సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్లలో ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద చిన్న వ్యాపారులకు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైంది. స్వయం ఉపాధి కోసం ముద్ర యోజన కింద ఎటువంటి పూచీ కత్తు లేకుండా రాష్ట్రంలో గత నాలుగేళ్లలోనే 44.63 లక్షల మందికి రూ. 49,313 కోట్ల మేర రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇందులో అత్యధికంగా మహిళలకే మంజూరయ్యాయి. ఇప్పటికే చేస్తున్న వ్యాపారాలను మరింత విస్తరించడానికి లేదా కొత్తగా వ్యాపారం చేసేందుకు ముద్ర రుణాలను మంజూరు చేశారు.
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి కోవిడ్ సమయంలో తిరిగి రాష్ట్రానికి వచ్చిన వారికి జీవనోపాధి కల్పించడానికి ముద్ర రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విరివిగా ఇప్పించింది. గత మూడేళ్లుగా లక్ష్యానికి మించి చిన్న వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 135 శాతం మేర ముద్ర రుణాలను మంజూరు చేశారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.12,000 కోట్లు రుణంగా ఇవ్వాలని లక్ష్యం కాగా రూ.16,212 కోట్లను మంజూరు చేశారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ. 10,838 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యమైతే రూ. 11,445 కోట్లు మంజూరు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని మించడం పట్ల ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రుణాల రికవరీ బాగుందని, మహిళల రుణాల్లో నిరర్థక ఆస్తులు కూడా చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు ముద్ర యోజన ద్వారా మహిళలు స్వయం ఉపాధి రంగంలో ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ముద్ర కింద మూడు రకాల రుణాలను మంజూరు చేస్తున్నారు. శిశు పథకం కింద రూ. 50 వేల వరకు, కిశోర్ పథకం కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు, తరుణ్ పథకం కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తున్నాయి.
టైర్ల ఫిట్ షాపుతో స్వయం ఉపాధి
రాజమహేంద్రవరానికి చెందిన యోగిత సింహాచలం పీఎంఎంవై కింద పది లక్షల రూపాయల రుణం తీసుకుని పరమేశ్వర బెస్ట్ ఫిట్ టైర్ షాపు ఏర్పాటు చేశారు. తొలుత ఒక్కరితో ప్రారంభమైన ఆ షాపులో తరువాత మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కార్లకు టైర్లు ఫిట్ చేస్తున్నామని, త్వరలోనే మరింత విస్తరించడం ద్వారా మరో పది మందికి కూడా ఉపాధి కల్పిస్తామని సింహాచలం పేర్కొన్నారు.
కర్టెన్ డిజైనర్ యూనిట్
తిరుపతికి చెందిన సులోచన డిజైనింగ్‌పై ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవాలనే ఆలోచనతో కెనరా బ్యాంక్‌లో తరుణ్ పథకం కింద రుణం కోసం ధరఖాస్తు చేసుకుంది. కెనరా బ్యాంకు రూ. 7.5 లక్షల రుణం మంజూరు చేసింది. దీంతో ఆమె కర్టెన్ డిజైనర్ పేరుతో యూనిట్‌ను ప్రారంభించింది. మైక్రో మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో కర్టెన్ల రూపకల్పనతో పాటు గృహోపకరణాలను తయారు చేయడం ప్రారంభించింది. మరో ఐదుగురికి ఉపాధి కూడా కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment