వైఎస్ జగన్ హెల్త్ బులిటెన్ విడుదలపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు
- వైఎస్ జగన్ హెల్త్ బులిటెన్ విడుదలలో జాప్యంపై వైద్యాధికారి వివరణ
- జననేత ఆరోగ్య పరిస్థితిపై పార్టీ శ్రేణుల ఆందోళన.. సర్కారు తీరుపై ఆగ్రహం
గుంటూరు: 'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రక్తనమూనాలు తీసుకొని వస్తున్న ప్రతిసారి మా సిబ్బంది ట్రాఫిక్ లో ఇరుక్కుపోతున్నారు. దీనివల్ల రక్త పరీక్షల ఫలితాల్లో మార్పులు వస్తున్నాయి. అందుకే హెల్త్ బులిటెన్ విడుదలలో జాప్యం ఏర్పడుతుంది..' ఇదీ జగన్ ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ వివరణ!
'ఓ వైపు వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్నా నివేదికలు బయటపెట్టకపోవడం ఎంతవరకు సమంజసం?' అని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలకు ఆ అధికారి చెప్పిన సమాధానం ఆందోళననేకాక అసహనాన్నీ కల్గించింది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా నల్లపాడులో గడిచిన ఐదు రోజులుగా వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులకు ఉంది.
అయితే ఆరోగ్య క్షీణతపై అధికారులు ఒకలా, ప్రభుత్వం మరోలా ప్రకటనివ్వడంపై వైఎస్సార్ సీపీ అభిమానులు సహా యావత్ ప్రజానికంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్యనేతలు బొత్స, వైవీ సుబ్బారెడ్డి, ఉమ్మారెడ్డి తదితరులతో కూడిన బృందం.. జీజీహెచ్ సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించగా ఆయన అనూహ్యకారణాలు వివరించారు.