సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, సంస్థల నుంచి ఆస్తిపన్ను రూపంలో రూ.825.87 కోట్లు వసూలయ్యాయి. జీహెచ్‌ఎంసీ మినహా 128 మునిసిపాలిటీలు, 12 కార్పొరేషన్ల పరిధిలో నిర్దేశిత లక్ష్యం రూ.1,146.56 కోట్లలో 72.03 శాతం మేర వసూలైంది. 2021– 22 ఏడాది ఆస్తిపన్ను వసూళ్లతో పోలిస్తే ఈసారి రూ.127.62 కోట్లు అదనంగా సమకూరాయి. ఆస్తిపన్ను వసూళ్లలో హైదరాబాద్ మినహా 12 కార్పొరేషన్లలో 92.33 శాతం పన్ను వసూళ్లతో ఫిర్జాదిగూడ మొదటిస్థానంలో నిలవగా, 55.02 శాతం పన్ను వసూళ్లతో నిజామాబాద్ చివరిస్థానంలో ఉంది. మునిసిపాలిటీలలో జగిత్యాల జిల్లా కోరుట్లలో అత్యధికంగా 97.39 శాతం, నిర్మల్ జిల్లా బైంసాలో అత్యల్పంగా 26.93 శాతం మాత్రమే వసూలైంది.
ఆస్తిపన్ను, భవన నిర్మాణాల ఫీజుల వసూళ్లతో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతి సంవత్సరం ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. చిన్న మునిసిపాలిటీల్లో కూడా పన్నువసూళ్లు ఆశాజనకంగా ఉండటంతో ప్రభుత్వానికి ఏయేటికాయేడు ఆదాయం పెరుగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు రెండు నెలల ముందు నుంచే కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ మునిసిపల్ కమిషనర్లతో తరుచూ సమావేశాలు నిర్వహించడం, ఆదాయలక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన సమీక్షలు ఎప్పటికప్పుడు చేయడంవల్ల పన్నువసూళ్లలో పురోగతి స్పష్టంగా కనిపించింది. మునిసిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గ్రాంట్లతోపాటు స్వయంగా ఆదాయం సమకూర్చుకోవడం తప్పనిసరని సీడీఎంఏ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆస్తిపన్నుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రతీ మంగళ, గురు, ఆదివారాల్లో మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 30లోగా ఆస్తిపన్నుచెల్లిస్తే 5 శాతం రాయితీ
2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించినవారికి ఎర్లీబర్డ్ స్కీమ్ వర్తిస్తుందని కమిషనర్, డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ తెలిపారు. ఆస్తిపన్ను మొత్తం చెల్లించేవారికి ఐదుశాతం రాయితీ లభిస్తుందన్నారు. ఆస్తిపన్ను మునిసిపల్ కార్యాలయానికి రాకుండానే పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లించవచ్చని పేర్కొన్నారు. పన్నుచెల్లింపు దారులకు మునిసిపాలిటీలు పంపించే ఎస్‌ఎంఎస్‌లలో లింక్ తెరిచి పన్ను చెల్లించవచ్చని, లేదంటే వాట్సాప్ చాట్‌బాట్ నంబర్ 90002 53342 ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment