బజ్జీ బండ్లు.. బంగారు బాతుగుడ్లు
► ట్రేడ్ లైసెన్స్‌లకు నోచుకోని చిరు వ్యాపారులు
► లైసెన్స్‌లు ఇవ్వకుండా ఉద్యోగుల నెలవారీ మామూళ్లు
► ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వైనం
సాక్షి, అమరావతి: ట్రేడ్ లైసెన్సులపై చిరు వ్యాపారులకు అవగాహన లేకపోవడం మున్సిపాలిటీ ఉద్యోగులకు వరంగా మారింది. వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు ఇవ్వకుండా మామూళ్లతో జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా మున్సిపాలిటీల పరిధిలో ఉండే చిన్న వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారు. వ్యాపారులు ట్రేడ్ లైసెన్సుకు అయ్యే సొమ్ము కంటే భారీగా మామూళ్ల కింద ఇవ్వాల్సి వస్తోంది. వ్యాపారులకు అవగాహన కల్పించి 24 గంటల్లోగా లైసెన్సు మంజూరు చేయాల్సి ఉద్యోగులే.. మామూళ్లకు అలవాటుపడి రాష్ట్ర ఖజానాకు గండికొడుతున్నారు.
16 లక్షలకు పైగా షాపులుంటే
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు పక్కన బజ్జీ కొట్ల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకూ సుమారు 16 లక్షల వరకూ వ్యాపార కేంద్రాలు ఉన్నాయని, వారిలో 6 లక్షలకు మాత్రమే ట్రేడ్ లైసెన్సులు ఉన్నట్టు మున్సిపల్ అధికార వర్గాలు తెలిపాయి. వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ విధిగా ట్రేడ్ లైసెన్సు తీసుకోవాలి. ఒక వేళ చిన్న వ్యాపారులు లైసెన్సు తీసుకోకపోయినా ప్రభుత్వ ఉద్యోగులే వారి వద్దకు వెళ్లి ఇవ్వాలి. అయితే.. లైసెన్సులు ఇవ్వడం మానేసిన ఉద్యోగులు.. మామూళ్లు తీసుకోవడం మొదలుపెట్టారు.
మామూళ్లు ఇవ్వకపోతే చిరు వ్యాపారులకు బెదిరింపులు తప్పడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారుల నుంచి వసూళ్ల సొమ్ము కోట్ల రూపాయల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు పక్కన చెరకురసం బండి నడుపుతుంటే సంవత్సరానికి ట్రేడ్ లైసెన్సుకింద రూ.165 మాత్రమే చెల్లించాలి. కానీ ఉద్యోగులు అతనికి లైసెన్సు ఇవ్వకుండా మూన్నెళ్లకోసారి వంద రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడలోనే ఇలా మామూళ్లు చెల్లించే చిన్న చిన్న వ్యాపారులు వేలల్లో ఉన్నారు.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
ట్రేడ్ లైసెన్సుల మామూళ్లతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యాపారులందరికీ లైసెన్సులు జారీచేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. మామూళ్లతో అటు మున్సిపాలిటీలూ, ఇటు చిరువ్యాపారులూ ఆర్థికంగా నష్టపోతుండగా, ఉద్యోగులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.