ఎన్నాళ్లీ కన్నీళ్లు!!
ఎక్కడ జబ్బు ఉంటే అక్కడ మందు వేయాలి.. కానీ జీజీహెచ్‌లో వేళ్లూనుకున్న నిర్లక్ష్యానికి ఎక్కడ చికిత్స చేయాలి? ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఘోరతప్పిదాలు జరుగుతున్నా చీమకుట్టినట్లయినా చలించని పాలకులను, అధికారులను ఏం అనాలి? సిబ్బంది బాధ్యతారాహిత్యానికి ఎలా ఖరీదు కట్టాలి? పెద్దాసుపత్రిలో పేదల ఆరోగ్యానికి భద్రతలేని వైనానికి ఎవరు జవాబు చెప్పాలి? తాజాగా చిన్నారిపై ఎలుకల దాడి ఘటన మొత్తం వ్యవస్థనే ప్రశ్నిస్తోంది. ఏడాది కాలంలో ఇక్కడ జరుగుతున్న వరుస సంఘటనలను పరికిస్తే పేదల ప్రాణాలకు ఇక్కడ విలువెంతుందో తెలుస్తోంది.
సాక్షి, గుంటూరు : కోస్తాంధ్రలోని ఆరు జిల్లాలకు ఆరోగ్యప్రదాయనిగా పేరొంది రాజధాని ప్రాంతంలో అతి పెద్ద ఆసుపత్రిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి వెళ్లాలంటేనే రోగులు హడలిపోతున్నారు. జీజీహెచ్ వైద్యులు, అధికారుల నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారుతోంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా.. జీజీహెచ్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నా అధికారులు, వైద్యుల బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యంతో అనేకమంది రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. మరోవైపు జీజీహెచ్‌లో అడుగడుగున అవినీతి రాజ్యమేలుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా నివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేకుండా పోయాయి.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ప్రజాప్రతినిధుల అండతో అక్కడి అధికారులు లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ రోగులపైఅశ్రద్ధ వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వేణుగోపాలరావు భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జీజీహెచ్‌లో ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
జీజీహెచ్‌లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే..
గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి జీజీహెచ్‌లో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ముందుకు వచ్చారు. ఆయన హార్ట్‌లంగ్ మిషన్ మూలన పడిన విషయాన్ని గుర్తించారు. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు నాలుగునెలలు ఆలస్యంగా ఆపరేషన్లు మొదలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.
జీజీహెచ్ ప్రసూతి విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలు, 2.10 గంటలకు వరుసగా గండి అనిత, కామినేని అనితలు మగ, ఆడ బిడ్డలకు జన్మనిచ్చారు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డలు మార్పడినట్లు అనుమానించిన ఇద్దరు తల్లులూ తమకు మగబిడ్డే పుట్టిందంటూ గొడవకు దిగారు. జబ్బు తో ఉన్న ఆడ శిశువును ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతి చెందింది. చివరకు జీజీహెచ్ అధికారులు సైతం పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
మే నెలలో బ్రాహ్మణపల్లికి చెందిన దోమవరపు లావణ్య అనే ఓ నిండు గర్భిణి ప్రసూతి వైద్య విభాగానికి వచ్చింది. వైద్యుల సూచన మేరకు స్కానింగ్ కేంద్రం వద్దకు వెళ్లింది. అయితే అనేక గంటలపాటు పడిగాపులు కాసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో నొప్పులు ఎక్కువై అక్కడే నేలపై పడి ప్రసవించింది. నేలపై పడ్డ రక్తపు మరకలను సైతం అక్కడి సిబ్బంది గర్భిణి వెంట వచ్చిన ఆమె తల్లితో తుడిపించారు.
మే 4వ తేదీన ఓ తల్లి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆడ పిల్ల అని తెలియగానే వదిలేసి వెళ్లిపోయింది. ఆమె వెళ్తున్నప్పుడు సిబ్బంది సైతం గమనించకపోవడం దారుణం.
ప్రత్తిపాడుకు చెందిన ఓ బాలింత బాత్‌రూమ్‌కు వెళ్ళి వచ్చేసరికి పసిబిడ్డను ఎవరో గుర్తు తెలియని మహిల ఎత్తుకెళ్లింది. దీంతో ఆ బాలింత లబోదిబో మనడంతో కొత్తపేట పోలీసులు అప్రమత్తమై బిడ్డను ఎత్తుకెళ్ళిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. జీజీహెచ్‌లో బిడ్డలు మార్పడటం, బిడ్డల్ని ఎత్తుకెళ్ళడం పరిపాటిగా మారినా అక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోతుంది. కనీసం ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేవు. భద్రత డొల్లతనం స్పష్టమౌతుంది.
తాజాగా పదిరోజుల శిశువుపై మూషికాలు దాడిచేసి చంపడం అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంతవరకూ ఎవ్వరిపై చర్యలు తీసుకోకుండా, తాను సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని పలువురు విమర్శిస్తున్నారు.
అనూష అనే బాలింతరాలు ఆడబిడ్డను కని నొప్పులతో బాధపడుతూ వైద్యులకు చెప్పగా పెయిన్ కిల్లర్ ఇచ్చి బెడ్‌పై పడుకోబెట్టారు. ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతి చెందింది. దారుణమైన విషయమేమిటంటే ఆమె మృతి చెందిన ఆరుగంటలపాటు అక్కడి వైద్యులు, సిబ్బంది గుర్తించలేదు. పసిబిడ్డ ఏడుపు విని చుట్టు పక్కల వారు వచ్చి చూశారు. అప్పటికే ఆమె మృతదేహం నీలుక్కుపోయి ఉంది. విషయం తెలుసుకున్న సిబ్బంది మృతదేహాన్ని ఐసీయూకు తరలించి డ్రామా రక్తి కట్టించారు. వీరి నిర్లక్ష్యానికి ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు.