లో తగిన ఫైర్‌సేఫ్టీతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పడానికి వీలుగా అగ్నిమాపక నిరోధక పరికరాలు సిద్ధంగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద, చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దుకాణాలకు దగ్గరగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాణాసంచా కాల్చకూడదని, షాపులో ఏర్పాటు చేసే లైట్లు ఇతరత్రా కరెంటు పరికరాలకు నాణ్యమైన విద్యుత్ వైర్‌ను వినియోగించాలని సూచించారు. బాణాసంచా స్టాల్‌లో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే స్టాల్ హోల్డర్‌దే బాధ్యతని, చట్టపరమైన చర్యలకు బాధ్యుడని తెలిపారు. ఈ విషయాన్ని తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్‌లో పొందుపరచనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పేర్కొన్నారు.
చదవండి: స్వీట్ క్రాకర్స్.. మతాబుల రూపాల్లో చాక్లెట్ల తయారీ
ప్రభుత్వ ఉత్తర్వులు పాటించాలి..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఫైర్ క్రాకర్స్ అయిన సిరీస్ క్రాకర్స్/లడీస్ తయారీ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం ఉందని, వాటి అమ్మకాలకు అనుమతించరని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్ 1955/న్యాయస్థానాలు/పీసీబీ/ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. బాణాసంచా విక్రయ స్టాళ్లను సంబంధిత డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అధికారుల బృందం కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తుందని కమిషనర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment