సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. ఆస్తిపన్ను మదింపు, వసూళ్లలో క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పురపాలికలకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. నిధుల్లేక పురపాలికలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. క్ష్రేత్రస్థాయిలో ఇంకా లక్షల సంఖ్యలో ఆస్తుల పన్ను మదింపు జరగడం లేదు. ఒకవేళ మదింపు జరిగి, నోటీసులు జారీ చేసినా, వందశాతం వసూళ్లు కావడం లేదు. స్థానిక సంస్థలు అభివృద్ధి నిధుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూడక తప్పడం లేదు. ప్రభుత్వాలు నిధులు విదిలించకపోతే ఆ స్థానిక సంస్థలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండాల్సిన పరిస్థితులుంటున్నాయి.
చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..
రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీతో సహా మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. జీహెచ్‌ఎంసీలో మొత్తం 17.50 లక్షల స్థిరాస్తులపై ఏటా రూ.4,500 కోట్ల ఆస్తిపన్నులు విధించి వసూలు చేస్తున్నారు. మిగిలిన 141 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో 22 లక్షల స్థిరాస్తులను ఆస్తి పన్నుల పరిధిలోకి తెచ్చి మొత్తం రూ.1,322 కోట్ల పన్నులను వాటిపై విధించారు. మిగిలిన వాటితో పోల్చితే ఒక్క జీహెచ్‌ఎంసీ 3.2 రెట్లు అధిక ఆదాయాన్ని పొందుతోంది. వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, కార్యాలయాలు పెద్దసంఖ్యలో ఉండటం, అద్దె విలువ సైతం అధికంగా ఉండటంతో జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం వస్తోంది.
క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు
రాష్ట్రవ్యాప్తంగా ఆస్తిపన్ను వసూళ్లలో లోపాలను అరికట్టేందుకు ఉన్నతస్థాయిలో కొత్త ఆలోచనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మార్పు రావట్లేదు. జిల్లాల్లో అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)ను ప్రత్యేకంగా సీనియర్ అధికారిగా నియమించినా.. ఆస్తిపన్ను పెంపులో పెరుగుదల ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పట్టణాల వైపు పెరుగుతూ..కొత్త నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. అయినా, స్థానిక సంస్థల ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లలో వందకు వందశాతం వసూలైన దాఖలాలు లేవు.
మదింపులోనే అసలు సమస్య
ఆస్తిపన్ను మదింపులోనే అసలు సమస్యలు వస్తున్నాయి. టాక్స్ ఇన్‌స్పెక్టర్లు ఆస్తిపన్ను మదింపు సమయంలోనే చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులు పుచ్చుకుని ఆస్తిపన్ను తక్కువగా వేస్తున్నారని, ముడుపులివ్వకపోతే అధికంగా వేస్తున్నారని అంటున్నారు. టాక్స్ ఇన్‌స్పెక్టర్లకు ఈ అవకాశం ఇవ్వకుండా భవన నిర్మాణ అనుమతి సమయంలోనే.. నిర్మాణ వైశాల్యం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేసే విధానాన్ని పురపాలక శాఖ ప్రవేశపెట్టింది.
చాలామంది అనుమతులకు మించిన సంఖ్యలో అంతస్తులను నిర్మిస్తుండటంతో.. అక్రమంగా నిర్మించిన అనుమతులు పన్నుల పరిధిలోకి రావడం లేదు. అనుమతిలేకుండా కట్టిన నిర్మాణాలకు పన్నుల చెల్లింపు విషయంలోనూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్తిపన్నుల సవరణ ప్రతీ ఐదేళ్లకోమారు జరగాల్సి ఉన్నా.. నివాస గృహాలపై గత 20 ఏళ్లుగా జరగలేదు. భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచినప్పుడల్లా ఆస్తిపన్ను ఆటోమెటిక్‌గా పెంచేందుకు పురపాలక శాఖ యత్నిస్తోంది. 141 మునిసిపాలిటీలు/ కార్పొరేషన్లలో ఇప్పటివరకు 76 మునిసిపాలిటీల్లో భూముల విలువలు పెరిగినప్పుడల్లా ఆస్తిపన్ను పెరిగే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మరో 65 మునిసిపాలిటీల్లో ఈ విధానం అమలు కావాల్సి ఉంది.
జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో గత ఐదేళ్లలో ఆస్తి పన్ను ఇలా..(ఆగస్టు10 వరకు)
సంవత్సరం ఉన్న ఇళ్లు (లక్షల్లో) డిమాండ్ (రూ.కోట్లలో) వసూళ్లు (రూ.కోట్లలో) శాతం
2018-19 17.53 501.20 445.89 88.96
2019-20 19.18 650.13 561.05 86.30
2020-21 20.27 799.14 719.34 90.01
2021-22 20.76 811.48 698.25 86.04
2022-23 21.95 1,322.89 334.18 25.26
Comments
Please login to add a commentAdd a comment