‘టౌన్‌’ బండి.. డౌన్‌ | Telangana: Lack Of Staff In Municipal Department To Work | Sakshi
Sakshi News home page

‘టౌన్‌’ బండి.. డౌన్‌

Published Sat, Feb 19 2022 1:37 AM | Last Updated on Sat, Feb 19 2022 5:02 AM

Telangana: Lack Of Staff In Municipal Department To Work - Sakshi

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిబ్బంది కొరత, సమస్యలకు  చిన్న ఉదాహరణ ఇది. పంచాయతీలుగా ఉన్నప్పటి నామమాత్రపు సిబ్బందితోనే చాలా మున్సిపాలిటీలు కొనసాగుతున్నాయి. సరిపడా అధికారులు, సిబ్బంది లేకపోవడం.. ఉన్నా ఇన్‌చార్జులే కావడంతో కొత్త పురపాలక సంస్థల్లో పాలన సరిగా జరగని దుస్థితి నెలకొంది. దీనితో అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోందని, వివిధ అనుమతులు, పారిశుధ్యం వంటి సేవలు సరిగా అందడం లేదని.. పన్నుల వసూళ్లు కూడా జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యపై ‘సాక్షి’ప్రత్యేక కథనం..

  సాక్షి, హైదరాబాద్‌:  పెరిగిన జనాభా, నివాస ప్రాంతాల విస్తరణ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పలు మేజర్‌ గ్రామపంచాయతీలను మున్సిపాలి టీలుగా, కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్‌ చేసింది. కొత్తగా 77 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇది జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా వాటికి అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకం జరగలేదు. పేరుకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా మారినా.. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటి పరిస్థితే ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కొత్తవి ఏర్పాటైన మొదట్లో.. ఆయా జిల్లాల్లో అప్పటికే ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొందరిని సీనియారిటీ ఆధారంగా కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లు, మేనేజర్లుగా డిప్యుటేషన్లపై నియమించారు. కొందరికైతే రెండేసి మున్సిపాలిటీలకు ఇన్‌చార్జి కమిషనర్‌గా, మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్నప్పటి సిబ్బంది నుంచే.. శానిటేషన్‌ ఇంజనీర్లు, ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లను ఎంపిక చేసి వెళ్లదీసుకొస్తున్నారు. 

అక్రమాలను అడ్డుకునేదెలా? 
మున్సిపాలిటీకి ఆదాయం సమకూరేది టౌన్‌ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల నుంచే. గ్రామపంచాయతీ నుంచి ఇళ్ల అనుమతి పొంది, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఘటనలు వెలుగులోకి రావడంతో.. కొత్త మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలకు టీఎస్‌బీపాస్‌ అనుమతి తప్పనిసరని పురపాలక శాఖ ప్రకటించింది. అయితే కొత్తగా అనుమతులు మంజూరు చేయడానికిగానీ, పంచాయతీలు ఇచ్చిన అనుమతులు చెల్లవని చెప్పడానికిగానీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు లేని దుస్థితి. కేవలం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న హైదరాబాద్‌ శివార్లలోని కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రం డిప్యుటేషన్‌ మీద టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిని నియమించడంతో.. వారు అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టగలుతున్నారు. ఇతర చోట్ల చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. 

పన్నుల ఆదాయానికీ గండి 
ఇంటిపన్నుతో పాటు ఇతర పన్నుల వసూలు చేసే రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. అభివృద్ధి పనులతోపాటు టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలనకు ప్రతి మున్సిపాలిటీకి ఇంజనీర్లు ఉండాలి. కానీ కొత్త మున్సిపాలిటీల్లో ఇంజనీర్ల కొరత నెలకొంది. సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు, ఏయే ప్రాంతాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయాలన్న నివేదికలు రూపొందించేందుకు అధికారులు లేరు. ఏదైనా అంశంపై మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు సమాధానం చెప్పేవారు కూడా లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఏడాదిన్నర క్రితమే ప్రకటించినా..: రాష్ట్రంలోని కొత్త, పాత మున్సిపాలిటీల్లో కమిషనర్, మేనేజర్‌ నుంచి శానిటరీ జవాన్‌ వరకు 4 వేల పోస్టులు అవసరమని పురపాలక శాఖ గతంలో లెక్కతేల్చింది. జనాభా ప్రాతిపదికన ఏయే మున్సిపాలిటీకి, కార్పొరేషన్‌కు ఏయే స్థాయిలోని అధికారులు, సిబ్బంది ఎంద మంది అవసరమనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2020 జూలై 14న మంత్రి కేటీఆర్‌ పురపాలకశాఖ అధికారులతో సమావేశమై.. తొలివిడతగా 2 వేల పోస్టుల భర్తీకి కసరత్తు చేయాలని ఆదేశించారు. కానీ ఇప్పటివరకు నియామకాలు జరగలేదు. తాజాగా 129 మున్సిపాలిటీల్లో 3,700 మంది వార్డు ఆఫీసర్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయాలనేది ఆలోచన.

ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప కొత్త మున్సిపాలిటీల్లో అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఇబ్బంది తప్పదని స్థానికులు అంటున్నారు.  జోగుళాంబ గద్వాల జిల్లాలో గ్రామపంచాయతీలుగా ఉన్న అలంపూర్, వడ్డేపల్లిలను మున్సిపాలిటీలుగా మార్చారు. మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి
డిప్యుటేషన్‌పై వచ్చిన నిత్యానంద్‌.. ఈ రెండు మున్సిపాలిటీలకు ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్నారు. అలంపూర్‌ మున్సిపాలిటీలో మేనేజర్, అకౌంటెంట్, బిల్‌ కలెక్టర్, ఏఈ, టౌన్‌ప్లానింగ్‌ ఏఈ పోస్టులకు ఇన్‌చార్జి అధికారులే ఉన్నారు. ఆర్‌ఐ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, వర్క్‌ ఇన్‌స్పెక్టర్, జూనియర్‌ అకౌంటెంట్‌ వంటి కీలక పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. శానిటేషన్, ఇతర సిబ్బంది అయితే పూర్తిగా ఔట్‌ సోర్సింగే. వడ్డేపల్లి మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి.
పది కీలక పోస్టులకుగాను ఏడింటిలో ఇన్‌చార్జులే ఉన్నారు.

►  మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపాలి టీలో కమిషనర్‌తోపాటు టీపీవో పోస్టులకు ఇన్‌ చార్జులను నియమించిన ప్రభుత్వం.. మేనేజర్, జూనియర్‌ అసిస్టెంట్‌లను మాత్రమే డిప్యుటేషన్‌ మీద పంపించింది. ఇక ఏ పోస్టుకూ అధికారులు లేరు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సహా పారిశుధ్య సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌లో తీసుకొని బండి నడిపిస్తున్నారు.
►   బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది కొరత ఉంది. డిప్యూటీ సిటీ ప్లానర్‌ (డీసీపీ) మాత్రమే ఉన్నారు. ఆయన కూడా ఇన్‌చార్జినే. నలుగురు సూపర్‌వైజర్లు, ఒక ఏసీపీ పోస్టులకు సంబంధించి ఎవరూ లేరు. ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్లో ముగ్గురు ఏఈలు అవసరం. ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఇద్దరు ఈఈ ఉండాల్సి ఉన్నా.. ఎవరూ లేరు. 
►   రామాయంపేట మున్సిపాలిటీలో అంతా ఇన్‌ చార్జుల పాలనే. 20 మందికిగాను.. మున్సిపల్‌ కమిషనర్, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు మాత్రమే రెగ్యులర్‌ ఉద్యోగులు. గతంలో మేజర్‌ పంచాయతీగా ఉన్నప్పటి సిబ్బందితోనే పాలన కొనసాగుతోంది. ళీ    చిట్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం మున్సిపల్‌ కమిషనర్, మేనేజర్, జూనియర్‌ అసిస్టెంట్‌ మాత్రమే ఉన్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్, రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్‌ ఇంజనీర్, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్లుగా ఇన్‌చార్జులే ఉన్నారు.
►    కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కమిషనర్, ఏఈ, టీపీవో ఇన్‌చార్జులే. ఏఈ, ఇంజనీరింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ , అకౌంట్స్‌ విభా గంలో ఏవో, జేఏవో, జూనియర్‌ అసిస్టెంట్, సీనియర్‌ అసిస్టెంట్, టౌన్‌ ప్లానింగ్‌ టీపీ, టీపీఎస్, శానిటర్‌ ఇన్‌స్పెక్టర్, హెల్త్‌ అసిస్టెంట్, రెవెన్యూ ఆఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బిల్‌ కలెక్టర్లు నలుగురికి ఒక్కరే, జూనియర్‌ అసిస్టెంట్లు నలుగురికి ఇద్దరే ఉన్నారు.

పలు కొత్త మున్సిపాలిటీల్లోని పరిస్థితి ఇదీ..
►   కొత్త మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది లేకపోవడంతో అంతకు ముందున్న గ్రామ పంచాయతీ పరిస్థితికి ఇప్పటికి తేడా లేని దుస్థితి.
►    మున్సిపాలిటీల్లో గెలిచిన పాలక మండళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా అమలు కావడం లేదు.
►    కొందరు కమిషనర్లు, కీలక అధికారులు రెండేసి మున్సిపాలిటీలకు ఇన్‌చార్జులుగా ఉంటుండటంతో పాలన కుంటుపడుతోంది.
►    టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది లేకపోవడం వల్ల కొత్త మున్సిపాలిటీల్లో భవన నిర్మాణాలకు అనుమతులు రావడం లేదు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే యంత్రాంగం లేదు. 
►   గ్రామ పంచాయతీ పర్మిషన్‌ పేరుతో కొత్త మున్సిపాలిటీల్లో ఇప్పటికీ భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని కొత్త మున్సిపాలిటీల్లో మాత్రం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి.. ఇతర మున్సిపాలిటీలు, రెవెన్యూ శాఖల నుంచి సిబ్బందిని తెప్పించి మరీ అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. కానీ జిల్లాలో ఈ పరిస్థితి లేదు.
►    పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం లేదు. కమిషనర్లుగా వ్యవహరిస్తున్న అధికారులు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నియమించి చెత్త తొలగింపు, ఇతర పారిశుధ్య పనులు చేయిస్తున్నారు.
►    హైదరాబాద్‌ శివార్లలోని జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, పీర్జాదిగూడ వంటి కొత్త కార్పొరేషన్లలో పాలకమండళ్ల హడావుడే తప్ప అధికారులు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఆలస్యం జరుగుతోందన్న ఫిర్యాదులు ఉన్నాయి.

అడుగడుగునా సమస్యలే..
అధికారులు, సిబ్బంది లేకుంటే మున్సిపాలిటీలు ఎందుకు?
పౌరులకు మౌలిక సదు పాయాలు కల్పించడమ నేది స్థానిక సంస్థల బాధ్యత. మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ నుంచి సౌకర్యాలు ఆశిం చడం ప్రజల హక్కు. కొత్త మున్సి పాలిటీలు ఏర్పాటు చేసి.. కమిషనర్లను,  సిబ్బందిని నియమించకపోవడం వల్ల స్థానిక సంస్థల ఉద్దేశం దెబ్బతింటుంది.  అధికారులను నియ మించకపోవడం శోచనీయం. పట్టణాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు కావాలి.  ప్రభుత్వం ఇప్పటికైనా రెగ్యులర్‌ స్టాఫ్‌ను నియమిస్తే మంచిది.
– ఆర్‌వీ చంద్రవదన్, రిటైర్డ్‌ ఐఏఎస్, ఎంసీహెచ్‌ మాజీ అదనపు కమిషనర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement