
మళ్లీ ఓటీఎస్ సదుపాయం కల్పించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను భారీ బకాయిదారులకు శుభవార్త. ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీల మొత్తం భారీగా పేరుకుపోయిన వారి సదుపాయార్థం ప్రభుత్వం వన్ టైమ్ స్కీమ్ (ఓటీఎస్)గా పేర్కొంటూ 90 శాతం మాఫీతో రాయితీ సదుపాయం కల్పించింది. దీంతో.. ఈ మార్చి నెలాఖరుకు ముగియనున్న 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తిపన్ను బకాయిల వడ్డీల్లో పది శాతం, అసలు చెల్లించేవారికి ఈ సదుపాయం వర్తిస్తుంది.
జీహెచ్‌ఎంసీ ఆదాయం పెంచుకునేందుకు కమిషనర్ ఇలంబర్తి రాసిన విజ్ఞప్తి లేఖకు స్పందించిన ప్రభుత్వం ఈ రాయితీ ఇచ్చింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఈ ఆర్థిక సంవత్సర ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రూ.2 వేల కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.1,540 కోట్లు వసూలైంది.
వడ్డీ మాఫీ రాయితీ వర్తించే వారి నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు రూ.5 వేల కోట్లున్నాయి. రాష్ట్రప్రభుత్వం గతం సంవత్సరం, అంతకుముందు సైతం ఈ సదుపాయాన్ని కల్పించడం తెలిసిందే. భారీగా బకాయిలు పేరుకుపోయిన వారి నుంచి కనీసం రూ. 500 కోట్లయినా వసూలవుతాయని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వడ్డీలతో సహా ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం ఈ రాయితీ సదుపాయం వర్తించనుంది. వారు చెల్లించిన మొత్తాన్ని వారి రాబోయే ఆస్తిపన్ను చెల్లింపులో అడ్జస్ట్ చేయనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.