GGH doctors
-
‘పోకిరి’ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స చేసేశారు..
గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన ‘పోకిరి’ సినిమా చూపిస్తూ.. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. కుడికాలు, కుడిచెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్డెక్స్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశామన్నారు. -
బాబు ఆరోగ్యం బాగుంది
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. ఆయన వైద్య పరీక్షలకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై జీజీహెచ్ వైద్య బృందం, జిల్లా ఎస్పీ పి.జగదీష్ లతో డీఐజీ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు 67 కిలోల బరువు ఉన్నారన్నారు. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపారు. జీజీహెచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మార్కండేయులు, డిపార్ట్మెంట్ ఆఫ్ డెర్మటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతాదేవి, డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థీషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర, డిపార్ట్మెంట్ ఆఫ్ పాథాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.హిమజ బృందం చంద్రబాబు ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించిందని వెల్లడించారు. స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు.. ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి అన్నీ బాగున్నాయని చెప్పారు. తమతో ఆయన బాగా మాట్లాడారన్నారు. అన్ని విషయాలు అడిగామన్నారు. షుగర్ కూడా అదుపులోనే ఉందని తెలిపారు. చంద్రబాబు వాడుతున్న మందులను కూడా పరిశీలించామన్నారు. శరీరంపై దద్దుర్లు ఉన్నాయని.. వాటికి ఆయన వాడుతున్న మందులతో పాటు తాము కొన్ని రకాల మందులు ఇచ్చామని వివరించారు. స్టెరాయిడ్స్ ఇస్తున్నారన్న మాట పూర్తిగా అసత్యమన్నారు. శరీరంపై ఉన్న దద్దుర్ల దృష్ట్యా చల్లని వాతావరణంలో ఆయన ఉండాలని చెప్పారు. జీజీహెచ్‌లో చంద్రబాబుకు వైద్య పరీక్షల నిమిత్తం ప్రత్యేక గది ఏర్పాటు చేయలేదన్నారు. నిత్యం జీజీహెచ్‌లో ఒక ప్రత్యేక గది ఉంటుందని స్పష్టం చేశారు. కాగా చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు డీఐజీ రవికిరణ్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు జైళ్ల శాఖలో ఖైదీలకు ఏసీ ఏర్పాటు చేయలేదన్నారు. కాబట్టి తాము ఏసీని ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు. వైద్య బృందం ఇచ్చిన నివేదికను కోర్టుకు అందజేస్తామన్నారు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు. జైలు లోపల 85 ఏళ్ల వృద్ధ ఖైదీ కూడా ఉన్నారన్నారు. జైలు లోపల ఉన్న అందరినీ జాగ్రత్తగా చూస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రత్యేక ఖైదీ అయినందున మరింత శ్రద్ధ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. జైలులో జరుగుతున్న ప్రతి విషయాన్ని కోర్టుకు నివేదిస్తున్నామని వివరించారు. రిపోర్టును బయట ఎవరికీ ఇవ్వలేదు.. చంద్రబాబుకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టును జీజీహెచ్ వైద్య బృందం తమకు అందించిందని డీఐజీ రవికిరణ్ చెప్పారు. ఆ రిపోర్టును తాము బయట ఎవరికీ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు తరఫున వచ్చిన లాయర్లు ఇవ్వాలని అడిగితే ఆయన అనుమతి తీసుకుని, సంతకం చేయించుకుని రిపోర్టును లాయర్లకు అందజేశామని తెలిపారు. అందులో ఒక లైనును జైలు అధికారులు బ్లాక్ మార్కర్‌తో కనిపించకుండా చేశారన్న వార్తలు పూర్తిగా అవాస్తమన్నారు. ఆ లెటర్‌పై బ్లాక్ మార్కు చేసి ఎవరు వైరల్ చేస్తున్నారో తమకు తెలియదని చెప్పారు. కాగా తమ పట్ల డీఐజీ దురుసుగా ప్రవర్తించారని లోకేశ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ములాఖత్ సమయం ముగిసిందని.. నిబంధనల ప్రకారం మీరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని మాత్రమే చెప్పానన్నారు. చంద్రబాబును కలిసిన లోకేశ్ చంద్రబాబును ఆయన తనయుడు నారా లోకేశ్, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్‌లో కలిశారు. శనివారం మధ్యాహ్నం 40 నిమిషాల పాటు జరిగిన ములాఖత్ అనంతరం వారు జైలు నుంచి నేరుగా వారు ఉంటున్న క్యాంప్‌కు వెళ్లారు. కాగా ములాఖత్‌లో లోకేశ్ డీఐజీ రవికిరణ్‌తో వాగ్వాదానికి దిగారని సమాచారం. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని, ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును వైద్యులు సూచించిన మేరకు చల్లటి వాతావరణంలో ఎందుకు ఉంచడం లేదని నిలదీసినట్టు తెలిసింది. -
అరుదైన కణితికి శస్త్రచికిత్స
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ వైద్యులు అత్యంత అరుదైన కణితి టెరటోమాను తొలగించి.. పసికందు ప్రాణాలను కాపాడారు. ఈ వివరాలను ప్లాస్టిక్ సర్జరీ వైద్య విభాగాధిపతి డాక్టర్ సుమితా శంకర్ శనివారం మీడియాకు వెల్లడించారు. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన బీసుపోగు చైతన్య, ఏసయ్య దంపతులకు ఈ ఏడాది జూన్‌లో మగబిడ్డ జన్మించాడు. పుట్టుకతోనే చిన్నారి ముక్కుపై భాగంలో సుమారు కిలో బరువున్న కణితి ఉండటంతో.. తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే చిన్నారిని తీసుకొని జీజీహెచ్‌కు వచ్చారు. పిల్లల వైద్యులు బిడ్డను పరీక్షించి న్యూరోసర్జరీ వైద్య విభాగానికి రిఫర్ చేశారు. జూన్ 4న ఆ పసికందుకు ప్లాస్టిక్ సర్జరీ, న్యూరోసర్జరీ వైద్యులు ఆపరేషన్ చేసి విజయవంతంగా ముక్కుపై ఉన్న కణితిని తొలగించారు. ఆ తర్వాత ముక్కు పై భాగంలో ఎక్కువ ఖాళీ ఉండటంతో.. ఇన్ఫెక్షన్లు బ్రెయిన్‌కు సోకే ప్రమాదాన్ని వైద్యులు గుర్తించారు. ఈనెల 21న మరో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆ ఖాళీని పూరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.6 లక్షల ఖరీదు చేసే ఆపరేషన్‌ను.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేసినట్లు డాక్టర్ సుమితా శంకర్ చెప్పారు. సకాలంలో ఆపరేషన్ చేయకపోతే.. పసికందు ప్రాణాలు పోయేవని తెలిపారు. ఇలాంటి అరుదైన ట్యూమర్‌కు ఆపరేషన్లు చేసినట్లు మెడికల్ జర్నల్‌లో ఇప్పటివరకు నమోదు కాలేదని చెప్పారు. దీనిని మెడికల్ జర్నల్స్‌కు పంపిస్తామని తెలిపారు. బిడ్డ ప్రాణాలు కాపాడిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి అభినందించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా బిడ్డకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులకు, ప్రభుత్వానికి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో న్యూరోసర్జరీ ఇన్చార్జ్ డాక్టర్ సురేంద్ర వర్మ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు చంద్రలేఖ, నజ్మా, శృతి, గంగా«భవాని తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
ఖైదీ నంబర్ 3468
సాక్షి, గుంటూరు, అమరావతి: నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు ఆదివారం గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జైలు అధికారులు ఆయనకు 3468 నంబర్‌ను కేటాయించారు. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1 నిందితుడు అయిన ఎంపీకి గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను జైలుకు తరలించారు. జైలులోని పాత బ్యారక్‌లో గల ఓ సెల్లో ఆయన్ను ఉంచారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు సీఐడీ పోలీసులు శనివారం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరు పరచగా తనపై పోలీసులు దాడి చేశారని జడ్జికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గుంటూరు జీజీహెచ్ వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి రఘురామకృష్ణరాజును పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి నేతృత్వంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ డాక్టర్ సుబ్బారావులు సభ్యులుగా ఏర్పాటైన మెడికల్ బోర్డు ఎంపీకి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్ స్కానింగ్, కిడ్నీ, లివర్ ఫంక్షనింగ్, చర్మ వ్యాధులకు సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. అనంతరం నాట్కో క్యాన్సర్ కేర్ సెంటర్ భవనంలోని రెండో అంతస్తులోని గదిలోకి ఆయన్ను తరలించారు. ఆదివారం కూడా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య పరీక్షల నివేదికను సీల్డ్ కవర్లో డాక్టర్ ప్రభావతి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మెసెంజర్ ద్వారా మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు ధర్మాసనానికి పంపించారు. అనంతరం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఎంపీని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామ కాల్ డేటాపై సీఐడీ కన్ను నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు చెందిన కాల్‌డేటా, వాట్సాప్ చాటింగ్‌లపై సీఐడీ దృష్టి పెట్టింది. ఎంపీకి టీడీపీ పెద్దలు, టీడీపీ అనుకూల మీడియా కీలక వ్యక్తులు ఫోన్ల ద్వారా టచ్‌లో ఉన్నట్టు సీఐడీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. వారు పలు కీలక విషయాలపై డైరెక్షన్ ఇచ్చినట్టు గుర్తించింది. -
గ్రీన్ చానల్‌తో సకాలంలో ఆక్సిజన్ సరఫరా
సాక్షి, గుంటూరు: కరోనా రోగులకు కీలకంగా మారిన ఆక్సిజన్‌ను గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి పోలీసులు సకాలంలో తెప్పించారు. వివరాల్లోకెళ్తే.. గుంటూరు జీజీహెచ్‌లో 800 పడకల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు సాధారణ రోగులు కూడా ఇక్కడ వందల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి 10 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ట్యాంకర్ బయల్దేరింది. ఇది సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని జీజీహెచ్ వైద్యులు గుర్తించారు. దీంతో ఆర్ఎంవో డాక్టర్ సతీష్ కొత్తపేట సీఐ రాజశేఖర్‌రెడ్డికి ఉదయం 11 గంటల ప్రాంతంలో విషయం తెలియజేశారు. ఆక్సిజన్ లోడ్‌తో వస్తున్న ట్యాంకర్ డ్రైవర్‌కు సీఐ ఫోన్ చేయగా ఏలూరుకు అవతల ఉన్నట్టు తెలిపాడు. దీంతో సీఐ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, విజయవాడ కమిషనర్ శ్రీనివాసులును, స్టేట్ కోవిడ్–19 కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులను అప్రమత్తం చేశారు. ఆక్సిజన్ ట్యాంకర్‌తో వస్తున్న లారీకి ఎక్కడ ట్రాఫిక్‌పరంగా ఇబ్బందులు తలెత్తకుండా హైవే పెట్రోలింగ్, పోలీస్ వాహనాలను పైలెట్‌గా ఉంచి గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. దీంతో ఆక్సిజన్ ట్యాంకర్ చేరుకోవాల్సిన సమయం కంటే గంటన్నర ముందు అంటే మ«ధ్యాహ్నం 2.20 గంటలకే గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎన్ఎంసీ బిల్లు రద్దు చేయాల్సిందే..
సాక్షి, గుంటూరు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్ర రాజధాని ఆస్పత్రి గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. వర్షంలో సైతం ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిలబడి నినాదాలు చేస్తూ, బిల్లును రద్దు చేసే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) గుంటూరు నగర అధ్యక్షురాలు డాక్టర్ పమిడి ముక్కల విజయ, సెక్రటరీ డాక్టర్ ఆవుల శ్రీనివాస్, ఇతర ఐఎంఏ నేతలు జూడాల సమ్మెకు మద్దతిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ మాట్లాడుతూ పార్లమెంట్లో ఇటీవల ఆమోదం పొందిన ఎన్ఎంసీ బిల్లు వల్ల ఎంతో కష్టపడి ఎంబీబీఎస్ వైద్య చదివే విద్యార్థులకు, వైద్య వృత్తిలో ఉన్న వైద్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ బిల్లు సామాజిక స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, పేద, మధ్యతరగతి వారికి తీరని లోటును మిగులుస్తుందని విచారం వ్యక్తం చేశారు. బిల్లులోని కొన్ని అంశాలను వైద్య లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వైద్య విద్యలో అన్ని నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని, ఫలితంగా వైద్యులు, ఆస్పత్రుల స్వేచ్ఛను కేంద్రం హరిస్తుందోని ఆరోపించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), అన్ని స్వయం ప్రతిపత్తి సంస్థలు తమ ఉనికి కోల్పోతాయన్నారు. ప్రైవేటు, డీమ్డ్ కాలేజీలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండే 85 శాతం సీట్లను 50 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమైన విషయంగా అభిప్రాయపడ్డారు. దీని వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్ అర్హత లేనివారికి కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో లైసెన్సు ఇచ్చి వైద్యం చేయమని కేంద్రం ప్రొత్సాహం ఇస్తుందని.. దీని ద్వారా దేశ ఆరోగ్య పరిస్థితి దిగజారుగుతుందన్నారు. వైద్య విద్యలో నాణ్యత పెంపొందించేందుకు ప్రత్యేక కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెబుతూ వాటి గురించి స్పష్టత ఇవ్వకపోవడం వైద్య విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. వైద్యుల, వైద్య విద్యార్థుల అభ్యర్థలను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి బిల్లును రాజ్యసభలో ఆమోదించడం పట్ల వ్యతిరేకతను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్, పీజీ, సూపర్‌స్పెషాలిటీ వైద్యులు, వైద్య విద్యార్థులు అత్యవసర వైద్య సేవలను సైతం బహిష్కరించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పవన్ తెలిపారు. ఐఎంఈ సెక్రటరీ డాక్టర్ ఆవుల శ్రీనివాస్, జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు మోహన్, రాజేశ్వరి, శ్రీనివాస్, విరంచి శ్రావణి, లోకేష్‌శర్మ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ
సాక్షి, అమరావతి/ కర్నూలు(హాస్పిటల్)/ ఉలవపాడు/ గుంటూరు మెడికల్: స్వైన్‌ఫ్లూ వైరస్ రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్ని జిల్లాలకే పరిమితమై ఉన్న ఈ వైరస్ ఇప్పుడు మరికొన్ని జిల్లాలకు విస్తరించింది. స్వైన్‌ఫ్లూ తీవ్రతతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 2018 అక్టోబర్ 24 నాటికి అధికారిక లెక్కల ప్రకారం 93 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదుకాగా, అనధికారికంగా ఇంతకంటే ఇంకా ఎక్కువ కేసులు నమోదై ఉంటాయని భావిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన కేసులు అధికారిక లెక్కల్లోకి తీసుకోవట్లేదని తెలుస్తోంది. స్వైన్‌ఫ్లూ వల్ల ఇప్పటివరకూ 7 మంది మాత్రమే మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూండగా, 13 మందికి పైనే మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. స్వైన్‌ఫ్లూ తీవ్రత ప్రస్తుతం చిత్తూరు, విశాఖ, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వేధిస్తున్న వసతుల కొరత రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో మాత్రమే స్వైన్‌ఫ్లూ బాధితులకు ప్రత్యేక వైద్యం ఉంది. కానీ అక్కడ ఇన్‌పేషెంట్ల రద్దీ పెరగడంతో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం కనిపిస్తోంది. అలాగే జ్వర లక్షణాలున్న బాధితులకు సరైన వైద్యం అందించడంలో వసతుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరుగుతుండటంతో బాధితులు, ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. బస్టాండ్లు, ఎయిర్‌పోర్ట్‌లు తదితర జనసమర్థ ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకున్నామని ప్రజారోగ్య శాఖ అధికారులు చెబుతున్నా స్వైన్‌ఫ్లూ విస్తరణను నియంత్రించలేకపోతున్నారు. రాష్ట్రాన్ని ఇప్పటికే మలేరియా, డెంగీ, విషజ్వరాలు వణికిస్తుండగా ఇప్పుడు స్వైన్‌ఫ్లూ మరింత ఆందోళన కలిగిస్తోంది. రానున్న సీజన్ స్వైన్‌ఫ్లూ విస్తరణకు మరింత అవకాశం కల్పిస్తుందని, నియంత్రణా చర్యలు తీసుకోలేక పోతే మరింత ప్రమాదం జరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో మరో ముగ్గురు మృతి కర్నూలు జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. స్వైన్‌ఫ్లూ వల్ల బుధవారం మరో ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే మృతుల సంఖ్య పదికి చేరింది. అలాగే నెల వ్యవధిలో కర్నూలు సర్వజన ఆస్పత్రిలో 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇంతకుముందు ఏడుగురు మృతిచెందగా బుధవారం కర్నూలు మండలం వెంగన్నబావి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు, ప్యాపిలికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి, ఆదోనికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి మృత్యువాతపడ్డారు. ఏడుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఇంకా 8 మంది చికిత్స పొందుతున్నారు. గుంటూరులో స్వైన్ ఫ్లూ కేసు నమోదు గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడుకు చెందిన టి.రాజశేఖరరెడ్డికి స్వైన్ ఫ్లూ సోకినట్లు బుధవారం గుంటూరు జీజీహెచ్ వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ నెల 21న జ్వరం, దగ్గుతో బాధపడుతున్న రాజశేఖరరెడ్డిని కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చేర్పించారు. జీజీహెచ్‌లో స్వైన్‌ఫ్లూ ఉందన్న అనుమానంతో పరీక్ష చేయగా బుధవారం నిర్ధారణ జరిగింది. దీంతో బాధితుడిని గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లాలో ఈనెలలో స్వైన్ ఫ్లూ కేసు నమోదవడం ఇది మూడోది. ప్రకాశంలో యువకుడి మృతి స్వైన్‌ఫ్లూ వ్యాధితో ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం రామాయపట్నానికి చెందిన ఓ యువకుడు బుధవారం మృతి చెందాడు. రామాయపట్నంకు చెందిన పంతంగి చంద్రశేఖర్ (33) మూడేళ్లుగా ఉద్యోగ రీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 18న నెల్లూరు జిల్లా కావలి మండలం గుమ్మడిబండల గ్రామంలో బంధువుల ఇంట వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన చంద్రశేఖర్ అనారోగ్యానికి గురి కావడంతో కావలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించారు. మర్నాడు ఒంగోలుకు తరలించగా పరిస్థితి విషమించడంతో ఈ నెల 20న విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 23న బాధితుడికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. అక్కడ చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. -
పాపకు ప్రాణం పోసిన జీజీహెచ్ వైద్యులు
గుంటూరు మెడికల్: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి ఉరివేసుకుని చనిపోతూ తన బిడ్డలను సైతం ఉరివేసి చంపాలనుకుంది. చుట్టుపక్కల వారు గమనించే సరికి తల్లి ఓ బిడ్డ చనిపోగా మరో పాప మాత్రం ఉరితాడుకు వేలాడుతూనే శ్వాస తీసుకోవటాన్ని గమనించారు. కొన ఊపిరిలో ఆస్పత్రికి వచ్చిన పాపకు గుంటూరు జీజీహెచ్ పిల్లల వైద్య విభాగం వైద్యులు మెరుగైన వైద్యసేవలను అందించి ప్రాణాలు కాపాడారు. పాప ఆరోగ్యం మెరగవ్వటంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. మే 18వ తేదీన పూసపాటి హేమశ్రీ అనే రెండున్నరేళ్ల చిన్నారిని బంధువులు తమ వద్దకు తీసుకొచ్చారని డాక్టర్ రాజు చెప్పారు. తల, మెడ భాగాల్లో వాపు ప్రారంభమై శ్వాసకి ఇబ్బంది పెరిగిందన్నారు. పాపకు ‘ట్రమటిక్ సర్వైకల్ వ్యాస్కులోపతి విత్ మైలోపతి ’వ్యాధిగా నిర్ధారణ చేసి 20 రోజులు పాటు ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యసేవలను అందించటంతో ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. డాక్టర్ బి.దేవకుమార్, డాక్టర్ పేరం ఝాన్సీ, డాక్టర్ కరిముల్లా, డాక్టర్ వాణిభాయ్, డాక్టర్ మీన ఇతర స్పెషాలిటీ వైద్యులు 28 రోజులపాటు వైద్యం అందించినట్లు వెల్లడించారు. -
ఈ ఖైదీకి చికిత్స చేయలేం.. తీసుకెళ్లండి
సాక్షి, గుంటూరు: ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న రిమాండ్ ఖైదీకి చికిత్స చేసేందుకు వైద్యులు ససేమిరా అంటున్నారు. అతనికి ఎలాగైనా వైద్యం చేయించేందుకు జైలు సిబ్బంది పడుతున్న అగచాట్లు అన్నీఇన్నీ కావు. జైలర్ జోక్యం చేసుకోవడంతో తాత్కాలికంగా చికిత్స చేసేందుకు జీజీహెచ్ వైద్యులు అంగీకరించారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంకు చెందిన డొప్పా రామమోహన్‌రావు కూరగాయాల కమీషన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార లావాదేవీలలో భాగంగా ఓ వ్యక్తికి చెక్కు ఇచ్చాడు. అదికాస్తా బౌన్స్ కావడంతో కోర్టు అతనికి రిమాండ్ విధించింది. తొమ్మిది నెలలుగా ఏలూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. పది రోజుల క్రితం అతని ఆరోగ్యం క్షిణించింది. గతంనుంచే ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న అతను స్ధానిక వైద్యుల వద్ద చికిత్స పొందుతుండేవాడు. జైలుకు వచ్చాక సరిగా మందులు వాడకపోవడంతో కడుపులో నొప్పి మళ్లీ మొదలైంది. కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతుండడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఆరు రోజులైనా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించాలని వైద్యులు సూచించారు. అక్కడినుంచి శనివారం సాయంత్రం గుంటూరు సమగ్రాసుపత్రికి తరలించారు. తమవద్ద ఈ వ్యాధికి సంబంధించిన వైద్యులు లేరని అడ్మిట్ చేసుకునేందుకు వైద్యులు నిరాకరించారు. రామమోహన్రావుకు కడుపులో నొప్పితోపాటు షుగర్ వ్యాధి కూడా ఉంది. అతని ఆరోగ్యం క్షీణిస్తోందని జైలు సిబ్బంది వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారు జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ప్రాణహాని జరిగితే మీదే బాధ్యత: వైద్యులకు చెప్పిన జైలర్ ఏలూరు జైలర్ వి.వి.సత్యనారాయణరెడ్డి ఆస్పత్రికి చేరుకుని డ్యూటీ డాక్టర్లను నిలదీశారు. ఓ రిమాండ్ ఖైదీకి చికిత్స లేదని, అడ్మిట్ చేసుకోమని ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమాండ్‌లో ఉన్న ఖైదీ బాధ్యత వైద్యులపై కూడా ఉంటుందని, ఖైదీకి ప్రాణహాని జరిగితే వైద్యులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. విషయం తెలుసుకున్న ఆర్ఎమ్ఓ అక్కడికి రాగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళాలంటే కుదరదని, రెండు రోజులు సెలవల కారణంగా అడ్మిషన్ ఇవ్వాల్సిందేనని జైలర్ సూచించారు. దీంతో ఖైదీకి మంగళవారం సాయంత్రం వరకు చికిత్స అందించేందుకు వైద్యులు అంగీకరించారు. మంగళవారం సాయంత్రం విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తామని జైలర్ సత్యనారాయణరెడ్డి చెప్పారు. -
నివేదిస్తాం.. నిర్ణయం ప్రభుత్వానిదే
- నిమిషనిమిషానికీ క్షీణిస్తోన్న జననేత ఆరోగ్యం - వైఎస్ జగన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించాలి - ఇదే విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్న వైద్యులు గుంటూరు: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజు పూర్తి కావచ్చింది. సోమవారం మూడోసారి వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జననేత ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు వైద్యులు పేర్కొన్నారు. దీక్షపై టీడీపీ మంత్రులు చెవాకులు పేలిన నేపథ్యంలో మీడియా సమక్షంలోనే వైఎస్ జగన్ కు వైద్యపరీక్షలు నిర్వహించడం గమనార్హం. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ శరీరంలో కీటోన్లు 3 ప్లస్ దాటాయి. బీపీ 130/80గా నమోదయింది. పల్స్ రేట్ 77గా ఉంది. ప్రస్తుత బరువు 72.4 కిలోలు. ఇప్పటి వరకు మూడు కేజీల బరువు తగ్గారు. పరీక్షల అనంతరం జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ హనుమా నాయక్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. తక్షణమే ఆయనను ఆసుపత్రిలో చేర్చాలని, వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకుంటే శరీరంపై తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు. నివేదికను ప్రభుత్వానికి పంపుతామని, అయితే తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. జననేత ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణిస్తుండటంతో పార్టీ శ్రేణులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. -
నివేదిస్తాం.. నిర్ణయం ప్రభుత్వానిదే
-
బ్లడ్ శాంపిల్స్ తీసుకొస్తూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు
- వైఎస్ జగన్ హెల్త్ బులిటెన్ విడుదలలో జాప్యంపై వైద్యాధికారి వివరణ - జననేత ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల ఆందోళన.. సర్కారు తీరుపై ఆగ్రహం గుంటూరు: 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రక్తనమూనాలు తీసుకొని వస్తున్న ప్రతిసారి మా సిబ్బంది ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు. దీనివల్ల రక్త పరీక్షల ఫలితాల్లో మార్పులు వస్తున్నాయి. అందుకే హెల్త్ బులిటెన్ విడుదలలో జాప్యం ఏర్పడుతుంది..' ఇదీ జగన్ ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ వివరణ! 'ఓ వైపు వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా నివేదికలు బయటపెట్టకపోవడం ఎంతవరకు సమంజసం?' అని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలకు ఆ అధికారి చెప్పిన సమాధానం ఆందోళననేకాక అసహనాన్నీ కల్గించింది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా నల్లపాడులో గడిచిన ఐదు రోజులుగా వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులకు ఉంది. అయితే ఆరోగ్య క్షీణతపై అధికారులు ఒకలా, ప్రభుత్వం మరోలా ప్రకటనివ్వడంపై వైఎస్సార్ సీపీ అభిమానులు సహా యావత్ ప్రజానికంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్యనేతలు బొత్స, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి తదితరులతో కూడిన బృందం.. జీజీహెచ్ సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించగా ఆయన అనూహ్యకారణాలు వివరించారు. -
ఎన్నాళ్లీ కన్నీళ్లు!!
ఎక్కడ జబ్బు ఉంటే అక్కడ మందు వేయాలి.. కానీ జీజీహెచ్‌లో వేళ్లూనుకున్న నిర్లక్ష్యానికి ఎక్కడ చికిత్స చేయాలి? ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఘోరతప్పిదాలు జరుగుతున్నా చీమకుట్టినట్లయినా చలించని పాలకులను, అధికారులను ఏం అనాలి? సిబ్బంది బాధ్యతారాహిత్యానికి ఎలా ఖరీదు కట్టాలి? పెద్దాసుపత్రిలో పేదల ఆరోగ్యానికి భద్రతలేని వైనానికి ఎవరు జవాబు చెప్పాలి? తాజాగా చిన్నారిపై ఎలుకల దాడి ఘటన మొత్తం వ్యవస్థనే ప్రశ్నిస్తోంది. ఏడాది కాలంలో ఇక్కడ జరుగుతున్న వరుస సంఘటనలను పరికిస్తే పేదల ప్రాణాలకు ఇక్కడ విలువెంతుందో తెలుస్తోంది. సాక్షి, గుంటూరు : కోస్తాంధ్రలోని ఆరు జిల్లాలకు ఆరోగ్యప్రదాయనిగా పేరొంది రాజధాని ప్రాంతంలో అతి పెద్ద ఆసుపత్రిగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి వెళ్లాలంటేనే రోగులు హడలిపోతున్నారు. జీజీహెచ్ వైద్యులు, అధికారుల నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారుతోంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా.. జీజీహెచ్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నా అధికారులు, వైద్యుల బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యంతో అనేకమంది రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. మరోవైపు జీజీహెచ్‌లో అడుగడుగున అవినీతి రాజ్యమేలుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా నివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేకుండా పోయాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ప్రజాప్రతినిధుల అండతో అక్కడి అధికారులు లెక్కలేనితనంగా వ్యవహరిస్తూ రోగులపైఅశ్రద్ధ వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వేణుగోపాలరావు భాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జీజీహెచ్‌లో ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జీజీహెచ్‌లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే.. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి జీజీహెచ్‌లో పీపీపీ విధానంలో గుండె ఆపరేషన్లు నిర్వహించేందుకు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ముందుకు వచ్చారు. ఆయన హార్ట్‌లంగ్ మిషన్ మూలన పడిన విషయాన్ని గుర్తించారు. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్ల సుమారు నాలుగునెలలు ఆలస్యంగా ఆపరేషన్లు మొదలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. జీజీహెచ్ ప్రసూతి విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలు, 2.10 గంటలకు వరుసగా గండి అనిత, కామినేని అనితలు మగ, ఆడ బిడ్డలకు జన్మనిచ్చారు. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డలు మార్పడినట్లు అనుమానించిన ఇద్దరు తల్లులూ తమకు మగబిడ్డే పుట్టిందంటూ గొడవకు దిగారు. జబ్బు తో ఉన్న ఆడ శిశువును ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతి చెందింది. చివరకు జీజీహెచ్ అధికారులు సైతం పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మే నెలలో బ్రాహ్మణపల్లికి చెందిన దోమవరపు లావణ్య అనే ఓ నిండు గర్భిణి ప్రసూతి వైద్య విభాగానికి వచ్చింది. వైద్యుల సూచన మేరకు స్కానింగ్ కేంద్రం వద్దకు వెళ్లింది. అయితే అనేక గంటలపాటు పడిగాపులు కాసినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో నొప్పులు ఎక్కువై అక్కడే నేలపై పడి ప్రసవించింది. నేలపై పడ్డ రక్తపు మరకలను సైతం అక్కడి సిబ్బంది గర్భిణి వెంట వచ్చిన ఆమె తల్లితో తుడిపించారు. మే 4వ తేదీన ఓ తల్లి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆడ పిల్ల అని తెలియగానే వదిలేసి వెళ్లిపోయింది. ఆమె వెళ్తున్నప్పుడు సిబ్బంది సైతం గమనించకపోవడం దారుణం. ప్రత్తిపాడుకు చెందిన ఓ బాలింత బాత్రూమ్కు వెళ్ళి వచ్చేసరికి పసిబిడ్డను ఎవరో గుర్తు తెలియని మహిల ఎత్తుకెళ్లింది. దీంతో ఆ బాలింత లబోదిబో మనడంతో కొత్తపేట పోలీసులు అప్రమత్తమై బిడ్డను ఎత్తుకెళ్ళిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. జీజీహెచ్‌లో బిడ్డలు మార్పడటం, బిడ్డల్ని ఎత్తుకెళ్ళడం పరిపాటిగా మారినా అక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోతుంది. కనీసం ఆసుపత్రిలో సీసీ కెమెరాలు లేవు. భద్రత డొల్లతనం స్పష్టమౌతుంది. తాజాగా పదిరోజుల శిశువుపై మూషికాలు దాడిచేసి చంపడం అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇంతవరకూ ఎవ్వరిపై చర్యలు తీసుకోకుండా, తాను సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అనూష అనే బాలింతరాలు ఆడబిడ్డను కని నొప్పులతో బాధపడుతూ వైద్యులకు చెప్పగా పెయిన్ కిల్లర్ ఇచ్చి బెడ్‌పై పడుకోబెట్టారు. ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో మృతి చెందింది. దారుణమైన విషయమేమిటంటే ఆమె మృతి చెందిన ఆరుగంటలపాటు అక్కడి వైద్యులు, సిబ్బంది గుర్తించలేదు. పసిబిడ్డ ఏడుపు విని చుట్టు పక్కల వారు వచ్చి చూశారు. అప్పటికే ఆమె మృతదేహం నీలుక్కుపోయి ఉంది. విషయం తెలుసుకున్న సిబ్బంది మృతదేహాన్ని ఐసీయూకు తరలించి డ్రామా రక్తి కట్టించారు. వీరి నిర్లక్ష్యానికి ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. -
20 ఏళ్లు...ఒకే పోస్టు
పదోన్నతులకు దూరంగా జీజీహెచ్ వైద్యులు సాక్షి, గుంటూరు: నిత్యం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్)కి వచ్చే పేద రోగుల అనారోగ్య బాధలు తీర్చే వైద్యులు పదోన్నతులకు దూరమయ్యారు. ప్రతిభ, సీనియార్టీ ఉన్నా పట్టించుకునే వారు లేక ఇరవై ఏళ్లుగా అదే పోస్టుల్లో కొనసాగుతూ అసంతృప్తికి గురువుతున్నారు. మూడు, నాలుగేళ్లకోసారి అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు కల్పిస్తున్నా ఇక్కడ ఆ ఊసే ఎత్తడం లేదని నిరాశకు లోనవుతున్నారు. {పభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అనేక విభాగాల వైద్యులు ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగుతున్నారు. ఎంత సీనియారిటీ ఉన్నా పదోన్నతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లకొకసారి పదోన్నతులు ఇవ్వాల్సి ఉన్నా ఇరవై ఏళ్లు దాటినా పట్టించుకోకుండా అదే పోస్టుల్లో కొనసాగిస్తున్నారని అనేక మంది వైద్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలు ఉన్నా భర్తీ చేయరెందుకు... గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో 32 వైద్య విభాగాలు ఉన్నాయి. వీటిలో 65 ప్రొఫెసర్ పోస్టులకు 44 మంది మాత్రమే ఉన్నారు. 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 46 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 32 మంది మాత్రమే ఉన్నారు. 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 195 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 160 మంది ఉన్నారు. 35 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నా తగినంత మంది అధ్యాపక సిబ్బంది లేరు. దీనివల్ల వైద్య విద్యార్థులకు సరైన విద్యాబోధన జరగడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. జీజీహెచ్‌లో రోగుల సంఖ్య పెరిగి వైద్యులు తీవ్ర పని ఒత్తిడికి గురికావాల్సి వస్తోంది. కొత్త పోస్టుల మాట అటుంచి కనీసం ఇక్కడ పనిచేస్తున్న వైద్యులకైనా పదోన్నతులు కల్పిస్తే అసిస్టెంట్, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అనేక ఏళ్లుగా వైద్య విద్య డెరైక్టర్ (డీఎంఈ) మాత్రం ఈ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం శోచనీయమని వైద్యాధికారులు మండిపడుతున్నారు. మాకు ఉత్తుత్తి పదోన్నతులా... ఐదేళ్లకొకసారి పదోన్నతులు ఇవ్వాల్సి ఉండగా దాన్ని పక్కనబెట్టి వైద్య కళాశాల, జీజీహెచ్‌ని తనిఖీ చేసేందుకు భారత వైద్య మండలి(ఎంసీఐ) సభ్యులు వచ్చినప్పుడు మాత్రం తమకు పదోన్నతులు కల్పించినట్లుగా సృష్టించి పబ్బం గడుపుతున్నారని పలువురు వైద్యులు వాపోతున్నారు. ఎంసీఐ బృందం వెళ్లగానే తిరిగి తమను ఎప్పటిలానే పాత పోస్టుల్లో కొనసాగిస్తున్నారని, ఇలా అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హత ఉన్నా పదోన్నతులు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తమతోపాటు ప్రభుత్వ వైద్యశాలల్లో చేరిన వైద్యులు ఇప్పుడు ప్రొఫెసర్లుగా పనిచేస్తుంటే తాము మాత్రం ఇరవైఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగానే కొనసాగుతున్నట్టు తెలిపారు. పదోన్నతుల గురించి పట్టించుకోకుండా డీఎంఈ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని తీవ్ర అసహనం వెలిబుచ్చుతున్నారు. తామంతా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పదోన్నతులపై పోరాడేందుకు మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు వైద్యుల సంఘం నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో తమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించు కుంటామన్నారు.