కనిగిరిలో జేసీబీలతో దుకాణాలు, బడ్డీల కూల్చివేత
బతుకుదెరువు కోల్పోయిన 500 కుటుంబాలు
కంటతడి పెట్టిన వీధి వ్యాపారులు
ఎమ్మెల్యే మెప్పు కోసమేనంటూ నిప్పులు చెరిగిన ప్రజా సంఘాలు
కనిగిరి రూరల్: వేకువజామున 4 గంటల సమయం.. కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులపైకి జేసీబీలు, ట్రాక్టర్లు దూసుకొచ్చాయి. వాటి వెనుకే మునిసిపల్, రెవెన్యూ అధికారులు, సచివాయల సిబ్బంది మందీమార్బలంతో చేరుకున్నారు. ఏకంగా 80 మంది పోలీసులను వెంటబెట్టుకొచ్చారు. రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు, బడ్డీలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు.
ట్రాఫిక్ నియంత్రణ పేరుతో కనిగిరి మునిసిపల్ కమిషనర్ టీవీ రంగారావు కనీస నిబంధనలు పాటించకుండా.. కష్టజీవులపై కర్కశంగా వ్యవహరించారు. తొలుత చెప్పుల బజార్, పామూరు బస్టాండ్ వైపు బడ్డీలను పెకిలించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన చిరు వ్యాపారులను పోలీస్‌లు, మునిసిపల్ సిబ్బందితో అడ్డుకున్నారు.
కనీసం తమ బడ్డీల్లో ఉన్న సామగ్రి తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరినా అంగీకరించకుండా జేసీబీలతో నుజ్జునుజ్జు చేశారు. పిండి వంటలు, చెప్పుల దుకాణాలు, సెల్ పాయింట్లు, వాచీ షాపులు, గాజుల షాపులు ఇలా అనేక దుకాణాల్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక వీధి వ్యాపారులు లబోదిబోమన్నారు. మొత్తం మీద చిరు వ్యాపారులకు రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.
పోలీస్ పహారాతో దమనకాండ
వాస్తవానికి చెప్పుల బజార్‌లోని కొన్ని దుకాణాలు, చర్చి సెంటర్‌లోని బడ్డీలు తొలగించనున్నట్టు కొంతకాలంగా చర్చ నడుస్తోంది. కానీ.. బుధవారం ఒక్కసారిగా పట్టణంలోని పామూరు రోడ్డు, కందుకూరు రోడ్డు, ఒంగోలు బస్టాండ్ రోడ్డులోని దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. 50 మంది స్పెషల్ పోలీసులు, 20 మంది పోలీస్ సిబ్బంది, నలుగురు ఎస్సైలు, సీఐలు ఈ దమనకాండలో పాల్గొన్నారు. కమిషనర్ టీవీ రంగారావు, ఆర్డీఓ పి.జాన్ ఇర్విన్, సీఐలు, ఎస్సైలు బడ్డీల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షించారు.
వ్యాపారుల శాపనార్థాలు
బడ్డీల తొలగింపు సందర్భంగా కమిషనర్ రంగారావు వ్యవహరించిన తీరుపై చిరు వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. నోటికాడి కూడును నేలపాలు చేసి, తమ జీవితాలను రోడ్డున పడేసిన వారంతా దుమ్ము కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే అధికారులు దమనకాండకు పాల్పడ్డారని ప్రజా సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. చిరు వ్యాపారుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment