Authorities negligence
-
Swapnalok Fire Accident: మేయర్ ఏం చెప్పారు.. అధికారులు ఏం చేశారు?
సాక్షి, హైదరాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనతో మరోసారి అధికారుల అలసత్వం బయటపడింది. డెక్కన్ మాల్ అగ్నిప్రమాద అనంతరం ఆగమేఘాల మీద టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయగా, రెండు మీటింగ్‌లకు మాత్రమే కమిటీ పరిమితమైంది. అక్రమ గోదాంలను గుర్తించడంలో అధికారుల అలసత్వం వహిస్తున్నారు. నగరంలో వేలల్లో అక్రమ గోదాములు ఉండగా, కనీస ఫైర్ నిబంధనలను భవన యాజమమానులు పాటించడం లేదు. హైదరాబాద్‌లో ఒక్క ఏడాదీలోనే అగ్నిప్రమాదాలకు ముప్పై మందికి పైగా మృతి చెందారు. భవన యజమానులకు కేవలం నోటీసులతోనే పరిమితం చేశారు.. సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో 4 పెద్ద ఫైర్ యాక్సిడెంట్లు సికింద్రాబాద్‌లో ఏడాది వ్యవధిలో 4 భారీ అగ్రి ప్రమాదం జరగగా 4 చోట్ల 28 మంది మృతి చెందారు. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. గతేడాది మార్చి 23న బోయగూడలోని ఓ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందాగా, సికింద్రాబాద్ రూబీ లాడ్జిలో సెప్టెంబర్ 12న ఫైర్ యాక్సిడెంట్లో 8 మంది మరణించారు. ఆ తర్వాత 4 నెలల్లోనే మరో పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జనవరి 29న డెక్కన్ మాల్లో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో ఉన్న గోడౌన్లను ఖాళీ చేయిస్తామని అధికారులు చెప్పారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. గోడౌన్లపై సర్వే చేసి మరీ రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రిపోర్టు రాలేదు. చర్యలు తీసుకోలేదు. వరుస ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్లలో కూడా చర్యలు తీసుకోలేదు. బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్‌గా ఉందా? లేదా అని మాత్రమే ఫోకస్ పెట్టారు. టాక్స్ కోసం పలుమార్లు తిరుగుతున్నప్పటికీ.. ఆ బిల్డింగ్ వాడకంపై మాత్రం అధికారులు దృష్టి పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. కాగా, సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. అతికష్టమ్మీద గ్రిల్స్ తొలగించి అయిదో అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక శాఖ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ అయిదుగురిని బయటికి తీసుకువచ్చారు. వీరికి సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే వీరు అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్ సైతం కన్నుమూశాడు. ఈ ఆరుగురికి కాలిన గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతోనే చనిపోయారని వైద్యులు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే! -
ఆస్తిపన్ను పరిధిలోకి రాని గృహాలు లక్షల్లో..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. ఆస్తిపన్ను మదింపు, వసూళ్లలో క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పురపాలికలకు ఏటా రూ.వందల కోట్ల ఆదాయానికి గండిపడుతోంది. నిధుల్లేక పురపాలికలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. క్ష్రేత్రస్థాయిలో ఇంకా లక్షల సంఖ్యలో ఆస్తుల పన్ను మదింపు జరగడం లేదు. ఒకవేళ మదింపు జరిగి, నోటీసులు జారీ చేసినా, వందశాతం వసూళ్లు కావడం లేదు. స్థానిక సంస్థలు అభివృద్ధి నిధుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూడక తప్పడం లేదు. ప్రభుత్వాలు నిధులు విదిలించకపోతే ఆ స్థానిక సంస్థలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండాల్సిన పరిస్థితులుంటున్నాయి. చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల.. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో సహా మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థలున్నాయి. జీహెచ్ఎంసీలో మొత్తం 17.50 లక్షల స్థిరాస్తులపై ఏటా రూ.4,500 కోట్ల ఆస్తిపన్నులు విధించి వసూలు చేస్తున్నారు. మిగిలిన 141 మునిసిపాలిటీలు/కార్పొరేషన్ల పరిధిలో 22 లక్షల స్థిరాస్తులను ఆస్తి పన్నుల పరిధిలోకి తెచ్చి మొత్తం రూ.1,322 కోట్ల పన్నులను వాటిపై విధించారు. మిగిలిన వాటితో పోల్చితే ఒక్క జీహెచ్ఎంసీ 3.2 రెట్లు అధిక ఆదాయాన్ని పొందుతోంది. వాణిజ్య భవనాలు, పరిశ్రమలు, కార్యాలయాలు పెద్దసంఖ్యలో ఉండటం, అద్దె విలువ సైతం అధికంగా ఉండటంతో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం వస్తోంది. క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు రాష్ట్రవ్యాప్తంగా ఆస్తిపన్ను వసూళ్లలో లోపాలను అరికట్టేందుకు ఉన్నతస్థాయిలో కొత్త ఆలోచనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మార్పు రావట్లేదు. జిల్లాల్లో అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)ను ప్రత్యేకంగా సీనియర్ అధికారిగా నియమించినా.. ఆస్తిపన్ను పెంపులో పెరుగుదల ఉండట్లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పట్టణాల వైపు పెరుగుతూ..కొత్త నిర్మాణాలు భారీగా పెరుగుతున్నాయి. అయినా, స్థానిక సంస్థల ఆదాయం ఆ స్థాయిలో పెరగడం లేదు. మరోవైపు ఆస్తిపన్ను వసూళ్లలో వందకు వందశాతం వసూలైన దాఖలాలు లేవు. మదింపులోనే అసలు సమస్య ఆస్తిపన్ను మదింపులోనే అసలు సమస్యలు వస్తున్నాయి. టాక్స్ ఇన్స్పెక్టర్లు ఆస్తిపన్ను మదింపు సమయంలోనే చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులు పుచ్చుకుని ఆస్తిపన్ను తక్కువగా వేస్తున్నారని, ముడుపులివ్వకపోతే అధికంగా వేస్తున్నారని అంటున్నారు. టాక్స్ ఇన్స్పెక్టర్లకు ఈ అవకాశం ఇవ్వకుండా భవన నిర్మాణ అనుమతి సమయంలోనే.. నిర్మాణ వైశాల్యం ఆధారంగా ఆస్తిపన్ను మదింపు చేసే విధానాన్ని పురపాలక శాఖ ప్రవేశపెట్టింది. చాలామంది అనుమతులకు మించిన సంఖ్యలో అంతస్తులను నిర్మిస్తుండటంతో.. అక్రమంగా నిర్మించిన అనుమతులు పన్నుల పరిధిలోకి రావడం లేదు. అనుమతిలేకుండా కట్టిన నిర్మాణాలకు పన్నుల చెల్లింపు విషయంలోనూ కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్తిపన్నుల సవరణ ప్రతీ ఐదేళ్లకోమారు జరగాల్సి ఉన్నా.. నివాస గృహాలపై గత 20 ఏళ్లుగా జరగలేదు. భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచినప్పుడల్లా ఆస్తిపన్ను ఆటోమెటిక్‌గా పెంచేందుకు పురపాలక శాఖ యత్నిస్తోంది. 141 మునిసిపాలిటీలు/ కార్పొరేషన్లలో ఇప్పటివరకు 76 మునిసిపాలిటీల్లో భూముల విలువలు పెరిగినప్పుడల్లా ఆస్తిపన్ను పెరిగే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మరో 65 మునిసిపాలిటీల్లో ఈ విధానం అమలు కావాల్సి ఉంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 141 పురపాలికల్లో గత ఐదేళ్లలో ఆస్తి పన్ను ఇలా..(ఆగస్టు10 వరకు) సంవత్సరం ఉన్న ఇళ్లు (లక్షల్లో) డిమాండ్ (రూ.కోట్లలో) వసూళ్లు (రూ.కోట్లలో) శాతం 2018-19 17.53 501.20 445.89 88.96 2019-20 19.18 650.13 561.05 86.30 2020-21 20.27 799.14 719.34 90.01 2021-22 20.76 811.48 698.25 86.04 2022-23 21.95 1,322.89 334.18 25.26 -
పట్టింపులేని ప్రభుత్వ భూములు
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : నగరాలు... పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి రీత్యా పల్లెలనుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రియల్ఎస్టేట్లలో ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకుని నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఎక్కువైంది. ఇలా వెంచర్లు వేసేవారు నిబంధనల ప్రకారం పదిశాతం స్థలాన్ని రిజర్వుసైట్‌గా కేటాయించాలి. దానిని ప్లాట్లు కొనుగోలు చేసుకున్నవారి ప్రయోజనాల కోసం అంటే పార్కులుగానీ... కమ్యూనిటీ భవనాలుగానీ... ఇంకా ఏదైనా ప్రజోపయోగానికి గానీ వినియోగించుకో వాల్సి ఉంటుంది. అయితే ఆ స్థలాలను అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగమవుతున్నాయి. కొన్ని చోట్ల కబ్జాలూ పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. జిల్లా వ్యాప్తంగా స్థలాలు నిరుపయోగమే... జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు పురపాలి కలతో పాటు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో చిన్న, పెద్ద లేఅవుట్లు వెలుస్తూనే ఉన్నాయి. ఇందులో జిల్లా కేంద్రం విజయనగరం విశాఖ నగరాభివృద్ధి సంస్థ(ఉడా) పరిధిలోకి వస్తుంది. ఇటీవల బుడాను ఏర్పాటు చేయడంతో కొన్ని బుడా పరిధిలోకి వచ్చి చేరాయి. వీటిలో కేటాయించిన ప్రజోపయోగ స్థలాల్లో అభివృద్ధి పనులు కూడా ఉడా, బుడా పరిధిలోకి వస్తాయి. మిగిలిన పురపాలక సంఘాల్లో నివాస స్థలాలకు డిమాండ్ ఉన్నందున స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడ అనుమతులు ఉన్న లే అవుట్లు 100 వరకు ఉండగా అనధికార లే అవుట్లు 200 వరకు ఉన్నాయి. వీటి అన్నింటిలో ప్రజోపయోగానికి కేటాయించిన 10శాతం స్థలాలను స్వాధీనం చేసుకొని.. అవసరమైన పనులు చేపట్టాల్సి బాధ్యత ఆయా మునిసిపాలిటీలదే. కానీ ఎక్కడా ఆ దిశగా చర్యలు కానరావడం లేదు. ఫలితంగా లక్షలు విలువ చేసే స్థలాలు పనికిరాకుండా వృథాగా పడి ఉన్నాయి. వినియోగానికి నోచుకోని స్థలాలు పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో అనుమతి పొందిన లే అవుట్లు ఏడు ఉండగా, మరో ఆరు అనధికార లే అవుట్లు ఉన్నాయి. ఇందులో ఎస్ఎన్ఎం నగర్లో అనుమతులు పొందిన లే అవుట్లో కేటాయించిన స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పటి వరకు దీని అభివృద్ధికి రూ. 5లక్షలు ఖర్చు చేసినప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృథాగా ఉంది. సౌందర్య సినిమాహాలు వెనుక భాగంలోని శత్రుచర్ల రియ ల్ ఎస్టేట్‌లో ప్రజోపయోగానికి కేటాయించిన స్థలంలో రూ.30 లక్షలతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. ఈ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. బెలగాం విశ్వవిజ్ఞాన పాఠశా ల ఎదురుగా శత్రుచర్ల నగర్ శివారులో వేసిన సాయినగర్ లేఅవుట్లో ప్రజోపయోగానికి కేటాయించిన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఖాళీగా ఉంది. పట్టణంలో అమరావతి నగర్, శత్రుచర్ల నగర్లో పురపాలక సంఘానికి అప్పగించిన స్థలాలు ఉన్నప్పటికీ అభివృద్ధి చెందడం లేదు. కేటాయించినా నిరుపయోగమే... బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో అధికారంగా వెలిసిన లేఅవుటు ఒక్కటే ఉండగా అక్కడ ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన స్థలం ఖాళీగా ఉంది. ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. జిల్లాలోనే అత్యధికంగా అనధికార లే అవుట్లు ఇక్కడ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు పట్టణంలో స్థలాలకు విపరీతమైన గిరాకీ ఉండడంతో ఎక్కడా లే అవుట్లకు అనుమతులు పొందిన దాఖలాలు లేవు. వీటిలో ప్రజోపయోగ స్థలాల కేటాయింపు అంతంత మాత్రమే. ఇక్కడ ఇళ్లస్థలాల క్రయ విక్రయాలన్నీ అనధికారంగానే నడుస్తున్నాయనే అభిప్రాయం ఉంది. అభివృద్ధిపై కానరాని చిత్తశుద్ధి సాలూరు పురపాలక పరిధిలో అనుమతులు పొందిన మూడు లేఅవుట్లు ఉన్నాయి. వీటిలో ప్రజావసరాలకు కేటాయించిన స్థలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. దీనివల్ల ఇక్కడ స్థలాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. ఒక చోట ఖాళీ స్థలానికి కంచె ఏర్పాటు చేశారు తప్ప ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. నెల్లిమర్ల నగర పంచాయతీలో పట్టణాభివృద్ధి అంతంత మాత్రమే. ఈ ప్రాంతంలో అనుమతులు పొందిన లే అవుట్ ఒకటి ఉండగా అనధికారంగా అయిదు లే అవుట్లు వెలిశాయి. ఉన్న అధికార లే అవుట్లో కూడా ప్రజావసరాలకు కేటాయించిన స్థలం నిరుపయోగంగా ఉంది. ఇప్పుడిప్పుడే కొత్తగా ఎన్నో లేఅవుట్లు వెలుస్తున్నా వారు కేటాయించే పది శాతం స్థలాలు కూడా తమ పరిధిలోకి తీసుకునే తీరిక పురపాలిక సంఘ అధికారులకు ఉండడంలేదు. అభివృద్ధికి ప్రణాళికలు పార్వతీపురం పట్టణంలో వెలుస్తున్న లే అవుట్లలో ప్రజావసరాలకు పదిశా తం స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నాం. పురపాలక సంఘం పరంగా ఆ స్థలాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇతర లే అవుట్లలోను ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతీ స్థలాన్ని ప్రజలకు ఉపయోగ పడేవిధంగా అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతాం. – పి.నల్లనయ్య, పురపాలక కమిషనర్, పార్వతీపురం -
‘కేశోరాం’లో కార్మికుడి మృతి
సాక్షి, పాలకుర్తి(కరీంనగర్): పాలకుర్తి మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారంలో బుధవారం లిఫ్ట్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి కొడారి నర్సింగం(42) అనే పర్మినెంట్ కార్మికుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యులు, తోటికార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన నర్సింగం కేశోరాం సిమెంట్ కర్మాగారంలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ఉదయం షిఫ్ట్ విధులకు హాజరై సిమెంట్ మిల్లు వద్ద నాల్గో అంతస్తులో పని చేస్తుండగా ఉదయం సుమారు 10 గంటలకు టీ తాగేందుకు లిఫ్ట్ ద్వారా కిందకు దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు 60 మీటర్ల ఎత్తు నుంచి కింద పడ్డాడు. దీంతో అతని తలతోపాటు చేయి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటికార్మికులు, అధికారులు కంపెనీ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్‌లతోపాటు ఇతర నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కార్మికసంఘం నాయకులు, అధికారులతో కలిసి ప్రమాదం జరిగిన వీఆర్‌పీఎం లిఫ్ట్ ప్రాంతాన్ని, సిమెంట్ మిల్లు నాల్గో అంతస్తు పైకి ఎక్కి పరిశీలించి మృతుడి కుటుంబానికి రూ.40లక్షలు ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐదుగంటల పాటు ఉద్రిక్త వాతావరణం కార్మికుడు నర్సింగం మృతితో కార్మికులు ఉదయం షిప్టు విధులను బహిష్కరించి కంపెనీ గేట్ ఎదుట నిరసనకు దిగారు. తొలుత యాజమాన్యం రూ.20లక్షలతోపాటు నర్సింగం కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. ఈమేరకు కంపెనీ ప్లాంట్ హెడ్ రాజేశ్‌గర్గు ఈవిషయాన్ని కార్మికసంఘం నాయకులకు తెలుపగా అందుకు వారు ఒప్పుకోకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కార్మికసంఘం నాయకులకు, అధికారులకు మధ్య పలుదఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో నాయకులు, కార్మికులు గేట్ ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దాదాపు 5గంటల పాటు పలు దఫాలుగా కొనసాగిన చర్చల అనంతరం మృతుడి కుటుంబానికి రూ.33లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. దీంతో పాటు మృతుడి కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం, సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన విచారణ నిర్వహించి చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం అంగీకరిస్తూ వ్రాతపూర్వకంగా ఒప్పందపత్రాన్ని అందజేశారు. దీంతో కార్మికులు, నాయకులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మికసంఘం అధ్యక్షుడు కౌశికహరి, ప్రధాన కార్యదర్శి తోడేటి రవికుమార్, జీడీనగర్, బసంత్‌నగర్, పాలకుర్తి సర్పంచులు సూర సమ్మయ్య, కట్టెకోల వేణుగోపాలరావు, జగన్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్, పాలకుర్తి వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, నాయకులు అయోధ్య సింగ్, తంగెడ అనిల్‌రావు, ముల్కల కొంరయ్య, అంతర్గాం జెడ్పీటీసీ నారాయణతోపాటు సమీప గ్రామాల ప్రజాప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు. కాగా మృతుడికి భార్య సరితతోపాటు ఇద్దరు కుమారులున్నారు, మృతుడి తల్లి సుశీల కంపెనీ ఎదుట పండ్ల షాపు నిర్వహిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే నర్సింగం మృతితో ఈసాలతక్కళ్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కారణం కేశోరాం కర్మాగారంలో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కార్మికులు ఆరోపిస్తున్నారు. కర్మాగారంలో ఐదో అంతస్తులు గల సిమెంట్ మిల్లు వద్ద కార్మికులు ఎక్కేందుకు, దిగేందుకు ఏర్పాటు చేసిన గల వీఆర్‌పీఎం లిఫ్ట్‌కు ఆపరేటర్ లేడని, లిఫ్ట్ కూడా సరిగ్గా పనిచేయడం లేదని ఒకచోట ఆగాల్సింది ఇంకో చోట ఆగుతోందని ఈవిషయాన్ని సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ సరిగ్గా ఆగకపోవడం వల్లనే నర్సింగం అదుపుతప్పి కింద పడి మృతిచెందాడని, వెంటనే సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చిన్నారిని మింగేసింది !
కొత్తూరు: అధికారుల నిర్లక్ష్యానికి 20 నెలల బాలుడి నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ విషాద సంఘటన కొత్తూరు మండలం బలద గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఇంకుడు గుంతలో పడి ఏకైక కుమారుడు తనువు చాలించడంతో కన్నవారు కన్నీరు మున్నీరయ్యూరు. వివరాల్లోకి వెళ్తే... ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు తవ్వాలని అధికారులు నిబంధన పెట్టారు. గుంతలు తవ్వకపోతే ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు, రేషన్‌కార్డులు రద్దవుతాయని ఆదేశించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా, ఎక్కడిపడితే అక్కడ గోతులను అందరూ తవ్వేశారు. అరుుతే బిల్లుల చెల్లింపులో జాప్యం, ఇతరత్రా కారణాలతో గుంతలను కప్పలేదు. ఈ క్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుంతలన్నీ నీటితో నిండిపోయూయి. బలద గ్రామానికి చెందిన సింగుపురం కృష్ణారావు కూడా రెండు నెలల క్రితం తన ఇంటి ముందు ఇంకుడు గుంత తవ్వినప్పటికీ.. ఇప్పటివరకూ బిల్లు చెల్లించలేదు. దీంతో దాన్ని కప్పకుండా అలాగే ఉంచేశాడు. అరుుతే తన 20 నెలల కొడుకు సాయి బుధవారం సాయంత్రం ఆడుకుంటూ గుంతలో పడిపోయూడు. ఈ విషయూన్ని ఎవరూ గమనించలేదు. రాత్రి వేళ కావడంతో బాబుకి భోజనం పెట్టేందుకు కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. ఇంతలో ఇంటిముందు ఉన్న ఇంకుడుగుంతలో సారుు కనిపించడంతో బయటకు తీశారు. కొనఊపిరితో ఉండడంతో ఆటోలో కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేందానికి తీసుకొచ్చారు. బాబుని పరీక్షించిన వైద్యులు అప్పటికే సాయి చనిపోయినట్టు నిర్ధారించారు. ఏకైక బిడ్డ ఇకలేడని తెలిసి కన్నవారు కృష్ణారావు, రాణి దంపతులు విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. బలడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కొడుకును కోల్పోయిన కృష్ణారావు దంపతులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీవో ఏమన్నారంటే.. ఇంకుడు గుంతలో పడి బాలుడు చనిపోయిన విషయూన్ని ఉపాధిహామీ పథకం మండల ఏపీవో అంగూరు సురేష్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కృష్ణారావుకు చెందిన జాబ్ కార్డును నిలిపివేయడంతో ఇంకుడు గుంతకు బిల్లు చేయలేదని చెప్పారు. ఇదే విషయూన్ని ఇప్పటికే కృష్ణారావుకు చెప్పినట్టు పేర్కొన్నారు. ఆనందం ఆవిరి కృష్ణారావు, రాణి దంపతులకు ఒక్కడే బాబు. అల్లారిముద్దుగా పెంచేవారు. నిరుపేదలైనప్పటికీ బాగా చూసుకునేవారు. బుధవారం సాయంత్రం కూడా బాబుని తల్లి రాణి ఆడించింది. అంతలోనే బయటకు వెళ్లి ఇంటిముందు ఉన్న గుంతలో పడి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ నిరుపేద తల్లిదండ్రులు తీవ్ర విషాదానికి గురయ్యూరు. -
ఎన్నాళ్లీ కన్నీళ్లు!!
ఎక్కడ జబ్బు ఉంటే అక్కడ మందు వేయాలి.. కానీ జీజీహెచ్‌లో వేళ్లూనుకున్న నిర్లక్ష్యానికి ఎక్కడ చికిత్స చేయాలి? ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఘోరతప్పిదాలు జరుగుతున్నా చీమకుట్టినట్లయినా చలించని పాలకులను, అధికారులను ఏం అనాలి? సిబ్బంది బాధ్యతారాహిత్యానికి ఎలా ఖరీదు కట్టాలి? పెద్దాసుపత్రిలో పేదల ఆరోగ్యానికి భద్రతలేని వైనానికి ఎవరు జవాబు చెప్పాలి? తాజాగా చిన్నారిపై ఎలుకల దాడి ఘటన మొత్తం వ్యవస్థనే ప్రశ్నిస్తోంది. ఏడాది కాలంలో ఇక్కడ జరుగుతున్న వరుస సంఘటనలను పరికిస్తే పేదల ప్రాణాలకు ఇక్కడ విలువెంతుందో తెలుస్తోంది. సాక్షి, గుంటూరు : కోస్తాంధ్రలోని ఆరు జిల్లాలకు ఆరోగ్యప్రదాయనిగా పేరొంది రాజధాని ప్రాంతంలో అతి పెద్ద ఆసుపత్రిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి వెళ్లాలంటేనే రోగులు హడలిపోతున్నారు. జీజీహెచ్ వైద్యులు, అధికారుల నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారుతోంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా.. జీజీహెచ్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నా అధికారులు, వైద్యుల బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యంతో అనేకమంది రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. మరోవైపు జీజీహెచ్‌లో అడుగడుగున అవినీతి రాజ్యమేలుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా నివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేకుండా పోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ప్రజాప్రతినిధుల అండతో అక్కడి అధికారులు లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ రోగులపైఅశ్రద్ధ వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వేణుగోపాలరావు భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జీజీహెచ్‌లో ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జీజీహెచ్‌లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే.. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి జీజీహెచ్‌లో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ముందుకు వచ్చారు. ఆయన హార్ట్‌లంగ్ మిషన్ మూలన పడిన విషయాన్ని గుర్తించారు. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు నాలుగునెలలు ఆలస్యంగా ఆపరేషన్లు మొదలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. జీజీహెచ్ ప్రసూతి విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలు, 2.10 గంటలకు వరుసగా గండి అనిత, కామినేని అనితలు మగ, ఆడ బిడ్డలకు జన్మనిచ్చారు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డలు మార్పడినట్లు అనుమానించిన ఇద్దరు తల్లులూ తమకు మగబిడ్డే పుట్టిందంటూ గొడవకు దిగారు. జబ్బు తో ఉన్న ఆడ శిశువును ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతి చెందింది. చివరకు జీజీహెచ్ అధికారులు సైతం పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మే నెలలో బ్రాహ్మణపల్లికి చెందిన దోమవరపు లావణ్య అనే ఓ నిండు గర్భిణి ప్రసూతి వైద్య విభాగానికి వచ్చింది. వైద్యుల సూచన మేరకు స్కానింగ్ కేంద్రం వద్దకు వెళ్లింది. అయితే అనేక గంటలపాటు పడిగాపులు కాసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో నొప్పులు ఎక్కువై అక్కడే నేలపై పడి ప్రసవించింది. నేలపై పడ్డ రక్తపు మరకలను సైతం అక్కడి సిబ్బంది గర్భిణి వెంట వచ్చిన ఆమె తల్లితో తుడిపించారు. మే 4వ తేదీన ఓ తల్లి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆడ పిల్ల అని తెలియగానే వదిలేసి వెళ్లిపోయింది. ఆమె వెళ్తున్నప్పుడు సిబ్బంది సైతం గమనించకపోవడం దారుణం. ప్రత్తిపాడుకు చెందిన ఓ బాలింత బాత్రూమ్కు వెళ్ళి వచ్చేసరికి పసిబిడ్డను ఎవరో గుర్తు తెలియని మహిల ఎత్తుకెళ్లింది. దీంతో ఆ బాలింత లబోదిబో మనడంతో కొత్తపేట పోలీసులు అప్రమత్తమై బిడ్డను ఎత్తుకెళ్ళిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. జీజీహెచ్‌లో బిడ్డలు మార్పడటం, బిడ్డల్ని ఎత్తుకెళ్ళడం పరిపాటిగా మారినా అక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోతుంది. కనీసం ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేవు. భద్రత డొల్లతనం స్పష్టమౌతుంది. తాజాగా పదిరోజుల శిశువుపై మూషికాలు దాడిచేసి చంపడం అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంతవరకూ ఎవ్వరిపై చర్యలు తీసుకోకుండా, తాను సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అనూష అనే బాలింతరాలు ఆడబిడ్డను కని నొప్పులతో బాధపడుతూ వైద్యులకు చెప్పగా పెయిన్ కిల్లర్ ఇచ్చి బెడ్‌పై పడుకోబెట్టారు. ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతి చెందింది. దారుణమైన విషయమేమిటంటే ఆమె మృతి చెందిన ఆరుగంటలపాటు అక్కడి వైద్యులు, సిబ్బంది గుర్తించలేదు. పసిబిడ్డ ఏడుపు విని చుట్టు పక్కల వారు వచ్చి చూశారు. అప్పటికే ఆమె మృతదేహం నీలుక్కుపోయి ఉంది. విషయం తెలుసుకున్న సిబ్బంది మృతదేహాన్ని ఐసీయూకు తరలించి డ్రామా రక్తి కట్టించారు. వీరి నిర్లక్ష్యానికి ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. -
పోలీస్‌లకే ‘ప్రజావాణి’
- ప్రజావాణిపై అధికారులు నిర్లక్ష్యం - డీఆర్వో కార్యాలయం గేట్లకు తాళాలు - దరఖాస్తులు తీసుకున్న పోలీస్ సిబ్బంది హన్మకొండ అర్బన్ : ప్రజావాణి నిర్వాహణలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. వందల కి లోమీటర్ల దూరం నుంచి జనం తమ బాధలు చెప్పుకునేందుకు వస్తే డీఆర్వో కార్యాలయంలో అధికారులు తలుపులకు తాళాలు వేసుకుని జనాన్ని గంటల కొద్దీ నిలబెట్టారు. ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజలనుంచి డీఆర్వో, రిటైర్డ్స్ ఎస్డీసీ ప్రసాద్‌రావు వినతులు స్వీకరించారు. గత రెండు వారాలుగా ప్రజావాణి లేక పోవడంతో ఈ సారి జనం ప్రజావాణికి పోటెత్తారు. సుదూర ప్రాంతాలనుంచి ఉన్నతాధికారులకు తమ గోడు వెళ్ల బోసుకుందామని కలెక్టరేట్‌కు జనం వ స్తే అధికారులు మాత్రం జనం సహనానికి పరీక్ష పెట్టారు. వచ్చిన దరఖాస్తును నమోదు చేసుకునేందుకు డీఆర్వో కార్యాలయం వద్ద ఒక్కొకరిని సుమారు మూడు గంటలపాటు నిలబెట్టారు. వారినుంచి దరఖాస్తులు తీసుకునేవారు లేరు. ఒక తరుణంలో జనం అధికారులతో వాగ్వాదానికి దిగారు. వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడి అధికారుల తీరును తీవ్రంగా నిరసించారు. జనం ఆందోళన ఉధృతం అవుతుండటంతో అక్కడ కాపలాగా ఉన్న పోలీస్ సిబ్బంది జనం నుంచి దరఖాస్తులన్నీ సేకరించి కుప్పపోశారు. ఇప్పటికైనా అధికారులు ప్రయోగాలు మాని ఒక పద్ధతి ప్రకారం ప్రజావాణి నిర్వహించాలని జనం కోరుతున్నారు. -
అధికారులూ...నిర్లక్ష్యం వద్దు
స్పీకర్ మధుసూదనాచారి కాచిగూడ: సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోతారని, కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ సమీక్ష సమావేశాన్ని బుధవారం కాచిగూడలోని మహేంద్ర గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కాగితాలకే పరిమితమవుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండానే నివేదికలు అందిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు మరోసారి సరి చూసుకోవాలన్నారు. పనులు చేపట్టకున్నా చేపట్టినట్లు రికార్డులు రాస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అధికారుల్లో జవాబుదారీతనం కొరవడుతోందని అసంతృప్తి వ్యక్తం చే శారు. ఐదారేళ్లుగా అనేక పనులు కొనసాగుతున్నాయని, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, జీహెచ్ఎంసీ సర్కిల్-9 డీఎంసీ సత్యనారాయణ, వాటర్‌వర్క్స్ డీజీఎం శ్రీధర్, నోడల్ అధికారి రాజేంద్ర కుమార్, ప్రేరణ, మాజీ కార్పొరేటర్ కన్నె ఉమారాణి, బీజేపీ గ్రేటర్ కార్యదర్శి కన్నె రమేష్‌యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎక్కాల కన్నా, బి.రవీందర్‌యాదవ్, సునిల్ బిడ్లాన్, ఎస్.మున్నాసింగ్, దూసరి శ్రీనివాస్‌గౌడ్, మేడిశెట్టి రాజేష్, తుమ్మల నర్సింహ్మారెడ్డి, యాంకర్ పవన్, లక్నపురి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.